హరిహరులు వేరు కాదు.
వారిద్దరి తత్వాల మధ్య ఉండేది ఏకత్వ భావనే.. హరిహర తత్త్వం అన్యోన్యతకు మరో రూపం. ఈ భావనను అర్థం చేసుకోవడానికి, హరిహరులిద్దరూ ఒకటేనని సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం.
‘న కార్తీక సమో మాస:’
మాసాలలో కార్తీకాన్ని మించినది లేదని అర్థం. ఇది స్కాంద పురాణోక్తి.
ఈ మాసంలో మహా విష్ణువుకు కార్తీక దామోదరుడని పేరు.
ఇక, పరమశివుడు కార్తీక మహాదేవుడిగా ఈ మాసంలో పూజలందుకుంటాడు.
‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్’ అనే విష్ణత్వ వైభవం, ‘శివతరాయచ’ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను వేదం వర్ణించింది. అటువంటి శివకేశవులకు పరమప్రీతిపాత్రమైన కార్తీకంలో అత్యంత విశిష్టమైనవి- కార్తీక సోమవారం, కార్తీక పూర్ణిమ. ఈ రెండింటి విశేషాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం..
కార్తీక మహాత్మ్యాన్ని, కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు అది చెప్పిన వారికి,
విన్న వారికి కూడా పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో శుక్ల పాడ్యమి మొదలుకుని నెల చివరి వరకు చేయదగిన ఓ వ్రతం ఉంది. ఇదిగాక సోమవార వ్రతం కూడా ఉంది. కార్తీకంలో కావేరి నదిలో స్నానం చేయడం మరెంతో పుణ్యాన్నిస్తుంది’ అని వశిష్ఠుడు జనకుడికి చెప్పాడు.
జనకుడు ఆ వ్రతాల వివరాలు చెప్పాలని కోరగా వశిష్ఠుడు ఇలా వివరించాడు.
ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో జనక మహారాజును కలిశాడు. జనకుడు మహర్షిని మిక్కిలి గౌరవంతో ఆదరించి, గౌరవించాడు. ఉభయకుశలోపరి అయ్యాక, లోక క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏదైనా పుణ్యకార్యం గురించి చెప్పాలని జనకుడు వశిష్ఠుడిని కోరాడు.
‘ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గం, అందులోనూ వినగానే పుణ్యం కలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి మునివర్యా!’ అని కోరాడట.
అప్పుడు వశిష్ఠుడు కార్తీక మాస విశేషాలను చెప్పాడట. అందులోనూ కార్తీక సోమవార వ్రతం గురించీ, దాని శక్తి గురించీ వివరించాడట.
కార్తీక వ్రతం
సూర్యోదయ సమయంలో కావేరి నదిలో స్నానం చేయాలి. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే భూమి మీద ఉన్న బావులు, చెరువులు, దిగుడుబావులు, చిన్న కాలువలు, నదులు తదితర అన్ని జలాల్లోనూ శ్రీహరి నివసిస్తూ ఉంటాడు. కార్తీక వ్రతం ఏ ఒక్క కులం వారికో సంబంధించినది కాదు. కులవివక్ష ఏదీ లేకుండా అందరూ ఆచరించదగిన వ్రతమిది. ఉదయాన స్నానం చేయడం, తరువాత భక్తితో పూజలు నిర్వహించడం, అనంతరం కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం వంటి వాటితో వ్రతాన్ని కొనసాగించాలి.
సాయంకాలం శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్లి దీపాలను వెలిగించి, స్వామికి నైవేద్యం సమర్పించాలి. కార్తీక వ్రతం జరుగుతున్నపుడు దాన్ని చూసినా పుణ్యఫలమే. ఈ మాసంలో కార్తీక శుక్ల పాడ్యమి మొదలుకుని మాసాంతం వరకు ఈ వ్రతాన్ని పై విధంగా ఆచరించాలి.
