ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‍కు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమిళ గ్రంథం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. రష్యా అధినేతకు అందించిన ఈ గ్రంథంలో ఏముంది? దీనిని ఎవరు రచించారు? ఏమిటి దీని ప్రత్యేకత అనే చర్చలు నడిచాయి. మన దేశపు గొప్ప సాహిత్య, సాంస్క•తిక వారసత్వాన్ని చాటి చెప్పే గొప్ప గ్రంథాలలో ఈ తిరుక్కురళ్ ఒకటి.
కులమతాలకు అతీతంగా నిలిచి, మానవాళికి శాశ్వతమైన నైతిక, సామాజిక, రాజకీయ విజ్ఞానాన్ని అందించింది ఈ గ్రంథం. నీతి, పరిపాలన, సమాజం, మానవ విలువలను ప్రబోధించే 1,330 పద్యాలు (కురళ్స్) ఉన్న ఈ గ్రంథాన్ని కవి, తత్త్వవేత్త తిరువళ్లువర్ రచించారు. దాదాపుగా 1,500 నుంచి 2,300 సంవత్సరాల క్రితం ఈ రచన జరిగిందని భావిస్తారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో, తత్త్వ శాస్త్రంలో ఇది అత్యంత ముఖ్య రచనగా పరిగణన పొందింది. ఒక్కో అధ్యాయంలో పది పవిత్ర ద్విపదల చొప్పున మొత్తం 133 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. ప్రతి ద్విపద ‘కురళ్’ అనే ఏడు పదాలతో ఉంటుంది. ప్రతీ కురళ్ రెండు పంక్తుల్లో మాత్రమే ఉంటుంది. అంత క్లుప్తతలోనే సంపూర్ణ జీవన సారాన్ని చాటుతుందీ కురళ్. అదే తిరక్కురళ్ ప్రత్యేకత. దాని సంక్షిప్తతే దాని విశిష్టత. రెండు పంక్తుల్లో చెప్పిన భావం.. సుదీర్ఘంగా చర్చించగలిగేంత లోతుగా ఉంటుంది.
3 భాగాలు.. 1,330 పద్యాలు..
తిరువళ్లువర్ తిరుక్కురల్.. నైతిక విలువల ఈ నీతి గ్రంథాన్ని మూడు భాగాలు (ముప్పాల్)గా.. 1330 పద్యాలను రచించారు. ఒక్కో అధ్యాయంలో పది పవిత్ర ద్విపద (రెండు లైన్ల పద్యం)ల చొప్పున మొత్తం 133 అధ్యాయాలు ఉంటాయి. మానవ జీవితంలో నైతికతపై గొప్ప ప్రభావం చూపే ఈ రచనలో మూడు భాగాలుంటాయి. అవి- ధర్మం, సంపద, ప్రేమ.
అరత్తుపాల్- ధర్మం (అరం):
వ్యక్తిగత విలువల గురించి వివరించే ఈ భాగంలో మొత్తం 38 అధ్యాయాలు ఉన్నాయి. కడవుల్ వాళ్తు (దైవస్తుతి) అనే మొదటి అధ్యాయంలో వివరించిన దైవ భావన ప్రత్యేకమైనది. తిరువళ్లువర్ దృష్టిలో దేవుడంటే స్వచ్ఛమైన చైతన్యం. జ్ఞానం, కరుణ, నైతికత, ప్రేమకు ఆయన మూర్తి రూపం.
పొరుట్పాల్- సంపద (పొరుల్):
సామాజిక, ఆర్థిక విలువల బోధనలతో కూడిన రెండో భాగమిది. ఇందులో మొత్తం 70 అధ్యాయాలు ఉన్నాయి. పరిపాలన, రాజనీతి, సామాజిక జీవితాలపై ఈ ద్విపదలు వెలుగు ప్రసరిస్తాయి.
ఇన్‍బత్తుప్పాల్- ప్రేమ (ఇన్బం):
బుక్ ఆఫ్ లవ్‍గా అభివర్ణించే ఈ భాగంలో 25 అధ్యాయాలు ఉన్నాయి. కలవియల్, కర్పీయల్ అనే రెండు రూపాలుగా ఇందులో ప్రేమ వ్యక్తమవుతుంది.
కలవియల్ అనేది వివాహానికి పూర్వపు ప్రేమను సూచిస్తుంది. ఇది ఎలాంటి ఆచారాలూ లేకుండా వివాహంతో ముగుస్తుంది.
