భారతదేశం ప్రాచీన కాలం నుంచి పాలించి, పెంచిన కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, ధార్మిక బాధ్యతలు, ఆచార వ్యవహారాలు, తత్వచింతన, జీవనరీతులు, సామాజిక వ్యవస్థ.. ఇవన్నీ ఒక్క రామాయణంలోనే చిత్రీకరించాడు వాల్మీకి తన రామాయణంలో!. అందుకే రామాయణం ‘భారత జాతీయ మహా ఇతిహాసం’గా ప్రసిద్ధి చెందింది. ఇది మత గ్రంథం. విశ్వ మానవుడికి యుగాల పూర్వమే భారతదేశం అందించిన మహాదర్శం. దానిని మనం కాపాడుకుంటూ ఆచరించి చూపడమే మనలోని రామభక్తికి నిదర్శనం. యుగాలు గడుస్తున్నా రామ నామం తారకమంత్రమై, రామ రూపం దివ్యమంగళ విగ్రహమై, రామ కథ పారాయణ గ్రంథమై విరాజిల్లుతున్నాయి. విశ్వవ్యాపక ఈశ్వర చైతన్యాన్ని జగన్మాతగా, వైష్ణవిగా ఉపాసించే తీరు, విష్ణువైన శ్రీరాముడిని ఆరాధించే తీరు- ఒకే తత్వపు రెండు రూపాలు.
మన భారత కథానాయకుడైన శ్రీరాముడు.. చైత్ర మాసం ఉత్తరాయణ పుణ్యకాలం, వసంత రుతువు, శుక్ల పక్ష నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆనాడే ఆయన జన్మదినంతో పాటు కల్యాణం జరిపించడంలో లోకోత్తరమైన రహస్యం ఉంది. దశావతరాల్లో రామావతారానికి ప్రత్యేకత ఉంది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ అవతారాలు దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు మహత్కార్యాల సాధనపైనే కేంద్రీకృతమయ్యాయి. కానీ, పరబ్రహ్మ రాముడై అవతరించడానికి ముఖ్య కారణం.. ధర్మ సంరక్షణ. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మ:’ అని వాల్మీకి అభివర్ణించాడు.
ధర్మానికి నాలుగు పాదాలు. నాలుగు పాదాల వృషభ రూప ధర్ముడు త్రేతాయుగం వచ్చేసరికి ద్విపాద పశువుకు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు కాళ్ల మీద నిలబడ్డాడట. పశు దశ నుంచి మానవ దశకు చేరుకున్న జీవుడు తిరిగి పతనావస్థకు చేరకుండా రక్షించడానికే రఘుకులదీపుడై దిగి వచ్చాడు సాక్షాత్తూ నారాయణుడు. ధర్మానికి కట్టుబడి, కర్తవ్య కర్మను చిత్తశుద్ధితో, ఏకాగ్రబుద్ధితో ఏ మానవుడు నిర్వహిస్తాడో అతడే ఆదర్శ మానవుడు. అలాంటి పురుషోత్తముడు దైవానికి ఏమాత్రం తీసిపోడు. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని ద్రష్ట అయిన ఆదికవి కోకిల వాల్మీకి కల స్వరంతో రామాయణమనే జీవన ప్రబంధాన్ని అనుసంధించి మధుర గానంగా మానవ జాతికి అందించాడు. అందుకే రామాయణం నేటికీ నిత్య పారాయణ గ్రంథంగా జనజీవనంలో మన్నుతోంది. నిత్యం తన నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని చాటుతోంది.
రామావతారం ఎందుకు?
ఈ భూమ్మీద మనిషిగా మనం ఎలా ప్రవర్తించాలో చూపించడానికే రాముడు అవతరించాడు. ఒక తనయుడిగా, ఒక అన్నయ్యగా, ఒక భర్తగా, ఒక కర్తగా మనిషి ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో రాముడు చేసి చూపించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదులుకోకూడదని, దాన్ని రక్షించగలిగితే అదే మనల్ని రక్షిస్తుందని స్వయంగా రాముడే తన జీవన ప్రస్థానాన్ని మన కళ్లముందు ప్రదర్శించాడు.
