ఫాల్గుణ ఫలం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో మూడో మాసం- మార్చి. తెలుగు పంచాంగం ప్రకారం మార్చి.. ఫాల్గుణ మాసం. అలాగే కొన్ని మాఘ మాస తిథులు కూడా కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో ఫాల్గుణం పన్నెండవ మాసం.
మార్చి 13వ తేదీ వరకు మాఘ మాస తిథులు, ఆపై మార్చి 14వ తేదీ నుంచి ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతాయి.

యశోద జయంతి, కాలాష్టమి, సీతాష్టమి, మహా శివరాత్రి, వసంత పూర్ణిమ, హోలీ పండుగ వంటివి ఈ మాసంలోనే పలకరిస్తాయి. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఈ మాసంలోనే నిర్వహిస్తారు.

మాఘ, ఫాల్గుణ మాసాలు శిశిర రుతువు కాలం. ఫాల్గుణ మాసంతో శిశిర రుతువు ముగిసి వసంత రుతువు ఆరంభమవుతుంది. మాఘ మాసం మహా జ్ఞాన మాసమైతే.. ఫాల్గుణం మనసంతా ఆనందాన్ని నింపే ఆహ్లాదాన్ని మోసుకొచ్చే మాసం. ఇక, మాఘ మాసంలో వచ్చే మహా శివరాత్రి మహా విశిష్టమైనదనే విషయం తెలిసిందే. మార్చి 11న నిర్వహించే ఈ మహా పర్వం నాడు దేశమంతా హరహర మహాదేవ శంభో అనే భగవన్నినాదం మారుమోగుతోంది. శిశిర రుతువు చెట్లన్నీ ఆకులు రాల్చే కాలం. ఫాల్గుణం చివరికి.. చైత్రం ఆరంభానికి వచ్చే సరికి మోడు వారిన వృక్షాలన్నీ పచ్చని చిగుర్లు తొడుక్కుని వసంతానికి స్వాగతం పలుకుతాయి. ఫాల్గుణ మాసంలో ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. అందుకే కాబోలు ఉసిరికాయతో ముడిపడి ఉండే ఒక ఏకాదశి తిథి ఫాల్గుణ మాసంలో వస్తుంది. అలాగే, నువ్వులు, మామిడిపూత (చూత కుసుమం) వంటివి ఈ నెలలో విరివిగా వినియోగిస్తారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పున్నమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణమనే పేరు వచ్చింది. దశావతారాలలో ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశిని ఈ మాసంలోనే నిర్వహిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరిది. మత్స్య పురాణంలో పేర్కొన్న పక్రారం.. ఈ మాసం గృహ నిర్మాణానికి అత్యంత అనువైనది. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తే కనక, పుత్ర లాభం కలుగుతుందని అంటారు. మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే ముఖ్యమైన పర్వాలు, పండుగలు, ముఖ్య తిథుల గురించి తెలుసుకుందాం.

జన్మకో శివరాత్రి..
మాఘ కృష్ణ (బహుళ) చతుర్దశి తిథి మహా శివరాత్రి (మార్చి 11) పర్వతిథి. శైవమతంలో అతి విశేషమైన, సర్వోత్క•ష్టమైన పండుగ శివరాత్రి. ఈనాడు భక్తులు ఉదయానే లేచి, స్నానాదులు చేసి, శివపూజ చేసి, ఉపవసించి, రాత్రంతా మేల్కొని ఉండి మర్నాటి ఉదయం పారణ చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథన పఠనాలతో గడుపుతారు. పూర్వం శ్రీశైల క్షేత్రంలో ఈ ఉత్సవం ఎంత గొప్పగా జరిగేదో పాల్కురికి సోమనాథుడు తన పండితారాథ్య చరిత్రలో గ్రంథస్తం చేశాడు. శివరాత్రి నాడు పూజలు, జాగరణాదులు చేసే వారు సర్వపాప విముక్తులై అంత్యమున శివ సాయుజ్యం పొందుతారని, శివరాత్రి వ్రతాన్ని ఆచరించని వారు జన్మ సహస్రములలో కొట్టుమిట్టాడుతారని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి.

