పుణ్యం … పుష్యం

జనవరి 1, మంగళవారం, మార్గశిర బహుళ ఏకాదశి నుంచి – జనవరి 31, గురువారం పుష్య బహుళ ఏకాదశి వరకు

విలంబి నామ సంవత్సరం – మార్గశిరం – పుష్యం – శరదృతువు -ఉత్తరాయన

ఆంగ్లమానం ప్రకారం మొదటి మాసం జనవరి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర – పుష్య మాసాల కలయిక. మార్గశిర మాసంలోని కొన్ని రోజులు, పుష్య మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. మార్గశిరంలో వచ్చే పర్వాలలో సఫలైకాదశి, రూప నవమి, కృష్ణ ద్వాదశి, యమదర్శన త్రయోదశి, మహోదధ్యమావాస్య, బకులామావాస్య ముఖ్యమైనవి. జనవరి 6వ తేదీతో మార్గశిర మాసపు తిథులు ముగుస్తాయి. 7వ తేదీ నుంచి పుష్య మాస తిథులు ప్రారంభమవుతాయి. పుష్య శుద్ధ విదియతో మొదలయ్యే ఈ మాసపు తిథులు కుమారషష్ఠి, ద్వాదశ సప్తమి, మహా భద్రాష్టమి, పుతద్రైకాదశి, కూర్మ ద్వాదశి, విరూపాక్ష వ్రతం, హిమశోధన పూర్ణిమ, మహా పౌషీ, కాలాష్టమి వంటి పుణ్య తిథులు, పర్వాలు, పండుగలతో ముగుస్తాయి. జనవరి 1, మార్గశిర బహుళ ఏకాదశి, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం జనవరి 31, పుష్య బహుళ ఏకాదశి, గురువారంతో ముగుస్తుంది.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే జనవరి నెల.. తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర – పుష్య మాసాల కలయిక. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. ‘పుష్య’ అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాదులకు శ్రేష్ఠమైనది. వేదాధ్యయనానికి ఉద్ధిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని పెద్దల మాట. ఇక, పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. ఈ మాస సమయంలోనే పంటలు రైతుల చేతికి అందిన సంతోషంతో.. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు.

ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు. వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యాన్ని కలుగచేస్తుంది. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. తెలుగు వారి పెద్ద పండుగల సంక్రాంతి సందడి చేసేది ఈ మాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి.
తెలుగు పంచాంగం ప్రకారం పుష్యమి సంవత్సరంలో పదవ మాసం. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే చోర భయమని మత్స్య పురాణం చెబుతోంది. ఈ మాసంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చేయాలనే సంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పుష్య మాసంలో గేదె ఈనితే శాంతి చేసే ఆచారం కూడా ఉంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. ఈ మాసంలో వచ్చే పండుగలు, పర్వముల వివరాలివీ..

మార్గశిర బహుళ (కృష్ణ) ఏకాదశి, జనవరి 1, మంగళవారం

మార్గశిర బహుళ ఏకాదశికే ‘సఫలైకాదశి’ అని కూడా పేరు. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కొడుకు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతనలా తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఇదంతా తనకు తెలియకుండానే మార్గశిర కృష్ణ ఏకాదశి నాడు జరిగింది. అయినా లుంపకుడు ఆ వ్రతం యొక్క ఫలితాన్ని పొందగలిగాడు. అందుచేత ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది.

మార్గశిర బహుళ (కృష్ణ) ద్వాదశి, జనవరి 2, బుధవారం

మార్గశిర బహుళ ద్వాదశి.. మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశిగా ప్రసిద్ధి. ఈనాడు ఈ రెండు వ్రతాలు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ (కృష్ణ) త్రయోదశి, జనవరి 3, గురువారం

చతుర్వర్గ చింతామణిలో దీనిని యమ దర్శన త్రయోదశిగా వర్ణించారు.

మార్గశిర బహుళ (కృష్ణ) చతుర్దశి జనవరి 4, శుక్రవారం, మాస శివరాత్రి

మార్గశిర బహుళ (కృష్ణ) అమావాస్య జనవరి 5-6, శని-ఆదివారాలు మహోదధ్యమావాస్య అని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇంకా దీనినే బకులామావాస్య అనీ అంటారు. పాలతో పాయసం వండి నివేదించడానికి ‘బకులక్షీరేణపాసంకృత్యా’ అంటారు.

