
అల్లు అర్జున్ ‘పుష్ప2’ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తమ్మీద పుష్ప మేనియా కమ్మేసింది. ఇప్పటికే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‍లో చేరింది. హిందీలో సైతం తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం విశేషం. ఇక, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మరో సంచలనం. ‘పుష్ప’ సినిమాలో ప్రతినాయక పాత్రధారి పుష్పను అరెస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ.. చేయలేకపోతాడు. కానీ, తెలంగాణ పోలీసులు మాత్రం అల్లు అర్జున్‍ను అరెస్ట్ చేశారు. సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్‍ను అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. సాంకేతిక కారణాలతో ఒకరోజంతా అల్లు అర్జున్ చంచల్‍గూడ జైలులోనే గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం కలిగించింది. ప్రస్తుతం వెయ్యి కోట్లకు పైబడి కలెక్షన్లతో ‘పుష్ప2’ దూసుకుపోతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు.
రవితేజ ‘మాస్ జాతర’
రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు రూపొందిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ‘ధమాకా’ తరువాత వీరిద్దరి కాంబినేషన్‍లో వస్తున్న మరో సినిమా ఇది. ఇటీవలే నార్వేలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. అక్కడి మంచు ప్రదేశాలలో కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరిస్తారు. మాస్ యాక్షన్ ఎంటర్‍టైనర్‍గా ముస్తాబవుతున్న ఈ సినిమా 2025, మే 9న థియేటర్లలోకి రానుంది. రవితేజ కెరీర్‍లో ఇది 75వ సినిమా.
2024 నామ చిత్రం ‘కల్కి’
2024 సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టాప్-10 భారతీయ చిత్రాల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది. ఇందులో ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’ చిత్రం ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంకా ‘స్త్రీ2’ రెండో స్థానంలో నిలవగా, ‘మహారాజా’, ‘షైతాన్’, ‘ఫైటర్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘భూల్ భులయ్యా3’, ‘కిల్’, ‘సింగమ్ అగైన్’, ‘లాపతా లేడీస్’ కూడా జాబితాలో ఉన్నాయి.
కీర్తి కొత్త జీవితం
హీరోయిన్ కీర్తి సురేశ్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటిల్‍తో కలిసి ఏడడుగులు వేసింది. గోవాలో వీరి వివాహం జరిగింది. దక్షిణాదితో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించిన, నటిస్తున్న కీర్తి సురేశ్ ‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ‘దసరా’లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. భర్త ఆంటోనీ వ్యాపార కుంటుంబానికి చెందిన వ్యక్తి. కీర్తి త్వరలో ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబరాల తేజు
సాయిదుర్గా తేజ్ పదేళ్ల కెరీర్‍లో 18వ చిత్రం- ‘సంబరాల ఏటిగట్టు’. ఇటీవలే రామ్‍చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. రోహిత్ కె.పి. దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.నిరంజన్‍రెడ్డి, చైతన్యరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా చేస్తోంది. ఈ చిత్రానికి ‘ఎస్‍వైజీ’ (సంబరాల ఏటిగట్టు) అనే పేరును ఖరారు చేశారు. 2025, సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Review జైలుకెళ్లొచ్చిన పుష్ప.