కర్పీయల్ అనేది సంప్రదాయ వైవాహిక ప్రేమను సూచిస్తుంది. ప్రేమలోని భిన్న కోణాలను అన్వేషించడానికి తిరువళ్లువర్ కవితాత్మక భావనలనూ, వివిధ నాటకీయ, భావయుక్త సన్నివేశాలనూ ఉపయోగించారు. ఆయన పద్యాలు ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా ప్రశాంతమైన ఆనందానికి మూలంగా చిత్రీకరిస్తాయి.
రెండో భాగంలో- పాలకుడి లక్షణాలు, న్యాయ పాలన, సలహాదారుల ఎంపిక, నిర్ణయాలు తీసుకోవడం, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై కురళ్‍లు ఉంటాయి. అదే సమయంలో
జీవన సూక్తులు
మానవులు తమ అంతర, బాహ్య జీవితాల్లో సంతోషంగా గడపడానికి ఉపయోగ పడే అనేక విషయాలు తిరుక్కురళ్‍లో ఉన్నాయి. పాలకులు, మంత్రుల క్రమశిక్షణలు, సామాజిక న్యాయం, రక్షణ, యుద్ధం, దుష్టులకు శిక్ష, విద్య, వ్యవసాయం, కుటంబ జీవితం వంటి పలు అంశాల్లో నైతికతలను ఇందులోని ద్విపదలు బోధిస్తాయి. అహింస, శాకాహారం, ధర్మం, క్షమ, దయ, స్నేహం, ప్రేమ, ఓర్పు, స్వీయ నియంత్రణ, కృతజ్ఞతా భావం, కర్తవ్యం, ఆతిథ్యం వంటి విషయాల్లో మేలైన బోధనలకు ఇది అద్దం పడుతుంది. వేశ్యలతో సాంగత్యం, దొంగతనం వంటివి చేయకూడదని, మద్యం వంటి మత్తు పదార్థాలు, జూదం వంటి వాటిని అరికట్టాలంటూ వ్యక్తిగత క్రమశిక్షణనూ ఇది బోధిస్తుంది.
ఆంగ్లేయుల హయాంలోనే తిరుక్కురళ్ లోని 275 సూక్తులను 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తమిళ పాఠ్య పుస్తకాల్లో చేర్చారు. అక్కడి హైకోర్టు ఆదేశాల మేరకు 2017-18వ విద్యా సంవత్సరం నుంచీ 6 నుంచి 12వ తరగతి వరకు తిరుక్కురళ్‍లోని తొలి రెండు అధ్యాయాల సూక్తులను తప్పనిసరి చేశారు. ప్రభుత్వ బస్సుల్లో తిరుక్కురళ్ సూక్తి బోర్డు ఏర్పాటుకు 1968లో నాటి తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2 మనసులో కల్మషం లేకుండా ఉండటమే నిజమైన సద్గుణం. అదితప్ప మిగిలినవన్నీ నిజమైన విలువను పొందలేవు.
2 ఈ లోకంలో పద్ధతి మేరకు జీవించే వాడు పై లోకంలో దేవతల్లో ఒకడిగా గౌరవించబడతాడు.
2 దైవం సహాయంతో ఒక కార్యం కాకపోయినా ప్రయత్నించే వ్యక్తి కాయకష్టానికి తగిన కూలి లభిస్తుంది.
2 పుట్టుకతో మనుషులందరూ సమానులే. వారి చర్యలలోని భేదాలు వారి విలువను అసమానంగా చేస్తాయి.
2 లోకం నిందించే వాటిని విడిచిపెడితే గుండు చేయించుకోవడం కానీ, పొడవాటి జుట్టు పెంచుకోవడం కానీ అవసరం లేదు.
2 దానధర్మాలను చూసి అసూయ పడేవాడు తన అనుచరులు దిగంబరంగా, ఆకలితో నశించిపోవడాన్ని చూస్తాడు.
2 జారిపోతున్న వస్త్రాన్ని పట్టుకోవడానికి చేయి ఎంత వేగంగా కదులుతుందో, స్నేహం కూడా స్నేహితుని బాధ్యను ఓదార్చడానికి అంతే వేగంగా పనిచేస్తుంది.
2 జూదం.. సంపద, ఆహారం, కీర్తి, విద్య, వస్త్రాలనే ఐదింటినీ హరింపచేస్తుంది.
2 ఇతరులు మంచి బట్టలు ధరించి, కడుపునిండి ఉన్నప్పుడు వారిలో తప్పులు వెదకడంలో నీచులు ముందుంటారు.
