శుభాలకు ‘నెల’వు

1, ఆగస్టు బుధవారం, ఆషాఢ బహుళ చతుర్థి నుంచి – 31, ఆగస్టు శుక్రవారం,
శ్రావణ బహుళ పంచమి వరకు
విలంబి నామ సంవత్సరం-ఆషాఢం- శ్రావణం- గ్రీష్మ రుతువు-దక్షిణాయన

ఆంగ్లమానం ప్రకారం ఎనిమిదవది ఆగస్టు మాసం. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ – శ్రావణ మాసాల కలయిక. ఆషాఢ మాసంలోని కొన్ని రోజులు, శ్రావణ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. శ్రావణ సోమవారాల వ్రతం, మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతం, నాగుల చవితి, నాగుల పంచమి, రక్షాబంధన్‍, తిరుమల తిరుపతి శ్రీవారి పవిత్రోత్సవాల ప్రారంభం – ముగింపు ఉత్సవాలు ఈ మాసంలోనివే. ఆగస్టు 12 నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతుంది. ఈ నెలంతా పర్వదినాలకు ‘నెల’వే. ఆగస్టు 1, బుధవారం ఆషాఢ బహుళ చతుర్థితో మొదలయ్యే ఈ మాసం శ్రావణ బహుళ పంచమి, శుక్రవారం 31వ తేదీతో ముగుస్తుంది.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇల్లూ లక్ష్మీ నివాసమే అవుతుంది. ఎటుచూసినా పూబంతుల హారాలు, పచ్చని మామిడాకుల తోరణాలు.. గుమ్మాలకు పసుపు కుంకుమల ముగ్గులు.. పట్టుచీరలు కట్టుకుని పూజా ద్రవ్యాలు, మంగళహారతులతో పూజా పునస్కారాలలో మునిగిపోయే పడుచులు.. అసలు ఈ కాలంలో వాతావరణమే వేరు. ఆధ్యాత్మిక గాలులు ఆరోగ్య పవనాలు వీస్తూ మదిలో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శ్రావణ మాసంలో ఆరోగ్య రీత్యా వ్రత నియ మాలు ఎక్కువ విధించారు. ఇవన్నీ ఆరోగ్యం కోసమే. మొత్తానికి శ్రావణ మాసపు సందడే వేరు. ఆషాఢంలో పండుగలు, పబ్బాలు లేక ముఖం వాచిపోయిన ఆధ్యాత్మికపరులు శ్రావణంలో వాటిని ముమ్మరం చేస్తారు. ఆంగ్లమానం ప్రకారం వచ్చే ఆగస్టు నెలలో 1వ తేదీ, ఆషాఢ బహుళ చతుర్థి, బుధవారం నుంచి ఆగస్టు 11, ఆషాఢ బహుళ అమావాస్య, శనివారం వరకు ఆషాఢ మాస తిథులు, ఆగస్టు 12, శ్రావణ శుద్ధ పాడ్యమి, సోమవారం నుంచి ఆగస్టు 31వ తేదీ శ్రావణ బహుళ పంచమి, శుక్రవారం వరకు శ్రావణ మాస తిథులు కొనసాగుతాయి. ప్రాయకంగా శ్రావణ మాసం ఎంతో విశేషమైనది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా పెద్దపీట వేసే ఈ మాసం విశేషాలు తెలుసు కుందాం.
ఆషాఢ బహుళ అష్టమి ఆగస్టు 5, ఆదివారం
ఆషాఢ కృష్ణ అష్టమి రౌచ్య మన్వంతరాది. రౌచ్యుడు పదమూడవ మనువు. అతనికే రేచ్చుడు అనే మరో పేరూ ఉంది. రౌచ్యుడు రుచి అనే మహర్షి కొడుకు. రుచి నిస్సంగుడై సంచ రిస్తుండేవాడు. అతను వివాహం చేసుకోలేదు. ఒకసారి అతనికి పితరులు తారసపడి పెళ్లి చేసుకుని సంతానాన్ని కని, తమకు సద్గతి కలిగించాలని కోరతారు. దీంతో రుచి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ‘నీ పితరులు చెప్పినట్టు వివాహం చేసుకో’ అని సూచిస్తాడు. అటు మీదట రుచి నదీ తీరాన పితృ తర్పణం చేస్తాడు. పితృ దేవతలు వచ్చి ‘బిడ్డా! నీకు ఒక మంచి ఇల్లాలు లభిస్తుంది. ఆమె వలన నీకు మన్వంతరాధిపతి అయిన మనువు పుడతాడు. అతను రౌచ్యుడు అనే పేరుతో వాసికెక్కుతాడు’ అని చెబుతారు. అంతలో నది మధ్యలో నుంచి మనోహరిణి అయిన ప్రమ్లోచ అనే అప్సరస బయటకు వస్తుంది. ఆమె రుచి మహర్షితో- ‘అయ్యా! వరుణ పుత్రుడైన పుష్కరుని వలన నేను ఒక కన్యను పడసి ఉన్నాను. ఆమె జగదేకసుందరి. ఆమె పేరు మాలిని. ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అభిలాషగా ఉంది’ అని చెబుతుంది. దీంతో రుచి మహర్షి మాలినిని పెళ్లాడతాడు. వీరికి ఒక కొడుకు పుడతాడు. అతనే రేచ్చుడనే పేరుతో త్రయోదశ తమ మన్వంతరాధిపత్యం వహించినాడు. ఈ మన్వతరంలో దివస్పతి నామకుడు ఇంద్రుడు. ధృతిమంతుడు, తత్త్వదర్శి తదితరులు సప్తర్షులు.
జ్యేష్ఠ బహుళ ఏకాదశి ఆగస్టు 7, మంగళవారం
ఈ తిథి కామికైకాదశి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథం ఈ ఏకాదశిని కామదైకాదశి అని వర్ణించింది. ఈనాటి ఏకాదశీ వ్రతాచరణం వలన సకల అభీష్టములు ఈడేరుతాయని ప్రతీతి. కోరిన కోరికలు నెరవేర్చే ఏకాదశి కాబట్టి ఇది కామికైకాదశి అయ్యింది. తీరని కోరికలు తీర్చుకోవడానికి ఈ తిథి పూజ్యనీయమైనదని పెద్దలు అంటారు.

