శుభప్రదం

సెప్టెంబరు 1, శనివారం, శ్రావణ బహుళ షష్టి నుంచి-సెప్టెంబరు 30, ఆదివారం భాద్రపద బహుళ పంచమి వరకు విలంబి నామ సంవత్సరం-శ్రావణం- భాద్రపదం-గ్రీష్మ రుతువు-దక్షిణాయన

ఆంగ్లమానం ప్రకారం తొమ్మిదవది ఆగస్టు మాసం. ఇది తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ – భాద్రపద మాసాల కలయిక. శ్రావణ మాసంలోని కొన్ని రోజులు, భాద్రపద మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. శ్రావణంలో వచ్చే పర్వాలలో బలరామ జయంతి, శ్రీకృష్ణాష్టమి ముఖ్యమైనవి. సెప్టెంబరు 9వ తేదీతో శ్రావణ మాసపు తిథులు ముగుస్తాయి. 10వ తేదీ నుంచి భాద్రపద మాస తిథులు ప్రారంభమవుతాయి. వినాయక చవితి, రుషి పంచమి, మహాలక్ష్మి వ్రతారంభం, క్షీరవ్రతారంభం, అనంత పద్మనాభస్వామి వ్రతం, గణేశ్‍ నిమజ్జనం, ఉండ్రాళ్ల తద్ది వంటి ఎన్నో పండుగలు, పర్వాలు భాద్రపద మాసపు ప్రత్యేక పండుగలు, పర్వాలు. సెప్టెంబరు 1, శ్రావణ బహుళ (కృష్ణ) షష్టి, శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం సెప్టెంబరు 30, భాద్రపద బహుళ పంచమి, ఆదివారంతో ముగుస్తుంది.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే సెప్టెంబరు నెల.. తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ, భాద్రపదాల కలయిక. అటు శ్రావణ శోభ.. ఇటు వినాయక చవితి, ఇతర ము్య• వ్రతాల సందడి.. ఆబాల గోపాలానికి ఇష్టమైన కృష్ణాష్టమి, వినాయక నవరాత్రోత్సవాలతో ఎటుచూసినా ఉత్సవ వాతావరణమే కనిపిస్తుంది. ఆంగ్లమానం ప్రకారం వచ్చే సెప్టెంబరు నెలలో 1వ తేదీ, శ్రావణ బహుళ షష్ఠి, శనివారం నుంచి సెప్టెంబరు 9, శ్రావణ బహుళ అమావాస్య వరకు శ్రావణ మాసపు తిథులు. సెప్టెంబరు 10, భాద్రపద శుద్ధ పాడ్యమి, సోమవారం నుంచి సెప్టెంబరు 30వ తేదీ భాద్రపద బహుళ పంచమి, ఆదివారం వరకు భాద్రపద మాసపు మాస తిథులు కొనసాగుతాయి. శ్రావణ మాసను ప్రాశస్త్యం గురించి గత సంచికలో తెలుసుకున్నాం. ఇక, భాద్రపద మాసం విశేషాల్లోకి వెళ్తే.. ఈ మాసంలో గృహ నిర్మాణం ఆరంభించ రాదని మత్స్య పురాణం చెబుతోంది. ఆషాఢం తరువాత మళ్లీ భాద్రపద మాసంలోనే ఆడపిల్లలు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయేది. ఉండ్రాళ్ల తద్ది నాడు ఉయ్యాలలూగడం యువతులకు ఎంతో మురిపెం. భాద్రపదంలో వచ్చే పర్వాల్లో ఆయా దేవతలకు నివేదించే ప్రధాన నైవేద్యం ఉండ్రాళ్లు. వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు. సెప్టెంబరు నెలలో ఉండే వాతావరణం రీత్యా ఉండ్రాళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వినాయకుడికీ ఇవంటే ఎంతో ప్రీతి. ఇక, ఈ నెలలో వచ్చే పర్వాలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం.

శ్రావణ బహుళ షష్ఠి, సెప్టెంబరు 1, శనివారం
శ్రావణ బహుళ షష్ఠి నాడు హల షష్ఠి పర్వాన్ని నిర్వహించాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. ‘హల’మనే పేరును బట్టి ఇది వ్యవసాయదారుల పర్వంగా తెలియవస్తోంది. ఇందుకు తగినట్టు ఇదే తిథి నాడు బలరామ జయంతిని జరుపుకొంటారు. బలరాముడు కర్షకుల దైవంగా పేరుంది. బలరాముడు ఎప్పుడూ హలం (నాగలి) చేతబట్టి ఉంటాడు. రైతులు తమ వ్యవసాయానికి ఆధారమైన నాగలిని భక్తిప్రపత్తులతో ఈనాడు కొన్నిచోట్ల పూజించే ఆచారం ఉంది.

శ్రావణ బహుళ సప్తమి, సెప్టెంబరు 2, ఆదివారం
శ్రావణ బహుళ సప్తమి తిథి శీతాల సప్తమి అని వివిధ వ్రత గ్రంథా లలో ఉంది. అయితే, ఈ వ్రతాచరణ విధానం ఏమిటో వివరంగా లేదు.

