‘ఆట గదరా శివ’ సినిమాతో ఆ మధ్య అలరించిన వర్ధమాన నటుడు ఉదయ్ శంకర్ గుర్తున్నాడు కదా!. తొలి చిత్రంలోనే చక్కని నటనతో ఆకట్టుకున్న ఈ కుర్రాడు త్వరలోనే మరో చిత్రంతో ఆకట్టుకోనున్నాడు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘మిస్ మ్యాచ్’ అనే టైటిల్‍ను ఫిక్స్ చేసింది చిత్ర బృందం. టైటిల్‍తోనే ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం జనవరిలో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమలోని అతిరథ మహారథులు విచ్చేశారు. ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి.’ అనే కొత్త చలన చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
‘కాకా ముత్తై’, ‘కన్నా’ తమిళ చిత్రాలలో నాయికగా నటించిన ఐశ్వర్య.. దివంగత ప్రముఖ నటుడు రాజేశ్ కుమార్తె. ఇక. తమిళనాట హీరో విజయ్ ఆంటోనీ నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్.వి.నిర్మల్‍కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మల్‍కుమార్‍కు ఇది తొలి తెలుగు చిత్రం. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్తో క్లాప్ కొట్టుకున్న నాటి నుంచే హైప్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో తెలుగు సినీ ప్రముఖుల సందడి మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, జెమిని కిరణ్, శరత్ మరార్, ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ, కరుణాకరన్, కిషోర్ పార్థసారథి (డాలి), జొన్నల గడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ శ్రీరాములు తదితరులు చిత్ర ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా జి.శ్రీరామ్‍రాజు, భరత్ రామ్ వ్యవహరిస్తున్నారు. భూపతిరాజా ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రా నికి గిఫ్టన్ ఇలియాస్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ద్వారానే ఈయన సంగీత దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. గణేశ్ చంద్ర ఛాయాగ్రహణం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్‍తేజ సాహిత్యం, రాజేంద్ర కుమార్, మధు మాటలు, మణివాసగం ఆర్ట్.. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు కానున్నాయి.
ఇంతకీ ఏమిటీ కథ?
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ‘మిస్ మ్యాచ్’ పేరుతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అంతటా ఆసక్తి కలిగిస్తోంది. ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి.. ఒక ఆట.. ఈ క్రమంలో చోటుచేసుకునే ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 40 మంది డ్యాన్సర్లతో చిత్రీకరిస్తున్న గీతం.. చిత్రానికే హైలైట్‍గా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ పాటకు విజయ్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. అలాగే తెలంగాణలోని గద్వాలలో గల జోగుళాంబ శక్తి పీఠంలో ఈ సినిమాకు సంబంధించిన వివాహ నిశ్చయ తాంబూలాలు, బంధుమిత్రుల విందు భోజనాల సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా మొత్తం క్రీడల నేపథ్యంలో సాగుతుంది. అందులో స్వచ్ఛమైన ప్రేమకథను దర్శకుడు నిర్మల్‍కుమార్ ఆసక్తి కలిగించేలా చొప్పిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘ఆట గదరా శివ’తో ఆకట్టుకున్న ఉదయ్ శంకర్ ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్ పోషిస్తున్నాడని, అతని నటన కట్టిపడేస్తుందని అంటున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలను అందించిన భూపతిరాజా.. ఆటల నేపథ్యంలో సాగే కుటుంబ కథను ఈ చిత్రం కోసం అందించారని, అదే ఈ చిత్రానికి ఆకర్షణ కానున్నదని దర్శకుడు నిర్మల్‍కుమార్ చెబుతున్నారు.
ఫస్ట్ లుక్‍కు అదిరే రెస్పాన్స్..
ఇటీవలే దర్శకుడు నిర్మల్‍కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ‘మిస్ మ్యాచ్’ చిత్రం తాలూకు ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధా కృష్ణ) ఈ చిత్రం ఫస్ట్ లుక్ చిత్రాలకు విడుదల చేశారు. ఈ చిత్రాలలో ఉన్న స్టిల్స్ను బట్టి కథానాయిక ఐశ్వర్య రాజేశ్ మల్లయోధురాలుగా, హీరో ఉదయ్ శంకర్ ఐటీ ప్రొఫెషనల్‍గా కనిపించనున్నారు. రెండు విభిన్న రంగాలకు చెందిన వారి హీరో, హీరోయిన్ల మధ్య లవ్, ఫ్యామిలీ ట్రాక్ ఎలా నడిచిందన్నదే ఈ చిత్ర కథ. చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. తనకు నిర్మల్‍కుమార్ ఎన్నో ఏళ్లుగా తెలుసని, తమిళంలో ‘డాక్టర్ సలీం’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించాడని అన్నారు. సలీం చిత్రం ద్వారా అతని దర్శకత్వ ప్రతిభను, సినిమాను డైరెక్ట్ చేసే విధానాన్ని తెలుసుకోవచ్చని అన్నారు. తెలుగులో అతను రూపొందిస్తున్న ఈ తొలి చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని చెప్పారు. ఎప్పుడూ మీడియా ముందుకు పెద్దగా రాని, కనిపించని కథకుడు భూపతిరాజా ఈ చిత్రం ఫస్ట్ లుక్ స్టిల్స్ రిలీజ్ సందర్భంగా అందరి ముందుకు వచ్చారు. గతంలో ఈయన ‘ముఠా మేస్త్రీ’, ‘అన్నయ్య’, ‘డాడీ’, ‘నేనున్నాను’ తదితర పలు విజయవంత మైన చిత్రాలకు కథలను అందించారు. ఈ చిత్రంలో అందరూ కీలక పాత్రలు పోషిస్తున్నారని, అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ చిత్రం విదేశాలతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోనూ షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. కథ, కథనంతో పాటు హీరోయిన్, తన మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు సినిమా చూస్తున్నంత సేపూ ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తాయని హీరో ఉదయ్ శంకర్ చెబుతున్నాడు.
Review ‘మ్యాచ్’ షురూ.