పిల్లలకు, పెద్దలకు టీకా ఆరోగ్య రక్షణ పక్కా

పిల్లలకు తల్లిపాల తరువాత అత్యంత రక్షణనిచ్చేవి టీకాలే. అందుకే పిల్లలకు నిర్దిష్టమైన నెలల కలంలో పలు టీకాలు క్రమం తప్పకుండా వేయిస్తుంటారు. పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు టీకాలు వేయిస్తుండాలి. ప్రముఖంగా పల్స్ పోలియో నుంచి ఈ మధ్యన వచ్చిన కరోనా టీకాల వరకు చాలా రకాల టీకాలు పిల్లలతో పాటు పెద్దలకూ రక్షణగా నిలుస్తాయి. అయితే చాలామంది టీకాలు అనేవి కేవలం పిల్లలకు మాత్రమే అవసరమైనవనే అభిప్రాయంతో ఉంటారు. కానీ, పిల్లలతో పాటు పెద్దలూ కాలానుగుణంగా తీసుకోవాల్సిన టీకాలు అనేకం ఉన్నాయి. పిల్లల్లోనే రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి టీకాలు వేయించాలని చాలామంది పెద్దలు భావిస్తుంటారు. పెద్దల్లోనూ ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా టీకాల సంరక్షణ ఎంతో అవసరం. సాధారణ ఫ్లూ జ్వరాల నుంచి దీర్ఘకాలిక సమస్యలైన హెప•టైటిస్‍ లాంటి ఇన్‍ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం ప్రస్తుతం మార్కెట్లో పలు రకాలు టీకాలు పెద్దల కోసం అందుబాటులో ఉన్నాయి.
వివిధ రకాల వ్యాధులకు పాశుపతాస్త్రంగా పనిచేసే టీకాలు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి భరోసా, భద్రత లభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సంరక్షణతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
మార్చి 16, 2026 జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా పిల్లలకు, పెద్దలకు అందుబాటులో ఉన్న టీకాలు ఏమిటి? వాటి వల్ల మనకు ఎలాంటి రక్షణ లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

ఏటా మార్చి 16న జాతీయ టీకా దినోత్సవాన్ని (నేషనల్‍ వ్యాక్సినేషన్‍ డే) నిర్వహిస్తారు. దీనినే జాతీయ రోగ నిరోధక దినోత్సవం (నేషనల్‍ ఇమ్యునైజేషన్‍ డే) అని కూడా అంటారు. టీకాలు అనేవి ప్రజారోగ్యంలో ముఖ్య భాగం. వ్యక్తులు, సమాజాన్ని అంటువ్యాధుల బారి నుంచి రక్షించడంలో ఇవి చాలా అవసరం. వివిధ బ్యాక్టీరియా, వైరస్‍లు మానవులను చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయం చేస్తాయి. టీకాల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పోలియోను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‍) 1988లో మొదటిసారి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే మన భారత ప్రభుత్వం 1995, మార్చి 16న దేశంలో పల్స్పోలియో ఇమ్యునైజేషన్‍ పోగ్రామ్‍ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఏటా ఇదే తేదీన జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఇన్‍ఫ్లూయెంజా ఫ్లూ టీకా:
ఫ్లూ జ్వరాలకు చక్కగా అడ్డుకట్ట వేయడానికి పెద్దలకు అందుబాటులో ఉన్న టీకా- ఇన్‍ఫ్లూయెంజా ఫ్లూ టీకా. గర్భిణిలు, అరవై సంవత్సరాలు పైబడిన వారు ఈ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లూ జ్వరాలతో తరచూ బాధపడే వారికి ఈ టీకా ఎంతో మేలు చేస్తుంది.

న్యూమోకోకల్‍ టీకా:
వృద్ధాప్యంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నిమోనియా కూడా ఎక్కువగా వచ్చే చాన్స్ ఉంటుంది. అలాంటి వారికి న్యూమోకోకల్‍ టీకా ఎంతో మేలు చేస్తుంది. మంచి సంరక్షణను ఇస్తుంది. ఇది నిమోనియా వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది.

