తెలుగు ‘తెర’ మరుగు

వెండితెరపై తెలుగు
వెలవెలబోతోంది.
కళామతల్లి మాతృ
భాషకు నోచుకోలేక
పరభాషా పరాయణత్వంతో ఖిన్నురాలవుతోంది. ఆంగ్ల పదాలే నేరుగా సినిమా టైటిల్స్గా తెరకెక్కుతున్నాయి. ఇక, పాటలైతే చెప్పనవసరం లేదు. మనం వినేది తెలుగా.. ఆంగ్లమా..? అనేది తెలియనంతగా గీతాల్లో తెలుగు ఖూనీ అవుతోంది.
ఒకప్పుడు అచ్చతెలుగు టైటిల్స్తో
కనువిందుచేసిన తెలుగు చలన
చిత్ర పరిశ్రమ నేడు
తెలుగునెలా విస్మరిస్తుందో
ఒక్కసారి పరిశీలించండి.
తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగ వేస్తే మొదట గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి.. గూడవల్లి రామబ్రహ్మం. మనందరం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే, సామాజిక సమస్యలపై ఆలోచనాత్మక చిత్రాలను తీయడమే కాదు వాటికి అచ్చ తెలుగులో పేర్లు పెట్టిన దర్శకుడాయన. ‘పాదుకా పట్టాభిషేకం, పృథ్వీపుత్ర, ద్రౌపదీ మానం రక్షణం..’ ఇలా సంస్క•త నామధేయాలతో తెలుగు చిత్రాలు తెరకెక్కుతున్న కాలంలో ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి అచ్చ తెలుగు టైటిళ్లతో ఆయన చిత్రాలను అందించారు. నిజానికి తెలుగు చలన చిత్రాలన్నీ మొదట్లో పౌరాణికాలే. కాబట్టి వాటికి తగ్గట్టుగా పేర్లు కూడా సంస్క•తంలోనే ఉండేవి. అడపాదడపా వచ్చిన సాంఘిక చిత్రాలు మాత్రమే తెలుగును తలకెక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి ఊతంగా నిలిచిన చిత్రాలన్నీ మన మట్టి భాషలోనే పేర్లు పెట్టుకున్నాయి. దీనికి ఉదాహరణ… ‘మళ్లీ పెళ్లి’. విధవ పునర్వివాహం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ఆ పేరు చక్కగా అమరింది. ‘తారాశశాంకం, బభ్రువాహన, గరుడ గర్వభంగం, హరవిలాసం’.. వెండితెరపై ఈ సంస్క•త పదాడంబరాల దండయాత్ర 1940వ దశకంలోనూ కొనసాగింది. అటువంటి సమయంలోనూ చక్కని తెలుగు చిత్రాలు వచ్చాయి. ‘ఇల్లాలు, పంతులమ్మ, ఇది మా కథ, మన దేశం, బోండాం పెళ్లి’లాంటివి ఇందుకు ఉదాహరణలు. ‘ఒక్క రోజు రాజు’ పేరిట ఆ రోజుల్లోనే ఓ చిత్రం వచ్చింది. ఈ పేరు వింటే కొన్నేళ్ల కిందట ‘ఒక్కరోజు ముఖ్య మంత్రి’ కథతో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ చిత్రం జ్ఞాపకం వస్తుంది.
ఇక, తెలుగు చిత్రాల్లో ఆంగ్లం తెరనేలడం, తెలుగు చిత్రాల్లో ఆంగ్ల టైటిల్స్ పెట్టడం 1940వ దశకంలోనే మొదలైంది. ‘సర్కస్‍కింగ్‍, రిటర్నింగ్‍ సోల్జర్‍’ పేర్లతో వచ్చిన చిత్రాలతో ఈ అలవాటు వ్యాప్తిలోకి వచ్చింది. ఆంగ్లమే కాదు ఉర్దూలో కూడా ఆనాటి చిత్రాలు కొన్ని పేర్లు పెట్టుకున్నాయి. దీనికి నిదర్శనం- వైవీ రావు దర్శకత్వం వహించిన ‘తాసిల్దార్‍’. మొత్తం మీద తెలుగు చలనచిత్ర చరిత్ర తొలినాళ్లలో తెలుగుపై సంస్క•తం ఆధిపత్యం వహించింది. ఆ తర్వాత దాని స్థానాన్ని పూర్తిగా ఆంగ్లం ఆక్రమిం చేసింది. ఎంతగా అంటే, ఇక తెలుగుకు ఏమాత్రం స్థానం లేనంతగా!.