2 ఒక మూర్ఖుడి తప్పులు బయ•పడినప్పుడు అతడు వస్త్రాలు ధరించాడని చెప్పగలమా?
2 ఆహారం, వస్త్రాలు మిగిలినవన్నీ అందరికీ సాధారణమైనవి. అవమానాన్ని గ్రహించే సున్నితత్వం నుంచే భేదం వస్తుంది.
2 సన్యాసులను కృపా పురుషులని పిలుస్తారు. ఎందుకంటే వారు జీవించే వారందరి పట్ల కరుణామయుల పాత్ర పోషిస్తారు.
2 అవివేకమంటే.. కీడు తెచ్చేదాన్ని పట్టుకుని మంచిని జారవిడుచుకోవడమే.
2 తాను జ్ఞానినని భావించుకునే అహంకారమే అజ్ఞానం.
సాధారణ వ్యక్తి మాట, కోపం, స్నేహం, విద్య, సంపాదన, కుటుంబ జీవనం గురించి మొదటి భాగంలో ద్విపదలు ఉంటాయి.
తిరువళ్లువర్.. విశ్వమానవ కవి
తిరుక్కురళ్‍ను 18వ శతాబ్దంలో ఆంగ్లభాషలోకి తర్జుమా చేశారు. అనంతరం దీని ప్రాశస్త్యం దృష్ట్యా అరవైకి పైగా భాషల్లోకి అనువాదమైంది. 19వ శతాబ్దిలో దీన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువదించిన ఈఎస్ ఏరియల్ తిరుక్కురళ్‍ను ‘పేరు లేని రచయిత రాసిన పేరు లేని పుస్తకం’గా వర్ణించారు. ఈ గ్రంథాన్ని గురించి క్రమబద్ధంగా అధ్యయనం చేసిన తొలి పండితుల్లో జార్జ్ ఉద్గోపోవ్ (1820-1908) ఒకరు. ఈయన ఆంగ్లికన్ క్రైస్తవ మిషనరీకి చెందినవాడు. తమిళ పండితుడు కూడా. ఈయన తిరువళ్లువర్‍ను ‘విశ్వమానవ కవి’గా వర్ణించారు. ఇక, తాజాగా మన ప్రధాని మోదీ.. పుతిన్‍కు బహుమతిగా అందించిన రష్యన్ అనువాద ప్రతిని నైరా మ్క•త్చ్యాన్ అనువదించారు. ‘సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్’ వారి తిరుక్కురళ్ అనువాద శ్రేణిలో భాగంగా ఈ ఏడాదే దీన్ని ప్రచురించారు. దానినే మోదీ పుతిన్‍కు కానుకగా అందించారు. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాకుండా, మానవ జీవిత విలువల గురించి చెప్పే లౌకిక గ్రంథం కావడంతో ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా భాషల్లోకి అనువాదమైంది.
ప్రాచీన గ్రంథం.. ఆధునిక కాలానికీ ప్రతీక
రెండు వేల సంవత్సరాల క్రితం రచించినదైనప్పటికీ తిరుక్కురళ్ ఆధునిక కాలానికి కూడా వర్తిస్తుంది. ఈ గ్రంథం నైతిక ప్రవర్తన అవసరాన్నీ, మానవ జీవిత వాస్తవికతనూ వివరిస్తుంది. మతం, కులం, జాతి ఆధారిత విభజనలను తిరువళ్లువర్ వ్యతిరేకించారు. అర్థవంతమైన మానవ జీవితానికి నైతికత, దయ ఇంకా ప్రేమ, దాతృత్వం వంటి సద్గుణాలు ప్రతి ఒక్కరికీ అత్యవసరమని ప్రబోధించారు. అసూయ, దురాశ, కోపం, కాఠిన్యం వంటి భావనలకు లోనవడం వల్ల నైతికత నశిస్తుందనీ, అటువంటి జీవితం అంతిమంగా దు:ఖానికి దారితీస్తుందని హెచ్చరించారు.
చదువు ప్రాముఖ్యంపై తిరువళ్లువర్ వేల సంవత్సరాల క్రితం చేసిన ఆలోచనలు ఆయన దార్శనికతకు అద్దం పడతాయి. విద్యపై ఆయన భావాలకూ, ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త ప్లేటో ఆలోచనలకూ మధ్య కొందరు పోలికలను కూడా గుర్తించారు. తిరువళ్లువర్ దృష్టిలో సద్గుణం, జ్ఞానం, విద్య.. ఇవి విడదీయలేనివి.