హెపటైటిస్‍ టీకా:
కాలేయానికి వచ్చే హెపటైటిస్‍ ఇన్‍ఫెక్షన్‍ శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అయితే హెపటైటిస్‍ ఇన్‍ఫెక్షన్లు రెండు రకాలు. ఒకటి- హెపటైటిస్‍-ఏ. రెండోది- హెపటైటిస్‍-బీ. రెండింటికీ ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండు దఫాలుగా హెపటైటిస్‍-ఏ టీకా తీసుకోవాల్సి వస్తే, హెపటైటిస్‍-బీ టీకాను జీవితంలో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. వీటివల్ల జీవితకాలానికి పూర్తి రక్షణ లభిస్తుంది. కొంతమంది హెపటైటిస్‍-ఏ, బీ రెండింటితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ రెండు రకాల టీకాలను తీసుకోవడం ఉత్తమం.
ఇక హెపటైటిస్‍-బీ అనేది హెపటైటిస్‍ బీ వైరస్‍ (హెచ్‍బీవీ) వల్ల కలిగే ప్రాణాంతక ఇన్‍ఫెక్షన్‍. ఈ ఇన్‍ఫెక్షన్‍ తీవ్రమైన కాలేయ వ్యాధికి కారణం అవుతుంది. కాబట్టి పుట్టిన వెంటనే ఈ హెచ్‍బీవీ టీకాలను శిశువులకు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. కనీసం నాలుగు వారాల వ్యవధిలో రెండు, మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల తీవ్రమైన ఇన్‍ఫెక్షన్‍ నుంచి మరణించే ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

హెచ్‍పీవీ టీకా:
మహిళలకు శాపంగా మారిన సర్వైకల్‍ క్యాన్సర్‍ నుంచి రక్షణ కోసం అందుబాటులో ఉన్న టీకా- హెచ్‍పీవీ. ఇది తీసుకుంటే మహిళలకు వచ్చే సర్వైకల్‍ క్యాన్సర్‍ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు.

తట్టు వ్యాధి నివారణ టీకా:
పిల్లలలో తట్టు వ్యాధి సాధారణంగా వస్తుంటుంది. ఇది అధిక ప్రమాదాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని నివారించడానికి రెండు మోతాదుల ఎంఎంఆర్‍ వ్యాక్సిన్‍ ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్‍ మీజిల్‍, గవదబిళ్లలు, రుబెల్లా వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం నుంచి పిల్లలను రక్షించడానికి సాయపడుతుంది. మొదటి డోసును 12 నుంచి 15 నెలల మధ్య, రెండోది 4 నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలందరికీ తప్పక వేయించాల్సిన వ్యాక్సిన్‍ ఇది.

ఓరల్‍ పోలియో టీకా:
పోలియోమైలిటిస్‍ అనేది పిల్లలలో వికలాంగత్వాన్ని కలిగించే ఒక వ్యాధి. భారీ టీకా ప్రచారం ఫలితంగా భారతదేశం ఈ వ్యాధి బారి నుంచి బయటపడింది. ఓరల్‍ పోలియో వ్యాక్సిన్‍ (ఓపీవీ) ద్వారా పోలియో నివారణ సాధ్యపడుతుంది. తీవ్రమైన వ్యాధి ప్రమాదం నుంచి పిల్లలను రక్షించడానికి వారికి ఐదు సంవత్సరాల వయసు ఉన్న సమయంలో రెండు చుక్కల వ్యాక్సిన్‍ను ఇస్తారు. పోలియో డ్రాప్స్ను ప్రభుత్వాలు ప్రతి ఏటా రెండుసార్లు చొప్పున భారీ ప్రచార కార్యక్రమాల ద్వారా అందిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలు కచ్చితంగా తీసుకోవాల్సిన టీకా ఇది.

రోటవైరస్‍ వ్యాక్సిన్‍:
ప్రపంచవ్యాప్తంగా శిశువులు, చిన్నపిల్లల్లో తీవ్రమైన విరేచనాలకు రోటవైరస్‍ అత్యంత సాధారణ కారణం. రోటవైరస్‍ టీకా ఈ ఇన్‍ఫెక్షన్‍ నుంచి పిల్లలను రక్షిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులు సోకే ప్రమాదాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పిల్లలకు 6, 10, 14 వారాల వయసులో ఈ టీకాను ఇస్తారు. భారతదేశంలో టీకా గురించి పెరిగిన అవగాహన ఈ ఇన్‍ఫెక్షన్‍ను ఎక్కువగా నియంత్రించగలుగుతోంది.
పైన తెలిపిన పలు టీకాలతో పాటు కరోనా నుంచి రక్షణకు కోవిడ్‍ టీకా, స్వైన్‍ఫ్లూ నుంచి రక్షణ కోసం స్వైన్‍ఫ్లూ టీకాలు, టైఫాయిడ్‍ జ్వరం నుంచి రక్షణ పొందేందుకు కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎంఎంఆర్‍, వారిసెల్లా, టైటానస్‍, డిఫ్తీరియా, పెర్టూసిస్‍, జోస్టర్‍, మెదడువాపు వ్యాధి నుంచి రక్షణకు కూడా పలు టీకాలను పెద్దల కోసం రూపొందించారు శాస్త్రవేత్తలు. వీటిని వేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది.

