దేవ దేవ ధవళాచల మందిర..

చిత్రం: భూకైలాస్‍ (1958)
సంగీతం: ఆర్‍.సుదర్శనం, ఆర్‍.గోవర్ధనం
సాహిత్యం:
సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో । దేవ దేవ ।।

పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమోనమో
।। దేవ దేవ ।।

దురిత విమోచనా.. ఆఆ.. ఆఆ.. ఆఆఆ.. ఆఆ..ఆ.ఆ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో
।। దేవ దేవ ।।
నమో నమో నమో నమో నమో నమో

నారాయణ హరి నమోనమో నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో నారాయణ హరి నమోనమో
నారద హృదయ విహారి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమోనమో నారాయణ హరి నమోనమో
పంకజ నయనా పన్నగ శయనా.. ఆ. ఆ ఆఆఆఆ..
పంకజ నయనా పన్నగ శయనా
పంకజ నయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో

నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నారాయణ హరి
నారాయణ హరి నమోనమో

వివరణ:
మన తెలుగు సినిమాల్లో వచ్చిన శివుడి గీతాలలో అజరామరం వంటిది ఈ గీతం. భక్తి పాటలు ఎన్ని ఉన్నా.. ఎన్ని విన్నా.. సందర్భాన్ని బట్టో, పాటలోని మాధుర్యం వల్లనో కొన్ని పాటలు నాలుకపై అలా ఉండిపోతాయి. అటువంటి పాటలు ఎన్ని వచ్చినా ఇలా గుర్తుండిపోయే పాటలపై అభిమానం మాత్రం చెక్కుచెదరదు. అటువంటి పాటల వరుసలో నిలుస్తుంది ‘భూకైలాస్‍’ చిత్రంలోని ‘దేవ దేవ ధవళాచల మందిర’ అనే పాట. ఈ పాటలోని పదాల పొందిక మనసును కట్టిపడేస్తుంది. సముద్రాల గారి సాహిత్యం ప్రాసలతో సాగుతూ అలరిస్తే ఘంటశాల గారి గాత్రానికి చక్కని సంగీతం తోడై ఈ పాట విన్న వారి మనసుల్లో భక్తి భావాన్ని ఇనుమడింప చేస్తూ అలా గుండెల్లో ఒదిగిపోతుంది. ఈ పాట వింటూ తన్మయత్వంతో తలాడించని వారుండదరంటే అతిశయోక్తి కాదు. రావణుడు శివుడిని స్తుతిస్తూ పాడే ఈ పాట తెలుగు సినిమాల్లోని భక్తి గీతాల్లో ఒక ‘ఐకాన్‍’గా నిలిచిపోతుంది. ఈ పాటలోని మరో చిత్రం, చమత్కారం ఏమిటంటే.. శంకరుడిని స్తుతిస్తూ సాగే ఈ భక్తిగీతం చివరిలో చాలా సహజంగా, అలవోకగా, నారాయణుడి స్తుతి కలిసిపోవడం.
మీ మ్యూజిక్‍ ప్లేయర్‍లో ఈ పాట ఉంటే సరేసరి.. లేదంటే ఒకసారి వినండి.. అలవోకగా ప్లేయర్‍లో ఈ పాటను లిస్ట్ చేసుకోవడం ఖాయం.
తేలికైన పదాలతో శివుడిని స్తుతిస్తూ సాగే ఈ గీతం ఎప్పటికీ ప్రత్యేకం.

Review దేవ దేవ ధవళాచల మందిర...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top