
‘దసరా’, ‘నాయకుడు’ సినిమాల వరుస విజయాలతో జోరు మీదున్న కీర్తిసురేశ్ నటిస్తోన్న తాజా చిత్రం- ‘భోళా శంకర్’. ఇందులో చిరంజీవి సరసన ఆమె చెల్లెలి పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తన కెరీర్, పర్సనల్ విషయాలను మీడియాతో పంచుకుంది. అవేమిటో ఆమె మాటల్లోనే చదివేయండి..
నాకు స్నేహితులు ఎక్కువ. వీలు చిక్కితే వాళ్లతో గడపడానికి ట్రై చేస్తా. నాకు బ్రదర్లాంటి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ‘భోళాశంకర్’తో చిరంజీవి గారితో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆయన మా అమ్మకు మంచి మిత్రుడు. కానీ, ఇప్పుడాయనకు నేను కొత్త ఫ్రెండ్ని. నా వరకూ ప్రతిరోజూ స్నేహితుల దినోత్సవమే.
• నేను అటు హీరోయిన్ ఓరియంటెడ్.. ఇటు కమర్షియల్ సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తునా. ఒకవిధంగా ఇలా చేయడం కష్టమే. నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. భవిష్యత్తులో మరిన్న ప్రయోగాత్మక సినిమాలు, పాత్రలు చేయాలనేది నా ఆశయం.
• ప్రస్తుతం నేను ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేడి’ తదితర చిత్రాల్లో నటించడానికి అంగీకరించా. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఈ ఏడాది ఈ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
• ‘భోళాశంకర్’లో చిరంజీవికి చెల్లెలిగా నటించినా.. ఆయనను మాత్రం అన్నయ్య అంటే కొడతారేమోనని భయంతో ‘చిరు గారు’ అని పిలిచేదాన్ని. మా అమ్మ ఆయనతో ‘పున్నమినాగు’ సినిమాలో నటించింది. అప్పటికి ఆమె వయసు 16. ఆయన తనని ఆ సినిమా సెట్లో ఎంతో జాగ్రత్తగా చూసుకునే వారట. ప్రతి విషయాన్ని ఎంతో ఓపికగా చెప్పేవారట. అమ్మ నాకు చెప్పిన ఈ విషయాలన్నీ చిరంజీవి గారితో చెప్పాను.
• ‘భోళాశంకర్’ చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నాకు చిరంజీవి గారి ఇంటి నుంచే భోజనం తెప్పించే వారు. సెట్లో ఎప్పుడూ ఆ భోజనం గురించే మాట్లాడుతుండే దానిని. ముఖ్యంగా చిరంజీవి గారి ఇంటి ఉలవచారు నాకు బాగా నచ్చేసింది.
• ‘భోళాశంకర్’లో చిరంజీవి గారి చెల్లెలిగా నటిస్తున్నాననే ఆనందం ఒకపక్క.. ఆయన పక్కన డ్యాన్స్ మూమెంట్స్ ఉండవేమోననే బాధ ఇంకోపక్క.. లక్కీగా ఆయనతో కలిసి రెండు పాటల్లో డ్యాన్స్ చేశా. హీరోయిన్ తమన్నా, చిరంజీవి గారి మధ్య వచ్చే షాట్స్ చాలా సరదాగా ఉంటాయి.
Review ‘చిరు’ ఇంటి ఉలవచారు నచ్చేసింది!.