మన ఉగాది పర్వదినమే కొంచెం ఇంచుమించుగా పార్సీలకు కూడా కొత్త పండుగగా ఉంది.

అగ్ని పూజకులైన పార్శీలు ఒకప్పుడు ఆర్యులతో కలిసి ఉండేవారని, వీరిద్దరు కలిసి ఉన్న కాలంలోనే కొత్త సంవత్సర పండుగ ఏర్పడి ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సర పండుగే మనకు సంవత్సరాది (ఉగాది) కాగా, పార్శీలకు ‘నౌరోజ్‍’ అయ్యింది. ‘నౌరోజ్‍’ అంటే కొత్త దినం అని అర్థం.
చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి మన పెద్దలు ఆయా మాసాలకు ఆయా పేర్లను నిర్ణయించారు. అంటే, చంద్రుని గతి ఆధారంగా నక్షత్ర మండలాలకు ఆయా పేర్లు పెట్టారు. ఆ మండలాలలో చంద్రుడు ప్రవేశించినపుడు ఆ నెలకు ఆయా నక్షత్రాల పేర్లు వస్తాయి. ఈ కోవలో, చిత్త నక్షత్రంలో పూర్ణ చంద్రుడున్న మాసం చైత్రమవుతుంది.

చైత్ర మాసంలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని అంటారు. చెట్లు ఆకులు రాల్చే కాలమిది. పూలు మాత్రం విరబూస్తాయి. ఎటుచూసినా వసంత పరిమళాలు వెదజల్లుతుంటాయి. పచ్చనాకులు.. లేత చివుళ్లు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మన మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. అందుకే చైత్రాన్ని వసంత మాసమనీ అంటారు.

అటువంటి శోభాయమానమైన వసంత మాసంలో వచ్చే పర్వం- ఉగాది. యుగాది అనే పదం నుంచి ఉగాది పుట్టింది. యుగమంటే ఒక కాల విభాగం. నూతన కాలం. దానికి ఆది యుగాది. దూరాన్ని కొలిచేందుకు ‘గజము’ బద్ద వలే, ధనమును లెక్కించడానికి ‘రూపాయి’ నాణెం వలే, అనంతమైన కాలాన్ని, దాని పరిమితిని తెలుసుకునేందుకు ‘సంవత్సరం’ ఉపయోగపడుతుంది. కాబట్టి కాలాన్ని కొలిచే కొలబద్ద వంటిది ‘సంవత్సరం’. ఆ సంవత్సరానికి ప్రామాణికంగా నిలిచేది ఉగాది. ఉగాది సమయంలో పితృకర్మలు, వ్రతాలు చేయడం మన భారతీయ సంప్రదాయం. భారతీయ సంప్రదాయంలో వచ్చే అనేక పండుగలు, పర్వాలకు ఉగాది నాంది పలుకుతుంది. ఈరోజు ప్రారంభించే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని, శుభ సంకల్పాలకు ఈ పర్వం నాందీపర్వం పలుకుతుందని అంటారు. ఇంకా రమణీయమైన సీతారామ కల్యాణానికి, వసంతాగమన వేడుకలకు ఈ మాసమే వేదిక..