కార్తీక సోమవార వ్రతం
కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆచరించదగిన వ్రతమిది. దీన్ని ఆచరించిన వారికి కైలాస నివాస అర్హత లభిస్తుంది. కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం, దానం, జపం అనేవి అశ్వమేథ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఒంటిపూట భోజనం, రాత్రిపూట భోజనం, ఛాయానక్త భోజనం, స్నానం, తిలదానం (నువ్వుల దానం), పూర్తి ఉపవాసం అనే ఆరు విధాల ఉపవాస దీక్షలున్నాయి. ఎవరి శక్తి మేరకు వారు ఏదైనా ఒక ఉపవాస దీక్షను ఆచరించవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఒంటిపూట భోజనం చేయవచ్చు. ఛాయానక్త భోజనం అంటే సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగటి పూటే భుజించడం. అంటే దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటల వేళ భుజించాలన్న మాట. ఇలా ఈ ఆరు రకాల ఉపవాసాలేవీ ఉండలేని వారు ఉదయం పూజ పూజ కాగానే పండితులకు భోజనం పెట్టి, ఆ పగటి పూట తానూ భోజనం చేయవచ్చు. కార్తీక మాసంలో ఈ ఆరు రకాల ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని మాత్రం తప్పక ఆచరించాలి. ఇలా చేస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం, పూజ చేసి రాత్రి పూట భుజించే వాడంటే శివుడికి ఎంతో ఇష్టం.
సోమవార వ్రత మహిమను తెలిపే కర్కశ కథ
కార్తీక సోమవార వ్రతం ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో తెలియచెప్పే కథ ఇది. పూర్వం కశ్మీర దేశానికి చెందిన స్వాతంత్య్ర నిష్ఠురి అనే ఒకామె ఉండేది. ఆమె అత్యంత హేయంగా, కర్కశంగా ప్రవర్తిస్తుండేది. దీంతో ఆమెను అందరూ కర్కశ అని పిలుస్తుండే వారు. ఈ కశ్మీర కన్య సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడిని పెళ్లి చేసుకుంది. అయితే, కర్కశ తన దుర్మార్గ ప్రవర్తనతో సుగుణశీలుడైన భర్తను నానావిధాలుగా హింసించేది. జారిణిగా జీవితం గడిపేది. చివరకు వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి బారినపడి, ఎవరూ ఆదరించే వారు లేక దీనస్థితిలో మరణించింది. ఆమె చేసుకున్న పాప ఫలితంగా మరుసటి జన్మలో కుక్కగా జన్మించింది. ఆ కుక్కకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడా ఆహారమే లభించలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయంకాలం వేళ వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం బలి (అన్నం ముద్ద)ను తన ఇంటి ముంగిట ఉంచాడు. ఆహారం కోసం అన్వేషిస్తున్న శునకం ఆ అన్నం ముద్దను తిన్నది. వెంటనే దానికి పూర్వజన్మ స్మ•తి కలిగింది. దాంతో మానవ భాషలో తన గతాన్నంతటినీ ఆ శునకం వేదపండితుడికి చెప్పింది.
అది చెప్పిందంతా విన్న వేద పండితుడు- కార్తీక సోమవారం నాడు పగటి పూట ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదంలాంటి బలిని తిన్న కారణంగానే శునకానికి పూర్వజన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని కుక్కకు చెప్పాడాయన. దాంతో తనకెలాగైనా పుణ్యం లభించేలా చేయాలని ఆ శునకం వేడుకుంది. దీంతో ఎన్నో సోమవార వ్రతాలు చేసి, పుణ్యం సంపాదించుకున్న ఆ వేద పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార వ్రతఫలాన్ని ఆ శునకానికి ధారపోశాడు. వెంటనే శునక దేహం విడిచి కర్కశ దివ్య శరీరం దాల్చింది. నేరుగా కైలాసానికి చేరుకుంది.
ఇది స్కంద పురాణంలో ఉన్న సోమవార వ్రత కథ. ఈ వ్రత కథలో అంతర్గతంగా ఎన్నో సందేశాలు ఉన్నాయి.
జీవితంలో ఎవరూ చెడు తిరుగుళ్లు
తిరగకూడదని, అలా చేస్తే జీవిత చరమాంకంలోనైనా కష్టాలు తప్పవని, అలాగే మరుసటి జన్మలో శునకంలాగానో, మరో నీచ జంతువు లాగానో జన్మించాల్సి వస్తుందనే హెచ్చరిక కనిపిస్తుంది. అలాగే, పండితుడు సోమవార వ్రత పుణ్యఫలాన్ని దయార్ద్ర హృదయంలో, పరోపకరా బుద్ధితో ధారపోయడానికి మనుషులంతా ఆదర్శంగా తీసుకోవాలన్న ఓ సూచన కూడా ఈ కథలో ఉంది. దైవభక్తి మాటున సామాజిక హితోక్తి కూడా ఇమిడి ఉండటం మన పురాణ కథల ప్రత్యేకత.
