ఆచి ‘తూచి’ తినండి

ఈ దేహమే ఒక దేవాలయం. దానికి ఆరోగ్యమే ఐశ్వర్యం, ఆయుష్షు. అందమంటేనే ఆనందం. ఆరోగ్యమంటే ఆత్మవిశ్వాసం. ఇవి సొంతం కావాలంటే దేహమే దేవాలయం కావాలి. అంటే అంత పవిత్రమైన జీవన శైలి అలవర్చుకోవాలి. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు. మరి అటువంటి భాగ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? అందం, ఆరోగ్యం, ఆహారం గురించి మన ప్రాచీన ఆయుర్వేద వైద్యం ఏం చెబుతోంది.
ఎంత ధనవంతుడైనా సరే.. చక్కని ఆరోగ్యం లేకపోతే పేదవాడే అనడంలో సందేహం లేదు. మనిషికి ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు. రోగి మానసిక, శారీరక స్థితులను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ఆయుర్వేదం ప్రత్యేకత. మరే వైద్య విధానంలోనూ ఈ తరహా చికిత్స అందించే వెసులుబాటు లేదు. కేవలం జబ్బును బట్టి వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం మిగతా వైద్య విధానాల శైలి. కానీ, ఆయుర్వేదం ఎంతో పురాతనమైనది. అయితే, దీని చికిత్సా విధాన పద్ధతుల ఔన్నత్యం వల్ల అది ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉంది. ఇది చెబుతున్న ఆరోగ్య రహస్యాలను ఆచరిస్తే జీవితం ఆనందాల నందనవనం అవుతుంది.
ఆహారమే ఆరోగ్యానికి ఆధారం
మనిషికైనా, పశు పక్ష్యాదులకైనా ఆహారమే జీవనాధారం. మనిషి మనుగడకు, ఉనికికి కారణభూతమైన ఆహారం ఆరోగ్యాన్ని కలి గిస్తుంది. చక్కని ఆరోగ్యం సొంతం కావాలంటే మిక్కిలి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో సగం వివరణలు ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియ చేసేవే. అందుకే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి
ఉంటుంది.
చక్కని ఆరోగ్యానికి ఆయుర్వేద సూత్రాలు
సూర్యోదయానికి గంటన్నర నుంచి రెండు గంటల ముందుగానే నిద్రలేవాలి.
ఉషఃకాలంలోనే కాలకృత్యాలను తీర్చు కోవాలి. దీనివల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, తలనొప్పి కలుగుతాయి. మూత్ర విసర్జన చేయక అలాగే ఉంచుకోవడం వలన చేసే పనిపై శ్రద్ధ లేకపోవడం, తల తిప్పినట్టు ఉండి బడలిక కలుగుతుంది. మనిషికి త్వరగా అలసట వచ్చేస్తుంది.
నిద్ర లేచిన వెంటనే నీళ్లు తగినన్ని తాగాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను నిగ్రహించుకోవాలి.
దంత ధావనం:
పళ్లను ఉదయం, సాయంత్రం (భోజనం తరువాత) వేళల్లో- చేదు, వగరు గుణాలు కలిగిన కానుగ, మర్రి, చండ్ర, మామిడి, గన్నేరు చెట్ల వేరు లేదా కొమ్మలను మెత్తగా కుంచెలాగా చేసుకుని తోముకోవాలి. తరువాత చిగుళ్లను మృదువుగా మర్దన చేసుకోవాలి.
నాలుకనూ మృదువుగా ఉంచుకోవాలి. దీనివలన నాలుకలోని, పళ్లలోని, నోటిలోని దుర్వాసన తొలగిపోతుంది.
ఆయిల్‍ ఫుల్లింగ్‍:
పళ్లు తోముకున్నాక చల్లని లేదా గోరువెచ్చని వేడి నీటితో లేదా తైలం (నూనె)తో కానీ ఐదునుంచి పది నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయాలి.
నస్యకర్మ:
ముఖ ప్రక్షాళన తరువాత నాసికా రంధ్రాలలో రెండు మూడు చుక్కల నువ్వుల నూనె వేయాలి. దీన్ని నిత్యం ఆచరించాలి. దీనినే నస్యకర్మ అంటారు.
వ్యాయామం:
రోజూ వ్యాయామానికి ముందు వార్మప్‍ చేయాలి. తరువాత మార్నింగ్‍ వాక్‍, యోగాసనాల వంటివి పాటిస్తే శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సరఫరా బాగా జరుగుతుంది.
అభ్యంగనం:
వ్యాయామం తరువాత శరీరానికి నూనెను పట్టించి మర్దన చేసుకోవాలి. దీనివల్ల స్పర్శ కేంద్రాలు బాగా పనిచేస్తాయి. రోమ కూపముల ద్వారా లోనికి ప్రవేశించిన నూనె సిర, ధమనులను శక్తివంతం చేస్తుంది. దీనివల్ల శరీరం ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. తరువాత చెవిలో రెండు చుక్కల నూనెను వేసుకోవాలి. ఇందువల్ల చెవుడు, చెవి వ్యాధులు దరి చేరవు. కాళ్లకు నూనె రాసుకోవడం వల్ల కాళ్ల పగుళ్లు, తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. దృష్టి నిర్మలంగా ఉంటుంది. చక్కని నిద్ర వస్తుంది.
స్నానం:
సున్నిపిండి, పెసరపిండి, పసుపు, గంధం, తులసి, వేప, కర్జూరాల వంటి వాటిని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం నిగనిగ లాడుతుంది. చర్మరోగాలు దరి చేరవు.
ధ్యానం:
రోజూ ధ్యానం చేయడం వలన శరీరం, మనసు ప్రశాంతత పొందుతాయి. రోజూ పది నిమిషాల పాటు ధ్యానం ఆచరించాలి. మధుమేహం, నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి ఇతర వ్యాధులు ఉన్న వారికి ఇది చాలా మంచి మందు.
భోజనం:
భోజనాన్ని రోజూ మధ్యాహ్నం ఒంటి గంటలోపు, రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య పూర్తి చేయాలి. ఇదే భోజన స్వీకారానికి ఆయుర్వేద వైద్యం ప్రకారం తగిన సమయం.
తాంబూలం:
భోజనం తరువాత తాంబూలం వేసుకోవాలి. ఇందులో జాజి, ఇలాచీ, లవంగం, కస్తూరి, పోకవక్కలు, కాచుపొడి, సున్నం, పచ్చ కర్పూరం వంటివి కలుపు కుని తమలపాకుతో తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. తాంబూలం పేరుతో కిళ్లీలు, జర్దాలు, పొగాకు ద్రవ్యాలు కలిపి నవి తీసుకోకూడదు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. తరువాత కొద్ది దూరం నడవాలి. రాత్రికి భోజనంలో పెరుగు తీసుకోకూడదు.
నిద్ర:
మనిషిని ఏడు గంటల నిద్ర చాలు. దీనివల్ల ఉత్సాహం, బలం కలుగుతాయి.. అశ్వగంథ చూర్ణాన్ని తేనెతోకలిపి తీసుకుంటే మంచిగా నిద్ర కలుగుతుంది. పగటి పూట నిద్ర అంతగా ఆరోగ్యానికి మంచిది కాదు.
వస్త్రధారణ:
వస్త్రాలు కొత్తవైనా, పాతవైనా చక్కగా ఉతికి, ఎండలో ఆరబెట్టిన వాటిని ధరించాలి. ఒకరి దుస్తువులను మరొకరు ధరించరాదు. దీనివల్ల అంటువ్యాధులు, చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
వెంట్రుకలు:
జుత్తును ఎప్పుడూ ట్రిమ్‍ చేసుకోవాలి. వెంట్రుకలకు నూనె రాయడం వల్ల కుదుళ్లు గట్టిపడతాయి.
గోళ్లు:
గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. లేదంటె వాటి ద్వారా మురికి శరీరంలోకి వెళ్తుంది.