శ్రావణ బహుళ అష్టమి, సెప్టెంబరు 3, సోమవారం
శ్రావణ బహుళ అష్టమి విషయంలో కొంత వివాదం ఉంది. తిథి ప్రకారం ఇది 2, 3 తేదీలలో వస్తుంది. ఇస్కాన్‍ వారి ప్రకారం ఇది 3వ తేదీన నిర్వహించుకోవాలి. పంచాంగ తిథి ప్రకారం 2వ తేదీనే అష్టమి తిథి ప్రవేశిస్తుంది (2వ తేదీ 20.47 గంటల నుంచి 3వ తేదీ 19.19 గంటల వరకు ఈ తిథి కాలం).
ఇక, కృష్ణాష్టమి విశేషాల్లోకి వెళ్తే..
కృష్ణాష్టమిని మహారాష్ట్రలో బుద్ధాష్టమిగా వ్యవహరిస్తారు. ఈనాడు మంగళగౌరీదేవి వ్రతం జరుపుతారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. దీనినే కాలాష్టమిగానూ వ్యవహరిస్తారు. కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినోత్సవ సందర్భ మైన పర్వం. అందుకే దీనిని కృష్ణ జన్మాష్టమి అనీ అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. ఇంకా కృష్ణ జయంతి, శ్రీ జయంతిగానూ వాడుకలో ఉంది.
కృష్ణుడు ద్వాపర కలియుగ పంధికాలంలో శుక్ల సంవత్సరం, శ్రావణ మాసం బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు రెండు జాముల రాత్రి వేళ కారాగారంలో మేనమామ గండాన పుట్టాడు.
కృష్ణాష్టమి నాడు తిలామలక పిష్టం ఒంటికి పట్టించుకుని స్నానం చేయాలి. తులసీ దళాలు వేసిన నీటితో ఆచమనం చెయ్యాలి. ఆనాడు ఉప వాసం ఉండాలి. సాయంత్రం ఇంటి మధ్యలో గోమయంతో అలికి రంగవల్లి తీర్చిదిద్దాలి. దాని మీద బియ్యం పోసి మంటపం ఏర్పరిచి కలశం ఉంచాలి. ఈ కొత్త కుండను అక్షింతలతోతో అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణుడిది ప్రతిమను ప్రతిష్ఠించాలి. తొలుత దేవకీదేవిని ప్రార్థించి, ఆపై కృష్ణ ప్రార్థన చేయాలి. అర్ధరాత్రి వరకు పూజ నిర్వహించాలి. పాలు, పెరుగు, వెన్న నైవేద్యంగా ఉంచాలి. చంద్రోదయ సమయాన బయటకు వెళ్లి అక్కడ అలంకృతమైన భూమిలో ఫలపుష్స చందన ఆయుతమైన శంఖం చేత ఉదకం గ్రహించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత శంఖంతో నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ రాత్రి భగవత్కథలు వింటూ జాగరణం చేసి మర్నాడు భోజనం చేయాలి. ఇది కృష్ణాష్టమి నాటి విధాయ కృత్యం. ఈనాడు చాలాచోట్ల ఉట్టి కొట్టే పండుగను సరదా సంతోషాల మధ్య నిర్వహించడం ఆచారంగా వస్తోంది

శ్రావణ బహుళ నవమి, సెప్టెంబరు 4, మంగళవారం
శ్రావణ బహుళ నవమి తిథి నాడు చండికా పూజ నిర్వహింలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అలాగే, ఈ తిథి అరవింద యోగి జననం కూడా. భారతీయ యోగి పరంపరలో అరవింద యోగి ప్రముఖులు. ఈ తిథి నాడు కౌమార పూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

శ్రావణ బహుళ దశమి, సెప్టెంబరు 5, బుధవారం
శ్రావణ బహుళ దశమి గురించి వ్రత గ్రంథాలలో ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదు. ఇక, లౌకికంగా చూస్తే ఈనాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం భారతీయ విద్యా సంప్రదాయంలో ఒక భాగంగా కొనసాగుతోంది. ఈనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల (ఉపాధ్యాయులు)ను విద్యార్థులు యథాశక్తి సత్కరించి పూజించాలి.

శ్రావణ బహుళ ఏకాదశి, సెప్టెంబరు 6, గురువారం
శ్రావణ బహుళ ఏకాదశి తిథి అజైకాదశి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథం ఈ ఏకాదశి తిథిని అజైకాదశిగా పేర్కొంది. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయిన హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ (బహుళ) ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. తత్ఫలితంగా ఆయన తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడని అంటారు.
ఇంకా, ఈనాడు కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కామికా వ్రతం చేయబడే దినం కావడం చేత ఈ తిథిని ‘కామికా ఏకాదశి’ అనడం కూడా ఉంది.

శ్రావణ బహుళ ద్వాదశి, సెప్టెంబరు 7, శుక్రవారం
శ్రావణ బహుళ ద్వాదశి తిథి రోహిణీ ద్వాదశీ తిథి అని వ్రత గ్రంథాలలో ఉంది. అయితే, ఈనాడు ప్రత్యేకించి ఏయే వ్రతాలు ఆచరించాలో వివరాలు అందుబాటులో లేవు.

శ్రావణ బహుళ త్రయోదశి, సెప్టెంబరు 8, శనివారం
శ్రావణ బహుళ త్రయోదశి ద్వాపర యుగాదిగా ప్రసిద్ధి. ఈ మేరకు ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ తిథిని పేర్కొంది. అలాగే, ఈ తిథి గడియల్లోనే శ్రావణ బహుళ చతుర్దశి గడియలు కూడా ప్రవేశిస్తున్నాయి. ఈనాడు అఘోర చతుర్దశి అని ఆమాదేర్‍ జ్యోతిషీలో పేర్కొన్నారు.