ఆషాఢ కృష్ణ (బహుళ) అమావాస్య
ఆగస్టు 11, శనివారం
ఈనాటి తిథి నాడు దీపపూజను ఆచరిస్తారు. ఇంట్లో ఉన్న ఇత్తడి దీప స్తంభాలు, కుందులు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్య పలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందులు, దీప స్తంభాలు ఆ పలకం మీద ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. లడ్డూలు, మోరుండలు నైవేద్యం పెడతారు. బ్రాహ్మణుడికి, ముత్తయిదువకు వాయినాలు ఇస్తారు. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు.
ఆషాఢ బహుళ అమావాస్య తిథి ముగియ గానే కర్కాటక సంక్రమణ ప్రవేశం.. ఈ కాలంలో వరాహ పూజ చేసి ఉపవాసం చేయాలని హేమాద్రి పండితుడి సూచన. ఇంకా ఈ ఘడియల్లో సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం వంటివీ చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.
ఈనాటి నుంచి దక్షిణాయనం. సూర్యుడు దక్షిణమునకు వెళ్తూ ఉంటాడు. దక్షిణాయనం పితృ మహిమకు అనర్హమైన కాలం. ఈ ఆయనంలో చనిపోయిన పుణ్యాత్ముడు పితృ మహిమను పొంది చంద్ర సాయుజ్యం పొందుతాడని వేద వచనం. కర్కాటక సంక్రమణం దక్షిణాయనమునకు ఆరంభం.