నిత్య జీవితంలో శత్రువులను ఎలా జయించాలో, మిత్రలను ఎలా సమాదరించాలో, ఆశ్రితులను ఎలా ఆదుకోవాలో రామాయణంలోని ఘట్టాలు అడుగడుగునా రుజువు చేస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు నీతి నియమాలు బోధించినంత మాత్రాన సంతానానికి న్యాయం జరగదు. రుజు మార్గంలో రాముడిలా, సీతలా నడిచి చూపించాలి. అదే ఆదర్శం. ఆ జీవితాదర్శాన్నే రాముడు మానవజాతికి ఒక వరంగా చేశాడు. రాముడిని మించిన ఆదర్శ పురుషుడు ముల్లోకాల్లో కనిపించకపోగా, ఆబ్రహ్మ పర్యంతం దేవలోకాల్లో ఉన్న ముక్కోటి దేవతామూర్తులు, ముక్తులు కావడానికి తిరిగి ఈ భూమిపై మానవ రూపంలో జన్మించవలసిందేనని భగవద్గీత చెబుతోంది. కర్మభూమి అయిన ఈ భూలోకం పరబ్రహ్మ యొక్క పాదపీఠం. పురుషార్థ సాధనకు ఏమాత్రం వీలులేని ఆ స్వర్గం కన్నా, స్వర్గ నరకాలేమిటో చవి చూపగల ఈ మానవ లోకమే మిన్న. అందుకే రాముడు మానవుడై ఈ భూమిపై అవతరించాడు.
‘నేను మనిషినే’..
త్రేతాయుగం అంతిమ సమయంలో బ్రహ్మ దిగి వచ్చి- ‘నువ్వు నారాయణుడివి. నీ లోకం వైకుంఠం’ అని గుర్తు చేస్తాడు.
‘నేను మనిషినే’ అని బదులిస్తాడు రాముడు.
ఆయన దృష్టిలో మానవ జన్మ మహనీయమైన మోక్ష ద్వారం.
రాముడి పుట్టిన రోజు సీతారామ కల్యాణం జరపడంలోని అంతరార్థం- లోక కల్యాణాన్ని సూచిస్తుంది. సీతారామ కల్యాణం జీవాత్మ, పరమాత్మల అనుసంధానానికి ఒక సంకేతం. రాముడి వంటి కొడుకు, సీతలాంటి భార్య, హనుమంతుడు వంటి బంటును పొందగలిగితే మానవ జీవితం ధన్యం అవుతుంది. మానవకోటి ఈ ఆదర్శం వైపు అడుగులు వేయాలని గుర్తు చేయడమే శ్రీరామ నవమి ఉత్సవాల తాత్పర్యం. శ్రీరామ జననం వెనుక దాగి ఉన్న పరమ రహస్యం.
శక్తిమంతమైన భగవత్ స్వరూపం ఒక మానవుడిగా నడయాడిన దైవమే- రామచరిత. రూపంలో, గుణంలో, చరిత్రలో, ధర్మనిష్టలో, ప్రేమలో, సముచిత వర్తనలో, జ్ఞానంలో, వాగ్వైఖరిలో.. ఇలా అన్నింటా నిండైన సౌందర్యం కలిగి, ప్రకటించిన స్వరూపం- శ్రీరామావతారం. ఏ ఒక్క గుణాన్నయినా సంపూర్ణంగా కలిగి ఉండటం అరుదైన అంశం. అటువంటిది, అన్ని లక్షణాలనూ నిండుగా కలిగి, ఏ లోపం లేని చరిత్రతో నడయాడాలంటే ఆ దేవుడే దిగిరావాలి. అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు. ఆనందాన్ని కలిగించే వాడు అందగాడు. జగదానంద కారకుడే శ్రీరామచంద్రుడు. అందుకే మానవజాతికి ఆదర్శంగా, ఆరాధ్యంగా ఆ మహనీయమూర్తిని వర్ణించి తరించారు వాల్మీకి, ఇతర వ్యాసాది మహర్షులు, కాళిదాసు తదితర సర్వ భాషా కవులు. త్యాగయ్య అయితే రాముడిని ‘జగదానందకారక’ అని కీర్తించాడు. ఇంకా ఎందరో భక్తాగ్రేసరులు శ్రీరాముడిని వేనోళ్ల కీర్తించారు. రమ్యమైన ఆ రామ నామాన్ని స్మరించి, తరించని భక్తజనం లేరంటే అతిశయోక్తి కాదు.
