హార్ట్అటాక్‍కు తొలి గంట.. గంటన్నర సమయంలోనే చికిత్స చేయాలి. బ్రెయిన్‍స్ట్రోక్ వస్తే ఆరు గంటల్లోపే క్లాట్‍లు తొలగించాలి.
ఇలా తొలి గంట.. గంటన్నరలో అందించే చికిత్సనే గోల్డెన్ అవర్ అనీ, గోల్డెన్ పీరియడ్ అనీ అంటారు.
క్యాన్సర్ విషయంలో ఈ సమయం ఇంకా విలువైనది. ప్రతి క్షణం.. ప్రతి నిమిషం ఆ మహమ్మారి శరీరమంతా వ్యాపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రక్త క్యాన్సర్ అయితే ప్రతి క్షణంలో రెట్టింపు వ్యాధికారక కణాలు విజృంభిస్తూ పెరిగిపోతాయి.
క్యాన్సర్ ఎంత పెద్ద రోగమైనా దానికీ ఓ గోల్డెన్ పీరియడ్ ఉంది.
అసలు క్యాన్సర్ ఉందని తెలియగానే ఏం చేయాలి?
నవంబర్ 2026,7వ తేదీన…. క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఆ పేరు వింటేనే గుండెలు జారిపోతాయి. తమ వంశంలో ఆ వ్యాధి ఎవరికీ లేదు కాబట్టి తమకు వచ్చే అవకాశమే లేదన్నది కొందరి అభిప్రాయం. పరీక్షల్లో అది ఉందని తేలినా.. డాక్టర్లు ఆ విషయమే చెప్పినా.. ఒక పట్టాన నమ్మలేని పరిస్థితి. మంచి పోషకాహారం తీసుకుంటున్నాం.. శుచి, శుభ్రంగా ఉంటున్నాం, తమకెందుకు వస్తుంది ఆ వ్యాధి అనేది చాలామంది అభిప్రాయం. వెంటనే వైద్యం ప్రారంభిస్తే ఆదిలోనే అడ్డుకట్టు వేయొచ్చని చెప్పినా ఏం కాదులే అని తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ, అది మామూలు వ్యాధి కాదు. నరనరానా.. కణకణాన వ్యాపించి నెమ్మదిగా ఊపిరి తీసే మహమ్మారి.. అదే క్యాన్సర్.
క్యాన్సర్ విషయంలో క్షణ కాలం కూడా చేసే ఆలస్యం క్షణకాలపు ఆయుష్షును తినేస్తుంది. చికిత్స పొందే విషయంలో మీమాంసకు పోతే అది మునుముందు మరిన్ని అనర్థాలకు దారితీస్తుంది. వ్యాధి ఉందని పరీక్షల్లో తేలగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి జన్యు పరీక్షలు చేయించుకుని, చికిత్సను పొందాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎంత వేగంగా వ్యాధిని గుర్తించాం.. ఎంత వేగంగా చికిత్స తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి వ్యాధి నయమయ్యే అవకాశాలు అంతగా ఆధారపడి ఉంటాయి.
అవగాహన ఇలా..
ప్రస్తుతం క్యాన్సర్లకు మంచి చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక జన్యు పరీక్షల ద్వారా దానికి మూలమేమిటో కచ్చితంగా నిర్ధారించి, టార్గెటెడ్ అప్రోచ్‍తో అవసరమైన మేరకే మందులు వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్టస్ కూడా తగ్గుతాయి. ప్రాథమిక దశలోనే వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేస్తే ఖర్చు కూడా తగ్గుతుంది. విపరీతంగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు.
క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు చేయడంలో లిక్విడ్ బయాప్సీ విధానం విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. గతంలో టిష్యూ బయాప్సీ విధానంలో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించాక, దాని మూలమేంటో కనిపెట్టే జన్యు పరీక్షల ఫలితాల కోసం రెండు, మూడు వారాల పాటు ఎదురుచూడాల్సి వచ్చేది. ముంబై, బెంగళూరు వంటి చోట్లే ఆ పరీక్షలు చేసేవారు. ఇప్పుడు లిక్విడ్ బయాప్సీతో జన్యు పరీక్షల ఫలితాలు రోజుల వ్యవధిలోనే తెలుస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ వంటి నగరాల్లో కూడా ఈ పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి ఫలితాలు వేగంగా రావడంతో పాటు కచ్చితత్వమూ ఉంటోంది.