ఉసిరికాయ తిథి..
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఉసిరికాయతో ముడిపడిన తిథి. మన వంటకాల్లో ఏదో విధంగా ఉసిరి వాడాలనేది ఈ పర్వం ఉద్దేశం. అందుకే ఈ ఏకాదశికి అమలక ఏకాదశి (మార్చి 25) అన్నారు. ఉసిరి కాయ ఔషధ ఫలం. దీని అసలు పేరు ఆమలకం లేదా ఆమలికం.

బహుశా ఉసురు (ప్రాణం) నిలిపేది కాబట్టి తెలుగులో ఇది ఉసురుకాయ.. కాల క్రమంలో ఉసిరి కాయ అనే పేరు స్థిరపడి ఉంటుంది. అరవం, కన్నడం, మలయాళంలో దీనిని నెల్లికాయ అని పిలుస్తారు. సంస్క•తంలో ఉసిరికాయకు ఐదారు పేర్లు వరకు ఉన్నాయి. ఆమలకం (గుణమును ధరించునది), ధాత్రి (దాది వంటిది), వయస్థ (వయస్సున నిలుపునది), ఫలరవ (సారవంతమైనది), అమృత (అమృతము వంటిది), శీతఫలి ( శీతవీర్యము కలది) అనే అర్థాలు కలిగిన పేర్లు ఉసిరికాయకు ఉన్నాయి.

మాఘ బహుళ విదియ/తదియ
మార్చి 1, సోమవార
మార్చి మాసంలో వచ్చే తొలి తిథి మాఘ బహుళ (కృష్ణ) విదియ. ఈ తిథి నుంచే ఆంగ్లమానంతో కూడిన మార్చి మాసం ప్రారంభమవుతుంది.
మాఘ బహుళ చతుర్థి/సంకష్ట హర చతుర్థి
మార్చి 2, మంగళవారం
మాఘ కృష్ణ చతుర్థి తిథి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఇది గణపతి సంబంధమైనది. ప్రతి నెలలో వచ్చే ఈ తిథి నాడు గణపతి విశేష ఆరాధనలు అందుకుంటాడు.

మాఘ బహుళ షష్ఠి/ యశోద జయంతి
మార్చి 4, గురువారం
మాఘ బహుళ షష్ఠి తిథి కుమారస్వామి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈ తిథి నాడు సు్ర•హ్మణ్యేశ్వరుడికి తమిళనాట విశేష పూజలు జరుగుతాయి. ఇక, ఈ తిథి.. యశోద జయంతి తిథిగానూ ప్రసిద్ధి. యశోద శ్రీకృష్ణుడి తల్లి.

మాఘ బహుళ సన్తమి/ కాలాష్టమి
మార్చి 5, శుక్రవారం
మాఘ బహుళ సప్తమి నాడు కాలాష్టమిగా తెలుగు క్యాలెండర్‍లో పేర్కొన్నారు. దీనిని బట్టి ఈనాడు కాలభైరవుడిని పూజించాలని తెలుస్తోంది. ఇక, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో మాత్రం ఈనాడు- విక్షుభార్క సప్తమి, సర్వాప్తి సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని రాశారు.

మాఘ బహుళ అష్టమి/సీతాష్టమి
మార్చి 6, శనివారం
మాఘ బహుళ తిథి సీతా అష్టమి. ఈనాడే కాలాష్టమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణి అనే మరో వ్రత గ్రంథంలో మాత్రం.. ఈనాడు మంగలా వ్రతం ఆచరించాలని ఉంది. ఇక, సీతాష్టమి అని పేర్కొనడం వల్ల ఇది సీతాదేవికి సంబంధించిన పర్వమై అయి ఉండొచ్చునని, ఇది దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరభారత దేశంలో ఈనాడు సీతాదేవికి విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

మాఘ బహుళ దశమి
మార్చి 8, సోమవారం
మాఘ బహుళ దశమి, మార్చి 8 ఆధ్యాత్మికంగా చెప్పుకోదగిన విశేషం ఏదీ లేకున్నా.. ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. మహిళలు ఆర్ధికంగా, ఇతరత్రా అన్నింటా స్వావలంబన, సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుతారు.

