ఆషాడ వైభవం

1, జూలై ఆదివారం, జ్యేష్ఠ బహుళ తదియ నుంచి – 31, జూలై మంగళవారం, ఆషాఢ బహుళ తదియ వరకు విలంబి నామ సంవత్సరం-జ్యేష్ఠ-ఆషాఢం-గ్రీష్మ రుతువు-దక్షిణాయన.

ఆంగ్లమానం ప్రకారం ఏడవది జూలై నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ – ఆషాఢ మాసాల కలయిక. జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు, ఆషాఢ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. యోగిని ఏకాదశి, పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం, తొలి ఏకాదశి వంటి పర్వాలు ఈ మాసంలోనివే. ఇంకా ముఖ్యమైన గురు పౌర్ణమి, తెలంగాణ బోనాల ఉత్సవాలు, తొలి ఏకాదశి పర్వదినాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. జూలై 1, ఆదివారం జ్యేష్ఠ బహుళ తదియతో మొదలయ్యే ఈ మాసం ఆషాఢ బహుళ తదియ, మంగళవారం 31వ తేదీతో ముగుస్తుంది. ఆషాఢ మాసం అమ్మవార్ల పూజకు ఉద్ధిష్టమైనది. అతివల ఆరోగ్యానికి ఆవశ్యకమైనది.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే జూలై నెలలో తెలుగు రాష్ట్రాలలోని పల్లెల్లో జాతర సంరంభం నెలకొంటోంది. ఎటుచూసినా అమ్మవార్ల పూజలతో బోనమెత్తిన పల్లెలు.. శిగాలూగే భక్తజనంతో సందడి వాతావరణం అలముకుంటుంది. ఆంగ్లమానం ప్రకారం వచ్చే జూలై నెలలో 1వ తేదీ, బహుళ తదియ ఆదివారం నుంచి జూలై 13వ తేదీ బహుళ అమావాస్య, శుక్రవారం వరకు జ్యేష్ఠ మాస తిథులు కొనసాగుతాయి. ఆపై ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది. జూలై 14వ తేదీ శనివారం, శుద్ధ విదియ మొదలుకుని జూలై 31వ తేదీ మంగళవారం బహుళ తదియ వరకు ఆషాఢ మాస తిథులు కొనసాగుతాయి. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో నాల్గవది. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. అలాగే శుభ ముహూర్తాల పరంగా కూడా ఈ మాసం అంతగా అనుకూలం కాదని అంటారు. జ్యేష్ఠ మాస తిథుల్లో వచ్చే పర్వాల్లో యోగిని ఏకాదశి ముఖ్యమైనది. ఇక, ఆషాఢం అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనది. గృహనిర్మాణాలను ఈ మాసంలో ఆరంభించరు. శుభ కార్యక్రమాలను తలపెట్టరు. అయితే, ఆధ్యాత్మికంగా చూస్తే శక్తివంతమైనదీ మాసం. ఇంకా
ఈ మాసంతోనే నాలుగు నెలల పాటు కొనసాగే చాతుర్మ్యాస వ్రతం శ్రీకారం చుట్టుకుంటుంది.
జ్యేష్ఠ బహుళ అష్టమి జూలై 6, శుక్రవారం
జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు తిందుకాష్టమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. దీనిని ఏడాది పాటు ప్రతి మాసం శివపూజ చేయాలి. అలాగే, ఈనాడు వినాయకాష్టమి అని నీలమత పురాణం చెబు తోంది. త్రిలోచన పూజ, శీతలాష్టమి పూజలు చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, పునర్వసు కార్తె ఈ తిథి నాటి నుంచే ఆరంభమవుతుంది.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి జూలై 9, సోమవారం
ఈ తిథి యోగినీ ఏకాదశి అని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. కుబేరుడు ప్రతి రోజూ శివపూజ చేస్తుండే వాడు. ఆ పూజకు అతని తోటమాలి ప్రతి రోజూ పూవులు అందిస్తుండే వాడు. తోటమాలి భార్యాలోలుడై ఒకసారి పూజ వేళకు కుబేరుడికి పువ్వులు అందించలేక పోయాడు. దీంతో కుబేరుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడు కుబేరుడు ఆ తోటమాలిని కుష్ఠు రోగ పీడితుడివి కావాలని శపించాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న తోటమాలి ఈనాడు ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని శాస్త్రయుక్తంగా ఆచరించి ఫలితంగా కుష్ఠు రోగం నుంచి విముక్తుడయ్యాడు.
అలాగే ఈనాడు వట సావిత్రీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ తిథి ప్రకారం మర్రిచెట్టు కింద ఉన్న సావిత్రిని రాత్రి వేళ పూజించాలి. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ పూర్ణిమ నాడు, జ్యేష్ఠ అమావాస్య నాడు కూడా చేసే ఆచారం కూడా ఉంది. ఈనాడు స్త్రీలు ఉపవసించి జలముతో వటవృక్షాన్ని తడపాలి. ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది (108) సార్లు దారం చుడుతూ ప్రదక్షిణం చేయాలి. మర్నాడు సువాసినీ స్త్రీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతం చేసే స్త్రీ సర్వదా సౌభాగ్యవతి అవుతుందని శాస్త్ర వచనం.