క్యాన్సర్ వ్యాధి ఉందని డాక్టర్ చెప్పాక ఇంకా అనుమానం ఉంటే మరో డాక్టర్‍ను సంప్రదించి నిర్ధారించుకోవాలే తప్ప, మాకెందుకు క్యాన్సర్ వస్తుందనే ధోరణితో జాప్యం చేయడం సరికాదు.
రక్త క్యాన్సర్ దావానలం వంటిది. రోగి శరీరంలో క్యాన్సర్ కణాలు (బ్లాస్టస్) ప్రతి క్షణం పెరుగుతుంటాయి. 24 గంటల్లో రెట్టింపు అవుతాయి. ఇప్పుడు ర్యాపిడ్ ఫిష్/పీసీఆర్ పరీక్ష విధానంలో 48 గంటల్లోనే పరీక్ష ఫలితాలు తెలుసుకుని చికిత్స ప్రారంభించే వీలుంది. తక్షణమే సరైన మందులు ఇచ్చి, రక్తం చిక్కబడకుండా, అవయవాలు దెబ్బతినకుండా కాపాడవచ్చు. ఏ రోగికి ఏ మందు బాగా పనిచేస్తుందో తెలుసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్టస్నూ నివారించవచ్చు. ఎముకల మజ్జ మార్పిడి (బోన్‍మ్యారో ట్రాన్స్ప్లాంట్) అవసరమని ముందే తెలిస్తే వీలైనంత త్వరగా దాతను వెతికే వీలుంటుంది. దానివల్ల 90 శాతం రోగుల్లో వ్యాధిని పూర్తిగా తగ్గించే వీలుంటుంది.
లంగ్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్న రోగికి సంప్రదాయ బయాప్పీ విధానంలో పరీక్షల ఫలితాల కోసం మూడు వారాలు ఎదురుచూస్తూ ఉంటే నష్టం తీవ్రమవుతూ ఉంటుంది. అలాగని ఫలితాల కోసం చూడకుండా రోగికి కీమో, ఇమ్మునో థెరపీలు ప్రారంభిస్తే మరో రకమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అది క్యాన్సర్ కాకుండా ఈజీఎఫ్‍ఆర్ పాజిటివ్ అయితే ఇమ్యునోథెరపీ వల్ల ఊపిరితిత్తుల్లో తీవ్రమైన వాపు, కాలేయ వైఫల్యం సంభవించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆధునిక జన్యు పరీక్షల ద్వారా ఏడు రోజుల్లో వ్యాధిని నిర్ధారించి చికిత్స ప్రారంభించే వీలు కలుగుతోంది.
వంశ పారంపర్య రొమ్ము, అండాశయ క్యాన్సర్ల పరీక్ష ఫలితాలను ఆధునిక పద్ధతుల్లో వేగంగా తెలుసుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ బారినపడిన మహిళల్లో శస్త్రచికిత్సకు ముందే ఈ జన్యు లోపాలను గుర్తించాలి. జన్యుస్థితి తెలియకుండా కేవలం ట్యూమర్‍ను మాత్రమే తొలగిస్తే భవిష్యత్తులో వేరొక రొమ్ము లేదా అండాశయాలకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శస్త్రచికిత్సకు ముందే రిపోర్టులు రావడం వల్ల సర్జికల్ ప్లాన్‍ను మార్చి ఒకేసారి అవసరమైన శస్త్రచికిత్సలన్నీ చేయవచ్చు.
క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స పర్యవేక్షణలో లిక్విడ్ బయాప్సీతో చేసే జన్యు పరీక్షలు గేమ్‍ఛేంజర్‍గా నిలవబోతున్నాయి.
క్యాన్సర్ కణాలు శరీరంలో పెరుగుతున్నప్పుడు అవి తమ డీఎన్‍ఏ ముక్కలను రక్తంలోకి విడుదల చేస్తాయి. లిక్విడ్ బయాప్సీలో రోగి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి అందులోని సూక్ష్మ జన్యు సంకేతాలను అత్యాధునిక నెక్టస్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా విశ్లేషిస్తారు.
ఒకసారి క్యాన్సర్ వ్యాధికి చికిత్స ప్రారంభించాక అది సరైన ఫలితాలనే ఇస్తోందా? వ్యాధి తగ్గుతోందా? అన్నది నిర్ధారించేందుకు మెరుగైన సాధనం లిక్విడ్ బయాప్సీ.
ఊపిరితిత్తులు, కాలేయం మధ్యలో గడ్డ ఏర్పడితే టిష్యూ బయాప్సీ చేయలేరు. వ్యాధి ప్రాథమిక నిర్ధారణ లిక్విడ్ బయాప్సీతోనే సాధ్యమవుతుంది.