‘అప్పుచేసి పప్పుకూడు, అత్తా ఒకింటి కోడలే, చెరపకురా చెడేవు, పెళ్లి చేసి చూడు, పెళ్లి నాటి ప్రమాణాలు, నవ్వితే నవరత్నాలు, మంచి మనసుకు మంచి రోజులు…’ ఇలా సామెతలు, జన వ్యవహారంలో ఉన్న మాటలను శీర్షికలుగా అలంకరించుకుని 1950-59 మధ్య కొన్ని చిత్రాలు వచ్చాయి. అవే కాదు, ‘బీదలపాట్లు, పేరంటాలు, పల్లెటూరి పిల్ల, పెంకిపిల్ల, రోజులు మారాయి, ఇల్లరికం, ఆకలి, సావాసం, పెంపుడు కొడుకు, అమ్మలక్కలు, కొత్తదారి, ముందడుగు, ఇంటిగుట్టు, వేగుచుక్క, సొంతవూరు, ఏది నిజం, అతనెవరు, ఆలుమగలు, రేపు నీదే’ వంటి వినసొంపైన పేర్లతో చిత్రాలు తెరకెక్కాయి. తమిళ డబ్బింగ్‍ చిత్రాలు కూడా ‘సవతి పోరు, సింగారి’ అంటూ తెలుగు సొగసులనే అద్దుకున్నాయి. ఇక ‘వచ్చిన కోడలు నచ్చింది, వదిన గారి గాజులు, దొంగలున్నారు జాగ్రత్త’ వంటి తమాషా పేర్లతో వచ్చిన చిత్రాలూ అనేకం.•థానాయకుడి పాత్రను బట్టి చిత్రానికి పేరు పెట్టడం అనే సంప్రదాయం ఈ దశకంలోనే (ఉదాహరణ: పిచ్చి పుల్లయ్య) పురుడుపోసుకుంది. అయితే, వీటన్నింటి మధ్యలో ‘ఇన్‍స్పెక్టర్‍, మిస్సమ్మ, ఎం.ఎల్‍.ఎ’ తదితర ‘ఇంగ్లిష్‍’ శీర్షికలూ ప్రేక్షకులను పలకరించాయి. ‘మాయా బజార్‍, సిపాయి కూతురు’లతో తెలుగు వెండితెరపై వాటా కోసం హిందీ కూడా వరుస కట్టింది.
1960 వచ్చేసరికి తెలుగు సినీ జీవుల అన్యభాషాభిమానం పెరిగింది. ‘లవ్‍ ఇన్‍ ఆంధ్రా, ప్రైవేటు మాస్టారు, పొట్టి ప్లీడరు, సర్వర్‍ సుందరం, కానిస్టేబుల్‍ కూతురు, డ్రైవర్‍ మోహన్‍, జంగిల్‍ రాణి, జల్సారాయుడు, భయంకర్‍ బడాచోర్‍’ లాంటి పేర్లతో తెలుగు చిత్రాలు తీశారు. ఇక, ‘డాక్టర్‍ చక్రవర్తి, డాక్టర్‍ ఆనంద్‍’ వంటి టైటిళ్లకైతే కొదవే లేదు. వీటికి తోడుగా టాక్సీ రాముళ్లు, టైగర్‍ రాముళ్లూ తయారయ్యారు. తెలుగునాట ఉన్న రక్షకభటులు సరిపోలేదేమో.. సీఐడీలనూ, గోవా సీఐడీ 999లనూ రంగంలోకి దించారు. అప్పటి తెలుగు వారి అదృష్టం ఏమో కానీ, మంచి తెలుగు పేర్లు ఉన్న చిత్రాలూ బాగానే వచ్చాయి. ‘కలిమి లేములు’, తేనె మనసులు, చల్లని నీడ, చివరకు మిగిలేది, చదువుకున్న అమ్మాయిలు, గుండమ్మ కథ, మూగ మనసులు, పూలరంగడు, రంగుల రాట్నం, అవే కళ్లు, మనుషులు మారాలి, చెయ్యెత్తి జైకొట్టు, దాగుడుమూతలు, ఉండమ్మా ••ట్టు పెడతా’ వంటివి వీటికి ఉదాహరణలు.
