శ్రేష్ఠ మాసం

మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. జ్యేష్ఠం.. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో మూడవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా..

26 మే శుక్రవారం, శుక్ల పాడ్యమి నుంచి 24 జూన్‍ శనివారం బహుళ పాడ్యమి
వరకు జ్యేష్ఠ మాసం, ఉత్తరాయనం, గ్రీష్మ రుతువు.

తెలుగు మాసాల వరుసలో మూడవది జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో గృహ నిర్మాణం అసలు ప్రారంభించరాదని మత్స్య పురాణం చెబుతోంది. ఇక ఈ మాసంలో వరుసగా వచ్చే ఆయా తిథులు, ముఖ్యమైన పర్వదినాలు, పండుగల గురించి తెలుసుకుందాం.
జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి
(మే 26, శుక్రవారం)ఈ తిథి నాడు కరవీర వ్రతం ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, భద్ర చతుష్టయ వ్రతాన్ని కూడా ఆచరించాలని వాటిలో పేర్కొన్నారు.
జ్యేష్ఠ శుద్ధ తదియ
(మే 28, ఆదివారం)జ్యేష్ఠ శుద్ధ తదియ తిథి నాడు ‘రంభా వ్రతం’ ఆచరిస్తారు. అలాగే, ఇదే తిథిని కొన్ని వ్రత గ్రంథాలు ‘రంభా తృతీయ’గా పేర్కొంటున్నాయి. ఇంకా, ఈనాడు రాజ్యవ్రతము, త్రివిక్రమ తృతీయా వ్రతం వంటివీ ఆచరిస్తారని తెలుస్తోంది. అయితే, వీటన్నిటిలో రంభా వ్రతమే దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది. ఆ వ్రత విశేషాలివీ..
తపోనిష్టలో ఉన్న శివుడికి ఉపచరించ డానికి హిమవంతుడు తన కూతురు పార్వతిని అప్పగించాడు. ఆ పమయంలో పార్వతిపై శివుడికి ప్రేమ పుట్టేందుకు మన్మథుడు తన బాణాలు ప్రయోగించాడు. శివుడి తపోనిష్ట చెదిరింది. దీంతో కోపం వచ్చి తన మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోగా, పార్వతి చిన్నబుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి విషయం అడిగి ఓదార్చి, కుమార్తెను హిమవంతుడి వద్దకు తీసుకెళ్లింది. అంతలో అక్కడకు సప్త మహామునులు రాగా, హిమవంతుడు తన కుమార్తె విషయాన్ని చెప్పాడు. అప్పుడు మునులు ‘బిడ్డా! ఒక వ్రతం ఉంది. దాన్ని ఆచరిస్తే శివుడే నీకు భర్తగా లభిస్తాడు’ అని చెప్పారు. పార్వతి వారిని ఆ వ్రత వివరాల గురించి అడిగింది. ‘ఈ వ్రతాన్ని పెద్దలు రంభా వ్రతం అంటారు. రంభ అనగా అరటిచెట్టు. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ఆచరించాలి. ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచవన్నె ముగ్గులు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి కాబట్టి, అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలి. ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. దానిని సరస పదార్థాల సంపన్నం చేయాలి. అరటిచెట్ల నీడలో పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రిని స్తుతించాలి. రాత్రి జాగరణం చేయాలి. ఇలా నెల రోజుల పాటు పగలు సావిత్రిని స్తోత్రం చేస్తూ రాత్రులు అరటిచెట్ల కిందనే విశ్రమిస్తూ ఉండాలి. అనంతరం సరస పదార్థ సంపన్నమైన ఆ మంటపాన్ని పుణ్య దంపతులకు దానం చేయాలి. గతంలో ఈ వ్రతాన్ని లోపాముద్ర చేసి భర్తను పొందింది’ అని మునులు పార్వతికి వ్రత నియమాలను వివరించారు. దీంతో పార్వతి దీక్షతో రంభా వ్రతాన్ని ఆచరించి.. శివుడిని మెప్పించి భర్తగా పొందింది.