కార్తీక పూర్ణిమ- దామోదరుడిగా విష్ణువు
భారతావనిలో పురాతన కాలం నుంచీ ఆచరణలో ఉన్న పర్వం- కార్తీక పూర్ణిమ. శౌనకాది మునులు ఈ పర్వదినాన్ని జరుపుకున్న విధానం గురించి పద్మ పురాణంలో ఉంది. అదే కథ కార్తీక పురాణ పారాయణలో పదిహేనో రోజు పారాయణాంశంగా చెబుతారు. అదేమిటంటే- నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా విష్ణువు ప్రతిమను ఉసిరిచెట్టు కింద ఏర్పాటు చేశారు. అక్కడే పూజాధికాల అనంతరం వనభోజన సమారాధన జరిగింది. అనంతరం తులసీ పూజ చేసి, సాయంత్రానికి మళ్లీ కార్తీక దామోదరుడిగా విష్ణువును పూజించి, దీపారాధన చేసి షోడశోపచారాలతో అర్చించారు. తరువాత చక్కని మానుతో చేసిన స్తంభాన్ని తెచ్చి, దాని మీద బియ్యం, నువ్వులు వంటి ధాన్యాలను, దాని మీద ఆవునేతితో దీపాన్ని వెలిగించి విష్ణువును పూజించారు. అనంతరం కార్తీక పురాణంలో మొదటి రోజు నుంచి పదిహేనో రోజు వరకు ఉన్న అంశాలను, కథలను అన్నిటినీ పారాయణం చేశారు. ఆనాటి రాత్రి హరిహర నామస్మరణతోనూ, సంకీర్తనలు, నృత్యాలతోనూ భక్తిపారవశ్యంతో కాలం గడిపారు. ఈ కథా భాగాన్ని కార్తీక పురాణ పారాయణలో పదిహేనో రోజు చేస్తుంటారు.
కార్తీక పూర్ణిమ- భక్తేశ్వర వ్రతం
కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరుడి గురించి చేసే ఓ వ్రతం కూడా ఉంది. దీనినే భక్తేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాచరణ వెనుక కథను గురించి పురాణాలు ఇలా చెబుతున్నాయి. పూర్వం మథురను చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతడికి కుముద్వతి అనే అనుకూలవతి అయిన భార్య ఉండేది. ఆ రాజుకు చాలా కాలం వరకూ సంతానం కలగలేదు. సంతానం కోసమని శివుడి గురించి ఆ రాజ దంపతులు చాలాకాలం పాటు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మనాడు. వారు సంతాన భాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు.
అంతట శివుడు- ‘అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? ఆయుష్షు ఉండీ విధవరాలుగా ఉండబోయే కుమార్తె కావాలా?’ అని అడిగాడు.
వారు కొడుకే కావాలని కోరుకున్నారు.
వారిని అనుగ్రహించి ఈశ్వరుడు అంతర్థానమయ్యాడు.
రాణి కుముద్వతి కొంతకాలానికి గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు బాగా పెరిగి పెద్దవాడయ్యాడు. అదే రోజుల్లో అలకాపురిని ఏలుతున్న మహారాజు మిత్రసహుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె చిన్న వయసు నుంచే ఈశ్వరుడిని గొప్పగా ఆరాధిస్తూ ఉండేది. భక్తేశ్వరలింగాన్ని ఆమె నిత్యం పూజిస్తూ ఉండేది. మథుర రాజుకు మిత్రసహుడి కుమార్తె గురించి తెలిసింది. తన కుమారుడికి మరణకాలం సమీపిస్తున్నదని గ్రహించిన మథుర రాజు.. ఆ ఆపద నుంచి తన కుమారుడిని కాపాడుకోవడానికి మిత్రసహుడి కుమార్తెనిచ్చి వివాహం చేయించాలని అనుకున్నాడు. అప్పుడు మిత్రసహుడి కుమార్తె తన భక్తితోనూ, ప్రాతివత్యంతోనూ తన కుమారుడిని రక్షించుకోగలదన్నది మథుర రాజు ఆలోచన. అలా మథుర రాజు మిత్రసహుడిని ఎలాగో ఒప్పించి ఆయన కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లయిన కొద్ది రోజులకే ఆయుష్షు తీరిపోవడంతో మథుర రాజు కుమారుడి కోసం యమధర్మరాజు వచ్చాడు. ఆ విషయాన్ని గమనించిన మిత్రసహుడి కుమార్తె వెంటనే తన దైవమైన భక్తేశ్వరుడిని స్మరించింది. భక్తేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై యముడితో పోరాడి, జయించి మథుర రాజు కుమారుడి ప్రాణాలను రక్షించి, పూర్ణాయువు ప్రసాదించి అంతర్థానమయ్యాడు.