సహజ ఆహారమే మేలు
ఆహారం సంభవం వస్తుః.. రోగశ్చాహర సంభవాః
హితహిత విశేషాచ్ఛ విశేష సుఖ దుఃఖయోః
మానవ దేహం ఆహారం వలన జనిస్తుంది. ఆ శరీరానికి వచ్చే వ్యాధులు అపథ్యకరమైన ఆహారం వల్లనే వస్తాయి. సుఖం (ఆరోగ్యం), దుఃఖం (అనారోగ్యం) అనేవి హిత, అహితాహార సేవల పరిణామాల ఫలితమేనని పై శ్లోకానికి అర్థం.
మంచి ఆరోగ్యం సొంతం కావాలంటే, ఆ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు పదార్థాలు (పైబర్‍) నీరు కావాల్సిన మోతాదుల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న దానినే సమీకృత ఆహారం అంటారు. మంచి ఆహారం తీసుకునే వ్యక్తులు అందంగా, ఆరోగ్యంగా, ఆకర్ష ణీయంగా ఉంటారు.
మనం తీసుకునే ఆహారం సహజసిద్ధమైనదై ఉండాలి. అత్యాధునిక పోకడలకు పోయి ఫాస్ట్ఫుడ్‍, జంక్‍ ఫుడ్‍ తీసుకునే బదులు ప్రకృతి ప్రసాదించిన తాజా పండ్లు, ఫలాలు, ఆకు కూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, ధాన్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన ఆహారం. ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది మనం తీసుకునే ఆహారమే. ఆయుర్వేద మందు మొక్కల్లో, పళ్లు, ఫలాలు, కూరగాయల్లో వ్యాధి నిరోధక శక్తులు పుష్క లంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యాధికారక లక్షణాలను పేరుకుపోనివ్వకుండా చేసి వార్థ క్యాన్ని, మధుమేహం, గుండెజబ్బులు, కీళ్ల జబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులను దరిచేర నివ్వకుండా చేస్తాయి. ఆహారంలో ఒకే రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఉదాహరణకు అధి కంగా మధుర రసాన్ని లేదా అధికంగా ఆమ్ల రసాన్ని తీసుకోకూడదు. మధురామ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు కలిగి అన్ని సమ పాళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

Review ఆచి ‘తూచి’ తినండి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top