మాఘ బహుళ ఏకాదశి/ విజయైకాదశి
మార్చి 9, మంగళవారం
మాఘ బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అనీ, విజయైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి నాడే శ్రీరాముడు రావణుడి లంకపై దండెత్తడానికి అనువుగా చేపట్టిన సేతువు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని అంటారు. అందుకే ఈ తిథి నాడు వివిధ పనుల విజయవంతానికి శ్రీకారం చుట్టే ఆచారం తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలలో ఆచరణలో ఉంది. అలాగే, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి తిథిని విజయైకాదశిగా పేర్కొన్నారు.

మాఘ బహుళ ద్వాదశి/ప్రదోష వ్రతం
మార్చి 10, బుధవారం
మాఘ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాసిన ప్రకారం.. మాఘ బహుళ ద్వాదశి నాడు తిల ద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచరించాలి. ఇదిలా ఉండగా, మూల, ఆషాఢ నక్షత్రాలతో కూడిన మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణం చెబుతోంది. అందులో వివరించిన ప్రకారం.. మాఘ బహుళ ద్వాదశి తిథికి ముందురోజు (మాఘ బహుళ ఏకాదశి)న ఉపవాసం ఉండి ద్వాదశి నాడు నువ్వులు దానం చేయాలి. మాఘ మాసంలో ఎక్కువగా నువ్వులతో ముడిపడిన పర్వాలు ఉంటాయి. ఈ తిథి కూడా అందులో భాగమై ఉండొచ్చు.

మాఘ బహుళ త్రయోదశి/ మహా శివరాత్రి
మార్చి 11, గురువారం
మాఘ బహుళ త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథి మహా శివరాత్రి పర్వంగా ఉంది. ప్రతిరోజూ రాత్రి శివుడిని పదకొండు సార్లు తలుచుకుని నిద్రపోవాలని, అలా శివుడిని తలుస్తూ రాత్రులు నిద్రపోవడం వల్లన ప్రతి రాత్రి శివరాత్రి అవుతుందని అంటారు. అలా కనీసం ఏడాదికి ఒక్కసారైనా రోజంతా శివుడిని తలచుకుని ఆధ్యాత్మికతను ఆస్వాదించే పర్వమే- శివరాత్రి. ఇంకా మాఘ బహుళ త్రయోదశి.. ద్వాపర యుగాది తిథి. ఈ యుగ సంధిలోనే వేదవ్యాసుడు అవతరించి వేదాన్ని విభజించాడని, ధర్మశాస్త్ర పురాణేతిహాసాలను రచించాడని ప్రతీతి. ఈనాడు విరివిగా దానాలు చేయాలని అంటారు. ద్వాపర యుగ ప్రమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల (8,64,000) మానవ సంవత్సరాలు. ఇందులో రెండు పాళ్లు ధర్మం నడుస్తుందని అంటారు. భగవంతుడు ఈ యుగంలో పీతవర్ణధారిగా ఉంటాడు. ఈ యుగాన్ని తామ్ర యుగమనీ అంటారు. ప్రజల్లో వైరుధ్య బుద్ధులు, సందేహాలు ఎక్కువవుతాయనీ, ప్రతి విషయంలో ప్రజలు సంశయ పీడితులుగా ఉండటం వల్ల ఈ యుగానికి ద్వాపర యుగం అనే పేరు వచ్చిందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఈ యుగంలోని మనుషులు శరీరంలో రక్తం ఉన్నంత కాలం ప్రాణాలు ధరించి ఉంటారు. ఇక, మాఘ కృష్ణ త్రయోదశి తిథి నాడు విరివిగా దానాలు చేస్తారు.