ప్రస్తుత సామాజిక మాధ్యమ యుగంలో చిన్న మాట.. చిన్న పోస్టు ఎన్నో వివాదాలను సృష్టిస్తోంది. ఘర్షణలను ఎగదోస్తోంది. ఎవరైనా మంచి చెప్పినా హేళన చేయడం, నిందిస్తూ ట్రోల్ చేసి ఆనందించడం వంటి ధోరణి పెరిగిపోతోంది. అటువంటి సమయంలో మనందరికీ- మాటను ఆలోచించి ఉపయోగించడం, ఇతరులను బాధించే మాటలకు దూరంగా ఉండటం- వంటి అంశాలపై తిరుక్కురళ్‍లో తిరువళ్లువర్ ప్రవచించిన పంక్తులు నిత్యానుసరణీయం.
కాలాతీత గ్రంథం..
విశ్వవ్యాప్త ప్రాశస్త్యం
తమిళ ప్రాచీన సాహిత్య చరిత్ర ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం- తిరుక్కురళ్. ఈ గ్రంథాన్ని మరిన్ని భాషల్లోకి తర్జుమా చేయాలని తమిళనాడు ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
– ముద్రణా యంత్రంపై తమిళంలో ముద్రితమైన తొలి గ్రంథం తిరుక్కురళ్.
– ప్రభుత్వ కార్యాలయాల పత్రాల్లో తిరువళ్లువర్ శకాన్ని అధికారికంగా పాటిస్తున్నారు. ఆంగ్ల సంవత్సరానికి 31 సంవత్సరాలు కలిపితే తిరు వళ్లువర్ సంవత్సరం లభిస్తుంది.
– తిరువళ్లువర్ 135 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని కన్యాకుమరిలోని సముద్రలో 2,000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు.
– తిరుక్కురళ్, తిరువళ్లువర్‍ను స్మరించుకునేలా 1976లో చెన్నై నుంగంబాక్కంలో వళ్లువర్ కోట్టాన్ని నిర్మించారు.
– ఇప్పటి వరకు 61 భాషల్లో 350 తర్జుమాలకు నోచుకుందీ ఉద్గ్రంథం. 2027 నాటికి మరో 15 భాషల్లోకి అనువాదం కానుందని అంచనా.
– తొలి అనువాదం 1595లో మలయాళంలో జరిగినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు.
– 1730లో లాటిన్, 1794లో ఆంగ్లం, 1848లో ఫ్రెంచ్, 1856లో జర్మనీ భాషల్లోకి అనువదించారు.
– 1975 ఏడాది చివరిలో ఏకంగా 20 భాషల్లోకి అనువాదం చేశారు.
– అనువాదాల్లో హిందీ, తెలుగు, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠి, గుజరాతీ, ఉర్దూ తదితర భారతీయ భాషలు, మలాయ్, చైనా, ఫిజియన్, లాటిన్, ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, తాయ్, ఆంగ్లం తదితర విదేశీ భాషలూ ఉన్నాయి.
– తిరుక్కురళ్‍ను 102 భాషల్లోకి అనువదించే పనులు ప్రారంభించినట్టు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) ప్రకటించింది.
– అత్యధికంగా దీని అనువాదాలు ఆంగ్లంలోనే 143 వరకు ఉన్నాయని అంచనా.

































































































































































































































































































































































































































Review ఆధ్యాత్మిక వికాసం.