ఫాల్గుణ బహుళ అమావాస్య/ కొత్తమావాస్య
ఏప్రిల్‍ 1, శుక్రవారం

ఏప్రిల్‍ మాసంలో తొలి రోజు ఇది. ఈనాటి తిథి- ఫాల్గుణ బహుళ అమావాస్య. ఫాల్గుణ బహుళ అమావాస్యను వివిధ ప్రాంతాలలో కొత్త అమావాస్యగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో ఫాల్గుణ బహుళ అమావాస్య నాటి రాత్రి శుభాశుభాలను విచారించుకుండానే ‘ఏరువాక’ సాగుతారనీ, దీనికి దొంగ ఏరువాక అని పేరనీ అంటారు. పలుచోట్ల ఈనాడు గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతరలు జరుపుతారు. ఈనాడు పల్లెల్లోని వీధి వీధుల్లో ఉండే అమ్మవార్లు విశేష పూజలు అందుకుంటారు. ఈనాడు వత్సరాంత శ్రాద్ధం చేయాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో రాశారు. ‘ఆరంభమనేదే ప్రాయకంగా అంతం కూడా’. ఒకటి అంతం చేయడం అంటే మరొకటి ఆరంభం చేయడమే. ఒకదానిని మనం అంతం చేస్తే మరొక ఆరంభం చేస్తున్నామన్న మాట. ఈ తిథి మీన సంక్రాంతి. అనగా, మీన సంక్రమణం. అంటే సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించే రోజు. అందుకే దీనిని మీన సంక్రమణం అంటారు. షడతీతి సంక్రాంతి అని కూడా అంటారు. ఈ తిథి నాడు చేసే జపదానాలు విశేష ఫలప్రదమని అంటారు. ఈ తిథి నాడు ఆ సంవత్సరాంత శ్రాద్ధ కార్యాలు నిర్వహించాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. మత్స్య, వాసుదేవులను పూజించాలని, ఉపవాసం ఉండాలని హేమాద్రి వ్రత ఖండం చెబుతోంది. ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.
కాగా, ఏప్రిల్‍ 1.. పాశ్చాత్యులక• ‘ఏప్రిల్‍ ఫూల్స్ డే’. అలాగే, ఏప్రిల్‍ 1 భారతీయ బ్యాంకులకు సెలవు దినం. కొత్త ఆర్థిక సంవత్సరం ఈనాటి నుంచే ప్రారంభమవుతుంది.

చైత్ర శుద్ధ పాడ్యమి/సంవత్సరాది
ఏప్రిల్‍ 2, శనివారం

ఇది చైత్ర మాసపు తొలి తిథి. ఈనాడే (ఏప్రిల్‍ 1, శనివారం, శ్రీ శుభకృతు నామ సంవత్సరం-2022) ఉగాది. కొత్త సంవత్సర ఆరంభ దినం. అందుకే సంవత్సరాది అయ్యింది. వసంత నవరాత్రులు కూడా ఈనాటి నుంచే ఆరంభమవుతాయి. ఈనాడే చంద్ర దర్శనం. సాధారణంగా మన దేశంలో పుష్య, మాఘ మాసాల్లో పంటలు పండి ప్రకృతి పంటల బరువుతో, పచ్చదనపు సొగసులతో తులతూగే కాలం. రైతులు తమ శ్రమ ఫలాన్ని కళ్లెదుట చూసుకుని పొంగి పోతుంటారు. ఈ సమయంలో వచ్చేదే సంక్రాంతి పర్వం. సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలమని, విషువత్పుణ్య కాలమని అంటారు. విషువత్తంటే పగలు, రాత్రి సమానంగా ఉండే కాలం. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖపై ఉంటాడు. ఈనాటి నుంచి ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి సంక్రాంతినే పూర్వం ఉగాదిగా భావించేవారు. అయితే, నక్షత్ర గణకులు, సిద్ధాంతకర్తలు చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది తిథిగా తరువాత కాలంలో నిర్ణయించారు. అలా ఉగాది పుష్య, మాఘ మాసాలను దాటుకుని చైత్రంలో నిర్ణయమైంది. చైత్రంలోని తొలి తిథి అయిన శుద్ధ పాడ్యమి ఈ పర్వానికి నెలవైంది. ప్రస్తుతం మనకు ఇదే సంవత్సరారంభ దినం. ఇక ఈ పర్వం పూర్వాపరాల్లోకి వెళ్తే..