జ్యేష్ఠ బహుళ అమావాస్య జూలై 13,
శుక్రవారం
హేమాద్రి పండితుని అభిప్రాయం ప్రకారం ఈనాడు భోగశాయి పూజ చేయాలి. ఇంకా ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరించారు. జ్యేష్ఠ బహుళ అమా వాస్య మిథున సంక్రాంతి పర్వదినం.
అలాగే, ఈనాడు సూర్య గ్రహణం. అయితే, ఇది భారతదేశంలో కనిపించదు.

ఆషాఢ శుద్ధ విదియ జూలై 14, శనివారం
ఆషాఢ శుద్ధ విదియ నాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల మాధవుడిగా నెలకొని ఉన్నాడని అంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు స్వామికి రథయాత్ర జరుగుతుంది. నాటి నుంచి పది రోజులు గుండిచా మందిరంలో కొలువుదీరి సర్వులనూ అనుగ్రహించే దర్శనం ఒక మహా సౌభాగ్యం. ఈ రథయాత్ర ప్రపంచం లోనే అతి పెద్దది. ప్రధానాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లే విశాల మార్గం (బొడొదండొ) లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది. ఉపనిషత్తుల్లో వర్ణించిన విధంగా- శరీర రథంలో పరమాత్మను దర్శించే (కఠోపనిషత్తు) అంతర్ముఖ సాధనకు ఈ యాత్ర ఒక ప్రతీక. శ్రీ క్షేత్రమని కూడా ప్రసిద్ధి పొందిన ఈ మహా స్థలం, ఇక్కడి ధర్మాలు ఒడిశా సంస్క•తిపై ప్రగాఢ ప్రభావం కలిగి ఉండటమే కాక, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించే సాంస్క• తిక అంశాలుగా మారిపోయాయి. జగన్నాథుని ‘నందిఘోష’ రథం, బలభద్రుడి ‘తాళధ్వజ’ రథం, సుభద్రాదేవి ‘దర్పాదళన’ రథాలను ఏటా దారువులతో నిర్మిస్తుంటారు. వాటి శిల్ప వైఖరి, వాటిలో పరివేష్టించే దేవతలు, ఈ క్షేత్రానికే పరిమితమైన ప్రత్యేకతలు. రథంలో ఉన్న జగ న్నాథుడిని, పది రోజులు గుండిచా మండపంలో ఉండే స్వామిని దర్శిస్తే వేయి యాగాలు చేసిన ఫలం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది.