ఇదీ భక్తేశ్వర వ్రత కథ.
నిష్కల్మష భక్తితో ఏదైనా సాధించవచ్చన్న సత్యాన్ని ఈ వ్రత కథ నిరూపిస్తుంది.
కార్తీక పూర్ణిమనే మహా కార్తీక అని కూడా అంటారు. ఆ రోజు పుణ్య నదులు, సముద్రాల్లో స్నానం చేస్తే మామూలుగా లభించే పుణ్యం కన్నా అధిక పుణ్యం లభిస్తుందని నమ్మకం. మహాఫల, నానాఫల, సౌభాగ్య, మనోరథ పూర్ణిమ, కృత్రిక, గోప్రధాన తదితర వ్రతాలను, వ్రత ఉద్యాపనలను కార్తీక పూర్ణిమ నాడు ఆచరిస్తుంటారు. లక్ష తులసీపూజ, లక్ష దీపార్చన, జ్వాలా తోరణం వంటి పూజలు, ఉత్సవాలు కూడా పూర్ణిమ నాడు నిర్వహిస్తుంటారు.
కార్తీక పూర్ణిమ- ప్రకృతి వైభవం
పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీక పౌర్ణమి అవుతుంది. కృత్తిక అనేది అగ్ని నక్షత్రం. చంద్రుడు పదహారు కళలతోనూ కనిపించే రోజు పూర్ణిమ. అటు అగ్ని వేడిమి, ఇటు చంద్రుడి చల్లదనం కలిగి ఒకేసారి వచ్చే రోజు- కార్తీక పూర్ణిమ. ఆహ్లాదకరమైన శరదృతువు (ఆశ్వయుజ, కార్తీక మాసాల కాలం)లో చంద్రుడు పుష్టిమంతుడై ఉంటాడు. శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు కార్తీక మాసం నాటికి చెరువులు, బావులు, నదుల్లోని నీరు తేట పడుతుంది. సూర్యరశ్మి ప్రసారం వల్ల జలాలు తేజస్సును, బలాన్ని సంతరించుకుంటాయి. దైవపూజకు అవసరమైన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. కార్తీకంలో పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అంటారు. శరదృతువులో నదీ ప్రవాహంలో ఓషధులు సారవంతంగా ఉంటాయి. అందువల్ల ఆ నీరు స్నానపానాలకు అమృతతుల్యమై ఉంటుందని మహర్షుల భావన. వర్షాకాలంలో అప్పటి వరకు భూమి మీద పడిన వాన నీరు భూమిలోకి ఇంకిపోతుంది. అప్పుడు బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుందని అంటారు. ఆ ప్రభావం తరువాత వచ్చే కార్తీకంలో నదీ ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుందని, ఆ నీటికి వ్యాధుల్ని నశింపచేసే గుణం ఉంటుందని చెబుతారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది, ఆ సమయంలో నదీస్నానం పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. చంద్రుడు మనసుకు ప్రశాంతత కలిగిస్తాడు. తమోగుణాన్ని హరిస్తాడు. అందుకే చంద్రుడిని శివుడు తన జటాజూటంలో ధరించాడు. చంద్రుడి పేరిట ఏర్పడిన సోమవారం కార్తీక మాసంలో విశిష్టమైనది. కార్తీక పూర్ణిమ నాడు పూజాధికాలు నిర్వహించి, వెన్నెల్లో పరమాన్నం వండుకుని, ప్రసాదాలుగా స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.