పుష్య శుద్ధ విదియ, జనవరి 8, మంగళవారం

ఈనాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నాలుగు రోజుల పాటు సాగే విష్ణు వ్రతాన్ని కూడా ఈనాడే మొదలుపెట్టాలని అంటారు.

పుష్య శుద్ధ పంచమి, జనవరి 11, శుక్రవారం

మధుసూదన భగవానుడిని ఈనాడు పూజించాలని అంటారు. ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని పంచమి తిథులలో నాగపూజ చేయడం తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఆచారమై ఉంది.

పుష్య శుద్ధ షష్ఠి, జనవరి 12, శనివారం

పుష్య శుక్ల షష్ఠిని కుమారషష్ఠి అని అంటారు. కుమారషష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి.
ఈ పర్వం తమిళులలో హెచ్చు. అరవ వారిలో పలువురికి కుమారస్వామి ఇలవేల్పు. వారిలో మురుగన్‍, షణ్ముగన్‍, కుమరన్‍ మున్నగు పేర్లు ఎక్కువగా ఉంటాయి. ప్రాచీనాంధ్ర కవులు తమ కావ్యాలలో ఇష్టదేవతా స్తుతిలో కుమారస్వామి స్తుతిని కూడా చేర్చారు. చాళుక్యుల కాలంలో కుమారస్వామి పూజ ఆంధ్ర దేశంలో హెచ్చుగా ఉండేది. ‘కుమారదేవం’ తదితర ఊళ్లు తెలుగునాట నేటికీ నిలిచి ఉన్నాయి. దీనివల్ల ఒకప్పుడు ఇక్కడ కూడా కుమారస్వామి ఉత్క•ష్ట స్థాయిలో పూజ లందుకున్నాడని తెలియవస్తోంది. అయితే, ప్రస్తుతం తెలుగు వారిలో కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యస్వామి పూజ విశేషమై ఉంది. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగు నాట విశేష పూజలందుకుంటున్నాడు. సుబ్బారాయుడి షష్ఠి అని పిలిచే మార్గశిర.

పుష్య శుద్ధ సప్తమి, జనవరి 13, ఆదివారం

ఈనాడు మార్తాండ సప్వమి, ద్వాదశ సప్తమి వ్రతాలు చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. వీటి పేర్లను బట్టి పరిశీలిస్తే.. ఇవి సూర్య సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి. ఈనాడు సూర్య భగవానుడిని యథాశక్తి పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

పుష్య శుద్ధ అష్టమి, జనవరి 14, సోమవారం

వివిధ వ్రత గ్రంథాలు దీనిని మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో వ్యవహరిస్తున్నాయి. ఈనాడు అష్టకా సంజ్ఞకమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని ప్రతీతి. పుష్య మాసం పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. కాబట్టి ఈనాడు పితృ దేవతల ప్రీత్యర్థం కార్యాలు తలపెట్టాలి.

పుష్య శుద్ధ నవమి, జనవరి 15, మంగళవారం

ఈనాడు ధ్వజ నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు ఒంటిపూట భోజనం చేసి మహామాయను పూజిస్తూ వ్రత నియమాన్ని పాటించాలి.

పుష్య శుద్ధ దశమి, జనవరి 16, బుధవారం

వివిధ వ్రత గ్రంథాలు దీనిని శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజ చేయడం ఉత్కళ దేశంలో ఆచారంలో ఉందని తెలుస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ అని అర్థం. మన తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు.

పుష్య శుద్ధ ఏకాదశి, జనవరి 17, గురువారం

ఈ ఏకాదశికి రైవత మన్వాది దినమని పేరు. రైవతుడు ఐదవ మనువు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన కారణంగా అతనికి రైవతుడు అనే పేరు వచ్చింది. ఈయన రేవతి, దుర్దముల కొడుకు. ఇతను కాలక్రమాన ధర్మవేది అయి మనువు అయ్యాడు. అతని మన్వంతరంలో విభుడు అనేవాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్థ్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్తరుషులు.

పుష్య శుద్ధ ఏకాదశి రైవత మన్వాది దినమే కాక పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.