క్యాన్సర్‍కు శస్త్రచికిత్స తరువాత శరీరంలో విషపూరిత కణాలు ఏమైనా మిగిలి ఉన్నాయా? అన్నదీ లిక్విడ్ బయాప్సీతోనే తెలుస్తుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లు, ప్రాంకియాటిక్ క్యాన్సర్ల విశ్లేషణలో ఇది మెరుగ్గా పనిచేస్తుంది.
ఒక రోగికి టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్మునోథెరపీ ప్రారంభించాక ట్యూమర్ పరిమాణంలో వచ్చే మార్పులు పెట్ స్కాన్‍లో కనిపించాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. లిక్విడ్ బయాప్సీతో చిన్న మార్పులనూ కనిపెట్టవచ్చు.
పెట్ స్కాన్ క్యాన్సర్ గడ్డ ఎక్కడుందో మాత్రమే చూపిస్తుంది. అది కూడా ఒక ట్యూమర్ ఒక మిల్లీమీటరు పరిమాణం ఉంటే తప్ప పెట్ స్కాన్‍లో గుర్తించలేరు. ట్యూమర్ లోపల జరుగుతున్న జన్యు మార్పుల్నీ పెట్ స్కాన్ చూపించలేదు. రోగి శరీరం మందులకు స్పందించకపోతే దానికి కారణమేంటో లిక్విడ్ బయాప్సీ ద్వారా మాలిక్యులర్ స్థాయిలో తెలుసుకోవచ్చు.
ఒక వ్యక్తి శరీరంలో పది చోట్ల క్యాన్సర్ గడ్డలు ఉన్నాయనుకుంటే వాటన్నిటికీ టిష్యూ బయాప్సీ చేయడం సాధ్యం కాదు. ఒక గడ్డకు టిష్యూ బయాప్సీ చేసి జన్యుపరమైన కారణాలు లేవని తెలుసుకున్నాక.. మిగతా గడ్డల్లో ఆ తేడాలు ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో లిక్విడ్ బయాప్సీ మెరుగైన ఫలితాలనిస్తుంది.
ఒకే రకం క్యాన్సర్ ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే రకమైన మందులు పనిచేయవు. క్యాన్సర్ కణాల వెనకున్న జన్యు లోపం తెలుసుకుంటే అవసరమైన మందులు మాత్రమే వాడి సైడ్‍ఎఫెక్టస్ను నివారించవచ్చు.
ఒక రోగిలో మూడో స్టేజ్‍లో ఉన్న క్యాన్సర్ గడ్డను తొలగించాక, ఆ రోగి శరీరంలో జన్యుపరమైన తేడాలున్న క్యాన్సర్ కణాలు ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నాయా? కంటికి కనిపించకుండా దాక్కున్నాయా? అన్నది పెట్ స్కాన్‍లో గుర్తించలేం. దీనిని లిక్విడ్ బయాప్సీ ద్వారా నిర్ధారించవచ్చు.
‘ఏంజెలినా జోలి’ ఉదంతం ఓ ఉదాహరణ..
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి 2013లో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటే ఆమెకు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 87 శాతం ఉన్నాయని వైద్యులు చెప్పారు. ఆమె తల్లి కూడా రొమ్ము క్యాన్సర్‍తో మరణించారు. దాంతో ఆమె ముందు జాగ్రత్తగా శస్త్రచికిత్సతో రొమ్ములు తొలగించుకున్నారు. 2015లో అండాశయాన్ని కూడా తొలగించుకున్నారు. జోలీ ఉదంతం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే.. నాకెందుకు క్యాన్సర్ వస్తుందిలే అన్న మొండి వైఖరి వదిలేసి, అనుమానం ఉంటే ముందస్తు స్క్రీనింగ్ చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ముందే పసిగట్టొచ్చు!
క్యాన్సర్ చికిత్స పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. ఈ మహమ్మారి చికిత్సలో ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పరిశోధకులు సానుకూల ఫలితాలు సాధించారు.