మాఘ బహుళ చతుర్దశి/ రటంతీ చతుర్దశీ వ్రతం
మార్చి 12, శుక్రవారం
మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు రటంతీ చతుర్దశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈ తిథి నాడు అరుణోదయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది. ఇంకా ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోద యానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడిని బిల్వార్చనం, తుమ్మి పూలతో పూజించాలి.

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
మార్చి 14, ఆదివారం
ఫాల్గుణ శుద్ధ పాడ్యమితో ఫాల్గుణ మాస తిథులు ప్రారంభమవుతున్నాయి. ఈనాడు చంద్ర దర్శనం. మీన సంక్రమణ దినం కూడా. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు భద్ర చతుష్టయ, గుణావాప్తి, పయో తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.

ఫాల్గుణ శుద్ధ విదియ
మార్చి 15, సోమవారం
ఫాల్గుణ శుద్ధ విదియ తిథి గురుదేవులు రామకృష్ణ పరమహంస జయంతి తిథి. ఈనాడు పశ్చిమబెంగాల్‍తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల రామకృష్ణ మఠాలలో, కాళీ మందిరాలలో విశేష ఆరాధనలు జరుగుతాయి.

ఫాల్గుణ శుద్ధ తదియ
మార్చి 16, మంగళవారం
ఫాల్గుణ శుద్ధ తదియ నాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం వంటివి చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. అలాగే, ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతి దినం. రాష్ట్రావరణ కోసం ప్రాణ త్యాగం చేసినందునే ఆయనను ‘అమరజీవి’గా స్మరించుకుంటారు.

ఫాల్గుణ శుద్ధ చతుర్థి
మార్చి 17, బుధవారం
ఫాల్గుణ శుద్ధ చతుర్థి నాడు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు వినాయకుడిని డుంఢి గణపతిగా పూజించాలి. రాజవ్రతం చేయాలి. ఈ పూజా ఫలం వలన పోయిన అధికారం తిరిగి సిద్ధిస్తుందని అంటారు. ఇది మంగళకరమైన తిథి. ఈరోజు నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం వంటివి కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, తెలుగు క్యాలెండర్లలో ఈనాటి తిథి నాడు చతుర్థి వ్రతం ఆచరించాలని ఉంది.

ఫాల్గుణ శుద్ధ పంచమి
మార్చి 18, గురువారం
ఫాల్గుణ శుద్ధ పంచమి తిథి నాడు అనంత పంచమీ వ్రతం ఆచరిస్తారు. ఈ మేరకు చతుర్వర్గ చింతామణిలో వివరాలు ఉన్నాయి.

ఫాల్గుణ శుద్ధ షష్ఠి
మార్చి 19, శుక్రవారం
ఈనాడు స్కంద షష్ఠి వ్రతం ఆచరిస్తారు. ఇంకా వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం.. ఇంకా ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడు అర్క సంపుట సప్తమీ, కామదా సప్తమీ, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమీ తదితర వ్రతాలను ఆచరించాలని తెలుస్తోంది.

ఫాల్గుణ శుద్ధ అష్టమి
మార్చి 22, సోమవారం
ఇది మాసిక దుర్గాష్టమి తిథి. మాసానికి రెండుసార్లు (శుద్ధ/బహుళ) వచ్చే అష్టమి నాడు సాధారణంగా దేవీ ఆరాధనకు ప్రతీతి. ఇంకా ఫాల్గుణ శుద్ధ అష్టమి తిథి నాడు లలిత కాంతీదేవి వ్రతం చేస్తారని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు దుర్గాష్టమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో పేర్కొన్నారు.