శావణ బహుళ అమావాస్య, సెప్టెంబరు 9, ఆదివారం
శ్రావణ బహుళ అమావాస్యను మన పంచాంగకర్తలు పోలాలమా వాస్యగా పేర్కొంటున్నారు. ఈనాడు పోలాంబా వ్రతాన్ని ఆచరించాలని అంటారు. పోలేరమ్మ అనే గ్రామ దేవతను ఈ రోజు పూజిస్తారు. కాగా, పోలి పేరుతో మరో అమావాస్య పర్వం కూడా అమల్లో ఉంది. అది కార్తీక బహుళ అమావాస్య నాడు వస్తుంది. అది పోలి స్వర్గానికి వెళ్లిన అమావాస్యంగా భావిస్తారు.
శ్రావణ బహుళ అమావాస్య నాడు వచ్చే ఈ అమావాస్యను తెలుగునాట పోలాలమావాస్యగా వ్యవహరిస్తారు. గోదావరి జిల్లాల్లో పోలాల అమావాస్య అంటారు. ఈనాడు గోదావరి పొర్లి పొర్లి ప్రవహిస్తుందని నానుడి. మహారాష్ట్రలో పిఠోరి అమావాస్యగా దీనిని వ్యవహరిస్తారు. ఆమాదేర్‍ జ్యోతిషీ వ్రత గ్రంథంలో కౌశ్యమావాస్యగానూ, గ్రంథాంతరాల్లో ఆలోకామా వాస్య గానూ, ఉత్కల దేశంలో సప్తపూరికామావాస్య అనీ పిలుస్తారు.
పోలాలమావాస్యను ‘పోలామా’ అనీ అంటారు. పోల అంటే కడుపు నిండా మేత మేసి, నీరు తాగి పనిపాటు లేకుండిన ఎద్దు అని అర్థం. ‘అమా’ అంటే అమావాస్య. ‘పోలామా’ అంటే ఎద్దులను బాగా మేపే అమావాప్య అని అర్థం. దీనిని బట్టి ఈ పర్వం వృషభ పూజకు ఉద్ధిష్ట మైనదిగా భావించాలి. సాధారణంగా అమావాస్య నాడు రైతులు ఎద్దుల చేత ఏ పనీ చేయించరు. నాగలి కట్టరు. దుక్కి దున్నరు. ఏరువాక పున్నమ వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ (జూన్‍) నాటి నుంచి వ్యవసాయ పనులతో ఎద్దులకు తీరిక ఉండదు. శ్రావణ మాసానికి వచ్చే సరికి వ్యవసాయ పనులు తీరుతాయి. దీంతో ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే నియమంతో ఈ పర్వాన్ని ఏర్పరిచి ఉండవచ్చు.
శ్రావణ బహుళ అమావాస్య నాడు పిఠోరి వ్రతం చేయదగినది. ఈనాడు పొద్దుటే లేచి స్నానం చేసి శివుడిని ఉద్దేశించి బొమ్మల పూజ చేయాలి. గోడపై గాని, కాగితంపై గాని, నేలపై దేవతల బొమ్మలు, ఇంట్లో ఉన్న వస్తువుల బొమ్మలు, మంచం, బల్ల, పాత్రలు, ఇల్లు, ఆవులు, గేదెలు, గుర్రాలు.. వీటి బొమ్మలు గీయాలి. వాటికి ఐదు సంవత్సరాల పాటు పూజా నియమాలు చేసి ఉద్వాసన చేయాలి. ఇలా చేస్తే సమస్త వస్తు సమృద్ధి కలుగుతుందని అంటారు. ఇది దసరా, దీపావళి, పంక్రాంతి పర్వదినాల సందర్భంలో చేసే బొమ్మల కొలువు వంటిది.

భాద్రపద శుద్ధ పాడ్యమి, సెప్టెంబరు 10, సోమవారం
భాద్రపద మాసపు ఆరంభ తిథి ఇది. ఈనాడు ఏ దేవుడి పూజ లేదని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. కానీ, ఈనాడు ఆడపడుచులు ఆడిపాడే సంప్రదాయం ఉంది. ఈనాడు పడుచులు తెల్లవారుజామున లేస్తారు. తలంటి పోసుకుంటారు. అనేక పిండివంటలు వండుతారు. భోజనానంతరం స్త్రీలు ఉత్సవాలతో, ఆటపాటలతో పొద్దుబుచ్చుతారు. సాయంకాలం తిరిగి పిండి వంటలతో భోజనం చేస్తారు. పడకకు చేరే లోపుగా ప్రతి వారు జొన్న కంకిలో గింజలు కొన్ని, ఒక దోసకాయ ముక్క తిని తీరాలని నియమం. అయితే, ఈ పర్వం పేరేమిటో, దానికి సంబంధించిన నేపథ్యమేమిటో ఇదమిత్థముగా తెలియరాదు. అయితే,భద్రచతుష్టయ వ్రతం, మృగశీర్షా వ్రతం వంటివి ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద శుద్ధ విదియ, సెప్టెంబరు 11, మంగళవారం
భాద్రపద శుద్ధ విదియ కల్కి జయంతి దినంగా ప్రసిద్ధి.