ఆదిశంకరులు ఈ క్షేత్రంలో గోవర్ధన మఠాన్ని స్థాపించి, స్వామిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు. శ్రీరామానుజాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, గురునానక్‍, తులసీదాస్‍, వల్లభాచార్య వంటి మహాత్ములు జగన్నాథుని దర్శనంతో పులకించారు. ఆధ్యాత్మిక శక్తికి, చారిత్రక ప్రశస్తికి కేంద్రం ఈ క్షేత్రం. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం పూరీ జగన్నాథ రథోత్సవాన్ని చిత్రీకరిం చేందుకు దాదాపు నెల రోజుల ముందు నుంచే సన్నాహాలు చేసుకుంటాయంటే అంతర్జాతీయంగా ఈ రథయాత్ర ఎంత ప్రసిద్ధమైనదో ఊహించుకోవచ్చు. నేత్రపర్వం చేసే రథోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా తిలకించాలని భక్తులు భావిస్తారు.

ఆషాఢ శుద్ధ పంచమి జూలై 17, మంగళవారం
ఆషాఢ శుద్ధ పంచమి నాడు కావేరీ నదీ తీరవాసులు ‘ఆడిపదినెట్టు’ అనే పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఆదిపదినెట్టు అంటే ఆషాఢ మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. ప్రాయకంగా ఈనాటికి కావేరి నదికి కొత్త నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడ ఇది వ్యవసాయ పనులకు అనువైన కాలం. కావేరీ వాసులు ఈ మాసాన్ని ‘ఆడా మాసం’గా కూడా వ్యవహరిస్తారు. అంటే ఇది మనకు ఇంచుమించు ఆషాఢ మాసంతో సమానమైనది. ఈ తిథిని ‘స్కంద పంచమి’గా కూడా పిలుస్తారు. స్కందుడి (కుమారస్వామి)ని ఈ రోజు విశేషంగా ఆరాధిస్తారు.
ఆషాఢ శుద్ధ షష్ఠి.

జూలై 18, బుధవారం
ఈనాడు స్కంద వ్రతం ఆచరిస్తారు. సాధా రణంగా షష్ఠి నాడు కుమారస్వామిని పూజిస్తారు. అందుకే దీనిని కుమార షష్ఠి అన్నారు. ఈనాడు ఈ వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వ రుడిని శోడశోప చారాలతో పూజించాలి. ఉపవాసం ఉండాలి. నీళ్లును మాత్రమే తీసుకోవాలి. మర్నాడు స్వామిని దర్శించుకోవాలి. ఈ వ్రతాచరణను ప్రధానంగా శరీరారోగ్యానికి నిర్దేశించారు. ఇక, కుమారస్వామి జన్మ వృత్తాంతంలోకి వెళ్తే.. కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యుడనే నామాంతరాలతో వ్యవహరిస్తారు. కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు చెబు తున్నాయి. శివ పార్వతులు మన్మథ క్రీడలో ఉండగా, వారికి తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని భయపడిన ఇంద్రుడు వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని ఆ సమయంలో చూసిన శివుడు పార్వతికి దూరం జరిగాడు. శివతేజం (వీర్యం) భూమిపై పడింది. అగ్ని దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని రెల్లు పొదల్లో జారవిడిచింది. ఆ రెల్లు పొదల్లో కుమారస్వామి జననం జరిగింది. శరవనం (రెల్లు)లో జన్మించిన కారణంగా శరవణు డయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు ముని కర్యలు ఆ శిశువును తీసుకెళ్లి బదరికా వనంలో వదిలారు. కృత్తికలు పెంచిన వాడు కనుక కార్తి కేయుడయ్యాడు.

ఆషాఢ శుద్ధ సప్తమి
జూలై 19, గురువారం
ఆషాఢ శుద్ధ సప్తమి నాడు ద్వాదశీ సప్తమీ పూజ నిర్వహిస్తారు. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన తిథి. ఈనాడు చేసే పూజను ‘మిత్రాఖ్య భాస్కర పూజ’ అని కూడా అంటారు.