జ్యేష్ఠ శుద్ధ చవితి
(మే 29, సోమవారం)ఈ తిథి నాడు ఉమా చతుర్థి వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఉమా పూజనం చేయాలని అంటారు. ఇంకా, గణేశ చతుర్థిగానూ ఈ తిథిని పరిగణిస్తారు. శుక్లాదేవి పూజ చేయాలని మరో వ్రత గ్రంథంలో ఉంది.
జ్యేష్ఠ శుద్ధ పంచమి
(మే 30, మంగళవారం)ఈ తిథి పితృ దేవతలను పూజించడానికి ఉద్ధిష్టమైనదని ఆయా వ్రత గ్రంథాలలో
ఉంది.
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి
(మే 31, బుధవారం)దీనినే అరణ్యక షష్ఠి అని గదాధర పద్ధతి, స్కంద షష్ఠి అని నామాంతర గ్రంథం, వింధ్యేశ్వర పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథం చెబుతున్నాయి. ఈనాడు అరణ్యాల్లో, కొండల్లో గౌరిని పూజించే వారికి సౌభాగ్యం సిద్ధిస్తుందని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ సప్తమి
(జూన్‍ 1, గురువారం)ద్వాదశ సప్తమి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే వరుణ పూజ చేయాలని మరికొన్ని గ్రంథాలలో రాశారు.
జ్యేష్ఠ శుద్ధ అష్టమి
(జూన్‍ 2, శుక్రవారం)ఇది దుర్గాష్టమి తిథి అని ఆమాదేర్‍ జ్యోతిషీ వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు దుర్గాదేవిని పూజించాలి.
జ్యేష్ఠ శుద్ధ నవమి
(జూన్‍ 3, శనివారం)ఈనాడు శుక్లాదేవిని పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.
జ్యేష్ఠ శుద్ధ దశమి
(జూన్‍ 4, ఆదివారం)ఈ తిథికి ‘దశపాపహర దశమి’ అని పేరు. పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. దీన్ని జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు ఆచరించాలి. ఈ తిథి నాడు ఏ నదిలో స్నానం చేసినా అది విశేష ఫలాన్నిస్తుంది. గంగానదిలో చేస్తే ఇంకా ఫలం. కాశీలోని దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం మరీ విశేషం. అలాగే, గంగావతారం ఈనాడే జరిగిందని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి, బుధవారం, హస్తా నక్షత్ర కాలంలో గంగావతారణం జరిగిందనీ, ఈ విషయాన్ని వాల్మీకి రామాయణం చెబుతోందని వ్రతోత్సవ చంద్రికాకారుడు చెబుతున్నారు. జ్యేష్ఠ శుక్ల దశమి సౌమ్యవారంతో హస్తా నక్షత్రంతో కలిసి వచ్చిన నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ పాపాలు సమసిపోతాయని నమ్మిక. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు రోజూ స్త్రీలు పిండి వంటలు చేస్తారు. రోజూ పదేసి భక్ష్యాలు దక్షణయుక్తంగా గురువులకు ఇస్తారు. పదకొండో నాడు, అనగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఉపవాస కాలంలో పచ్చి మంచినీళ్లయినా ముట్టకూడదు. అదే నిర్జలైకాదశి.
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి
(జూన్‍ 5, సోమవారం)దీనినే నిర్జలైకాదశి అనీ అంటారు. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు గంగోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠంలో ఎండలు మెండుగా ఉంటాయి. భూమిలో నీటిమట్టం చాలా అడుగుకు పడిపోతుంది. అట్టి గడ్డు వేసవిలో ఈ ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. అందుచేతనే దీనికి నిర్జలైకాదశి అనే పేరొచ్చింది. ఈ ఏకాదశి భీముడి కారణంగా ఏర్పడినట్టు చెబుతారు.
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
(జూన్‍ 6, మంగళవారం)ఈనాడు చంపక ద్వాదశి పర్వమి గదాధర పద్ధతి అనే గ్రంథంలో ఉంది. త్రివిక్రమ పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అలాగే, ఈ తిథి రామలక్ష్మణ ద్వాదశిగానూ ప్రసిద్ధి. ఈనాడు కూర్మ జయంతి ఆచరిస్తారు. శ్రీశంకరాచార్య కైలాస గమనం ఈనాడే జరిగింది.