నవజాత శిశువులకు
ఇవ్వాల్సిన టీకాలివే..

బీసీజీ:
ఈ టీకా పుట్టిన వెంటనే లేదా ఏడాది వయసు వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇది క్షయవ్యాధి నుంచి రక్షిస్తుంది.

హెపటైటిస్‍-బీ:
ఈ టీకాను పిల్లలు పుట్టిన 24 గంటల్లోపు ఇవ్వడం చాలా ముఖ్యం. దీంతో కాలేయ ఇన్‍ఫెక్షన్లు, భవిష్యత్తులో రాగల వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

ఓపీవీ-0:
ఇది పోలియో వ్యాక్సిన్‍. పుట్టిన వెంటనే లేదా పుట్టిన మొదటి పదిహేను రోజుల్లోపు ఇవ్వాల్సిన టీకా ఇది.

ఓపీవీ-1,2,3:
ఈ మోతాదులను వరుసగా 6 వారాలు, 10 వారాలు, 14 వారాల వయసు పిల్లలకు ఇస్తారు. ఈ టీకాను ఐదు సంవత్సరాల వయసు వరకు ఇవ్వవచ్చు.

పెంటావాలెంట్‍ వ్యాక్సిన్‍ (1,2,3):
ఇది డిఫ్తీరియా, టెటనస్‍, పెర్టుసిస్‍, హెపటైటిస్‍-బీ, హేమోఫిలస్‍ ఇన్‍ఫ్లూయెంజా టైప్‍-బీ (హిబ్‍)లకు పనిచేసే మిశ్రమ టీకా ఇది. దీనిని పిల్లలకు 6, 10, 14 వారాల వయసులో ఇవ్వాల్సి ఉంటుంది.

రోటావైరస్‍ టీకా:
ఇది శిశువులకు 6, 10, 14 వారాల వయసులో ఇవ్వాలి.

ఐపీవీ (పోలియో ఇంజెక్షన్‍):
రెండు మోతాదులుగా ఇస్తారు. 6, 14 వారాల వయసులో ఇస్తారు.

తట్టు/ఎంఆర్‍ మొదటి టీకా:
ఈ టీకా 9 నుంచి 12 నెలల వయసు మధ్య ఇవ్వాలి.

జేఈ (జేఈ-1):
ఈ టీకా జపనీస్‍ ఎన్సెఫాలిటిస్‍ నుంచి రక్షిస్తుంది. 9, 12 నెలల వయసు మధ్య ఇవ్వాల్సి ఉంటుంది.

విటమిన్‍ ఏ:
దీనిని శిశువులకు 9 నెలల వయసులో ఎంఆర్‍ వ్యాక్సిన్‍తో పాటుగా మొదటి మోతాదుగా ఇస్తారు. ఇది పిల్లల దృష్టి, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

పెద్ద పిల్లలకు టీకాలు

డీపీటీ బూస్టర్‍-1:
ఈ టీకాను 16 నుంచి 24 నెలల వయసు మధ్య పిల్లలకు డిఫ్తీరియా, టెటనస్‍, పెర్టుసిస్‍ నుంచి రక్షణ కల్పించడానికి ఇస్తారు.

తట్టు/ఎంఆర్‍ 2వ టీకా:
ఇది పదహారు నుంచి 24 నెలల వయసులో పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఓపీవీ బూస్టర్‍ (పోలియో బూస్టర్‍):
పోలియో నుంచి రక్షణ కొనసాగించడానికి ఇది 16 నుంచి 24 నెలల వయసులో పిల్లలకు ఇవ్వాలి.

జేఈ-2:
16 నెలల నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యలో ఈ రెండో జపనీస్‍ ఎన్సెఫాలిటిస్‍ వ్యాక్సిన్‍ ఇవ్వాలి.

విటమిన్‍-ఏ (2 నుంచి 9 వరకు మోతాదులు):
రెండో డోసును 16 నుంచి 18 నెలల వయసులో ఇవ్వాలి. ఆ తరువాత బిడ్డకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి ఆరు నెలలకు ఒక డోసు చొప్పున ఇవ్వాలి.

డీపీటీ బూస్టర్‍-2:
కౌమార దశలో ఉన్న పిల్లలకు ఇది చాలా ముఖ్యమైన వ్యాక్సిన్‍. మొదటి మోతాదును పది సంవత్సరాల వయసులో, రెండో మోతాదును పదహారు సంవత్సరాల వయసులో ఇవ్వాల్సి ఉంటుంది.

Review పిల్లలకు, పెద్దలకు టీకా ఆరోగ్య రక్షణ పక్కా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top