పుష్య శుద్ధ ద్వాదశి, జనవరి 18, శుక్రవారం

పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి, సుజన్మ ద్వాదశీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

పుష్య శుద్ధ చతుర్దశి, జనవరి 20, ఆదివారం

పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఇది విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేసి, గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు.

పుష్య శుద్ధ పూర్ణిమ, జనవరి 21, సోమవారం

పుష్య నక్షత్రంతో కూడిన పున్నమికి ‘పౌషీ’ అని పేరు. ఏ మాసంలో పూర్ణిమావాస్య వస్తుందో ఆ మాసానికి పుష్యమాసమని పేరు.
శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి. పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి. మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి.

మనకు వచ్చే పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. దీనికి ‘అనుమతి’ అని పేరు. పదహారు కళలలో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. దీనికి ‘రాకా పూర్ణిమ’ అని పేరు. అనుమతి అయితేనేం, రాకా అయినేతేం.. మొత్తానికి మనకు ఏడాదికి పన్నెండు పూర్ణిమలు. ఈ పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా ఉన్నాయి.

హిందువుల పండుగలను పరిశీలిస్తే.. కృష్ణ పక్షంలో కంటే శుక్ల పక్షంలో పండుగలు ఎక్కువ. ఆస్వాదనీయమైన శుక్ల పక్షపు వెన్నెల వ్యర్థం కాకుండా మన పెద్దలు ఆ రోజుల్లో పండుగలు, పబ్బాలు, వ్రతాలు, ఉత్సవాలు ఏర్పాటు చేసి ఉంటారు. అందుకే తెలుగు నాట ‘పున్నమి’ గొప్ప తిథి. మానవ ప్రపంచం ప్రసవించిన మహనీయులలో సాటిలేని మేటి గౌతమబుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడు ముఖ్య ఘట్టాల్లో ప్రముఖ స్థానాన్ని వహించింది. ఆయన పుట్టింది ఒక వైశాఖ పూర్ణిమ నాడైతే, ఆయన బుద్ధుడిగా అవతరించింది మరో వైశాఖ పూర్ణిమ నాడు. నిర్యాణం చెందినది మరో వైశాఖ పూర్ణిమ నాడు.

ఇక, దశావతారాల్లో ఒకటైన కూర్మావతారపు జయంతి వైశాఖ పూర్ణిమ నాడు.
హనుమజ్జయంతి చైత్ర పూర్ణిమ నాడు.
జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణిమ.
ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా ప్రసిద్ధి.
శ్రావణ పూర్ణిమ రక్షా పూర్ణిమ.
భాద్రపద పూర్ణిమలు అధ్యాయ, ఉపకర్మ పూర్ణిమలు.
ఆశ్వయుజ పూర్ణిమ కోజాగరీ పూర్ణిమ.
కార్తీక పూర్ణిమ పూర్ణిమ త్రిపుర పూర్ణిమ.
మార్గశిర పూర్ణిమ కోరల పూర్ణిమ.
పుష్య పూర్ణిముత్సర్జనోత్సవ పూర్ణిమ.
మాఘ పూర్ణిమ మహా మాఘి పూర్ణిమ.
ఫాల్గుణ పూర్ణిమ కాముని పున్నమి.

ఇక, మహా పౌషి (పుష్య పూర్ణిమ) విషయానికి వస్తే.. తమిళులు దీనిని ‘పూసమ్‍’ అంటారు. తై పూసమ్‍ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్‍వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్‍వేణిలో తామ్రపర్ణి నదిలో స్నానం పాపక్షయకరమై ఉంటుంది.

అంబ సముద్రం తాలూకాలో తిరుప్పుదైమారుతూరు అనే ఊరు ఉంది. అక్కడి దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవాన్ని పూజించడం విశేష పుణ్యప్రదమని అంటారు.
పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్‍ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది.

పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. అలాగే, మహాపౌపౌష్య పూర్ణిమ నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది. పుష్య శుద్ధ పూర్ణిమినే హిమశోధన పూర్ణిమ అని కూడా అంటారు.

పుష్య బహుళ (కృష్ణ) పాడ్యమి, జనవరి 22, మంగళవారం

పుష్య కృష్ణ పాడ్యమి నాడు విద్యావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు.

పుష్య బహుళ (కృష్ణ) అష్టమి, జనవరి 28, సోమవారం

పుష్య కృష్ణ అష్టమిని వివిధ వ్రత గ్రంథాలు కాలాష్టమిగా వర్ణించాయి.