శ్రావణ శుద్ధ పాడ్యమి, ఆగస్టు 12, ఆదివారం
శ్రావణ మాసపు ఆరంభ తిథి ఇది. ఈనాడు బిల్వరోటక, అర్థ శ్రావణికా, ఆరోగ్య, విద్యాప్రాప్తి వ్రతాలు చేస్తారని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాటి నుంచి శ్రావణ మాసపు శుక్లపక్షం ఆరంభమవుతుంది. శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి తదుపరి పదిహేను రోజుల్లో పవిత్రారోహణోత్సవాలు సాగించాలని మన వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి నాడు ధనదునికి, విదియ నాడు శ్రియఃపతికి, తదియ నాడు పార్వతికి, చవితి నాడు వినాయకుడికి, పంచమి నాడు శశికి, షష్ఠి నాడు గుహుడికి, సప్తమి నాడు సూర్యుడికి, అష్టమి నాడు దుర్గకు, నవమి నాడు మాతృగణమునకు, దశమి నాడు ధర్మరాజుకు, ఏకాదశి నాడు మునులకు, ద్వాదశి నాడు చక్రపాణికి, త్రయోదశి నాడు అనంగుడికి, చతుర్దశి నాడు శివుడికి, చివరిదైన శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు పితృదేవతలకు పవిత్రారోహణోత్సవాలు చేయాలని శాస్త్రం.
పవిత్రం అంటే దర్భ. దర్భలతో కట్టిన పొడవైన వలి తొడుగును వైదిక భాషలో పవిత్రం అంటారు. బ్రాహ్మణులు సూచించిన విధంగా ఈ పవిత్రలను కట్టి ఆయా దేవతల విగ్రహాలపై వేలాడదీయాలి. పవిత్రలను దేవునికి వేయడానికి ముందు వాటిని పూజించాలి. దానినే దోర గ్రంథి పూజ అంటారు. ఈ పవిత్రోత్సవాలు కొన్నిచోట్ల ఆశ్వయుజ మాసంలో చేస్తారు.

శ్రావణ శుద్ధ విదియ/తదియ
ఆగస్టు 13, సోమవారం
ఈ తిథి నాడు శ్రియధిపతి అయిన శ్రీమహా విష్ణువుకు పవిత్రారోపణం చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అలాగే ఈ తిథి మనోరథ ద్వితీయా అని తిథితత్వం పేర్కొం టోంది. పగలు వాసుదేవార్చనం, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం చేయాలి. సోమవారం నాడే శ్రావణ శుద్ధ తదియ ఘడియలు కూడా ప్రవేశిస్తున్నాయి. ఈ కాలంలో పార్వతీదేవికి పవిత్రారోపణమ్‍ సమర్పించాలి. అలాగే, ఈనాడు మధు శ్రావణీ వ్రతం ఆచరించాలని కృత్యసార సముచ్చయం అనే వ్రత గ్రంథంలో ఉంది.

శ్రావణ శుద్ధ చవితి
ఆగస్టు 14, మంగళవారం
ఈ తిథి నాడు విఘ్నేశ్వరుడికి పవిత్రారోప ణమ్‍ చేయాలి. అలాగే త్రిపుర భైరవునికి పవిత్రారోపణమ్‍ చేయాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఇది గణేశ్‍ చతుర్థ తిథి. ఈనాడు చూడికుడుత్తనాంచార్‍ తిరు నక్షత్రం.

