శుభం..శ్రావణం

శ్రీ వికారి నామ సంవత్సరం-శ్రావణ మాసం- వర్ష రుతువు -దక్షిణాయనం

ఆగస్టు 1, గురువారం, ఆషాఢ బహుళ అమావాస్య నుంచి – ఆగస్టు 31, శనివారం, భాద్రపద శుద్ధ పాడ్యమి వరకు

తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఐదవది. ఆంగ్లమానం ప్రకారం ఇది ఆగస్టు.. ఎనిమిదవ నెల. స్వయంగా విష్ణువు జన్మించిన నక్షత్రయుక్తమైన మాసం కావడంతో ఇది ఎన్నో విధాలుగా ఉత్క•ష్టమైనది. సకల శుభాలకు నెలవైన ఈ మాసంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ఒకటా రెండా ఎన్నో పండుగలు, పర్వాలకు నెలవైన శ్రావణ మాసం విష్ణు భగవానుడికి, మహాలక్ష్మీ దేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది

శ్రావణ మాసం అనేక ఆధ్యాత్మిక విషయాల రీత్యా ఉత్క•ష్టమైనది. విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రమని అంటారు. అటువంటి నక్షత్రయుక్త పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. అలాగే, శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మాసమిది. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. ఆధునిక యుగంలో ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే జన్మించారు. ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్‍, చూడికుడుత్త నాంచార్‍ తదితరుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే. గరుడుడు అమృతభాండాన్ని సాధించింది ఈ మాసంలోని శుద్ధ పంచమి నాడు. ఆగస్టు 2తో ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో నాగ చతుర్థి (ఆగస్టు 4), శ్రావణ సోమవార వ్రతం (ఆగస్టు 5, 12, 19, 26), నాగ పంచమి (ఆగస్టు 5), శ్రావణ మంగళ గౌరీ వ్రతం (ఆగస్టు 6, 13, 20, 27), వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 9), తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు (ఆగస్టు 10 – 13), బక్రీద్‍ (ఆగస్టు 12), భారత స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), శ్రావణ పూర్ణిమ (రాఖీ పూర్ణిమ- ఆగస్టు 15), పార్శి సంవత్సరాది (ఆగస్టు 17), బలరామ జయంతి (ఆగస్టు 21), శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 24), మదర్‍ థెరిస్సా జయంతి (ఆగస్టు 26), పోలాల అమావాస్య (ఆగస్టు 30) వంటి పండుగలు, పర్వములు శ్రావణ మాసంలో పలకరిస్తాయి.

ఆగస్టు 2 నుంచి ఆగస్టు 30 వరకు కొనసాగే శ్రావణ మాసంలో అన్ని రోజులూ పవిత్రమైనవే. వర్షంతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. ప్రకృతి సస్యశ్యామలమైన పులకరింతలతో పరిఢవిల్లే కాలం. ఈ వర్షరుతువులో అడుగడుగునా పర్వదినాలతో శ్రావణ మాసం శోభిల్లుతుంది.

ఆగస్టు 1, గురువారం/ ఆషాఢ బహుళ అమావాస్య

దీనినే చుక్కల అమావాస్య అంటారు. ఈనాడు ఇంట్లోని ఇత్తడి దీప స్తంభాలు, కుందులు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్య పలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీప స్తంభాలు దాని మీద ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. సాయంత్రం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు. ఈ పక్రియనే దీప పూజగా వ్యవహరిస్తారు.

ఆగస్టు 1, గురువారం/ శ్రావణ శుద్ధ పాడ్యమి

ఈ నాటి నుంచి శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల్లో ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోహణం చేస్తారు. దర్భలతో చేసిన తోరములను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోహణోత్సవ అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు.

ఆగస్టు 2, శుక్రవారం/ శ్రావణ శుద్ధ విదియ

ఈ తిథి ‘శ్రియఃపవిత్రారోపణం’ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. తిథి తత్వం దీనినే ‘మనోరథ ద్వితీయ’ అని చెబుతోంది. ఈనాటి పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాదికాలు చేయాలని నియమం.

ఆగస్టు 3, శనివారం/ శ్రావణ శుద్ధ తదియ

ఈ తిథి నాడు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలని కృత్యసార సముచ్చయము అనే వ్రత గ్రంథంలో ఉంది.

