నేలమాళిగ
ఇందులో ఉండటం వల్ల జఠరాగ్ని హెచ్చవుతుంది. మూర్ఛ, దాహం, శ్రమ, చెమట ఉండవు. వేడి, శీతబాధ, వాతాలు అణగిపోతాయి. దేహకాంతి పోయి వివర్ణమయ్యే అవకాశం కూడా ఉంది.
పగడం
దొండపండు రంగులో ఉండి, గుండ్రంగా కోలగా లేదా వంకరగా లేక నున్నగా గొగ్గులు, పుచ్చులు లేకుండా స్థూలంగా ఉన్న పగడం శ్రేష్ఠం. దీన్ని ధరిస్తే వాత పిత్తాది దోషాలు పోతాయి. వీర్యవృద్ధి, కాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. తేనెలో అరగదీసి పూసుకుంటే జిహ్వ దోషం పోతుంది.
పచ్చ కర్పూరం
చిరు చేదుగా సువాసన కలిగి, మనోహరంగా ఉంటుంది. అరుచి, దగ్గు, క్షయ, మూత్రవ్యాధులను అణచివేస్తుంది. వీర్యపుష్టినిస్తుంది. బుద్ధిని కలిగిస్తుంది. చెమట తదితర దుర్గంధాలను అణచివేస్తుంది. కోరికను పెంచుతుంది. కడుపుబ్బుగా ఉన్నపుడు, రతి సమయంలోనూ, ఎండన పడినపుడు, ఆకలి, దాహం అధికంగా ఉన్నపుడు, తాపం పుట్టినపుడు దీన్ని తీసుకుంటే ప్రశస్తంగా ఉంటుంది.
పచ్చగన్నేరు
ఈ రకం గన్నేరు దేవాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సన్నని ఆకులుండి, పాలు కలిగి ఉంటుంది. దీని పువ్వులు పసుపు పచ్చగా పొడవుగా ఉండి సువాసన కలిగి ఉంటాయి. దీని చెక్క చేదుగా ఉంటుంది. విరేచనకారి. దీని పప్పు విషతుల్యం. తింటే చనిపోతారు. దీనికి విరుగుడు ఆవుపేడ నీళ్లలో కలిపి వడబోసి తాగిస్తే గుణం కనిపిస్తుంది.
పచ్చ పెసరపప్పు
త్రిదోషాలను హరిస్తుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. దాహాన్ని అణచివేస్తుంది. మూలశంక, అజీర్ణం, విదాహం, జ్వరాలను తగ్గిస్తుంది. విరేచకారి. దేహానికి పుష్టినిచ్చి, మంచి రక్తాన్ని కలిగిస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. కడుపుబ్బరాన్ని పోగొడుతుంది. పొట్టు తీయని పప్పయితే శ్రేష్ఠం. పొట్టుతో ఉన్న పప్పును వేయించి తింటే జఠరదీప్తి కలుగుతుంది. పైత్యరోగాన్ని పోగొట్టి సర్వేంద్రియాలకు బలాన్ని చేకూరుస్తుంది.
పచ్చ అరటిపళ్లు
పొడవుగా, ఆకుపచ్చగా ఉంటాయి. బాగా పండితే పసుపుపచ్చగా కూడా ఉంటాయి. సువాసన కలిగి, మంచి రుచిగా ఉంటాయి. మేహశాంతి, పైత్యశాంతిని కలుగచేస్తాయి. ఆకలిని తీరుస్తాయి.
పటికి పంచదార
దీనిని కలకండ, ఖండశర్కర, పటికి బెల్లమనే పేర్లతో వ్యవహరిస్తారు. మేహశాంతిని కలుగచేస్తుంది. జఠరదీప్తి, వీర్యవృద్ధి, దేహపుష్టి, బలాన్నిస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. వాత, పిత్త, శ్లేష్మాల కారణంగా వచ్చిన రోగాలు, దాహం, తాపం, భ్రమ, శ్రమ, దగ్గు, నేత్రరోగాలను తగ్గిస్తుంది. పొడిదగ్గును అణచివేస్తుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది. సర్వేంద్రియాలకు బలాన్ని కలిగిస్తుంది. మితిమీరి తింటే ఆకలి మందగించి విరేచనం కాకుండా పోతుంది. మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. దీనిని మెత్తగా నూరి బార్లీ గంజిలో గాని, సగ్గుబియ్యం జావలో గాని కలిపి తీసుకుంటే జ్వరపడి లేచిన వారికి, రోగులకు ఆరోగ్యం చేకూరుతుంది.
పచ్చిపోక
పచ్చి లేక ఉడకబెట్టిన పోకచెక్క వగరుగా ఉంటుంది. నోటికంపు, కంఠదోషం, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.
పట్టు గొడుగు
మనోహరంగా ఉంటుంది. బలాన్నిచ్చి కాంతిని కలుగచేస్తుంది. ఎండ, గాలి, ధూళి సోకకుండా కాపాడుతుంది.
పట్టువస్త్రం
దీన్ని ధరిస్తే చల్లగా ఉంటుంది. కఫం, వాతం, మూర్ఛ, దాహం, శ్రమ.. వీటిని హరిస్తుంది. కాంతినిచ్చి దేహపుష్టి, బలాన్ని కలుగచేస్తుంది. శీతోష్ణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
పట్టె మంచం
సర్వాంగాలకూ సౌకర్యంగా ఉంటుంది. ఆరోగ్యకారకం.
పనసకాయ కూర
రుచిగా ఉంటుంది. మేధస్సును పెంచుతుంది. వీర్యపుష్టిని కలుగచేసి బలాన్నిస్తుంది. వేడి చేస్తుంది. బాగా నీరసంగా ఉన్న వారు దీనిని తినకపోవడమే మంచిది.
పనసగింజలు
రుచిగా ఉంటాయి. వీర్యవృద్ధిని కలుగచేస్తాయి. మలమూత్రాలను జారీ చేస్తాయి. పైత్యం చేసి శరీరకాంతిని తగ్గిస్తాయి. వేడి చేస్తాయి. అయితే, వీటిని నేతిలో గాని, నూనెలో గాని వేయించి తింటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
పగటి నిద్ర
బద్ధకాన్ని కలిగిస్తుంది. వాతం చేస్తుంది. అన్నం అరగనివ్వదు. బుద్ధిమాంద్యాన్ని కలుగచేసి నీరసాన్ని పుట్టిస్తుంది. అయితే వేసవి కాలంలో మధ్యాహ్నం వేళ చిన్న కునుకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.




























































































Review పగటినిద్ర పనికి చేటు.