శ్రావణ శుద్ధ పంచమి,
ఆగస్టు 15, బుధవారం
శ్రావణ మాసంలో వచ్చే పర్వాలలో నాగపంచమి మొదటిది. ఈనాటి నుంచి శ్రావణ మాసపు పర్వాలు.. కొత్తరూపు సంతరించు కుంటాయి. ఇక, శ్రావణ శుద్ధ పంచమి విషయానికి వస్తే.. ఈ తిథి సర్ప పూజకు ఉద్ధిష్టమైనది. భారతీయులకు నాగపూజ తర తరాలుగా ఆచారంగా ఉంది. మట్టితో చేసిన పామును ప్రతి కుటుంబం వారు ఈనాడు కొంటారు. లేదా గోడ మీద పసుపుతో కానీ మంచి గంథంతో కానీ ఐదు లేక ఏడు లేక తొమ్మిది పాముల్ని చిత్రించి పూజిస్తారు.
స్త్రీలు ఈ పూజ ఉదయాన్నే చేస్తారు. పువ్వులు, మంచి గంధం, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేపిన ఉలవలు మొదలైనవి ఈనాటి పూజా ద్రవ్యాలు. దీపారాధనం, కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా నివేదిస్తారు. పూజా స్థలంలో రోజంతా దీపం ఉంచుతారు. పాలు, భక్ష్యాలు కూడా పెట్టి ఉంచుతారు. సాయంకాలం తిరిగి పూవుల పూజ, కర్పూర నీరాజనం, దీపారాధన చేస్తారు. భక్ష్యాలు మళ్లీ నైవేద్యం పెడతారు. రాత్రంతా అక్కడి ఒకటి కానీ ఒకటికి ఎక్కువ కానీ దీపాలు ఉంచుతారు. ఆ రాత్రి అంతా భక్తులు ఆడుకుంటూ మేలుకుని ఉంటారు. ఇందువల్ల ఆ పాలు కూడా నిద్ర పోకుండా మేలుకుని ఉంటాయి అని విశ్వాసం. నాటి ఉదయం నాగపూజ అయిన తరువాత ఇంట్లోని స్త్రీలు, పిల్లలు ఒకచోట చేరతారు. వీరిలో ఒక పెద్దామె ఈ పండుగ పుట్టు పూర్వోత్తరాల గురించి వివరించడం ఆచారం. కథ అయినంత వరకు ఆ పెద్దామె చేతిలో అక్షితలు పెట్టుకుని ఉంటుంది. అనంతరం కథ విన్న వారందరికీ వాటిని పంచుతుంది.
శ్రావణ శుద్ధ పంచమిని ఆంధ్ర దేశంలోకి కృష్ణా, గోదావరి నదీ మండలాల్లో సాగర ప్రాంతీయులు గరుడ పంచమి పర్వంగా వ్యవహరించే ఆచారం కూడా ఉంది. పురాణ గాథలను బట్టి చూస్తే నాగులకు, గరుడిడికి విరోధం ఉన్నట్టు తోస్తుంది. ఈ గాథల్లో గరుడుడే విజేతగా ఉంటుంటాడు. కానీ దీనిని భిన్నంగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరుడుడే తీసికట్టు అయినట్టు గాథలు ఉన్నాయి. మరో కథ ప్రకారం నాగపంచమి తిథి నాడే గరుడుడు అమృతాపహరణం చేశాడు. అందుచేత దీనికి గరుడ పంచమి అనే పేరు వచ్చింది.

శ్రావణ శుద్ధ షష్ఠి
ఆగస్టు 16, గురువారం
ఈ తిథి నాడు కల్కి జయంతి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అలాగే, గుహస్య పవిత్రారోపణమ్‍ అని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. శ్రావణ శుద్ధ షష్ఠి నాడు సూపౌదన వ్రతం ఆచరిస్తారు. సూప + ఓదనం అనగా పప్పు, అన్నం అని అర్థం. ఈనాడు శివపూజ చేసి పప్పు, అన్నం నైవేద్యంగా పెట్టాలి. పప్పు, అన్నమే తినాలి. ఈ వ్రతాచరణం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి.

శ్రావణ శుద్ధ సప్తమి
ఆగస్టు 17, శుక్రవారం
ఈనాడు ద్వాదశీ సప్తమీ వ్రతం ఆచరిస్తారు. అలాగే చతుర్వర్గ చింతామణిలో ఈనాడు పాపనాశినీ సప్తమీ వ్రతం ఆచరించాలని రాశారు. ఇంకా అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణం చేయాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. తరచి చూస్తే- శ్రావణ శుద్ధ సప్తమి తిథి నాడు అవ్యంగ సప్తమీ వ్రతం ఆచరిస్తారు. సూర్యుడిని పూజించి, సూర్య గ్రహం పేరు మీదుగా నాలుగున్నర మూరల నూలు గుడ్డను దానం చేయాలి. ఈనాడు హస్తా నక్షత్రం కూడా కలిసి వస్తే దానిని పాపనాశన సప్తమి అంటారు. ఈనాటి జన దాన హోమాలు అనంత ఫలితాన్ని ఇస్తాయి.

శ్రావణ శుద్ధ అష్టమి
ఆగస్టు 18, శనివారం
అష్టమి తిథి సాధారణంగా దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. దుర్గా వ్రతం ఏడాది పొడవునా ప్రతి నెలలోనూ భిన్న రీతుల్లో నిర్వహిస్తారు. ఈ క్రమంలో వచ్చే శ్రావణ శుద్ధ అష్టమి నాడు పుష్పాష్టమీ వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ వ్రతాన్ని ఈనాడు ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి మాసం రకరకాల పూవులతో శివుడిని, దుర్గామాతను పూజించాలి.