రామ జననం.. రామనామం
పుత్ర కామేష్టి యాగం ముగిసిన తరువాత ఆరు రుతువులు గడిచాయి. పన్నెండవ నెల అయిన చైత్ర మాసాన నవమీ తిథి నాడు, అదితి దేవతాకమైన పునర్వసు నక్షత్రాన ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉండగా కర్కాటక ల్నగంలో గురుడు చంద్రునితో కలిసి ఉండగా కౌసల్యాదేవి జగన్నాథుడు, సర్వలోకారాధ్యుడు, సర్వలక్షణ సంయుతుడు, విష్ణువులో అర్ధభాగమైన మహాభాగుడు అయిన శ్రీరాముడిని ప్రసవించింది. రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడని రామాయణంలో నాలుగు చోట్ల ఉంది. ఇంతటి దివ్య చరిత్ర కలిగిన గ్రంథం కాబట్టే రామాయణాన్ని ఆదికావ్యం అంటారు.
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపతనాశనమ్
రామ నవమి నుంచి రామకోటి రాయడం ఆరంభించి మరుసటి రామ నవమికి ఆ వ్రతాన్ని ముగించే ఆచారం చాలా చోట్ల ఉంది.
రామనామ లిఖే ద్యస్తు లక్షకోటి శతావధి
ఏకైక మక్షరం పుంసాం మహాపాతకనాశనమ్
రామనామం లక్ష లేదా కోటి రాసినా, ఒక్కొక్క అక్షరమే మహా పాతకమును నశింపచేస్తుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరంగా ఉంది.
మన దేశాన్ని ఏకతాసూత్రాలని అనాది కాలం నుంచి బంధించినది రామ చరితమే. అటువంటి రామచరిత్ర తెలియని, చదవని భారతీయుడు ఎవరూ ఉండరు. భారతదేశాన పసిపిల్లలకు సైతం రామకథ ఎంతో కొంత తెలిసి ఉండటం రామ మహిమ కాక మరేమిటి? ఈనాటికీ రామకోటి వ్రతాన్ని చేపట్టే భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాగే, రామకోటి జప యజ్ఞాలు కూడా నిర్వహిస్తున్నారు. రాముని పేరుపై అఖండ జప యజ్ఞాలు కూడా జరుగుతుంటాయి.
రామ ప్రతిమ నిర్మాణం.. దానం
రామ ప్రతిమను ఎలా నిర్మించాలో, దానిని ఎలా దానం చేయాలో లింగ పురాణం, రామార్చన చంద్రికలలో వివరంగా ఉంది.
‘చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచి రామనవరాత్రులు ఆరంభమవుతాయి. నవమి నాడు సీతారామ కల్యాణం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజుల్లో రామాయణ పారాయణం, రాత్రిళ్లు రామకథా కాలక్షేపం చేయాలి. నవమి నాడు రామ జనన ఘట్టం చదివి వినిపించి, పూజాధికాలు చేయాలి. పానకం, పణ్యారము (వడపప్పు) ప్రసాదంగా పంచాలి. దశమి నాడు పట్టాభిషేక ఘట్టం పఠించాలి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రం నిర్వహించాలి. నవమితో నవరాత్రము ముగించాలి’.
రామ జయంతి నాడే సీతారాముల కల్యాణం నిర్వహించడం విశేషం. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే పాటించే ఆచారం. లోక కల్యాణార్థమే అవతరించిన ఆ రాముడికి ఉత్సవ కృతజ్ఞతగా ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారనే భావన ఉంది. అయితే దీనికి సరైన ఆధారాలు లేవు. భద్రాచలంలో ఈనాడు మహా వైభవంగా రామ కల్యాణం జరుగుతుంది.
‘రామా’ అంటే క్షణంలోనే మోక్షం
రామనామ స్మరణ చేసిన వాడెంత పాపాత్ముడైనా మోక్ష పదవిని పొందుతాడని, రామనామం సమస్త అమంగళాలను అణచివేసి మనోభీష్టాలను నెరవేరుస్తుందని భాగవతం చెప్పింది. శ్రీరామ నామ సర్వోపయోగం, సఫలం అయిన సరస సాధనమని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘రామ’ అనే శబ్దమే ఒక మహా మంత్రం. ఆ నామం తారక మంత్రం. సంసారమనే దు:ఖ సాగరాన్ని దాటడానికి భక్తులకు నావలా సహాయపడేది రామనామమే. ఈ రామనామంలో అపారమైన మహిమ దాగి ఉంది.