భాద్రపద శుద్ధ తదియ, సెప్టెంబరు 12, బుధవారం
భాద్రపద శుద్ధ తదియ హరితాళిక వ్రతానికి ప్రసిద్ధి. తెలుగు నాట పదహారు కుడుముల తిధిగా ఇది ప్రాచుర్యంలో ఉంది. సౌభాగ్యవంతమైన స్త్రీలు, కన్యలు ఆచరించే వ్రత పర్వమిది. ఈ వ్రతం ఆచరించే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందిందని పురాణగాథ. ఈనాటి పూజకు అరటి స్తంభాలతో మండపం నిర్మించి, వివిధ వర్ణాల పట్టుబట్టలతో, తోరణాలతో దానిని అలంకరించాలి. పూజ తరువాత ఉపవాసం ఉండాలి. ఉత్తర భారతదేశంలోనే ఈ వ్రతాచరణ ఎక్కువగా ఉనికిలో ఉంది. ఇదే నాడు మన తెలుగు నాట పదహారు (16) కుడుముల తద్ది పర్వాన్ని జరుపుకుంటారు. ఇది నోము. పూర్వం ఓ రాజ కుమార్తె ఈ నోము సరిగా పరిసమాప్తి చేయలేదు. దీంతో మరుసటి జన్మలో ఆదరాలై పుట్టింది. ఈతి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి అడవికి వెళ్లగా, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై గతజన్మలో 16 కుడుముల తద్ది సరిగా ఆచరించని ఫలితంగానే ఈ కష్టాలు కలిగాయని చెబుతారు. అప్పుడు ఆ యువతికి పార్వతి స్వయంగా ఈ వ్రతాచరణ గురించి చెప్పింది. పార్వతీదేవి చెప్పిన ప్రకారం..
రాకుమార్తె ఇంటికి వచ్చి పార్వతీదేవి చెప్పిన విధంగా భాద్రపద శుద్ద తదియ గడియల్లో తలంటి పోసుకుని పదహారు కుడుములు వండుకుని మూతపెట్టి చల్ల తెచ్చేందుకు తలుపు దగ్గరగా వేసి పొరుగింటికి వెళ్లింది. ఆమె వచ్చేలోపు కుక్క లోనికి ప్రవేశించి కుడుములు తినివేసింది. అయితే, ఈశ్వరార్పణంగా భావించి ఆ చల్ల కూడా కుక్కకే ఆమె పోసింది. ఆమె జంతుప్రేమకు పార్వతీదేవి మెచ్చి ప్రత్యక్షమైంది. ‘రాచబిడ్డా! కుక్క కుడుములు తినేసిందని విచారించకు. నీ భూత హితార్థబుద్ధికి మెచ్చుకున్నాను. నీకు నేను కావాల్సినంత సంపద ఇస్తున్నాను’ అని చెప్పింది.
ఆ ప్రకారమే ఆమెకు సంపద కలిగింది. దీంతో ఆమె ఏటేటా భాద్రపద శుద్ధ తదియ నాడు పదహారు కుడుములు వండి నైవేద్యం పెట్టి నోము ఆచరిస్తూ వచ్చింది. అప్పటి నుంచీ అది పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతి చెందింది.
భాద్రపదంలో ఇది చాలా విశేషమైన తిథి అని చెప్పాలి. ఈనాడు పదహారు కుడుముల తద్దితో పాటుగా, హరితాళికా వ్రతాన్ని ఆచరిస్తారు. ఉత్కల దేశంలో గౌరీ తృతీయ పేరిట నోము ఆచరిస్తారు. ఇంకా ఈనాడు కాంచన గౌరీ పూజ, ఉమా పూజ, కోటీశ్వరీ వ్రతం, అనంత తృతీయా వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఈ తిథి నాడే వరాహ జయంతి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద శుద్ధ చతుర్థి, సెప్టెంబరు 13, గురువారం
భాద్రపద శుద్ధ చతుర్థి (చవితి) వినాయక చవితిగా ప్రసిద్ధి. గణపతి మొత్తం దేవతల్లోనే విశిష్ట దైవం. విశేష రూపం, వాక్కులు, మనసు చేత ఏర్పడే దృశ్యాదృశ్య ప్రపంచం ‘గ’కారం. వాక్కులకు, మనసుకు అతీతమైన రూపాన్ని ‘ణ’కారం చేత సూచిస్తారు. ‘గం’ గణపతి బీజాక్షరం.
గణపతి పృథ్వీతత్వానికి అధి దేవత. గణపతి చేతిలోని పాశం రాగాన్ని, అంకుశం తాళాన్ని సూచిస్తాయి. ఏకదంతం ఏకాగ్రతను, మోదకం ఆనందానికి ప్రతీకలు.
గణపతి ఏకదంతుడు. ఏకదంతం అద్వైత ప్రతీక. ఆయన చేతిలోని దంతం భగ్నలేఖిని. సృష్టిలో జ్ఞానం, విజ్ఞానం ఉన్నాయి. ఈ రెండూ ఒకటి కావు. అన్నింటిలోని ఒకే తత్వాన్ని వివరించి అనుభూతి కలిగించేది జ్ఞానం. దాన్ని విశ్లేషించేది విజ్ఞానం. విశ్లేషణ విభిన్నత్వాన్ని నిరూపిస్తుంది. జ్ఞానం ఏకత్వానికి ప్రతీక. విజ్ఞానం ఒక్కోసారి వైషమ్యాలను, అహంకారాన్ని కలిగిస్తుంది. గజముఖుని ఏకదంతం ఏకత్వానికి సంకేతం. భగ్నదంతం విజ్ఞానానికి సూచిక అని పండితుల భావన.
వినాయక ‘చవితి’ అయినా కానీ, ఇది వేర్వేరు చోట్ల అంతకంటే ఎక్కువ రోజులే ఆచరిస్తారు. మహారాష్ట్రలో 11 రోజులు, ఆంధ్ర దేశంలో 3,5,7,9,11 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. ఈ దేవుడికి 21 మోదకాలు నైవేద్యంగా పెడతారు. ఆ రోజు దేవునికి సమర్పించే పత్రిలో అతి పవిత్రమైనవి దూర్వా పత్రాలు (గరిక పోచలు). గజాననుడు మంగళాదైవతం. కాబట్టి ప్రతి కార్యానికి ముందు గజానన పూజ చేయడం ఆచారమైంది. తెలుగు నాటు నాలుగు చతుర్థులు గణేశపరంగా ప్రసిద్ధం. అవి- 1) సంకష్ట చతుర్థి, 2) దూర్వా గణపతి (శ్రావణం లేదా కార్తీకంలో శుద్ధ చతుర్ధి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు), 3) సిద్ధి వినాయక వ్రతం (భాద్రపద శుద్ధ చతుర్థి), 4) కపర్ధి వినాయక వ్రతం (శ్రావణ శుక్ల చతుర్థి).
వంగ దేశంలో గణేశ చతుర్ధి లేదు. దక్షిణ భారతంలో ఇది మిక్కిలి ప్రసిద్ధిం. దీన్ని కొన్నిచోట్ల రాళ్ల పండుగ అనీ అంటారు. రాజస్థాన్‍లో ఇది వివాహ నిశ్చయాలకు మంచి రోజు. విద్యను కోరే వారు చవితి తిథిలో సరస్వతీ పూజ చేయాలని అంటారు. కొన్ని వ్రత గ్రంథాలలో భాద్రపద చతుర్ధిని శివ చతుర్థిగా వర్ణించారు. త్రిమూర్తులు కూడా గణపతిని పూజిస్తారని ప్రతీతి