ఉగాది పండుగ ఆర్యావర్తనం అని పిలిచే ఉత్తర హిందూస్థానంలో ప్రస్తుతం నామమాత్రమైపోయింది. వ్రతోత్సవ చంద్రికాకారుని రాతలను బట్టి ప్రస్తుతం వింధ్య పర్వతానికి ఉత్తరాన ఒక్క మాళవ దేశంలోనే చైత్రాది పర్వం ఆచరణలో కొద్దిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈనాడు గృహాలంకరణం, పంచాంగ శ్రవణం అక్కడి విధాయ కృత్యాలు. ఉత్తర హిందూ దేశాన ఇతర ప్రాంతాలో ఈ మాత్రం పర్వం కూడా నిర్వహించరు. ఆర్యావర్తంలో ఈ ఆర్యాచారం ఎందుకు లుప్తమైపోయిందంటే.. కాలాంతరాన అమల్లోకి వచ్చిన సౌరబార్హ్యస్పత్య మన్వాది కాల పరిగణనలో గల తేడాలు ఇందుకు ఒక కారణం కావచ్చు. వింధ్యకు దక్షిణాన శాలివాహన శకము, ఉత్తరాన విక్రమార్క శకమూ ప్రచారంలోకి రావడం ఇందుకు మరో కారణం కావచ్చు. ఈ రెండు శకాల సందర్భంలో మహారాష్ట్రలో ప్రచారంలో ఉన్న గాథ గురించి తెలుసుకోవాలి.
పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి నలుగురు కొడుకులు. చనిపోయే ముందు అతను తన కొడుకులకు నాలుగు సీళ్లు వేసిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కాని సీళ్లు తెరవద్దని అతను కొడుకులను ఆదేశించాడు. అలాగే, ఆ కొడుకులు తండ్రి మరణానంతరం ఆ పాత్రల సీళ్లు తొలగించి చూపారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు ఉన్నాయి. దీనికి అర్థం వారికి తెలియలేదు. ఆనాటి హైందవ చక్రవర్తి విక్రమార్కుడు. ఆ కుమారులు నలుగురూ దాని అర్థాన్ని బోధించాల్సిందిగా విక్రమార్కుడిని కోరారు. కానీ విక్రమార్కునికి కూడా అందులోని అంతరార్థం తెలియలేదు. అప్పుడు వారు ప్రతిష్ఠానపురానికి వెళ్లారు. అక్కడ కూడా రాజు కానీ మరెవ్వరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కాని ఆ ఊరిలోని వింత బాలుడు ఒకడు ఆ సమస్యను విడమరిచి చెప్పాడు. ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. ఆ బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు ఇద్దరు సోదరులు. నాగ కుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. ఇందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. దిక్కులేని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయమిచ్చాడు. ఆ కుమ్మరి ఇంట్లోనే ఆమె ఒక కుమారుడిని ప్రసవించింది. ఆ బాలుడికి ఆమె శాలివాహనుడు అని పేరు పెట్టింది. ఆ బాలుడు వర్తకుని నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్లి ఇలా చెప్పాడు.

‘మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమినీ, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ, ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్నీ, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్నీ పంచుకోవాలనేది వర్తకుని తాత్పర్యం’ అని శాలివాహనుడు చెప్పాడు. శాలివాహనుడు ఇంత సముచితంగా సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతనిని చూడ్డానికి కుతూహలపడి కబురంపాడు. కానీ, శాలివాహనుడు రాజు వద్దకు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన విక్రమార్కుడు శాలివాహనుడిని మట్టుబెట్టడానికి అపార బలసమేతుడై దండెత్తి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనలపైకి వదిలాడు. శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రముని సేనల్ని నిద్రపోయేటట్టు చేశాడు. అందుకు విక్రముడు వాసుకి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఉభయ పక్షాలకూ మధ్య రాజీ కుదిరింది. ఆకాశవాణి.. నర్మదా నదికి ఉత్తర ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షిణాన్ని శాలివాహనుడు ఏలాలని ఆదేశించింది. దీంతో మన ఆంధ్రులకు, దక్షిణాదులకు శాలివాహనుడు శక స్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. దీంతో ఉగాది పర్వం అతని శక స్థాపనతో ముడిపడినదైంది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వారికి చైత్రాది దినమే సంవత్సరాది. ఆదిలో ఈనాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు.

ఈనాడే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు నియోగించాడు. నాటి నుంచి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఆదిలో ఈనాడు ఆరంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా, దిన క్రమాభివృద్ధిగా సాగుతూ ఉంది.