పుష్య బహుళ (కృష్ణ) నవమి, జనవరి 29, మంగళవారం

పుష్య కృష్ణ నవమి తిథి నాడు అన్వష్టకా శ్రాద్ధమ్‍ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే గ్రంథంలో వివరించారు.

పుష్య బహుళ (కృష్ణ) దశమి, జనవరి 30, బుధవారం

పుష్య కృష్ణ దశమి.. స్వామి వివేకానంద జయంతి దినం.

పుష్య బహుళ (కృష్ణ) ఏకాదశి, జనవరి 31, గురువారం

పుష్య కృష్ణ ఏకాదశిని షట్‍ తిలైకాదశి అనే పేరుతో ‘ఆమాదేర్‍ జ్యోతిషీ’ అనే గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు తిలదాహీ వ్రతం చేస్తారని రాశారు. షట్‍ తిలైకాదశి అంటే.. ఆరు విధాలుగా తిలలను ఉపయోగించే ఏకాదశి అని భావం.
1. స్నానం చేసే నీటిలో నువ్వులను వేయాలి.
2. నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాచుకోవాలి.
3. ఆరు నువ్వుల గింజలను తినాలి.
4. తాగే నీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవాలి.
5. గురుజనులకు తిలలు దానం చేయాలి.
6. తిల తర్పణం విడువడం ద్వారా దేవతలకు నువ్వులు సమర్పించాలి.
ఈ ఏకాదశి నాడు నువ్వులను పై ఆరు విధాలుగా ఉపయోగించాలనే ఆచారం ఏర్పడటం వల్ల దీనికి షట్‍ (ఆరు) తిలైకాదశి అనే పేరు వచ్చింది.

పుష్య మాసం – నువ్వులు, బెల్ల

పుష్య మాసం శని మాసం. ఈ మాసంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని.. మన శరీర జీవనాడి కారకుడై ఉంటాడు. ఈ జీవనాడి యొక్క ఒకశాఖ హృదయ స్పందనను, రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి, శరీరంలోని కొవ్వు పదార్థం తగ్గడం వల్ల మకర మాసం మొదలయ్యే సమయానికే ఈ కొవ్వు కొరతను తీర్చాలని నియమం. ఇందువల్ల రవి ప్రభావం (ఎండ వేడిమి) ఎదుర్కోవడానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చేయడం వల్ల హృదయ స్పందన సక్రమంగా ఉంటేటట్టు చేయగల ‘నువ్వులు – బెల్లం’ తినాలనే నియమం పెట్టారు.

పుష్యమి నక్షత్రం శని నక్షత్రం. ఈ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి (గురువు). శనికి అధి దేవత యముడు. ‘యమం’ అంటే, ‘సం యమం’ అని అర్థం. అంటే ఆధీనంలో ఉంచుకోవడం. అంటే, శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవడం ఈ జీవనాడి మూలంగా మాత్రమే సాధ్యమవుతుంది. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్థం తక్కువైతే శరీరం చైతన్యం కోల్పోవడం, అనారోగ్యం మొదలైనవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి నువ్వులు, బెల్లానికి మాత్రమే ఉంది.
శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించే వాడు అతడే. భక్తులు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్టలు పాటిస్తే శని తన ధర్మాలన్నిటినీ ప్రసాదిస్తాడు. మనిషి ఎప్పుడైతే న్యాయం, సత్యం, ధర్మం వంటి శుభ లక్షణాలను పొందగలమో అప్పుడే అతను బృహస్పతి (గురువు) అంతటి వాడవుతాడు.

గరుడ పురాణంలో నాభి స్థానం శని స్థానం అని నిరూపితమైంది. పరమాత్ముని నాభి కమలం నుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడు. ఎప్పుడు శరీరంలోని ఈ నాభి ప్రదేశాన్ని శని ప్రదేశమని చెప్పారో, అప్పుడే ఆ ప్రదేశానికి ఇవ్వదగిన ప్రాముఖ్యమంతటికీ శని ప్రభావమే కారణమని చెప్పినట్టు మనం గ్రహించాలి.

-గణపతి సిద్ధాంతి విశ్లేషణ, తెలుగుపత్రికకు ప్రత్యేక

Review పుణ్యం … పుష్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top