భాద్రపద శుద్ధ పంచమి, సెప్టెంబరు 14, శుక్రవారం
భాద్రపద శుద్ధ పంచమి తిథి రుషి పంచమిగా ప్రసిద్ధి. దీని గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది కేవలం ఆడవాళ్ల వ్రతం. బాద్రపద శుక్ల పంచమి మధ్యాహ్న సమయంలో నదికి కానీ చెరువుకు కానీ వెళ్లి స్నానం చేయాలి.
ఒకప్పుడు సితాశ్వరాజు బ్రహ్మని తక్షణమే పాపాల్ని తగ్గించే వ్రతాన్ని గురించి చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మ ‘రుషి పంచమి’ వ్రతం గురించి ఉపదేశించాడట.
విదర్భ దేశంలో ఉత్తంగుడు అనే బ్రాహ్మణుడి భార్య సుశీల మిక్కిలి పతివ్రత. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె. కొడుకు వేద పండితుడు. కూతురు బాల వితంతువు అయ్యింది. ఈ కష్టంతో ఉత్తంగుడు గంగా తీరవాసి అయి బ్రహ్మచారులకు వేదం చెబుతుండే వాడు. కూతురు అతనికి సపర్యలు చేస్తుండేది.
ఒకనాడు బాలిక శరీరం నుంచి పురుగులు పడ్డాయి. వాటిని చూసి భయంతో ఆమె స్ప•హ తప్పి పడిపోయింది. అప్పుడు తల్లి ఆమెను తండ్రికి చూపగా, అతను దివ్యదృష్టితో ఆమె పూర్వజన్మలో బ్రాహణ బాలిక అయి ఉండి, రజస్వల అయిన నాడే ఇంట్లోని వస్తువులు ముట్టుకున్నట్టు గ్రహించాడు. అంతేకాక, నాడు ఆమె రుషి పంచమి వ్రతాన్ని ఆచరించే వారిని చూసి నవ్వింది. అందుకు ఆమె శరీరం క్రిమిగ్రస్తమైంది.
రుషి పంచమి వ్రతాన్ని ఆచరిస్తే ఈ దోషం పోతుంది. ఈ వ్రతాచరణ వల్ల రజస్వలగా ఉండి అజ్ఞాతంగా చేసే తప్పుల్ని పోగొట్టుకోవచ్చని అంటారు.
ఈ వ్రతం గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం గురించి చాలామందికి తెలుసు కానీ, ఆచరించే వారు తక్కువ.

భాద్రపద శుద్ధ షష్ఠి, సెప్టెంబరు 15, శనివారం
భాద్రపద శుద్ధ షష్ఠి నాడు సూర్యపూజ చేయాలని పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. ఉద్యాపన పూర్వకమైన సూర్యషష్ఠి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, కృత్యసార సముచ్చయము అనే గ్రంథాలలో కూడా ఉంది.
ఈనాడు స్కంద దర్శనం చేసుకోవాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.

భాద్రపద శుద్ధ సప్తమి, సెప్టెంబరు 16, ఆదివారం
భాద్రపద శుద్ధ సప్తమి నాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలని, దీనినే ఆముక్తాభరణ వ్రతం అని అంటారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు కుక్కుటీ వ్రతం చేసి సాంబశివ పూజ చేయాలని తిథి తత్వంలో రాశారు. ఇంకా చతుర్వర్గ చింతామణిలో ఈనాడు ద్వాదశ సప్తమి, అనంత ఫల సప్తమి, పుత్ర సప్తమి, అపరాజితా సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని ఉంది. ఈనాడు లలితా సప్తమి అని ఆమాదేర్‍ జ్యోతిషీలో ఉంది. నీలమత పురాణంలో ఈనాడు అలంకార పూజ చేయాలని రాశారు.

భాద్రపద శుద్ధ అష్టమి, సెప్టెంబరు 17, సోమవారం
భాద్రపద శుద్ధ అష్టమి నాటి సాయంకాలం ప్రతి ఇంటి నుంచి ఒక యువతి బయల్దేరి బయటికి వచ్చి కొన్ని బొమ్మరాళ్లు ఏరుతుంది. వాటిని ఒక కుండలో వేస్తుంది. ఆ కుండకు తాడు పోసి ఇంటి నూతిలో దింపి తిరిగి బయటకు తీస్తుంది. ఆపై బొమ్మరాళ్లను ఒక పళ్లెంలో పెడుతుంది. ఆ నూతి పక్కనే వాటికి పూజ చేస్తుంది. అనంతరం ఒక చిన్న గంట పుచ్చుకుని వాయిస్తూ బొమ్మరాళ్లతో కూడిన పళ్లాన్ని పట్టుకుని ఇంట్లోకి వస్తుంది. ఈలోగా ఇంటిలోని ఇతర స్త్రీలు తమ చేతుల్ని పసుపు కుంకాల్లో ముంచి నేల మీద అద్ది ఆనమాళ్లు వేస్తారు. సింహద్వారం వద్ద, ఇంటి నిండా ఇలాగే ఆనమాళ్లను వేస్తారు. బొమ్మరాళ్ల పళ్లాన్ని గొనివచ్చిన బాలిక ఈ ఆనమాళ్ల మీదనే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడు స్త్రీలు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెబుతారు. ఈ బొమ్మరాళ్లను మామూలుగా దేవతార్చన జరిగే చోట పెడతారు. మర్నాడు సాయంకాలం వరకు అవి అక్కడనే ఉంటాయి. అప్పుడు పేరంటాళ్లను పిలిచి వేడుక చేస్తారు. పసుపు, కుంకుమలు ఇస్తారు. కొద్దిగా కొబ్బరి, గసగసాలు పంచదార కలిపి తొక్కి చేసిన ఉండలు ఈనాటి ప్రధాన ప్రసాదం.
మర్నాడు మళ్లీ ఆ బొమ్మలను పూజిస్తారు. పెరుగు అన్నం నైవేద్యం పెడతారు. ఆ మీదట బొమ్మరాళ్లను తీసుకెళ్లి నూతిలో వేస్తారు. వేస్తూ వేస్తూ మీదటికి మళ్లీ వచ్చేటప్పుడు మీతో ఆనందాన్ని, సుఖాన్ని తీసుకురండి అంటారు.
భాద్రపద శుక్ల అష్టమికి రాధాష్టమి అని కూడా పేరు. శ్రీకృష్ణుడి యందు తన చిత్తాన్ని లయింపచేసిన రాధ కృతార్థత పొందిన శుభ దినం ఇదేనని చెబుతారు. ఈనాడు రాధాకృష్ణులను పూజించిన వారికి సంసార సుఖం అగ్గలమవుతుంది. భాద్రపద శుక్ల అష్టమి నాడు గౌరీపర్వం కూడా కొన్నిచోట్ల ఆచరిస్తారు. ఈ పండుగ వినాయక చవితి వెళ్లిన మూడు రోజులకు ఆరంభమై మూడు రోజులు ఉంటుంది. గణపతి తల్లి, శివుని భార్య అయిన పార్వతికి ఇది అత్యంత ప్రియకరమైన దినాలని అంటారు.
ఈ అష్టమి ఒకవేళ గురువారంతో కూడి వస్తే కనుక, ఈ తిథిని గుర్వష్టమి అనీ అంటారు. దీనినే నీలమత పురాణంలో అశోకికాష్టమిగా వర్ణించారు.