భారతీయ ఆరాధ్య దైవం- శ్రీరాముడు. త్రేతాయుగంలో జన్మించినప్పటి నుంచి నేటి కలియుగం వరకు శ్రీరామ నవమి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాన్ని ఎంతో వేడుకగా, ఆనందంతో నిర్వహించడానికి అనేక కారణాలు ఉన్నాయి. రామునిలో నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ, మితభాషిత్వం, మృదుభాషిత్వం, మధుర భాషిత్వం, సత్యభాషిత్వం, సేవా భావం, శాంత స్వభావం, విధాన నిర్ణయ చాకచక్యం, అహింస, సత్ప్రవర్తన, నడవడి, సానుకూల దృక్పథం, ధర్మాచరణ, త్యాగం, ప్రేమ, అన్నదమ్ముల అనుబంధం, రాజ్యకాంక్ష లేకుండటం, స్నేహశీలత, భార్యాభర్తల అనుబంధం, మాతాపిత పాదసేవ, శత్రువును కూడా మిత్రుడిగా భావించడం, ఏకపత్నీ వ్రతం, తండ్రి మాట జవదాటకుండటం.. ఇలా ఎన్నో సుగుణాల రాశి శ్రీరాముడు. శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు ధర్మపాలన చేసి, సుపరిపాలన అందించి ప్రజల చేత ‘రామరాజ్యం’ అంటే ఇలా ఉండాలనే ఘనత సాధించి, రఘువంశ చరిత్రలో ప్రథముడిగా నిలిచాడు. ఇన్ని సలక్షణాలు, సద్గుణాలు, సుమనసు కలిసి జీవించి నేటికీ ఆరాధ్యునిగా సేవింపబడుతున్నాడు. అందుకే శ్రీరాముడి పుట్టిన రోజు వేడుకను అశేష భారతీయులు విధిగా, తమ జీవితకాలంలో ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా నిర్వహించుకుంటారు. ఇన్ని పకల సుగుణాల శోభితుడు కాబట్టే ఆయనను ‘రామా’ అని స్మరిస్తే క్షణంలోనే మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంతేకాక ఈ దానం వల్ల కురుక్షేత్రలో సూర్యగ్రహణ వేళ తులా పురుష దానాదులు చేయడం వల్ల కలిగే ఫలం లభిస్తుంది’.
మనమూ హనుమంతుడిమవుదాం!
రామాయణంలో రాముడి తరువాత అంతటి వాడు ఎవరంటే హనుమంతుడనే చెప్పాలి. ఎందుకంటే, నిరంతరం రామ నామం స్మరించడం ద్వారా ఆయన రాముడి తరువాత స్థానంలో ఆ మహా కావ్యంలో నిలవగలిగాడు.
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం
సీతాపతిం సుందరమ్
కాకుతృమ్ కరుణార్ణవం గుణనిధిం
విపప్రియమ్ ధార్మికమ్
రాజేంద్ర సత్యసంధం
దశరథతనయం శ్యామలమ్
శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకులతికలం
రాఘవం రావణారిమ్
‘లక్ష్మణాగ్రజుడూ, రఘుకుల శ్రేష్ఠుడూ, సీతాపతీ, అత్యంత సుందరుడూ, కుకుతృకుల నందనుడూ, కరుణా సాగరుడూ, గుణ నిధానుడూ, బ్రాహ్మణ ప్రియుడూ, శాంతమూర్తీ, సర్వలోక సుందరుడూ, రఘుకుల తిలకుడూ, రాఘవుడూ, రావణుడిని వధించిన రామ భగవానుడికి నేను వందనం ఆచరిస్తున్నాను’ అని పై శ్లోకానికి భావం.
ఈ లోకంలో రామనామాన్ని మించిన రమ్యమైన నామం మరొకటి లేదు. మానవమాత్రులను సులభంగా తరింపచేసేది రామనామమే. ఆ నామ స్మరణతోనే రామాయణంలో రాముడి తరువాత హనుమంతుడు అంతటి కథానాయకుడు కాగలిగాడు.
రాముడు.. పూర్ణ మానవుడు
రాముడు పరిపూర్ణ మానవుడు. అటువంటప్పుడు ఆయన పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్య పాలన ఎలా చేశాడనేది చాలామందికి కలిగే సందేహం.
కాబట్టే మన పండితులు వివిధ భాష్యాలను చెప్పారు.
‘శతం సహస్ర మయుతం సర్వ మానంత్య వాచకం’ అని శత సహస్రాది పదములు బహుత్వ సూచకములని కొందరు పేర్కొన్నారు. కాలమానమును ప్రాచీనులు సంకేతాలను వాడటం ఆచారమని, వాల్మీకి కూడా ఈ సంకేతాలనే వాడి ఉండొచ్చని ఇంకొందరి అభిప్రాయం.
