ఖైదీ నంబర్ 150 సినిమా షూటింగ్‍లో పాల్గంటూనే తీరిక చేసుకుని 151వ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో పాల్గంటున్నారని, ఎన్నో కథలు వింటున్నారని సమాచారం. కథ కుదిరితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమేనని ఇటీవల జరిగిన ‘సరైనోడు’ వేడుకలో చిరంజీవి సభా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి 151వ సినిమాకు దర్శకత్వం వహించే వారి పేర్లలో బోయపాటి శ్రీను పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఇంకా ఖరారు కాకున్నా 151వ సినిమా అల్లు అరవింద్ తన గీతా ఆర్టస్ పతాకంపై నిర్మించడం ఖాయమైపోయింది. మరోపక్క పూరీ జగన్నాథ్ ‘ఆటో జానీ’ కూడా తెరపై చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే ఖైదీనంబర్ 150 ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న చిరంజీవి సినిమాలో ఒక్క ఫ్రేమ్‍లోనైనా కనిపించాలని ‘మెగా’ ఫ్యామిలీలోని హీరోలు, నటులు ఉవ్విళ్లూరుతున్నారు. వీలైతే ఏదైనా సన్నివేశంలో, కుదరకపోతే అందరూ కలిసి ఒక సన్నివేశంలో కనిపించాలని ఆశిస్తున్నారు. మరి, వీరందరితో కలిసి చిరంజీవి ‘తెర’ పంచుకుంటారో లేదో చూడాల్సిందే. ప్రస్తుతానికి చిరంజీవి తనయుడు రామ్‍చరణ్ ఓ పాటలో కనిపించనున్నాడు. మిగతా వారు ఏయే సన్నివేశాల్లో తెరపై తళుక్కుమంటారో చూడాల్సిందే.
ఇక, ఖైదీ నంబర్ 150 సినిమాలో స్టైలిష్‍గా కనిపించేందుకు చిరంజీవి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడొస్తున్న వర్ధమాన తారలకు తీసిపోని విధంగా స్టైలిష్‍గా కనిపించడానికి ఆయన పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ కథానాయకగా నటించనుండగా, కేథరిన్ ప్రత్యేక గీతంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో పాటు అప్పుడే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. చిరంజీవి తన పాత్రకు అప్పుడే డబ్బింగ్ చెప్పే పనిలో పడ్డారు. సాధ్యమైనంత వరకు చిత్రాన్ని తొందరగా పూర్తి చేసి ప్రమోషన్ వర్క్కు తగినంత సమయం ఉండేలా చిత్ర బృందం ప్రణాళిక రచిస్తోంది. సంక్రాంతికి కానుకగా అందించడానికి చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఖైదీ నంబర్ 150 సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు రామ్‍చరణ్ నిర్మిస్తున్నారు. సంగీతం దేవీశ్రీప్రసాద్. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత వస్తున్న చిత్రం కావడంతో తెలుగు చిత్రసీమలో చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. •
Review చిరు @ 151.