ఆషాఢ శుద్ధ అష్టమి
జూలై 20, శుక్రవారం
ఆషాఢ శుద్ధ అష్టమి తిథి నాడు మహిషఘ్నీ పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. గదాధర పద్ధతి అనే మరో గ్రంథంలో ఆషాఢ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అనీ, పరశురామి యాష్టమీ అని పేర్కొన్నారు. అష్టమి నాడు మహిషాసుర మర్దని పూజ చేయాలని అందులో ఉంది.

ఆషాఢ శుద్ధ నవమి
జూలై 21, శనివారం
ఆషాఢ శుద్ధ నవమి తిథి నాడు ఐంద్రాదేవిని పూజించాలని స్మ•తి కౌస్తుభంలో వివరించారు. ఈమె కూడా శక్తి దేవతే.

ఆషాఢ శుద్ధ దశమి
జూలై 22, ఆదివారం
మన ఆధ్యాత్మిక పర్వాల్లో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అందుకు నిదర్శనమే.. శాక వ్రతం. ఆషాఢ శుద్ధ దశమి నాటి నుంచే శాక వ్రత మహాలక్ష్మీ వ్రతం ఆరంభం అవుతుంది. దీనినే దధి వ్రతారంభమనీ అంటారు. ఈనాడు మహాలక్ష్మిని పూజించి నెల పాటు ఆకుకూరలు తినడం మాని ఆకు కూరలు దానం చేయాలి. శాక వ్రతం అనేది చాతుర్మాస్య వ్రతం ఆచరించే నాలుగు నెలల్లో ఒక వ్రతాచరణ మాసం. ఈ మాసానికి సంబంధించి, ఈ మాసంలో లభించే ఆహార పదార్థాలనే భుజించాలని నియమంగా పెట్టారు. ఆరోగ్య పరిరక్షణ ఈ శాక వ్రతం ఉద్దేశం. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుస మన్వంతరాది దినం. చాక్షుస మనువు మనువుల్లో ఆరవ వాడు. ఈయన ఉగ్రుడనే రాజు కుమార్తె అయిన విదర్భను వివాహమాడాడు. ఇతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు. సుమేధ, అతి నామ మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి
జూలై 23, సోమవారం
ఏకాదశి అనగా, ప్రతి పక్షము (15 రోజులు) నకు ఒకసారి వచ్చే పదకొండవ (11) తిథి అని అర్థం. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా ఇలా 24 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశులన్నీ పుణ్యప్రదాలు. ఆ రోజున హరినామ కీర్తన ప్రధానంగా చేస్తారు. కాబట్టి ఏకాదశిని ‘హరివాసరం’ అని కూడా అంటారు. శిష్టులు ఏకాదశి నాడు పరమ నిష్టగా ఉండి ఉపవాసం ఆచరిస్తారు. దశమి రాత్రి నిరాహారుడై, ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా, ద్వాదశి ఉదయం పారణమొనర్చి, ద్వాదశి నాడు రాత్రి కూడా నిరాహారుడై ఉండాలి. అప్పుడు కాని ఏకాదశి వ్రతం సంపూర్ణం కాదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఆ రోజు సూర్యచంద్రాది గ్రహణముల కాలంలో భూరి దానం ఇస్తే పుణ్యం కలుగుతుంది. అంతేకాక అశ్వమేథ యజ్ఞ ఫలం, అరవై వేల సంవత్సరాల తపఃఫలం పొందుతారని ప్రతీతి. ఏకాదశి నాడు ఉపవసించడం- బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కంటే, విద్యార్థులకు వేద విద్యాదానం చేయడం కంటే ఉత్తమమైనదని పురాణేతిహాసాలు పేర్కొంటు న్నాయి. ఒకవేళ ఏకాదశి నాడు ఉపవసించలేని వారికి వాయు పురాణంలో ప్రత్యామ్నాయాలు చూపారు. ఉపవాసం చేయలేనపుడు వాయు భక్షణం, అది చేతకానపుడు పంచగవ్యం లేక నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. అదీ సాధ్యం కానపుడు ఉడకని పదార్థాలు లేక హవిష్యాన్నం తినవచ్చు. ఇది కూడా చేయలేని వారు ఒక్క పొద్దు ఉండవచ్చు.
ఏకాదశి నాడు భుజించే వాడు చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ పాపాన్ని పోగొట్టుకోలేడని ప్రతీతి. ఒకసారి బ్రహ్మ ఫాల భాగం నుంచి ఒక చెమట బిందువు కిందపడిందట. దాని నుంచి ఓ రాక్షసుడు పుట్టాడు.
‘ప్రభూఁ నాకు నివాసం చూపు’ అని ఆ రాక్షసుడు బ్రహ్మను కోరాడు.
అప్పుడు బ్రహ్మ- ‘నువ్వు ఏకాదశి నాడు ఎవరైతే భుజిస్తారో వారి శాల్యన్నపు మెతుకులతో నివసిస్తావు. పిదప వారి కడుపుల్లోకి చేరి క్రిములుగా మారతావు’ అని చెప్పాడట.
అందువల్లే దక్షిణ భారతదేశంలో ఏకాదశి నాడు వరి అన్నం చాలామంది తినరు.
ఇక, ఆషాఢ శుద్ధ ఏకాదశి విషయానికి వస్తే- ఇది తొలి ఏకాదశి. ఇది పుణ్యతిథిగా, పవిత్రమైన రోజుగా ప్రసిద్ధం. కుల, వర్గ భేదాలకు అతీతంగా పండుగ రోజున భగవంతుడి ధ్యానంలో ఉపవసించడం అనూచానంగా వస్తున్న గొప్ప ఆచారం. శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకోవడానికి అనువైన సమయమిది. ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక పౌరాణిక గాథలు ఈ వ్రతం ఇహపరాల నడుమ సేతుబంధనం వంటిదని వర్ణించాయి. ఆషాఢ మాసంలో వచ్చే ప్రథమ ఏకాదశి ‘సర్వేషాంశయనైక’ ఏకాదశి అని, ఆ రోజు నుంచి చాతుర్మ్యాస వ్రతం ఆరంభమవు తుందని అంటారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి పర్వం అనేక విధాలుగా ఉద్ధిష్టమై ఉంది. ఈ
తిథి నాడు ఉపవసించి యథాశక్తి భగ వంతుడిని కొలవాలని ఆయా పురాణాలు చెబుతున్నాయి.
ఆషాఢ శుద్ధ ద్వాదశి.