ఫాల్గుణ శుద్ధ నవమి
మార్చి 23, మంగళవారం
సాధారణంగా నవమి తిథి కూడా దుర్గాదేవి పూజకు, ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఫాల్గుణ శుద్ధ నవమి నాడు ఆనంద నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు దుర్గాపూజ చేయాలని పలు వ్రత గ్రంథాలలో ఉంది.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి/అమలైకాదశి
మార్చి 25, గురువారం
ఇది ఉసిరికాయతో ముడిపడిన పర్వం. అందుకే ఈ తిథికి అమలక ఏకాదశి అనే పేరు వచ్చింది. అమలికం అంటే ఉసిరికాయ అని అర్థం. ఇక, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు చిత్రరథుడు పరశురాముడిని పూజించాడని పురాణగాథ. అలాగే, ఆంధప్రదేశ్‍లోని ఉభయ గోదావరి జిల్లాల వారు ఈ ఏకాదశిని కోరుకొండ ఏకాదశి అనీ అంటారు. కోరుకొండలో నరసింహ స్వామి కోవెలలో ఈ తిథి నాడు గొప్ప తిరునాళ్లు జరుగుతాయి. కాకతీయుల అనంతరం ప్రసిద్ధికెక్కిన కాపయ నాయకుని కాలం నుంచి ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. ఈనాడు వేలకొద్దీ జనం అక్కడికి వస్తారు. గోదావరి తీరంలో ఈ తీర్థకాలాన్ని పురస్కరించుకుని ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డులంత’ అనే సామెత ఒకటి ఉంది. ఈ సామెత మామిడి కాయలకు సంబంధించి వాడతారు. మకర సంక్రాంతికి మంచి పూత మీద ఉన్న మామిడికాయలు ఈ ఏకాదశి నాటికి కోడిగుడ్డంత పరిమాణానికి ఎదుగుతాయి. దీనిని పోల్చడానికే ‘కోరుకొండ ఏకాదశికి కోడిగుడ్డంత’ అనే సామెతను గోదావరి తీర ప్రాంతవాసులు తమ సంభాషణల్లో ప్రయోగిస్తుంటారు.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి/త్రయోదశి
మార్చి 26, శుక్రవారం
ఈ తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని చెబుతారు. నృసింహ ద్వాదశిగానూ వ్యవహరిస్తారు. కాగా, పుష్యమితో కూడిన ద్వాదశి గోవింద ద్వాదశి అనీ, ఆనాడు గంగా స్నానం మహా పాతక నాశనంగా ఉంటుందని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు మనోరథద్వాదశీ, సుకృత ద్వాదశీ, సుగతి ద్వాదశీ, విజయా ద్వాదశీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకీ వ్రతం చేస్తారని పేర్కొన్నారు. ఇది కూడా ఉసిరికాయ సంబంధమైన పర్వమే కావడం విశేషం. ఇంకా, ఈ తిథి నాడు పుండరీకాక్ష పూజలు కూడా చేసే ఆచారం ఉంది.

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
మార్చి 27, శనివారం
ఫాల్గుణ శుద్ధ చతుర్థశి తితి నాడు లలితా కాంత్యాఖ్యదేవీ వ్రతం ఆచరించాలని తిథి తత్త్వంలో ఉంది. అలాగే, ఈనాడు మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతోంది.

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి
మార్చి 28, ఆదివారం
ఇది వసంత పూర్ణిమ తిథి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని మహా ఫాల్గుణీ అనీ వ్యవహరిస్తారు. దీనినే హోలికా పూర్ణిమా అనీ అంటారు. కొన్ని వ్రత గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమగా వర్ణించాయి. ఈ పూర్ణిమ నాడు దక్షిణాది ప్రాంతాలలో కామ దహనం చేయడం ఆచారం. అందుకే ఈ పూర్ణిమను కాముని పున్నమి అంటారు. కాముడు ఈ రోజున దహనమయ్యాడని పురాణగాథ. అందుకే పంచాంగకర్తలు ఈ తిథిని కామదహన దినమని రాస్తారు. దక్షిణ భారతంలో కామదేవుని దహన దినంగానే కానీ, ఇది ఉత్తరాదిలో మాదిరిగా హోలికా దహన దినంగా అంత ప్రఖ్యాతం కాదు.
హోలిక అనే రాక్షసిని దగ్ధం చేసిన దానికి గుర్తుగా కామదహనం పేరిట మంటలు వేసే ఆచారం ఏర్పడిందని అంటారు. హోలిక అనే రాక్షసి పేరును బట్టే దీనిని హోలీ పర్వదినం అనే పేరు స్థిరపడింది. ఉత్తరాదిలో ఈ పర్వాన్ని చోటీ హోలీగా వ్యవహరిస్తారు. అలాగే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే లక్ష్మీ జననమని అంటారు. అందుకే ఈ తిథిని లక్ష్మీ జయంతి తిథిగానూ వ్యవహరిస్తారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలితాలు కలుగుతాయని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరించారు. మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే వివాహం చేసుకుందని అంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది.