కార్తీక దీపం విశిష్టత
కార్తీక దీపం ఉత్తమ ఫలాన్నిస్తుందని అంటారు. ఆ దీపాన్ని ఉభయ సంధ్యల్లోనూ శివకేశవ మందిరాల్లో, తులసి సన్నిధిలో వెలిగించడం ఒక మహోత్క•ష్టమైన సత్కర్మ. కార్తీక పూర్ణిమ నాటి దీపదానం పవిత్రమైనదని ప్రతీతి. ఆ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణాలు ఉంటాయి. సాగర మథనం సమయంలో వెలువడిన హాలాహలాన్ని శివుడు తన గరళంలో దాచుకోవడానికి సంకేతంగా ఈ ఉత్సవం చేస్తారు. కార్తీక మాసం నెల పొడవునా అరటి దొప్పలలో దీపం ఉంచి నది లేదా చెరువులో వదులుతారు. ఆవునేతి దీపం ఉత్తమమైనది. కనీసం ఆముదంతోనైనా దీపం వెలిగించాలని పెద్దలు చెబుతారు. కార్తీక మాసంలో ఉసిరిక వృక్షం, తులసి సన్నిధానంలో భోజనం చేయడం పుణ్యప్రదం. ఆ రెండు చెట్లు ఉన్న వనంలో భుజించడాన్నే ‘వన భోజనాలు’గా పరిగణిస్తారు. సర్వ దేవతలకు ఉసిరిక వృక్షం నెలవని, సర్వ తీర్థాలూ ఆ చెట్టు గల భూమినే ఆశ్రయించి ఉంటాయని అంటారు. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో భగవద్గీతలోని పది, పదకొండు అధ్యాయాలను పారాయణం చేస్తుంటారు. ఈ పఠనం వల్ల వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారని పురాణగాథలు చెబుతున్నాయి. స్కాంద పురాణంలో అంతర్గతమైన కార్తీక పురాణం ఇంకా కార్తీక మాస వ్రతం గురించి అనేక విశేషాలను అందిస్తోంది. కార్తీకంలో పితృ తర్పణ మహత్వాన్ని సైతం ఈ పురాణం వివరిస్తోంది.
కార్తీక మాసంలో ఏరోజు ఎవరిని పూజించాలి?
కార్తీక శుద్ధ పాడ్యమి: లక్ష్మీదేవిని ఆరాధించాలి. అలాగే, బలి చక్రవర్తిని కూడా ఈనాడు పూజిస్తారు. ముఖ్యంగా కేరళవాసులు బలిని దైవంగానే కొలుస్తారు.
కార్తీక శుద్ధ విదియ: యముడు తన సోదరి ఇంటికి భోజనానికి వచ్చిన రోజు ఇది. ఈనాడు ఆయనను పూజించడం వల్ల యమగంగాలు, దోషాలు తొలగిపోతాయి.
కార్తీక శుద్ధ తదియ: ఈనాడు లక్ష్మీదేవిని, గౌరీదేవిని, విష్ణువును పూజించాలి.
కార్తీక శుద్ధ చతుర్థి: ఇది నాగుల తిథి. కాబట్టి ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించాలి. ఈయననే కార్తికేయుడు, స్కందుడు, కుమారస్వామి అని కూడా అంటారు. ఈయనను ఆరాధించడం వల్ల సర్పదోషాలతో పాటు కుజ దోషాలు కూడా తొలగి దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సౌభాగ్యం నిలబడుతుందని అంటారు.
కార్తీక శుద్ధ పంచమి: ఇది కూడా నాగుల ఆరాధనకు ప్రత్యేకించిన తిథియే. సాధారణ పూజా విధులు ఈనాడు నిర్వహించాలి.
కార్తీక శుద్ధ షష్ఠి: ఇది కూడా సుబ్రహ్మణ్యుడికి ఉద్దేశించిన తిథి. ఈనాడు కూడా ఆయనను ఆరాధించి కు•దోషాలను పోగొట్టుకోవచ్చు.
కార్తీక శుద్ధ సప్తమి: కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఏడో రోజు ఇది. ఈ తిథికి అధిపతి సూర్యుడు. ఈ రోజున ప్రాత:కాలంలోనే నిద్రలేచి నదీస్నానం ఆచరించి, సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆదిత్య హృదయ పారాయణం వల్ల అన్నింటా విజయం చేకూరుతుంది. గోధుమలు, బంగారం, పట్టువస్త్రాలు దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక శుద్ధ నవమి: నవమి తిథి దుర్గాదేవి ఆరాధనకు ఉద్దేశించినది. కాబట్టి ఈనాడు అమ్మవారిని పూజించాలి. వస్త్రాలు, బంగారం, వెండి దానం చేయాలి. ఈరోజున దుర్గామాతను ఆరాధించడం వల్ల రాహువు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. దాంపత్యబంధం మెరుగవుతుంది.
కార్తీక శుద్ధ దశమి: ఈ రోజుకు అధిపతులు అష్టవశువులు మరియు పితృదేవతలు. పితృ తర్పణాలు దానం చేయాలి. ఈ రోజు పితృ దేవతలను తలచుకోవడం, వారికి తర్పణాలు విడువడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని అంటారు.