‘నిత్య కల్యాణం పచ్చతోరణం, ఇంటికి దీపం ఇల్లాలే, పక్కలో బల్లెం, లోగుట్టు పెరుమాళ్లకెరుక, కన్నుల పండుగ, కాడెద్దులు ఎకరం నేల, కలసి ఉంటే కలదు సుఖం, పంతాలు పట్టింపులు, నిలువు దోపిడీ’.. ఇలా ఆ కాలంలో వెండితెరపై మెరిసిన సామెతలు, జాతీయాలూ తక్కువేం కావు.
ఈ మధ్య ఇడియట్లు, రాస్కెళ్లు, స్టుపిడ్లు, సోంబేరులు, పోకిరీలు, కంత్రీలే కథానాయకులు అవుతున్నారు. కాసుల వాన కురిపిస్తారన్న ఆశతో ఈ బూతు మారాజుల కథలను 70 ఎంఎంలలో చూపిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇంతకూ వీళ్లకు ఆదర్శప్రాయులెవరు? వెతికితే 70వ దశకంలో కనిపిస్తారు. ‘జూదగాడు, సోమరిపోతు, పొగరుబోతు, మొరటోడు, కేడీ నం.1’ తదితరుల స్ఫూర్తినే ఇప్పటి వారు కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇంకాస్త ఘాటుగా ఆ పని చేస్తున్నారు. తెలుగుచలన చిత్రాలు వాణిజ్య విలువలు అద్దుకున్నది 1970వ దశకంలోనే. ఆ క్రమంలోనే పేర్లకు అవలక్షణాలు ఇంకా ఎక్కువగా అంటు కున్నాయి. ‘రివాల్వర్‍ రాణి, బుల్లెట్‍ బుల్లోడు, హలో పార్ట్నర్‍, మైనరు బాబు, సెక్రటరీ, హీరో 76, ఏజెంట్‍ గోపీ, జనరల్‍ చౌదరి, కెప్టెన్‍ కృష్ణ, టైగర్‍, ఐ లవ్‍ యూ, లవ్‍ మ్యారేజ్‍, మిస్‍ జూలియా ప్రేమకథ, బస్తీ బుల్‍బుల్‍, జాక్పాట్‍లో గూఢచారి, తాసిల్దార్‍ గారి అమ్మాయి..’ ఇలా శీర్షికల్లో వెల్లు వెత్తిన అన్యభాషా పదాలెన్నో. ఇక, కిలాడీలు, బస్తీ కిలాడీలు, మాస్టర్‍ కిలాడీలు, రౌడీలు, కేడీ రౌడీలు, రౌడీలకు రౌడీలు, కత్తుల కాంతయ్యలు, రత్తయ్యలందరూ కలిసి ప్రేక్షకులను భయపెట్టారు. జడ్జి గారి కోడళ్లు, కలెక్టర్‍ జానకీలు, లాయర్‍ విశ్వనాథ్‍లు, కరాటే కమలలూ ఎవరి సత్తావారు చూపారు. చైర్మన్‍ చలమయ్య, ప్రెసిడెంట్‍ పేరమ్మ వంటి వాటికీ తక్కువ లేదు. వీళ్లందరినీ తప్పించుకుని తెలుగు పేర్లతో వచ్చిన చిత్రాలూ ఉన్నాయి ఆ కాలంలో. ‘దసరా బుల్లోడు, తల్లాపెళ్లామా, సొమ్మొకడిది సోకొకడిది, మూడు పువ్వులు ఆరు కాయలు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, కోటివిద్యలు కూటి కొరకే, దున్నే వాడిదే భూమి, పెత్తందార్లు, రాజ్యంలో రాబందులు, తూర్పు పడమర, సంబరాల రాంబాబు, దేవుడు చేసిన మనుషులు, వేటగాడు, సోగ్గాడు, పదహారేళ్ల వయసు’ అమ్మభాషలో మెరిశాయి.