శ్రావణ శుద్ధ నవమి, ఆగస్టు 19, ఆదివారం
మాతృ దేవతల పేరుపై ఈనాడు పవిత్రారోపణమ్‍ చేయాలి. అలాగే కౌమారీ పేరుతో దుర్గాదేవిని పూజించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది.

శ్రావణ శుద్ధ దశమి, ఆగస్టు 20, సోమవారం
శ్రావణ శుద్ధ దశమి సమస్త ఆశలను నెరవేరుస్తుందని అంటారు. అందువల్లే దీనిని ఆశా దశమి అని కూడా అంటారు. ఈనాడు గంధాదులతో శివుడిని పూజించాలి. అలాగే, ఆశా దశమి వ్రతం నిర్వహించాలి. పగలు ఉపవాసం చేయాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజ చేయాలి. ఈ వ్రతం ఏడాది పాటు చేయాలి. అలా చేసిన వారి ఆశలన్నీ ఈడేరుతాయని అంటారు.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి పవిత్రోత్సవాలు ఈనాడే ఆరంభమవుతాయి.

శ్రావణ శుద్ధ ఏకాదశి
ఆగస్టు 21/22 మంగళవారం
శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అని కూడా అంటారు. మహిజిత్తు అనే వాడికి ఎంతకీ సంతానం కలగలేదు. ఆయన శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ వ్రత ఫలితంగా అతనికి పుత్రుడు పుట్టాడు. పుత్రుడిని దయ చేసిన ఏకాదశి కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది. ఈ వివరాలు ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో
ఉన్నాయి.
కాగా, శ్రావణ శుద్ధ ఏకాదశి తిథి ఆగస్టు 21, 22 తేదీలలో రెండు రోజుల్లోనూ ఉంది.
ఏ ఘడియలు శుభమైనవో పురోహితులను సంప్రదించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.

శ్రావణ శుద్ధ ద్వాదశి
ఆగస్టు 23, గురువారం
శ్రావణ శుద్ధ ద్వాదశినే దామోదర ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు విష్ణు ప్రతిమను దానం చేయడం వల్ల అమోఘమైన ఫలితాన్ని పొందవచ్చని వ్రతకారులు చెబుతున్నారు.
అలాగే, ఈనాడు పవిత్రారోపణమ్‍ కూడా చేయాలి.

శ్రావణ శుద్ధ త్రయోదశి,
ఆగస్టు 24, శుక్రవారం
శ్రావణ శుద్ధ త్రయోదశి అనంగుడికి ప్రీతికరమైన రోజు. చైత్ర శుద్ధ త్రయోదశి నాడు అనంగుడికి దమనారోపణం చేయడం ఆచారం. శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు అనంగుడికి పవిత్రారోపణం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు అనంగ వ్రతం ఆచరించాలి. ఈ వ్రత విధానం ఇలా ఉంది..
కుంకుమలు కలిపిన అక్షతలు, ఎర్రరంగు పూవులు సంగ్రహించి రతీ మన్మథులను నెలకొల్పి పూజించాలి. మినుములు వేయించి, విసిరి పంచదార, నేయి కలిపి ఉండలు చేసి వాటితో పాటు పాలను నైవేద్యంగా పెట్టాలి. మైనపు వత్తి వెలిగించి హారతి ఇవ్వాలి. రతీమన్మథుల పూజలో ఈ మినపసున్నిని నివేదన చేయడం బలవర్ధకం, మైథున ప్రీతికరం అని చెప్పడానికి కావచ్చు. ఏమైనా శ్రావణ మాస కాలపు వాతావరణ రీత్యా మినుమును తినడం ఆరోగ్యదాయకమైనదని ఇక్కడ గ్రహించాలి.
ఇక తిథుల పరంగా ఈనాడు తెలుగు నాట ప్రసిద్ధమైన వరలక్ష్మీ వ్రతం. అలాగే, తిరుమలలోని శ్రీవారి పవిత్రోత్సవాలకు ఇది ముగింపు దినం.
శ్రావణ శుద్ధ చతుర్దశి,ఆగస్టు 25, శనివారం
ఈనాడు శివుడికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. విగ్రహాలకు అయితే పిక్కల వరకు పవిత్రం వేలాడదీయాలి. శివుడు లింగరూపి కాబట్టి లింగం పొడవు అంత ఎత్తు కానీ, లేదా 12-8-4 అంగుళములు కానీ పొడవు ఉండి, ముడిముడికీ మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీఅలు 50, 38, 21 కానీ ఉండాలి. ఇదే శివ పవిత్రం అని ‘మన పండు గలు’ అనే గ్రంథంలో ఉంది.

