
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‍లో చందూ మొండేటి దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న ‘తండేల్’ నుంచి ఇటీవలే ఓ శివశక్తి గీతం విడుదలైంది. ‘నమో నమ:శివాయ.. ఢమ ఢమ ఢం అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు.. అష్టదిక్కులు అదిరేట్టు తాండవేశ్వరా..’ అంటూ సాగే ఈ గీతం అభిమానులను అలరిస్తోంది. జొన్నవిత్తుల సాహిత్యానికి దేవీశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చగా అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటను విజువల్‍గా తెరకెక్కించిన తీరు, ఇందులో చైతూ, సాయిపల్లవి వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్‍మీడియాలో హల్‍చల్ చేస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచార పర్వంలో భాగంగానే ఈ పాటను విడుదల చేశారు. వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోందని, దేశభక్తి అంశాలు కూడా మిళితమై ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
కొబ్బరికాయ్ కొట్టేశారు..
మహేశ్‍బాబు – రాజమౌళి కాంబినేషన్‍లో చిత్రం ప్రారంభమైంది. మీడియాకు దూరంగా, ఎలాంటి అధికార ప్రకటన లేకుండా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. సాధారణంగా మహేశ్ తన సినిమా ప్రారంభ కార్యక్రమాలకు హాజరుకాడు. కానీ ఈ చిత్రం మాత్రం ఆయన సమక్షంలోనే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇది మహేశ్‍కు 29వ చిత్రం. దుర్గా ఆర్టస్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందనున్నట్టు టాక్. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేందప్రసాద్ కథను సమకూర్చారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజమౌళి నుంచి ‘ఆర్‍ఆర్‍ఆర్’ తరువాత వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. చూద్దాం.. వీరిద్దరి కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో..?!
కొత్త కబురు
‘దేవర’ హుషారు
గతేడాది ‘దేవర’తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్‍తో కలిసి నటిస్తున్న ఈ సినిమా ముగింపు దశలో ఉంది. దీని తరువాత ప్రశాంత్‍నీల్‍తో కలిసి ఓ యాక్షన్ ఎంటర్‍టైనర్ చేయనున్నాడు. ఎన్టీఆర్ ఆర్టస్, మైత్రి మూవీస్ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నాయి. ఇది 2026, జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ‘దేవర’ సీక్వెల్ కూడా ఉంటుందనే సంకేతాన్ని ఇటీవలే ఎన్టీఆర్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‍లో ఉన్నారు.
‘అకీరా’ మెప్పిస్తాడు..
పవన్‍కల్యాణ్, రేణుదేశాయ్‍ల కుమారుడు అకీరానందన్ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నట్టు ఇటీవల రేణు వ్యాఖ్యానించడం ఆసక్తి రేపింది. తను సినిమాల్లోకి రావడం గురించి తానెంతో ఆసక్తి, ఆత్రుతతో ఉన్నానని, హీరోగా మెప్పిస్తాడనే నమ్మకంతో ఉన్నానని చెప్పారామె. దీంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు.
Review ఢమ ఢమ ఢం అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు...