బావి నీళ్లు:
ఉప్పగా, తియ్యగా ఉంటాయి. వేడి చేస్తాయి. శ్లేషాన్ని, వాతాన్ని పోగొడతాయి. జఠరదీప్తినిస్తాయి. విరేచనాన్ని కావిస్తాయి. పైత్యాన్ని కలిగిస్తాయి.
బియ్యపు కడుగు:
బియ్యం కడిగిన నీళ్లను కడుగు అని, పసగడుగని అంటారు. ఈ నీళ్లలో పంచదార కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. చలువచేస్తుంది. దాహం, తాపం తగ్గుతాయి. ఎక్కువగా తీసుకుంటే జలుబు చేస్తుంది. బియ్యాన్ని మొదటిసారి కడిగిన కడుగును తీసుకుంటే అగ్నిమాంద్యం, అతిసారం, మేహం పోతాయి. రెండవసారి కడుగును తీసుకుంటే శరీరంలో ఉన్న విషాలు, రక్తపైత్యం వంటివి నశిస్తాయి. వేసవి కాలంలో ఈ కడుగు నీళ్లను తీసుకుంటే చాలా మంచిది.
బీరకాయ:
దీని కూర రుచిగా ఉంటుంది. చలువ చేస్తుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. పొట్టను మృదువుగా ఉంచుతుంది. జఠరపుష్టిని, పుంస్త్వాన్ని కలిగిస్తుంది. ఇది అన్ని రోగుల వారికి పథ్యంగా పనిచేస్తుంది.
బీరకాయ పచ్చడి:
కఫాన్ని హరిస్తుంది. అరుచిని పోగొడుతుంది. జఠరదీప్తినిస్తుంది. వేడి చేస్తుంది.
బీరకాయ పొట్టు:
పథ్యంగా పనికివస్తుంది. దీనిని ఎండబెట్టి నేతిలో వేయించి తింటే చాలా రుచిగా ఉంటుంది. తేలికగా జీర్ణం అవుతుంది.
బీరాకు:
ఈ ఆకు రసం లేదా కషాయం వేడి చేసి నీరుజేస్తుంది. ఉబ్బుతనాన్ని పోగొడుతుంది. చెడు రక్తాన్ని తీసివేస్తుంది. పైత్యాన్ని హరిస్తుంది.
బుడంకాయ:
చేదుగా ఉంటుంది. జఠరాగ్నిని కలిగిస్తుంది. పైత్యం, వాతం, మూలవ్యాధి, శూల, మేహాలను అణచివేస్తుంది. ముదురు బుడంకాయ చేదుగా, పుల్లగా ఉండి రుచి పుట్టిస్తుంది. పైత్యం చేస్తుంది. పండుకాయ మేహశాంతిని కలుగచేస్తుంది. పచ్చికాయను ముక్కలుగా కోసి వాటిని ఆముదంలో ఉడికించి ఆ ఆముదాన్ని తాగితే పొట్టలోని క్రిములు నశిస్తాయి.
బూడిద గుమ్మడికాయ:
చలువ చేస్తుంది. నీరు పడుతుంది. మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. పొట్టను మృదువుగా చేస్తుంది. పాండు రోగాన్ని, జ్వరాన్ని పోగొడుతుంది. మంచి రక్తాన్ని కలిగిస్తుంది. కాలేయం, కడుపులో ఉన్న వేడిని అణచివేస్తుంది. దేహపుష్టిని కలిగిస్తుంది. లేత బూడిద గుమ్మడికాయ ఉప్పగా ఉండి, పొత్తి కడుపును శుభ్రం చేస్తుంది. వీర్యపుష్టి, బలాన్ని కలుగచేస్తుంది. కఫం, పైత్యం, అతిమూత్రాన్ని పోగొడుతుంది. ముదిరిన కాయ రసం విరేచనకారి. క్షయ రోగికి ఇది బాగుంటుంది. దీని ముక్కలతో పులుసు కానీ, మజ్జిగ పులుసు కానీ చేసి తీసుకుంటే మేహశాంతి, పైత్యశాంతి కలుగుతుంది.
బూడిద గుమ్మడికాయ వడియాలు:
మంచి రుచిగా ఉంటాయివి. కొద్దిగా పైత్యవాతాలను అణచివేస్తాయి. వీర్యపుష్టి, బలాన్ని కలుగచేస్తాయి.
బూరుగు దూది పరుపు:
మృదువుగా ఉంటుంది. కఫ, వాతాలను తగ్గిస్తుంది. నిద్ర సౌఖ్యాన్నిస్తుంది. వీర్యవృద్ధిని కూడ కలుగచేస్తుంది.
బూరెలు:
రుచిగా బాగుంటాయి. శుక్రవృద్ధిని, పుష్టిని కలుగచేస్తాయి. శ్లేష్మం చేస్తుంది.
బెల్లం:
ఉదర రోగం, వాతాలను పోగొడుతుంది. కడుపులో పురుగులను కలిగిస్తుంది. ఒంట్లో ఉన్న నీరు తీసేసి బలాన్నిస్తుంది. బాలింతలకు, మశూచి తగిలిన వారికి, గాయాలతో బాధపడుతున్న వారికి పథ్యంగా ఉపయోగపడుతుంది. స్త్రీ సాంగత్యం చేసిన వెంటనే ఇంత బెల్లం ముక్క తింటే నీరసం అనిపించదు. పాత బెల్లం చాలా మంచిది. ఇది సర్వ దోషాలను, జ్వరాన్ని, తాపాన్ని పోగొడుతుంది. రుచిని పుట్టించి, మూత్రాన్ని జారీ చేస్తుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. శ్రమను పోగొడుతుంది. బాలింతలకు కూడా మంచిదిది. కొద్దిగా మిరియాలు పొడి కలిపిన బెల్లం పానకాన్ని తీసుకుంటే వడదెబ్బ తగలదు. గుండె దడను తగ్గిస్తుంది. చలువ చేస్తుంది. నిద్ర పడుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. కొత్త బెల్లం అపథ్యం.
బెండకాయ:
చలువ చేస్తుంది. కడుపునొప్పిని కలిగిస్తుంది. వాత, కఫాలను పెంచుతుంది. •లాన్నిచ్చి, వీర్యవృద్ధిని కలుగచేస్తుంది.
బొబ్బర్లు:
కమ్మగా, రుచిగా ఉంటాయి. వేడి చేసి, చలువ చేస్తాయి. గుండెలను మృదువు పరుస్తాయి. పురుషులకు ఇంద్రియాన్ని, స్త్రీలకు పాలను కలుగచేస్తాయి. మూత్రాన్ని జారీ చేస్తుంది. విరేచనకారి. దేహపుష్టి కలిగిస్తుంది. మూత్రపిండాల నొప్పిని పోగొడతాయి. అపానవాయువును హెచ్చు చేస్తాయి.




























































































Review బావినీళ్లు తియ్యన.. దూది పరుపు మెత్తన.