చైత్ర శుద్ధ విదియ/మత్స్య జయంతి
ఏప్రిల్‍ 3, ఆదివారం

చైత్ర శుద్ధ విదియ తెలుగు పంచాంగ క్యాలెండర్ల ప్రకారం మత్స్య జయంతి దినం. అలాగే, ఈనాటి నుంచే మహమ్మదీయుల పవిత్ర మాసమైన రంజాన్‍ నెల ఆరంభమవుతుంది. చైత్ర శుద్ధ విదియ వేదవ్యాస తీర్థానాం పుణ్యదినం అని శ్రీమధ్వ పుణ్యతీర్థమనీ ప్రసిద్ధి. పెరియ పెరుమాల్‍ తిరు నక్షత్రం ఈనాడేనని ఆళ్వాచార్యుల చరిత్ర చెబుతోంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు ‘ఉమా శివాగ్ని పూజ’ అని రాస్తారు. ఈనాడు బాలేందు వ్రతం చేస్తారని, ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలకు దమనంతో పూజ జరగాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం చెబుతోంది. దీనికి సంబంధించిన బ్రహ్మ పురాణంలో ముగ్గురికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒకనాడు పార్వతి భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి అగ్ని భట్టారకుడు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా వెళ్లిపోయాడు. అప్పుడు శివుడికి వీర్య పతనమైంది. క్రీడాభంగానికి భగ్నం చెందిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాల్సిందిగా అగ్నిని ఆజ్ఞాపించింది. అగ్ని ఈ వీర్యాన్ని ధరించి కుమారస్వామి జననానికి కారణభూతుడు అయ్యాడు. కాగా, స్కంద పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఇది స్త్రీల సౌభాగ్య వ్రతం.

చైత్ర శుద్ధ తదియ/శివ డోలోత్సవం
ఏప్రిల్‍ 4, సోమవారం

చైత్ర శుద్ధ పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రుల తొమ్మిది రోజులలో ఈ తదియ మూడవ రోజు. ఈనాడు శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తారని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శివ డోలోత్సవం నాడు ఉమా శివులను దమనములతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాప్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ తదియను మహారాష్ట్ర పంచాంగాలు గౌరీ తృతీయ అని పేర్కొంటున్నాయి. వ్రత గ్రంథాలను బట్టి చూస్తే చైత్ర శుక్ల తృతీయ నాడు మహాదేవుడితో కూడిన గౌరిని పూజించాలి. దీనినే డోలా గౌరీ వ్రతం అంటారు. ఈ పూజలో కుంకుమ, అగరు, కర్పూరం హెచ్చుగా వాడాలి. అలంకారానికి మణులు, మంచి వస్త్రాలు వాడాలి రాత్రి జాగరణం చేయాలి.
అలాగే, ఈనాడు సౌభాగ్య శయన వ్రతాన్ని కూడా ఆచరించాలని, ఈ వ్రతాన్ని గురించి మత్స్యుడు మనువుకు చెప్పినట్టు మత్స్య పురాణంలో ఉంది. చైత్ర శుద్ధ తృతీయ పూర్వాహ్న వేళ ఉమా మహేశ్వర ప్రతిమలకు వివాహం చేసి కల్పోక్త ప్రకారం పూజలు, దానాలు చేస్తే శివలోకప్రాప్తి కలుగుతుంది. ఈనాడు రామచంద్ర డోలోత్సవం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ చతుర్థి
ఏప్రిల్‍ 5, మంగళవారం

చైత్ర శుద్ధ చతుర్థి తిథి గణపతి పూజకు ఉద్ధిష్టమైనది. ఈనాడు గణపతిని దమనములతో పూజించాలని నియమం. ఈనాడు ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. సాధారణ పంచాంగాలలో ఈనాడు చతుర్థి వ్రతం, రోహిణి వ్రతం ఆచరించాలని ఉంది. అలాగే, ఈనాడు బాబూ జగ్జీవన్‍రామ్‍ జయంతి దినం.

చైత్ర శుద్ధ పంచమి/శ్రీపంచమి
ఏప్రిల్‍ 6, బుధవారం

చైత్ర శుద్ధ పంచమి తిథిని శాలి హోత్రయ పంచమిగా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి వర్ణిస్తున్నాయి. ఈనాడు హయపూజ చేయాలని ఉంది. శాలిహోత్రుడు అశ్వశాస్త్రం రాసిన రుషి. మన రాజులు ఆశ్విక దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్రహయ పంచమి వ్రతం బాగా ఆచారంలో ఉండినట్టు కనిపిస్తుంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శ్రీపంచమి, శ్రీ వ్రతం అని రాస్తారు. మాఘ మాసంలో ఒక శ్రీ పంచమి ఉంది. ఈ పంచమి కంటే అది ప్రచారంలో ఉన్న పండుగగా కనిపిస్తుంది. ఈనాడు లక్ష్మీపూజ చేయలని ఉంది. అదే- ‘శ్రీ వ్రతం’. దీనినే లక్ష్మీ పంచమి అని కూడా వ్యవహరిస్తారు.

Review మన ఉగాది పర్వదినమే కొంచెం ఇంచుమించుగా పార్సీలకు కూడా కొత్త పండుగగా ఉంది..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top