‘తృతీయం దశ మిత్యాహు: చతుర్థంతు సమహస్రకం’
తృతీయమనగా పది, చతుర్థమనగా వేయి అనే అభియుక్తోక్తి వలన దశ వర్ష సహస్రములనగా, నలుబది, దశ వర్ష శతములనగా ముప్పది, రెండూ కూడగా, డెబ్బదియని దుంపల రామిరెడ్డి అనే పండితుడు చక్కని సమన్వయం చేశారు.
డెబ్బది సంవత్సరాలు రాజ్యం చేయడం సామాన్య విషయం కాదు. పట్టాభిషేకానికి పూర్వం ముప్పై ఎనిమిది సంవత్సరాలు, వాటిని డెబ్బైతో కలిపితే నూటా ఎనిమిది (108).. ఈ నూటా ఎనిమిదేళ్లు జీవించడానికి, తరువాత నూట పదహారు సంవత్సరాలు జీవించానికి యత్నించుట ఆనాడు పలువురి సాధనగా ఉండేదని శాస్త్రాలను బట్టి తెలుస్తోంది.
సంపూర్ణావతారం
దశావతారాల్లో రామ, కృష్ణ అవతారాలు సంపూర్ణ అవతారాలని భారతీయ పురాణేతిహాసములు చెబుతున్నాయి. అందులోనూ సీతారామ లక్ష్మణులు అన్ని విధాలా హైందవ సంస్క•తికి ఆదర్శప్రాయులై విలసిల్లుతున్నారు. పాతివ్రత్యానికి- సీత, పితృవాక్య పరిపాలన, సత్యసంధత, ఏకపత్నీ వ్రతానికి- శ్రీరాముడు, భ్రాతృప్రీతికి, పరదార విముఖతకు- సౌమిత్రి (లక్ష్మణుడు)ని మించిన వారు భారతీయ సాహిత్యాన లేరు. రామచంద్రుని గుణగణములను, రూప సంపదను వాల్మీకి ముక్తకంఠమున కీర్తించాడు. రామచంద్రుని చరిత్రను మొదట రాసినవాడు ఆదికవి వాల్మీకే. భారతీయ సాహిత్యానికి రామాయణమే ఆది కావ్యం. అంటే మొదటి కావ్యం. వాల్మీకి రాముడిని వర్ణించిన తీరులోని రమణీయతను వినడానికి చెవులు, కనడానికి కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. రామాయణమంతా రాముడి అద్భుత గుణగణాలే రమ్యింప చేస్తుంటాయి. ధర్మనిరతికి తార్కాణంగా నిలిచే ఆ రాఘవుడు ధర్మప్రభువుగా వినుతికెక్కాడు.
రెండు వేల ఏళ్లకు పూర్వం నుంచే..
రామలక్ష్మణులను ఆదర్శ మూర్తులుగా పేర్కొనే
సంప్రదాయం మన భరతఖండం నాట రెండు వేల
సంవత్సరాలకు ముందు నుంచే ఉండేదని తెలుస్తోంది. ఇందుకు హాలుని గాథా సప్తశతిలోని ఒక గాథ నిదర్శనం.
ది అరస్స అనుద్ధమణస్స
కులవహు ణిఅఅ కుడ్డ లిహి ఆఇం
దిఅహం కఖేఇ రామా
ణులగ్గ సోమిత్తి చరిఆఇం (1 – 35)
(దేవర స్యాశుద్ధ మనస: కులవధూర్నిజక కుడ్య లిఖితాని
దివసం కథయతి రామా సులగ్న సౌమిత్రి చరితాని)
పాపం.. ఇంటిని గుట్టుగా నడుపుకుంటున్న ఓ ఇల్లాలు- తన పట్ల తన మరిది చెడు తలపుతో ఉండటాన్ని గ్రహించి, అతని ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ఇంటి గోడపై ‘రామ నులగ్న సౌమిత్ర చరిత’ను రోజూ రాస్తుండేదట. అన్న గారైన రాముని భార్య పట్ల సోదరుడై లక్ష్మణుడు ఎంత గౌరవ ప్రపత్తులతో నడుచుకునే వాడో తెలుసుకోవాలనేది ఆమె ఈ రాతల వెనుక ఉద్దేశమన్న మాట. ఆనాడే ఇంటి గోడలపై నీతి బోధకంగా రామకథలను రాయడాన్ని బట్టి దాని విశిష్టత, ప్రాముఖ్యతను గురించి వేరే చెప్పనవసరం లేదు. జీవితంలో నైతిక ప్రవర్తనను, ధర్మనిరతిని నేర్పే అద్భుత గ్రంథం- రామాయణం.
Review రామ నామం తారక మంత్రం.