జూలై 24, మంగళవారం
‘చతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వాన కారుతోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేథ యజ్ఞం నిర్వహించాలని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఉంది. ఈ వరుస క్రమంలో వర్ష రుతువున చాతుర్మాస్యం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.
చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి సంవత్సరానికి ప్రథమ ఏకాదశి. ఈ ఏకాదశినాడు విష్ణువు క్షీర సముద్రంలో శేష పానుపుపై శయనిస్తాడని పురాణ ప్రతీతి. ఈ వ్రతమును ఏకాదశి నుంచి కానీ, కటక సంక్రాంతి దినం నుంచి కానీ, ఆషాఢ పూర్ణిమ నుంచి కానీ ఆరంభించవచ్చు. చాతు ర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరకృత్య పాపాలన్నీ నశిస్తాయని భారత వచనం.
చాతుర్మాస్య వ్రత విధానం గురించి స్కాంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులంగా ఉంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్రపదాన పెరుగును, ఆశ్వయుజాన పాలును, కార్తీక మాసాన పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించాలని వాటిలో
ఉంది. ఇంకా నిమ్మ, రా•మాషములు, ముల్లంగి, ఎర్రముల్లంగి, గుమ్మడి, చెరుకు, కొత్త ఉసిరిక, చింత మొదలైన వాటిని త్యజించాలని స్కాంద పురాణంలో ఉంది. పాత ఉసిరిక ఎక్కడ దొరికినా, దానిని సంపాదించి తినాలని అందులో పేర్కొ న్నారు.
పై ఆహార పదార్థాల నిషేధాన్ని బట్టి వర్షా కాలంలో అపథ్య ఆహారాన్ని మానిపించి, ఆరోగ్య పరిరక్షణమే ఈ వ్రత పరమార్థమని స్పష్టమవు తోంది. వర్షా కాలం క్రిమికీటకాలకు పుట్టినిల్లు. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ వ్రతం అపథ్య ఆహారాన్ని త్యజించిందని భావించాలి.
భీష్ముడు శేషధర్మంలో చాతుర్మాస్యం స్త్రీలకే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. అయినా ఇది అందరూ ఆచరించదగిన వ్రతం. ముఖ్యంగా ఆశ్రమవాసులకు ఇది ముఖ్యమైన వ్రతమని పురాణాల్లో ఉంది. ఇక, బుద్ధుడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్టు జాతక కథల్లో పలుచోట్ల ఉంది. ఈ వ్రతాన్ని ఆ కథల్లో ‘కత్తిక నక్ఖత్త’, ‘కత్తికరత్తి’, ‘కత్తికఛన’ అని వర్ణించారు. రాజగృహం, అవంతి, వారణాసి తదితర మహా నగరాల్లో ఈ చాతుర్మాస్య సమాప్యుప్త ఉత్సవాల సప్తాహం అత్యంత వైభవంగా నిర్వహించే వారు. జైనులు ఇప్పటికీ చాతుర్మాస్య కాలంలో అత్యంత నిష్టగా అహింసా వ్రతాన్ని ఆచరిస్తారు.వర్ష (ఏడాది) కాలంలో అపథ్య ఆహారం మాన్పించే ఆరోగ్య పరిరక్షణ సూత్రంగా ఈ వ్రతం రూపుదాల్చిందని అంటారు. సంప్రదాయ ధార్మిక భావనలు, ఆరోగ్య పరిరక్షణ నియమాల సమ్మేళనమే ఈ వ్రతాచరణ సంకల్పంగా భావించవచ్చు. అందుకే మహిళలకు చాతుర్మాస్య వ్రతం అత్యంత ప్రీతకరమైనది.