ఫాల్గుణ బహుళ పాడ్యమి/హోలీ
మార్చి 29, సోమవారం
హోలీ ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకుని సంతోషాన్ని వ్యక్తం చేసే పర్వం. ఇది వసంత రుతువుకు సంబంధించిన పర్వం. మాఘ మాసపు కృష్ణ పంచమికి జరిపే వసంత పంచమి దినాలకే వసంత రుతువు లక్షణాలు పొడచూపుతాయి. ఫాల్గుణ పూర్ణిమ నాటికి అవి మరింత ప్రస్ఫుటమవుతాయి. ఫల, పుష్ప జాతుల మొక్కలన్నీ కొత్త చిగుళ్లు తొడిగి రంగురంగుల పూలను విరబూస్తాయి. ఈ సమయానికి రాగి రంగుతో కనిపించే చిగుళ్లు ఆకు పచ్చరంగుతో పత్రాలు పలు రకాల రంగులతో పువ్వులు వికసిస్తాయి. తొలకరి పంటలన్నీ ఈ కాలానికి ఇళ్లకు చేరి ఉంటాయి. ఈ వర్ణ సంబరానికి స్వాగతం పలుకుతూ ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పర్వంగా హోలీ ప్రసిద్ధమై ఉంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మర్నాడు వచ్చే పాడ్యమి తిథి నాడే హోలీ పర్వదినం. ఈనాడు కొన్ని ప్రాంతాల వారికి కొత్త సంవత్సర ఆరంభ దినం కూడా. హోలీ వసంతాగమన సూచిక పర్వం. వసంతాన్ని ఆహ్వానిస్తూ పిల్లా, పెద్దా అందరూ ఆనందోత్సాహాలతో రంగునీళ్లు, పూలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా ఒకరినొకరు రంగునీళ్లతో తడుపుకోవడం అనే పక్రియ దాదాపు రోజంతా సాగుతుంది. ఎర్ర రంగు నీళ్లను వసంతాన్ని చల్లుకోవడాన్ని కొన్ని ప్రాంతాల్లో రంగ్‍లీల అంటారు. పూర్ణిమ నాడు మంటలు వేసే తతంగం పూర్తి కాగానే, ఈ రంగ్‍లీల ఆరంభమవుతుంది. హోలీ పర్వం అతి ప్రాచీనమైనదే కాక.. ఆధునికమైనది కూడా. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరే వేళ ఇది. ఈ కాలంలో పునాస పంటలన్నీ పచ్చని ముఖాల పసిమితో ఉంటాయి. ఈ రంగుల వాతావరణమే హోలీలో వాడే రంగులకు ప్రతీక అని అంటారు. ఇంకా ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి నాడు ధూలి వందనం అనే పండుగ చేస్తారని కొందరు చెబుతారు.

ఫాల్గుణ బహుళ విదియ
మార్చి 30, మంగళవారం
ఫాల్గుణ బహుళ విదియ తిథి కూడా కామ మహోత్సవంగానే వాడుకలో ఉంది. అయితే, ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక్కడ ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీ సంబంధ పర్వంగానే భావించాలి. హోలీ మర్నాడే వచ్చే తిథి కాబట్టి, ఇది దానికి అనుబంధంగా వచ్చే తిథిపర్వమని భావించవచ్చు.

ఫాల్గుణ బహుళ తదియ
మార్చి 31, బుధవారం
ఈ తిథి కల్పాది దినం. ఈనాడు ఛత్రపతి శివాజీ జయంతి దినం.

Review ఫాల్గుణ ఫలం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top