ఆగస్టు 4, ఆదివారం/ శ్రావణ శుద్ధ చవితి

ఈనాడు గణపతిని విశేషంగా ఆరాధిస్తారు. ఈ తిథి విఘ్న పూజకు ఉద్ధిష్టమైనదని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

ఆగస్టు 5, సోమవారం/ శ్రావణ శుద్ధ పంచమి

నాగపంచమి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. తెలంగాణలో శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపు కొంటుంటే, ఆంధప్రదేశ్‍లో మాత్రం కార్తీక శుద్ధ పంచమి నాడు నాగపంచమి జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. కాగా, శ్రావణ శుద్ధ పంచమిని కొన్ని వ్రత గ్రంథాలు నాగ పంచమి అంటున్నాయి. స్త్రీలు ఈనాటి ఉదయమే పూజ చేస్తారు. ఈనాడు ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజిస్తారు. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ఉంది. నాగపంచమి నాడు భూమి దున్నకూడదని అంటారు.

ఆగస్టు 6, మంగళవారం/ శ్రావణ శుద్ధ షష్ఠి

ఈ తిథి కల్కి జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్‍ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సూపౌదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సూపౌదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం).

ఆగస్టు 7, బుధవారం/ శ్రావణ శుద్ధ సప్తమి

ఈ తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించినది. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి (హస్తా నక్షత్రం వస్తే) వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది.

ఆగస్టు 8, గురువారం/ శ్రావణ శుద్ధ అష్టమి

దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూల మైనది. శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అనీ అంటారు.

ఆగస్టు 9, శుక్రవారం/ శ్రావణ శుద్ధ నవమి

ఈ తిథి నాడు కౌమారీ నామక పూజనమ్‍ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. వరలక్ష్మీ వ్రతం ఈ శుక్రవారం నుంచే ప్రారంభ మవుతాయి.

ఆగస్టు 10, శనివారం/ శ్రావణ శుద్ధ దశమి

ఆశా దశమిగా ప్రసిద్ధి. ఈనాడు చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరుతాయని ప్రతీతి. పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించాలి. అలాగే, ఈనాటి నుంచి తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభ మవుతాయి.

ఆగస్టు 11, ఆదివారం/ శ్రావణ శుద్ధ ఏకాదశి

పుత్రైదకాదశిగా ఈ తిథి ప్రసిద్ధి. మహిజిత్తు అనే ఆయన శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా అతనికి పుత్ర సంతానం కలిగింది. పుత్రుడిని ప్రసాదించిన ఏకాదశి కాబట్టి పుత్రదైకాదశి అయిందని ఆమాదేర్‍ జ్యోతిషీలో ఉంది.

ఆగస్టు 12, సోమవారం/ శ్రావణ శుద్ధ ద్వాదశి

ఈ తిథి దామోదర ద్వాదశిగా ప్రతీతి. ఈనాడు విష్ణు ప్రతిమను దానం చేస్తారు. దీనినే శ్రీధర పూజగా కూడా వ్యవహరిస్తారు.

ఆగస్టు 13, మంగళవారం/ శ్రావణ శుద్ధ త్రయోదశి

తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఈనాటితో ముగుస్తాయి. ఈ తిథి శని త్రయోదశి. ఈనాడు అనంగ వ్రతం చేయాలని, రతీ మన్మథులను నెలకొల్పి పూజించాలని వ్రత గ్రంథాల్లో ఉంది. మినుములతో చేసిన మినపసున్ని ఉండలు, పాలను నివేదించాలి. మైనపువత్తితో హారతినివ్వాలి. అనంగుడు అంటే మన్మథుడు. శ్రావణ శుద్ధ త్రయోదశి ఆయనకు ప్రీతికరమైన తిథి. ఈనాడు ఆయనకు పవిత్రారోపణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది.

ఆగస్టు 14, బుధవారం/ శ్రావణ శుద్ధ చతుర్దశి

ఈనాడు శివునికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక 12-8-4 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి, ముడి ముడికి మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీలు 50, 38, 21 ఉండేలా దర్భలు వేలాడదీయాలి. ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అంటారు.

ఆగస్టు 16, శుక్రవారం/ శ్రావణ బహుళ పాడ్యమి

ఈనాడు ధనావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మొదలు భాద్రపద పూర్ణిమాంతం వరకు ఆచరించాల్సిన మాస వ్రతమిది. దీనినే శివ వ్రతమని కూడా అంటారు.