శ్రావణ శుద్ధ పూర్ణిమ, ఆగస్టు 26, ఆదివారం
శ్రావణ శుద్ధ పూర్ణిమ చాలా విశేష పర్వాల కలయిక. ఈనాడు జంధ్యాల పున్నమి, రాఖీ న్నమి, నార్లీ పున్నమి, హయగ్రీవ జయంతి అనే పర్వాలు నిర్వహిస్తారు.
అయితే, పైవేవీ ప్రస్తుతం ఆచారంలో లేకపోగా, సోదరి సోదరుల ప్రేమకు అద్దం పట్టే వేడుక రక్షాబంధన్‍గా ప్రస్తుతం విశేష ఆచరణలో ఉంది. ఈనాడు రంగు రంగుల రాఖీలను
చెల్లెళ్లు, అక్కలు తమ సోదరులకు కట్టి సందడి చేస్తారు. అలాగే, ఈనాడు హయగ్రీవ జయంతి దినం కూడా.
శ్రావణ బహుళ పాడ్యమి, ఆగస్టు 27, సోమవారం
శ్రావణ బహుళ పాడ్యమి తిథి నాడు ధనావాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ తిథి మొదలుకుని భాద్రపద పూర్ణిమ వరకు మాస వ్రతం చేయాలని అంటారు.

శ్రావణ బహుళ విదియ,
ఆగస్టు 28, మంగళవారం
ఈనాడు విష్ణువు వాకుడు చెట్టు పరుపుగా లక్ష్మితో కూడి శయనిస్తాడని ప్రతీతి. కాబట్టి అటువంటి రూపాన్ని పూజించడం శుభకరమని అంటారు. ఈ తిథి నాడు విష్ణువును, లక్ష్మిని శయన రీతిలో ఉండగా పూజించే దంపతులకు ఎప్పుడూ ఎడపాయని సుఖం కలుగుతుందని ఫలశ్రుతి.
అలాగే, ఈనాడు అశూన్య వ్రతం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. ఈ రోజు మొదలు నాలుగు నెలల పాటు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలని గ్రంథాంతరాలలో ఉంది. అందుచేతనే దీనికి చాతుర్మాస్య ద్వితీయ అనే పేరు కూడా ఉంది.
ఇక, శ్రావణ బహుళ విదియ మరో విధంగా కూడా మహనీయమై ఉంది. ఈనాడు పూజ్య రాఘవేంద్రుల వారి పుణ్యతిథి.
తుంగభద్ర తీరంలో మంత్రాలయం అనే చోట ఒకానొక శ్రావణ బహుళ ద్వితీయ నాడు (క్రీ.శ.1671) ఆయన బృందావనంలో ప్రవేశించారు. నాటి నుంచి అది గొప్ప తీర్థా స్థలమై వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి అసలు పేరు వెంకటభట్టు. తంజావూరులోని పండిత కుటుంబాలలో ఈయన కుటుంబమూ ఒకటి. వీరు మధ్వ మతస్తులు. తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులు. ఈనాటి నుంచి మూడు రోజుల పాటు బృందావనంలో తీర్థం నిర్వహిస్తారు. స్వామి తీర్థంతో పాటు గ్రామ దేవత సంబరాలు కూడా జరుగుతాయి.

శ్రావణ బహుళ తదియ
ఆగస్టు 29, బుధవారం
శ్రావణ బహుళ తదియ నాడు తుష్టి ప్రాప్తి తృతీయ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతా మణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈ తిథి కజ్జలీ తృతీయా అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అయితే, ఈ వ్రతాచర ణకు సంబంధించిన వివరాలేవీ అందుబాటులో లేవు.