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
(జూన్‍ 7, బుధవారం)జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి మూడు వ్రతాలు చేసే ముహూర్త దినంగా చతుర్వర్గ చింతామణి చెబుతోంది. వీటిలో ఒకటి- దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం. మిగతా రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం పర్యాప్తమై సాగేవి. వాటి పేర్లు- జాతి త్రిరాత్రి వ్రతం, రంభా త్రిరాత్రి వ్రతం. రెండో వ్రతాన్ని రాత్రి ప్రారంభించి, అరటి చెట్టు కింద ఉమామహేశ్వరులను పూజించాలని వ్రత నియమం. అలాగే, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి- విద్యారణ్యుల ఆరాధన దినం కూడా.
జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి
(జూన్‍ 8, గురువారం)చంపక చతుర్దశి అని మరోపేరు కూడా ఉంది. ఈనాడు వాయు వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే రుద్ర వ్రతం కూడా ఆచరిస్తారు.
జ్యేష్ఠ పూర్ణిమ
(జూన్‍ 9, శుక్రవారం)మన పంచాంగంలో జ్యేష్ఠ పూర్ణిమ నాటి వివరాల్లో ‘వృషభ పూజ, హల ప్రవాహః’ మున్నగు పదాలు ఉంటాయి. ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధి కృత్యాలని తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ తిథిని ఏరువాక పూర్ణిమ, ఏరువాక పున్నమి అనే వ్యవహారికం వచ్చింది. ఏరువాక అంటే, ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరిచిన నాగలి. భూమిని దున్నడాన్ని ఏరువాక అంటారు. అంటే, ఇది వ్యవసాయానికి సన్నాహకం. వర్ష రుతువు ఆరంభ దశలో ఈ పర్వం వస్తుంది. అప్పుడప్పుడే వర్షాలు పడి భూమి సాగుకు యోగ్యంగా మారుతుంది. ఆ సమయంలో దున్ని, విత్తనాలు చల్లి రైతులు సాగుకు సిద్ధమవుతారు. కర్షకులకు ఎద్దులే సర్వస్వం. కావున ఈ తిథి నాడు వాటిని పూజించే ఆచారం ఏర్పడింది. కన్నడిగులు ఈ పర్వాన్ని ‘కారుణి పబ్బ’ అని అంటారు.
ఇంకా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు సావిత్రీ వ్రతాన్ని కొందరు ఆచరిస్తారు. కొన్నిచోట్ల వట పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు.
జ్యేష్ఠ బహుళ అష్టమి
(జూన్‍ 17, శనివారం)ఈ తిథి నాడు తిందుకాష్టమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఏడాది పాటు ప్రతి నెలా శివపూజ చేయాలి. అలాగే, వినాయకాష్టమి, త్రిలోచన పూజ, శీతలాష్టమి తదితర పూజలు కూడా ఈనాడు చేస్తారు.
జ్యేష్ఠ బహుళ ఏకాదశి
(జూన్‍ 20, మంగళవారం)దీనినే యోగిన్యేకాదశి అనీ అంటారు. కుబేరుడు తోటమాలి రోజూ సమయానికి పువ్వులు అందించే వాడు. ఒకనాడు భార్యాలోలుడై కుబేరుడికి సమయానికి పూలు ఇవ్వలేకపోయాడు. దీంతో కుబేరుడు పట్టరాని కోపంతో అతనిని కుష్ఠు రోగ పీడితుడివి కమ్మని శపించాడు. ఆ వ్యాధితో బాధపడుతూ అతను ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతని రోగం కుదిరింది.
జ్యేష్ఠ బహుళ అమావాస్య
(జూన్‍ 24, శనివారం)ఈనాడు భోగశాయి పూజ చేసి, ఉపవాసం ఉండాలని హేమాద్రి అనే పండితుని ఉవాచ. అలాగే ఈ తిథి సుజన్మావాప్తి వ్రతాన్ని ఆచరించాలని, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామని అనే ద్రత గ్రంథంలో ఉంది.

Review శ్రేష్ఠ మాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top