క్యాన్సర్ చికిత్సలో వ్యాధి మళ్లీ మళ్లీ రావడం, కీమోథెరపీ వల్ల ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినడం అనేవి రెండు ప్రధాన సవాళ్లు. ఈ క్రమంలో చికిత్స తర్వాత వ్యాధి మళ్లీ రాకుండా ముందుగానే ప్రమాదాన్ని గుర్తించే కృత్రిమమేథ (ఏఐ) విధానం, క్యాన్సర్ కణాలపై మాత్రమే పనిచేసి.. ఆరోగ్యకరమైన కణాలకు తక్కువ నష్టం కలిగించే కొత్త ఔషధ సమ్మేళనాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉంది. ఈ పరిశోధనలో క్యాన్సర్ కణాలను ఒక్కొక్కటిగా పరిశీలించే ‘సింగిల్ సెల్ ఆర్‍ఎన్‍ఏ’ విశ్లేషణను ఉపయోగించారు. వేలాది కణాల సమాచారాన్ని సేకరించి దాన్ని ఏఐ, మెషీన్‍లెర్నింగ్ విధానాలతో విశ్లేషించడం ద్వారా క్యాన్సర్ మూల కణాలకు ఉండే ప్రత్యేక లక్షణాలను గుర్తించగలిగారు. ఇందుకోసం ‘ఎస్‍ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, అశోకా యూనివర్సిటీ’ పరిశోధకులు సంయుక్తంగా ‘ఏఐ బేస్డ్ క్యాన్సర్ స్టెమ్‍లైక్ సెల్ ప్రొఫైలర్ అండ్ నియోప్లాజం డికన్వల్యూటర్’ అనే ఏఐ ఆధారిత విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది కణితుల్లో దాగి ఉన్న క్యాన్సర్ మూల కణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. అంతర్జాతీయ క్యాన్సర్ డేటాబేస్‍ల్లోని 25 వేలకుపైగా కణితి నమూనాలను ఈ విధానంతో పరిశీలించారు. ఈ పరిశోధన ద్వారా అత్యంత శక్తివంతమైన క్యాన్సర్ మూల కణాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణితులతో ఉన్న రోగులు చికిత్సకు తక్కువగా స్పందించే అవకాశం, క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
క్యాన్సర్ మూల కణాలను కచ్చితంగా గుర్తించడం సాధ్యమైతే వాటి బలహీనతలను తెలుసుకుని, వాటిని లక్ష్యంగా చేసుకునే మందులను అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటివరకు క్యాన్సర్ మూల కణాలను గుర్తించడం, వాటిని ఇతర క్యాన్సర్ కణాల నుంచి వేరు చేయడం చేయడం పెద్ద సవాలుగా ఉండగా కొత్త ఏఐ ఆధారిత అధునాతన సాంకేతిక విధానంతో ఆ పక్రియను మరింత సులభతరం చేయగదలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పరిశోధనలో ఉపయోగించిన విధానాన్ని క్యాన్సర్ కణజాల •యాప్సీలపై ప్రయోగించారు. పలు బయాప్సీలపై ఈ మోడల్‍ను పరీక్షించగా, వ్యాధి మూల కణాల గుర్తింపులో మంచి ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణామాన్ని క్యాన్సర్ మూల కణాలపై పరిశోధనలకు కొత్త మార్గాన్ని చూపే కీలక అడుగుగా పరిశోధకులు భావిస్తున్నారు.
ఇక, మరో పరిశోధనలో ‘ఐఏఎస్‍ఎస్‍టీ-గువాహటి, ఐఐటీ-గువాహటి’ శాస్త్రవేత్తలు.. ‘ఆర్‍కే-251’ అనే సూక్ష్మ అణు సమ్మేళనాన్ని (స్మాల్ మాలిక్యూల్ యూనిట్) అభివృద్ధి చేశారు. సాధారణ కీమోథెరపీ మందులు క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలపైనా ప్రభావం చూపుతాయి. అందువల్ల రోగులకు అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ఈ సమస్యను తగ్గించడమే ఆర్‍కే-251 లక్ష్యం. క్యాన్సర్ కణాల్లో ‘రియాక్టివ్ ఆక్సిజన్ స్పిసియస్’ అనే పదార్థాలు సాధారణ కణాల కంటే ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణంలోకి ఆర్‍కే-251 వెళ్లినపుడు ఈ ఆర్‍ఓఎస్‍తో చర్య జరిపి.. ‘ఎన్‍బీడీ-హెచ్‍ఈఎక్స్’ అనే క్యాన్సర్ నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ఔషధం ప్రభావవంతంగా పని చేస్తుందని ప్రయోగశాల పరీక్షల్లో తేలింది.





























































































Review ఆరోగ్య భాగ్యం.