ఆషాఢ బహుళ పాడ్యమి
జూలై 28, శనివారం
ఈ తిథి నాడు మృగశీర్షా వ్రతం ఆచరించా లని స్మ•తి కౌస్తుభ వ్రత గ్రంథం చెబుతోంది. అలాగే, కోకిలా వ్రతాన్ని ఆచరించాలని కూడా అందులో ఉంది. చతుర్వర్గ చింతామణిలో- ఆషాఢ బహుళ పాడ్యమి నాడు ధర్మావ్యాప్తి వ్రతం ఆచరించాలని రాశారు.

ఆషాఢ బహుళ విదియ
జూలై 29, ఆదివారం
ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ నాటి తిథి గురించి ‘క్షీరసాగరే సలక్ష్మీక మధుసూదన పూజ’ అని వర్ణించారు. అంటే, దీనిని బట్టి ఈనాడు లక్ష్మీ సహిత మధుసూదనుడిని పూజిం చాలని తెలుస్తోంది. ఇంకా ఈనాడు అష్టనాగ పూజ, మానస పూజ నిర్వహించాలని వేర్వేరు గ్రంథాల్లో ఉంది. మరికొన్ని గ్రంథాలు ఆషాఢ బహుళ విదియ తిథి విజయతీర్థ పుణ్యదినమని పేర్కొంటున్నాయి

Review ఆషాడ వైభవం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top