శ్రావణ బహుళ చవితి
ఆగస్టు 30, గురువారం
ఈనాడు సంకష్ట చతుర్థీ వ్రతం చేస్తారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. గ్రంథాంతరాలలో దీనికి బహులా చతుర్థీ అనే పేరు కూడా ఉంది. ఈ దినాన గోపూజ చేస్తారని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. సంకష్ట హరణ చతుర్థీ వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయని అంటారు. ఇది గణపతి సంబంధ వ్రతం. శ్రావణ బహుళ పక్షంలో చతుర్థి నాడు చంద్రోదయం అయ్యే వరకు
ఉపవాసం ఉండాలి. చంద్రుడు ఉదయించాక గణపతి పూజ సాగించాలి.
ఈశ్వరుడు, రావణుడు, రాముడు, ధర్మరాజు మున్నగు పురుషులూ, పార్వతి, దయమంతి, అహల్య తదితర స్త్రీలు ఈ వ్రతం ఆచరించినట్టు వ్రతకల్పంలో ఉంది.

శ్రావణ బహుళ పంచమి
ఆగస్టు 31, శుక్రవారం
ఈనాడు రక్షా పంచమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈ తిథి నాడు నాగపూజ ఆచరించాలని కూడా కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

శ్రావణమాసపు ఔచిత్యము
మన చేత తెలగపిండి, అనపపప్పు, మునగ ఆకు తినిపించిన ఆషాఢభూతి కాలం అంతమై భూమిని శ్యామల తృణశాలినిగా చేసే శ్రావణ మాసపు ఘడియలు ప్రవేశించే కాలమిది. చైత్రాదిమాస పరిగణనలో శ్రావణం ఐదో మాసం. శ్రావణం అనేక విశేషాలకు ‘నెల’వు.
విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. అటువంటి శ్రవణా నక్షత్రయుక్త పూర్ణిమ కలది కావడం చేత ఈ మాసానికి శ్రావణమనే పేరొచ్చింది.
శ్రావణమాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే భృత్య లాభమని మత్స్య పురాణంలో ఉంది.
శ్రావణ మాసంలో పుట్టిన వారు వేదోక్త కర్మలు చేయించడంలో సమర్థుడు, పుత్రుల తోనూ, కళత్రములతోనూ, ధనముతోనూ కూడిన వాడు, అందరి చేత గౌరవించబడే వాడు అవు తాడని ‘యవన జాతకం’ అనే గ్రంథంలో ఉంది.
శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మాసమిది. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. ఆధునిక యుగంలో ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే జన్మించారు. ఆళ వందారు, బదరీ నారాయణ పెరుమాళ్‍, చూడి కుడుత్త నాంచార్‍ తదితరుల తిరు (జన్మ) నక్షత్రాలు ఈ మాసంలోనే.
గరుడుడు అమృతభాండాన్ని సాధించింది ఈ మాసంలోని శుద్ధ పంచమి నాడే.

శ్రావణ శనివారాలు.. ్ర శావణ మంగళవారాలు
వారానికి ఉన్న ఏడు రోజుల్లో మాఘ మాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో లక్ష్మి (గురు)వారాలు మహత్తు కలవిగా పరిగణనీయములై ఉన్నాయి. ఆది, సోమ, గురువారాలు పోతే మిగిలిన నాలుగు వారాల్లో మూడు వారాలు ఒక్క శ్రావణ మాసంలోనే మహత్తు కలవిగా ఎంచబడుతున్నాయి.
శ్రావణ మాసంలో శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ఎక్కువ నియమనిష్టలను కోరేవిగా ఉన్నాయి.
శ్రావణ మాసంలోని శనివారాల్లో పెద్ద తిరుమలలో పూజా విశేషాలు అధికంగా జరుపుతారు.
శ్రావణ మంగళవారాల విషయానికి వస్తే.. కొత్తగా వివాహమైన మహిళలు శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం మన తెలుగు నాట విశేష ఆచారమై ఉంది. మంగళగౌరీ వ్రతాచరణ వల్ల జన్మజన్మలకూ అమంగళం కలగకుండా ఉంటుందని చెబుతారు
(శ్రావణ మంగళగౌరీ వ్రతం తేదీలు: ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబరు 4.