ఆగస్టు 17, శనివారం/ శ్రావణ బహుళ విదియ

ఈనాడు అశూన్య వ్రతం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. ఈ రోజు మొదలు నాలుగు నెలలు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలని గ్రంథాంతరాలలో ఉంది. అందుచేతనే దీనిని చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. అయితే, ప్రస్తుతం ఈ తిథి శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు విష్ణువు వాకుడు చెట్టు పరుపుగా లక్ష్మితో కూడి శయనిస్తాడని ప్రతీతి. వీరిని పూజించడం శుభం.

ఆగస్టు 18, ఆదివారం/ శ్రావణ బహుళ తదియ

ఈనాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం ఆచరించాలని అంటారు.

ఆగస్టు 19, సోమవారం/ శ్రావణ బహుళ చవితి

ఈనాడు సంకష్ట చతుర్థీ వ్రతం చేస్తారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ‘బహుళా చతుర్థి’ అనే పేరూ ఉంది. గోపూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ చెబుతోంది. సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతా యని ఫల శ్రుతి.

ఆగస్టు 20, మంగళవారం/ శ్రావణ బహుళ పంచమి

ఇది రక్షా పంచమి వ్రత దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ చెబుతోంది. నాగపూజ చేసే ఆచారం కూడా ఉంది.

ఆగస్టు 21, బుధవారం/ శ్రావణ బహుళ షష్ఠి

ఈ తిథి బలరామజయంతిగా ప్రసిద్ధి. ఈ తిథి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది.

ఆగస్టు 23, శుక్రవారం/ శ్రావణ బహుళ సప్తమి

ఈనాడు శీతలా సప్తమి వ్రతమాచరించాలని అంటారు. విదేశీ కాల మానం ప్రకారం 23వ తేదీ మొదలు 24వ తేదీ వరకు నడిచే సప్తమి గడియల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించుకోనున్నారు.

ఆగస్టు 25, ఆదివారం/ శ్రావణ బహుళ నవమి

ఈనాడు చండికా పూజ చేస్తారు. అలాగే, ఈ తిథి అరవింద యోగి జన్మ తిథి. కౌమార పూజ కూడా ఆచరిస్తారు. రామకృష్ణ పరమహంస వర్ధంతి దినం కూడా ఈ రోజే.

ఆగస్టు 26, సోమవారం/ శ్రావణ బహుళ ఏకాదశి

ఈ ఏకాదశిని అచై•కాదశి అంటారు. రాజ్యం, భార్య, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు. ఇంకా ఈనాడు కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని అంటారు. కామికా వ్రతం ఆచరించే దినం కాబట్టి ఈ తిథిని కామికా ఏకాదశి అని కూడా అంటారు.

ఆగస్టు 28, బుధవారం/ శ్రావణ బహుళ త్రయోదశి

ఈనాడు రోహిణీ ద్వాదశీ వర్షం అనే పూజ చేస్తారు. త్రయోదశి తిథి ద్వాపర యుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీ చెబుతోంది.

ఆగస్టు 29, గురువారం/ శ్రావణ బహుళ చతుర్దశి

ఈనాడు అఘోర చతుర్దశి. అలాగే మాస శివరాత్రి పర్వం.

ఆగస్టు 30, శుక్రవారం/ శ్రావణ బహుళ అమావాస్య

శ్రావణ కృష్ణ అమావాస్య పోలామావాస్యగా ప్రసిద్ధి. ఈనాడు కర్షకులు వ్యవసాయ సంబంధ పనులు, ప్రత్యేకించి ఎద్దులతో ఏ పనీ చేయించరు. మహారాష్ట్రలో దీనిని పిఠోరి అమావాస్య అని, ఆమాదేర్‍ జ్యోతిషీలో కౌశ్యమావాస్య అని, గ్రంథాంతరాల్లో ఆలోకామావాస్య అని వ్యవహరిస్తారు. ఇక, తెలుగు నాట ఇది పోలాంబ వ్రతంగా ప్రసిద్ధి. పోలేరమ్మ అనే గ్రామ దేవత ఈనాడు విశేష పూజలు అందుకుంటుంది.

ఆగస్టు 31, శనివారం/ భాద్రపద శుద్ధ పాడ్యమి

ఇది ఆడపడుచుల పండుగ. ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తారు. పిండివంటలు చేసి.. ఆరగించిన అనంతరం స్త్రీలు విలాసంగా గడుపుతారు. పడకకు చేరేలోగా జొన్నకంకిలో గింజలు కొన్ని, ఒక దోసకాయ ముక్క తిని తీరాలి. ఈ రోజు ప్రత్యేకించి ఏ దేవుడినీ పూజించరు.

Review శుభం..శ్రావణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top