భాద్రపద శుద్ధ నవమి, సెప్టెంబరు 18, మంగళవారం
భాద్రపద శుద్ధ నవమి గురించి వివిధ గ్రంథాలలో వివిధ రకాలుగా ఉంది. పుణ్యస్త్రీలుగా చనిపోయిన వారి శ్రాద్ధ దినంగా ఈ తిథిని ఎంచుతారని అంటారు. దీనిని వారి భర్తలు ఈ తిథి నాడు బతికి ఉన్నంత కాలం చేస్తారు. కొడుకులు లేకపోతే భర్తే స్వయంగా చేస్తాడు. కొడుకులు ఉంటే పెద్ద కొడుకు చేయడం ఆచారం. పిండ ప్రదానం మొదలైనవి ఉండవు. ఇంకా ఈనాడు శ్రీవృక్ష నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, నందికా నవమి, గోధూమ నవమి అంటారని నీలమత పురాణం చెబుతున్నాయి. ఈ తిథిని నందా నవమి అంటారని, ఈనాడు దుర్గాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.

భాద్రపద శుద్ధ దశమి, సెప్టెంబరు 19, బుధవారం
భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతారాలను పూజించాలని అంటారు. ఈ కారణంగానే దీనికి దశావతార వ్రతమనే పేరు వచ్చింది. నీలమత పురాణంలో ఈనాడు వితస్తోత్సవం చేస్తారని ఉంది. వితస్తనేది పాంచాల దేశంలోని ఒక నది. ఈ నది ఈనాడే పుట్టిందని అంటారు. ఈ దశమి మొదలుకుని ఏడు రోజులు విడవకుండా వితస్తానదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని చెబుతారు.
దశావతార వ్రతం నాడు దేవతలకు, రుషులకు, పితరులకు తర్పణం ఇవ్వాలి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార ప్రతిమలను చేసి పూజించాలి. భోజనం చేయకూడదు. శక్తి లేని వారు ఒంటి పూట భోజనం చేయవచ్చు.

భాద్రపద శుద్ధ ఏకాదశి, సెప్టెంబరు 20, గురువారం
భాద్రపద శుద్ధ ఏకాదశిని వామన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి నాటికి ఆయన శయనించి రెండు మాసాలు అవుతుంది. ఆయన భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు కాస్త ఒత్తిగిలుతాడు. ఆ ఒత్తిగిలడం కూడా ఎడమ నుంచి కుడికి.. అందుచేత దీనికి పార్శ్వపరివర్తిన్యేకాదశి అని పేరు వచ్చింది.
ఈ పర్వాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు సంధ్యాకాలంలో జరగడం కొన్నిచోట్ల ఆచారంగా ఉంది. అలాగే, ఈనాడు కటదానోత్సవం అనే వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
కటము అంటే చాప. కటకారుడు అంటే చాపలు అల్లేవాడు. అంటే ఈనాడు చాప దానం చేయాలి.

భాద్రపద శుద్ధ ద్వాదశి, సెప్టెంబరు 21, శుక్రవారం
భాద్రపద శుద్ధ ద్వాదశిని వామన ద్వాదశిగా వ్యవహరిస్తారు. విష్ణువు ఐదవ అవతారమైన వామనుడికి ఇది ప్రియమైన దినమని అంటారు. వామనుడు బ్రహ్మచారి వటుడు. తపస్విని అయిన అదితికి కశ్యప రుషి వల్ల పుట్టిన వాడు.
విరోచనుడు అనే దైత్యుని కొడుకు బలి. దైత్య కులంలో పుట్టిన బలి గొప్ప విష్ణు భక్తుడు. విష్ణువు అభిమానాన్ని చూరగొన్నాడు. దీంతో అతనికి గర్వం కలిగి దేవతలను బాధించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు శేష నారాయణుని సన్నిధికి వెళ్లి బలి బాధ పోగొట్టవలసిందిగా కోరారు. అయితే బలి తన ఇష్ట భక్తుడు కావడంతో అతని జోలికి వెళ్లడానికి విష్ణువుకు ఇష్టం లేకపోయింది. అయితే, దేవతల బలవంతంతో ఆయన తగ్గక తప్పలేదు. ఫలితంగా వామనమూర్తి అయిన బ్రాహ్మణ యాచకుని వేషంలో బలి చక్రవర్తి వద్దకు వెళ్లాడు. బలి సింహాసనంపై నుంచి లేచి దానిపై వామనుడిని కూర్చోబెట్టాడు. మిక్కిలి వినయంతో రాకకు కారణం అడిగాడు. తన వేద పఠనానికి తనకు ‘త్రిపద్భూమి’ కావాలని వామనుడు బలికి కోరాడు. ప్రతిపద్భూమి అంటే మూడు అడుగుల నేల అని వివరించాడు. బలి అలాగే ఇస్తానన్నాడు. మంత్రయుక్తంగా ఆ దానం చేయడానికి బలి తన గురువైన శుక్రుడికి కబురంపాడు. శుక్రుడు వచ్చి వామనుడి ఆంతర్యం గ్రహించి బలికి అసలు విషయం చెబతాడు. దానం ఇవ్వడంతోనే నిన్ను పాతాళానికి తొక్కివేస్తాడని కూడా అంటాడు. అయినా సరే, తాను ఆడిన మాట తప్పనని బలి అంటాడు. అంతట వామనుడు ్ర•హ్మాండాంత సంవర్థియై ఒక పాదంతో భూమిని, మరో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో పాదం బలి నెత్తి మీద ఉంచి అతనిని పాతాళంలోకి తొక్కివేశాడు
హేమాద్రి, భవిష్య పురాణాలలోని కథ ఇది. భాద్రపద మాస శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రంలో వామనావతార జయంతి ఉత్సవం జరుపుతారు. దీనిని విజయ ద్వాదశి అనీ అంటారు. వామన ద్వాదశికి ముందు ఏకాదశి ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేసి వామనావతార విగ్రహాన్ని పూజించాలి. విగ్రహానికి శిఖ, సూత్రం, యజ్ఞోపవీతం, కమండలువు ఉండాలి. శ్రవణ ద్వాదశి నాడు ఉపవాసం చేసిన వారికి బ్రహ్మహత్యా దోషాలు పోతాయి