తెలుగు సినిమాల పేర్ల స్థాయి ‘బజారురౌడి, టూ టౌన్‍ రౌడీ, స్టేట్‍ రౌడి, దాదా, విక్కీదాదా, కేటుగాడు, రుస్తుం, వస్తాద్‍, ఖైదీ, ఖైదీరాణి, డాకూ రాణి’లకు ఎదిగిన కాలం ఎనభయ్యో దశకం. మరోవైపు ఆంగ్లం మరింత దూకుడుగా దాడిచేసింది. ‘డిస్కో కింగ్‍, పోలీస్‍ ఆఫీసర్‍, రాజమండ్రి రోమియో, బుల్లెట్‍, డేంజర్‍లైట్‍, లేడీస్‍ టైలర్‍, టిక్‍ టిక్‍ టిక్‍, లవ్‍ ఇన్‍ సింగపూర్‍, సూపర్‍మేన్‍, ఛాలెంజ్‍ రాముడు, బ్లాక్‍టైగర్‍, పోలీస్‍ రిపోర్ట్, టెర్రర్‍, చాలెంజ్‍’ వంటి చిత్రాలు వెండితెరను ముంచెత్తాయి. అటువంటి సమయంలోనే- ‘ఆరని మంటలు, యువతరం కదిలింది, ఆవేశం, మొగుడు కావాలి, చట్టానికి కళ్లులేవు, అద్దాలమేడ, నోముల పంట, తొలి•కోడి కూసింది, మంచుపల్లకి, ప్రేమించు పెళ్లాడు, పూజకు పనికిరాని పువ్వు, డబ్బెవరికి చేదు, ముద్ద మందారం, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, రెండుజళ్ల సీత’.. వంటి చిత్రాలూ మురిపించాయి.
‘లారీడ్రైవర్‍, టీనేజ్‍, అసెంబ్లీరౌడీ, గ్యాంగ్‍లీడర్‍, లేడీస్‍ స్పెషల్‍, జడ్జిమెంట్‍, అగ్రిమెంట్‍, గ్యాంగ్‍వార్‍, చాంపియన్‍, పోలీస్‍ బ్రదర్స్, జగన్నాథం అండ్‍ సన్స్, మదర్‍ ఇండియా, సంసారాల మెకానిక్‍, జంటిల్‍మేన్‍, జోకర్‍, పోలీస్‍ లాకప్‍, వన్‍బైటు, క్రిమినల్‍, హలో బ్రదర్‍, ఆంటీ, బిగ్‍బాస్‍, లవ్‍గేమ్‍, గన్‍షాట్‍, స్ట్రీట్‍ఫైటర్‍, లైఫ్‍లో వైఫ్‍, టైం, లక్కీచాన్స్’.. ఇలా చెప్పుకుంటూపోతే 1990లలో ఈ జాబితా చాలా పెద్దదే ఉంటుంది. వెండితెరపై తెలుగు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాలమిది. అటువంటి సమయంలోనే ‘ఇరుగిల్లు పొరుగిల్లు, చెవిలోపువ్వు, అమ్మ రాజీనామా, అమ్మకడుపుచల్లగా, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు, పెళ్లి పుస్తకం, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఏవండీ ఆవిడ వచ్చింది, చీమలదండు’ వంటి ‘తెలుగు’ టైటిళ్లతో వచ్చిన చిత్రాలు లేకపోలేదు. 21వ శతాబ్దంలో తెలుగు దర్శక నిర్మాతల సృజనాత్మకత శ్రుతిమించింది. ‘టూలెట్‍ ఫర్‍ బాచిలర్స్ ఓన్లీ’తో మొదలుపెట్టి ‘నీకూ నాకు డాష్‍ డాష్‍’ అనేంతగా వెళ్లింది. బస్టాప్‍, కింగ్‍, షాడో.. పేరు వింటేనే, చదివితేనే ఆంగ్ల చిత్రమేమో అన్నంతగా భ్రమింప చేసే స్థాయికి తెలుగు చిత్రాలు చేరాయి. •

Review తెలుగు ‘తెర’ మరుగు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top