శ్రావణ మంగళగౌరీ వ్రతం
కేశవుడికి అత్యంత ప్రీతికరమైన ఈ నెల అమ్మ వారికీ ప్రీతికరమే. అందుకే ఈ నెల మహిళలకు అత్యంత ప్రాముఖ్యమైనది. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు తమ అయిదోతనం కలకాలం నిలవాలంటూ మంగళవారాలు (ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబరు 4) మంగళగౌరీ వ్రతం, శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం (ఆగస్టు 24) వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతం గురించి సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టు పురాణ కథనం. శ్రావణ మంగళవారం నోములు తొలిసారి నోచుకునే ఆడపిల్లలకు పక్కన తల్లి లేదా అత్తగారు ఉండాలంటారు. అలా ఐదేళ్ల పాటు మంగళవారం నోములు నోస్తే మంచిదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే, సర్వమంగళగౌరీ వ్రతం గురించి పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో
ఉంది.
సర్వశుభాలూ ప్రసాదించే తల్లి కాబట్టి పార్వతీదేవి సర్వమంగళ అయ్యింది. గులాబీ వర్ణంలో మెరిసిపోతుంది కాబట్టి.. గౌరీదేవిగా పూజలు అందుకుంటుంది. దీనికి సంబంధించి పురాణాలలో ఉన్న గాథ ఇది.
దంపతుల మధ్య సరసాలూ విరసాలూ సహజమే కదా! ఆది దంపతులకూ ఈ విషయంలో మినహాయింపు లేదు. పార్వతీదేవిది అచ్చంగా అన్నగారి పోలికే. అంటే, విష్ణుమూర్తి ఛాయే. దీంతో ఒకసారి పరమేశ్వరుడు ఆమెను కొంటెగా, ‘కాళీ’ (నల్లని దానా) అని పిలిచాడట. దీంతో అమ్మవారికి కోపం వచ్చేసింది. ఘోర తపస్సు చేసి గౌర వర్ణాన్ని సంపాదించుకుంది. ఆ గౌరమ్మ ఆశీస్సుల కోసమే శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. మంగళవారం అమ్మవారిదైనపుడు సోమవారం సోమఖేశరుడిది కాకుండా పోతుందా? అందుకే శ్రావణ సోమవారాల్లో (ఆగస్టు 13, 20, 27 మరియు సెప్టెంబరు 3) లింగారాధన చేస్తే శివుడు మురిసిపోతాడట. అందుకే ఇవి శ్రావణ సోమవారం వ్రతాలుగా వినుతికెక్కాయి.

శ్రావణ శుక్రవార వ్రతం
శ్రావణ మాసంలో శుక్రవారాలు అత్యంత మహత్తు కలవి. శ్రావణ శుక్రవార వ్రతం విశేషమైనది. ఇది పుణ్య స్త్రీలకు ప్రత్యేకించిన వ్రతం. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందని తెలుగు నాట విశ్వాసం. శ్రావణ శుక్రవారాల్లో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు 24) మరీ విశేషమైనది. ఈ రోజు ధనకనక వస్తు వాహనాది వృద్ధికి మూలమైనది. ఇదే వరలక్ష్మీ వ్రతంగా ప్రసిద్ధి చెందింది. మహా లక్ష్మి ఉపదేశాన్ని పొంది చారుమతీ దేవి ప్రచారానికి తెచ్చిన వ్రతమిది. శ్రావణ వరలక్ష్మి పూజను కొత్త నగతో చేయాలని వ్రత నియమం. కొత్తగా వివాహమైన మహిళలకు శ్రావణ తగవు అని ఆభరణాలు అత్తవారు తెస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని శ్రావణ పట్టీ అంటారు. వరలక్ష్మీ వ్రతం నాడు తెలుగింటి లోగిళ్లు లక్ష్మీ నివాసాలుగా మారిపోతా యనడంలో అతిశయోక్తి లేదు.

Review శుభాలకు ‘నెల’వు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top