భాద్రపద శుద్ధ త్రయోదశి, సెప్టెంబరు 22, శనివారం
భాద్రపద శుద్ధ త్రయోదశిని గోత్రిరాత్రి వ్రతమని, దూర్వాత్రి రాత్రి వ్రతమని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఈనాడు మొదలుకుని మూడు రోఉలు అగస్త్యార్ఘ్య దానం చేయాలని కృత్యసార సముచ్చయం అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద శుద్ధ చతుర్దశి, సెప్టెంబరు 23, ఆదివారం
భాద్రపద శుద్ధ చతుర్ధశి తిథి అనంతుని పూజకు విశేషమైనది. ఈనాడు చేసే పూజా కార్యకలాపాన్ని అనంత వ్రతమని అంటారు. అనంతుడు అనేది త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు పేర్లలో ఒకటి. అనంత చతుర్దశీ వ్రతం మిక్కిలి విశేషమైనదని స్మ•తి దర్పణం అనే వ్రత గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు పాలీ చతుర్దశీ వ్రతం, కదలీ వ్రతం ఆచరించాలని ఉంది. ఉత్కళ దేశంలో దీనిని అఘోర చతుర్దశి అంటారని ఆమాదేర్‍ జ్యోతిషీ వ్రత గ్రంథంలో రాశారు. ఈ వ్రతాచరణకు త్రయోదశితో కూడిన చతుర్దశి పనికి రాదు. పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యము. అనంత వ్రతం గురించి భవిష్యోత్తర పురాణంలోనూ, తిథి ప్రాముఖ్యం గురించి హేమాద్రి వ్రత గ్రంథంలోనూ ఉంది.
మనిషికి పోయిన అధికారం, సంపద, రాజ్యం మొదలైనవి అనంతుని పూజించడం వల్ల తిరిగి వస్తాయని అంటారు.

భాద్రపద శుద్ధ పూర్ణిమ, సెప్టెంబరు 25, మంగళవారం
భాద్రపద శుద్ధ పూర్ణిమ అనేక విధాలుగా ప్రతీతమై ఉంది. శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు మంచిది కాకపోయినా, వీలులేక పోయినా ద్విజులు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకుంటారు.
ఈనాడు ఉమామహేశ్వర వ్రతం, పుత్ర వ్రతం, ఉపాంగ లలితాగౌరీ వ్రతం, లోక పాలక పూజ, వంధ్యత్వ హారిలింగార్చనా వ్రతం, వరుణ వ్రతం, బ్రహ్మసావిత్రీ వ్రతం, అశోక త్రిరాత్ర వ్రతం వంటివి చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద పూర్ణిమ నాడు భాగవత పురాణాన్ని దానం ఇస్తే పరమపదం కలుగుతుంది.
భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించిన అగస్త్యార్ఘ్య దానాన్ని భాద్రపద పూర్ణిమతో ముగిస్తారని తిథి తత్వం చెబుతోంది.
ఈనాడు దిక్పాల పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. దీనినే ఇంద్ర పౌర్ణమాసీ అంటారని గదాధర పద్ధతి అనే గ్రంథంలో రాశారు. అలాగే, భాద్రపద శుద్ధ పూర్ణిమ ‘మహా భాద్రీ’ అని, ఈనాడు బదర్యాశ్రమంలో గడిపితే విశిష్ట ఫల ప్రదమై ఉంటుందని గదాధర పద్ధతిలో ఉంది.
నైష్కిఉలకు పౌర్ణమాసీ కృత్యాలైన నాన్దీ శ్రాద్ధం, పితృ శ్రాద్ధం మొదలైనవి ఈనాడు తప్పకుండా చేయాలని చెబుతారు.

భాద్రపద బహుళ పాడ్యమి, సెప్టెంబరు 26, బుధవారం
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మహాలయ పక్షం ఆరంభమవు తుంది. ఇది వేదకాలం నుంచీ ఆచరణలో ఉన్న పండుగగా ఉంది. దీనినే పితృ పక్షమని కూడా అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది. ఆ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. సాధారణ శ్రాద్ధ దినం వ్యక్తులకు సంబంధించినది. మహాలయ పక్షము సాము దాయకంగా పితరులను పూజించడానికి ఏర్పడింది.
మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి తొంభై ఆరు శ్రాద్ధాలని చెప్పారు. ఆ తొంభై ఆరింటిలోనూ పితృ పక్షం ముఖ్యమైనది. శ్రాద్ధ దినం నాడు కర్మ చేసే వాడు శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఉపాసించాలి.
తండ్రి బతికి ఉండగా తల్లిని కోల్పోయిన వాడు భాద్రపద కృష్ణ పక్ష నవమి నాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు గంట కాలం పుచ్చుకుంటుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసే వాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై ఉంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి. ఇదే విధంగా తండ్రికి కూడా శ్రాద్ధకర్మను నిర్వహించాలి.
పురోహితులు సూచించిన మేరకు దర్బగడ్డి మీద అవిసె చెట్టు ఆకులు వేస్తారు. దాని మీద విష్ణు పాదమనే ఆకు వేస్తారు. దాని మీద పిండాలు ఉంచుతారు. ఇవి పెద్ద పిండాలు. ఈ పిండాల పక్కన చిన్న పిండాలు, మరికొన్ని ధర్మ పిండాలు ఉంచుతారు. వీటినన్నింటినీ పూజిస్తారు. తరువాత దీపారాధన చేస్తారు. ఆ మీదట మంత్ర పుష్పాంజలి చేస్తారు. చివరగా నైవేద్యపు వస్తువును ఆరుబయట కాకి తినడం కోసం ఉంచుతారు. కాని ఈ నైవేద్యాన్ని ఎంత తొందరగా ముట్టుకుంటే పితృ దేవతలు అంత ఎక్కువగా తృప్తి పడ్డారని తలుస్తారు. ఇలా కర్మ చేయడానికి పాలుమాలిన తమ వంశీకుడిని పితృ దేవతలు శపిస్తారని అంటారు. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధ కర్మ చేయడం మహత్కార్యంగా మహారాష్ట్రులు భావిస్తారు. ఈ రోజు శ్రాద్ధ కర్మ చేయలేని వారు కనీసం తర్పణమైనా విడవాలి.

