
హీరోయిన్ అంటే.. హీరో ఫైట్లు చేసి చేసీ.. అలసిపోయిన ఓ డ్యూయట్ పాడుకుంటే ఆ హీరో పక్కన మెరిసే అందాలబొమ్మ. అంతేనా? దాదాపు సినిమాలన్నీ ఇదే లైన్‍లో ఉంటుంటాయి. అందచందాలతో ఆకట్టుకోవడమే కథానాయికల పనన్నట్టుగా సినిమాలుంటాయి. అయితే, కొందరు హీరోయిన్లు మాత్రం డిఫరెంట్. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడే పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి కథానాయక ప్రాధాన్యమున్న సినిమాల కథా.. కమామిషు..
అనుష్క
‘ఘాటి’కురాలు: బాహుబలిలో ఎంత శక్తివంతమైన పాత్రలో కనిపించిందో చూశారుగా అనుష్కను. ఈసారి ఓ గిరిజన మహిళగా మరింత పవర్‍ఫుల్ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతోంది ‘ఘాటి’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె తనను ఎన్ని బాధలకు గురిచేసినా.. తనపై ఎన్ని నేరాలు మోపినా వెనుకడుగు వేయకుండా పోరాడి తన తెగను గెలిపించే పాత్రలో కనిపించనుంది. మొరటుగా ఉండే ఈ పాత్ర ద్వారా అనుష్క డ్రగ్స్ మాఫియాతో పోరాడుతుందట.
కొడవలి పట్టిన నయనతార
ఒంటరి తల్లులు ఎదుర్కొనే బాధలు అందరికీ తెలిసినవే. తన పాప ప్రాణాల కోసం, ఆమె రక్షణ కోసం ‘రాక్కాయి’గా మారి కొంగు బిగించి, కొడవలి పడుతోంది నయనతార. ఒంటరి తల్లిగా తనకు వచ్చిన సమస్యపై యుద్ధం ప్రకటిస్తుంది నయన. శత్రువులను తరిమికొడుతుంది. సమస్యలొస్తే ఎదురొడ్డి పోరాడాలే కానీ పారిపోకూడదని తన పాత్ర ద్వారా చెబుతోందీ లేడీ సూపర్‍స్టార్.
‘పరదా’ తీసిన అనుపమ
ఇప్పటివరకు ఆడిపాడిన పాత్రలే చేసిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మహిళా ప్రాధాన్యమున్న ‘పరదా’ ద్వారా కొత్త పాత్రలో పోరాటపటిమను ప్రదర్శించనుంది. మహిళలు ఇంటా బయటా ఎన్నో ఆంక్షలు భరిస్తుంటారు. ఇప్పటికీ చాలాచోట్ట పరదా పద్ధతి ఉంది. ఇలాంటి ఆంక్షలను, దురాచారాలను రూపుమాపడానికి ఈ సినిమాలో నడుం బిగించింది అనుపమ. తన ముఖంపైనున్న పరదాను తొలగించి.. తనలాంటి ఆడవాళ్లకు అండగా నిలిచే ధైర్యాన్నిస్తోంది అనుపమ ఈ పాత్ర ద్వారా.
డైనమిక్ రష్మిక
‘పుష్ప’లో శ్రీవల్లిగా ఆడిపాడిన రష్మిక ఈసారి నటనకు ప్రాధాన్యమున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమ్మాయిలు చదువుకునే రోజుల్లో ఏదో సాకుతో వాళ్లను అణచిపెట్టడానికే చూస్తారు ఇంటా బయటా. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమాలోని తన పాత్ర ద్వారా చాటిచెప్పనుంది రష్మిక. ఈ తరం అమ్మాయిలకు తన పాత్ర స్ఫూర్తిగా ఉంటుందంటోంది. అమ్మాయిలు ఆత్మాభిమానంతో ఎలా బతకాలో ఈ సినిమాలో చూపిస్తున్నారు.
గన్ పట్టిన సమంత
మహిళలంటే వంటింట్లో గరిటె తిప్పేవాళ్లేనా? అవసరమైతే, ఆపద వస్తే గన్ కూడా పట్టగలరని అంటోంది సమంత. ఈమె నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. కథానాయికగా మంచి స్టార్‍డమ్ సంపాదించిన సమంత ప్రస్తుతం తనే నిర్మాతగా మారి సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహిళలను ఏ విషయంలోనూ తక్కువ అంచనా వేయొద్దని, కుటుంబానికి కానీ, చుట్టుపక్కల వారికి కానీ కష్టం వస్తే అస్సలు సహించరని ఈ చిత్రంలోని తన పాత్ర ద్వారా చాటుతున్నట్టు సమంత చెబుతోంది.
Review వీరోచిత పాత్రల్లో ‘హీరో’యిన్లు!.