కార్తీక శుద్ధ ఏకాదశి: ఈ రోజుకు అధిపతి దిగ్గజాలు. గుమ్మడికాయ, నూనె దానం చేయడం వల్ల యశస్సు, ధన లాభం కలుగుతాయి.
కార్తీక శుద్ధ ద్వాదశి: శివకేశవులను ఆరాధించాలి.
కార్తీక శుద్ధ త్రయోదశి: శనీశ్వరుడిని పూజించడానికి ఇది మంచి తిథి.
కార్తీక శుద్ధ చతుర్దశి: ఈ రోజుకు అధిపతి శివుడు. శివుడి వద్ద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల ధనప్రాప్తి, ఉద్యోగంలో అభివృక్ష్మిద్ధి కలుగుతాయి. విభూతి పండుతో పాటు శక్తి కొద్దీ దానాలను చేయాలి.
కార్తీక శుద్ధ పూర్ణిమ: ఇది కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు. శివపార్వతులను దీపారాధనతో ఆరాధించాలి. విష్ణువుకు కూడా ప్రీతికరమైన దినమిది.
కార్తీక బహుళ పాడ్యమి: మన్మథుడిని పూజించాలి. మల్లె, జాజి వంటి పువ్వులను స్త్రీలకు దానం చేయాలి. వన భోజనం చేయాలి. మన్మథుడిని ఆరాధించడం వల్ల వీర్యవృద్ధి, సౌందర్యం కలుగుతాయి.
కార్తీక బహుళ విదియ: యముడిని పూజించాలి. నువ్వులు, ఇనుము, గేదె వంటివి దానంగా ఇవ్వాలి. యముడిని పూజించడం వల్ల అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి.
కార్తీక బహుళ తదియ: చంద్రుడిని ఆరాధించాలి. బియ్యం, వెండి దానం చేయాలి.
కార్తీకం.. నాలుగు విధులు
కార్తీక మాసంలో ప్రధానంగా పాటించాల్సిన విధులు నాలుగు ఉన్నాయి. అవి- దీపం, దానం, ఉపవాసం, నదీస్నానం.
స్నానం
కార్తీక మాసంలో రవి తులా రాశిలో ఉంటాడు. కాబట్టి నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానమాచరించడం వల్ల మనిషి శరీరానికి శక్తి కలుగుతుంది. ఆరోగ్యసిద్ధి లభిస్తుంది. ఈ మాసంలో నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది.
దీపం
దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని, దీపం నుంచి వచ్చే కాంతిలో త్రిమూర్తులు ఉంటారని అంటారు. కార్తీక మాసంలోనే కాదు.. నిత్యం దీపారాధన చేయాలని అంటారు. చీకటి దారిద్య్రానికి, అజ్ఞానానికి చిహ్నం. అటువంటి చీకటిని దీపమనే కాంతి పోగొడుతుందని అంటారు. కార్తీక మాసంలో నెల పొడవునా దీపారాధన చేయడం సాధ్యం కాని వారు కార్తీక శుక్ల ద్వాదశి నాడు కానీ, కార్తీక పూర్ణిమ నాడు కానీ చేస్తే సంవత్సరంలో దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సాయంత్రం పూట ఆలయంలో కానీ, తులసికోట, రావిచెట్టు వద్ద కానీ, మేడపైన కానీ, ఏదైనా నది వద్ద కానీ దీపారాధన చేస్తే వారికి పుణ్యం లభించి శివుడి అనుగ్రహం పొందుతారు.
ఉపవాసం
కార్తీక మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచి జరిగి మనసు నిర్మలత్వంతో దైవం వైపు, దైవత్వం వైపు లగ్నమవుతుంది. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండటం అంటే, కేవలం ఆహారం మానేయడం కాదు. కోరికలను తొలగించుకుని, ధ్యాసను భగవంతుడి వైపు లగ్నం చేసి ఉంచడం. ఉపవసించిన ప్రతి క్షణమూ భగవతారాధనలో గడిపిన వారికి ఉపవాస ఫలితం సిద్ధిస్తుంది. అది పుణ్యప్రదమై, జ్ఞానప్రదమై, మోక్షప్రదం అవుతుంది.
దానం
కార్తీక మాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణ దానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్య ఫలం లభిస్తుందని కార్తీక, మార్కండేయ, శివ పురాణాలు చెబుతున్నాయి.
Review స్నానం పుణ్యప్రదం వ్రతం మోక్షపథం.