భాద్రపద బహుళ విదియ, సెప్టెంబరు 27, గురువారం
భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. దీని తరువాతి రోజు తదియ. ఇది ఉండ్రాళ్ల తద్ది. కొన్ని పండుగలకు పూర్వ దినాలను భోగి అనడం వాడుకలో ఉంది. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పండుగల పూర్వ దినాలను భోగి అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్ల తద్ది స్త్రీల పండుగ. కన్నెలు, పడుచులు, చిన్నారి మగపిల్లలు కూడా ఈ పర్వంలో పాల్గొంటారు. ఉండ్రాళ్ల తద్ది భోగి నాడు ఆడపిల్లలు అందరూ తలంటి పోసుకుంటారు. దీంతో భోగి పీడ వదులుతుందని అంటారు. తలంటు అయిన తరువాత చేతి, కాలి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారుగట్ల గోండూర పచ్చడి, నువ్వు పొడి, ఉల్లిపాయ పులుసు, గట్టి పెరుగు వంటివి వేసుకుని భోజనం చేసి, తాంబూలం వేసుకుని ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం మున్నగు వాటితో కాలక్షేపం చేస్తారు.

భాద్రపద బహుళ తదియ, సెప్టెంబరు 28, శుక్రవారం
భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ల తద్ది. దీనికి ముందు రోజైన భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారుజామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట ఆడతారు. ఊరి బయట తోటలకు అట్లు, బెల్లపట్లు, పెరుగన్నం పట్టుకెళ్లి, వాటిని ఆరగించాక ఉయ్యాల లూగుతారు. రాత్రి గౌరీ పూజ చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా స్త్రీల సౌభాగ్యం కోసం చేసే పండుగ. శ్రావణ, బాద్రపద మాసాలలో కొన్ని స్త్రీ సౌభాగ్యకారకమైన వ్రతాలు గురించి వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కానీ, ఉండ్రాళ్ల తద్ది గురించి ఆయా గ్రంథాలలో లేదు. హేమాద్రి పండితుడు చెప్పిన ప్రకారం.. చైత్ర, భాద్రపద, మాఘ మాసాలలో రూప సౌభాగ్య సౌఖ్యదమైన తృతీయా వ్రతాన్ని గురించి తనకెందుకు చెప్పలేదని యుధిష్టరుడు కృష్ణుడిని ప్రశ్నించాడు.
కృష్ణుడు- భవిష్యోత్తర పురాణం నుంచి ఓ వ్రతాన్ని ఉదహరించాడు. భాద్రపద తృతీయ అన్నాడే కానీ, భాద్రపద బహుళ తదియ అని స్పష్టంగా చెప్పలేదు. సాధారణంగా భాద్రపద శుద్ధ తృతీయ నాడు చేయాల్సిన వ్రతాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ‘గుడ తృతీయ’మనే ఒక వ్రతాన్ని కృష్ణుడు ఉదహరించాడు. గుడాపూపములు దేవికి నైవేద్యంగా పెట్టి, జలాశయాల్లో దేవీ ప్రతిమలను విసర్జిస్తారు. వామదేవుని ప్రీతి కోసం పాయసాన్ని సమర్పించాలని ఈ వ్రతంలో ఉంది. ఈ వ్రతం కూడా ఏ పక్షపు తృతీయ అనేది స్పష్టంగా లేదు. గుడాపూపములు నైవేద్యంగా ఇవ్వాలని అనడం వల్ల నేటి ఉండ్రాళ్ల తద్దియే ఆ వ్రతమై ఉండవచ్చని వ్రతకారుల అభిప్రాయం. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలనేది ఆరోగ్య సూత్రం. దానికి అనుగుణంగానే ఉండ్రాళ్లు ఆరగించే ఈ పండుగ ఆచరణలోకి వచ్చి ఉండవచ్చు.
కాగా, ఉండ్రాళ్ల తద్ది (తదియ) నాడు కొన్ని వర్ణాల వారు గొంతెమ్మ (కుంతి) పూజ చేయడం కూడా ఆచారంగా ఉంది.
ఏదైమైనా ఇది ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందో త్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తన భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు

భాద్రపద బహుళ చవితి, సెప్టెంబరు 29, శనివారం
భాద్రపద బహుళ చవితి నాడు దికాల్ప పూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. అంతకుమించి ఈ తిథి గురించిన వివరాలు అందుబాటులో లేవు.

భాద్రపద బహుళ పంచమి, సెప్టెంబరు 30, ఆదివారం
భాద్రపద బహుళ పంచమి నాడు నాగులకు పాలు పోయడం ద్వారా వాటిని తృప్తిపరచాలని అంటారు. ఈనాడు రుషులను పూజించాలి. ఇది ప్రధానంగా పురుషులు చేసేదిగా ఉంది. మొదట స్నానం చేసి

Review శుభప్రదం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top