కార్తీక దీపం

నవంబరు 1, గురువారం, ఆశ్వయుజ బహుళ అష్టమి నుంచి-నవంబరు 30, శుక్రవారం కార్తీక బహుళ అష్టమి వరకు
విలంబి నామ సంవత్సరం-ఆశ్వయుజం-కార్తీకం-శరదృతువు-దక్షిణాయన

ఆంగ్లమానం ప్రకారం పదకొండవ మాసం నవంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ – కార్తీక మాసాల కలయిక. ఆశ్వయుజ మాసంలోని కొన్ని రోజులు, కార్తీక మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. ఆశ్వయుజంలో వచ్చే పర్వాలలో ధన త్రయోదశి, నరక చతుర్దరశి, దీపావళి ముఖ్యమైనవి. దీపావళి నాడే ధనలక్ష్మి పూజ, కేదార గౌరీ వ్రతం ఆచరించడం తెలుగింటి సంప్రదాయం. నవంబరు 7వ తేదీతో ఆశ్వయుజ మాసపు తిథులు ముగుస్తాయి. 8వ తేదీ నుంచి కార్తీక మాస తిథులు ప్రారంభమవుతాయి. కార్తీక స్నానారంభంతో మొదలయ్యే ఈ మాసపు తిథులు భగినీ హస్త భోజనం, నాగుల చవితి, గురుపాడ్యమి, బాలల దినోత్సవం (నెహ్రూ జయంతి), చిలుక ద్వాదశి, తులసీ వ్రతారంభం, వైంకుఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి, పుట్టపర్తి సత్యసాయి బాబా జయంతి వంటి పుణ్య తిథులు, పర్వాలు, పండుగలతో ముగుస్తాయి. నవంబరు 1, ఆశ్వయుజ బహుళ అష్టమి, గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే నవంబరు నెల.. తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ, కార్తీక మాసాల కలయిక. ఆశ్వయుజ మాసం దీపావళి అమావాస్య (నవంబరు 7)తో ముగుస్తుంది. అంతకుముందు వచ్చే ధన త్రయోదశి (నవంబరు 5) పర్వం, దీపావళి రోజు నిర్వహించే ధనలక్ష్మీ పూజ అతివలకు ఆటపట్టయిన పర్వాలు. ఆశ్వయుజం ముగియడంతోనే వానా కాలం ముగుస్తుంది. నవంబరు 8వ తేదీ, కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక మాస తిథులు ప్రారంభమవుతాయి. కార్తీక మాసం ప్రవేశిస్తూనే చలి వణికిస్తుంది. అందరి ఆరోగ్యాలు నజ్జు నజ్జుగా ఉంటాయి. అందుకే ఈ మాసం పొడవున, నెలలోని ముప్పై రోజులు వివిధ వ్రత నియమాలను విధించారు. ఆయా వ్రతాలను ఆచరించడం ద్వారా, వీటి ద్వారా భగవంతునికి వివిధ నైవేద్యాలు నివేదించడం ద్వారా, తిరిగి వాటిని మహా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ప్రత్యేకించి కార్తీక మాసం శివారాధనకు ఎంతో ఉద్ధిష్టమైనది. కార్తీక మాసంలో తెల్లవారుజామునే సముద్ర, నదీ స్నానాలు చేయడం అత్యంత ఆవశ్యకం. ఈ విధంగా చేయడం ద్వారా ఆ నీటిలోని లవణాలు, పోషకాలు మన ఒంటికి భేషుగ్గా పడతాయని అంటారు. కార్తీక మాసం సంవత్సరంలో ఎనిమిదివ మాసం. మత్స్య పురాణం ప్రకారం ఈ నెలలో ఇంటి నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయని అంటారు. ముఖ్యంగా ప్రాతఃకాల స్నానాలు ఈ నెలలో ముఖ్యాచారం. అలాగే ఉసిరికను దైవికంగా కొలిచి, ఘన ఆహారంగా తీసుకోవాల్సిన మాసం మాసం కూడా ఇదే. కార్తీక మాసాన్నే కౌముదీ మాసం అని కూడా అంటారు. కౌముది అంటే వెన్నెల. పిండారబోసినట్టు ఈ నెలంతా వెన్నెల వెలుగులు పరుచుకుని ఉంటాయి. భువిలో జ్యోతులుగా వెలిగే దీపాలు ఆ వెన్నెల వెలుగులకు మరింత శోభను చేకూరుస్తాయి. పూర్తిగా ఈ నెలంతా శివ, వైష్ణవారాధనకు అనువైనది. ఈ మాసంలో కూరలేమీ తినకుండా ఉసిరికాయ వ్యంజనంగా తిన్నవారికి, మోదుగ ఆకుల్లో భోజనం చేసే వారికి, తెల్లవారుజామునే గోపూజ చేసే వారికి అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. ఈ నెలలో వచ్చే ఆయా తిథుల్లో ఏమేమి వ్రతాలు, పూజా నియమాలు విధించారో ఒకసారి పరిశీలిద్దాం.

ఆశ్వయుజ బహుళ (కృష్ణ) అష్టమి, నవంబరు 1, గురువారం

ఆశ్వయుజ బహుళ అష్టమినే జితాష్టమిగా కూడా వ్యవహరిస్తారు. జీమూత వాహనుడిని ఈ రోజు పూజిస్తారు. ఇది స్త్రీలకు సంతాన ప్రాప్తిని కలిగించే మహిమ గలదిగా ఈ తిథికి పేరు. సాయంకాలం ప్రదోష సమయంలో జీమూత వాహనుడిని పూజించాలని నియమం. ఈ వ్రతాచరణ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. చతుర్వర్గ చింతామణిలో మంగళా వ్రతం, కృతస్సార సముచ్ఛయంలో మహాలక్ష్మీ వ్రతం ఈనాడు ఆచరించాలని రాశారు. కృత్యసార సముచ్ఛయం అనే ఈ వ్రత గ్రంథంలో ఆశ్వయుజ బహుళ అష్టమిని జీవత్తు పుత్రికాష్టమీ అని పేర్కొన్నారు. ఆమాదేర్‍ జ్యోతిషీలో దీనినే కాలాష్టమిగా వ్యవహరించారు.

ఆశ్వయుజ బహుళ (కృష్ణ) నవమి, నవంబరు 2, శుక్రవారం

ఆశ్వయుజ కృష్ణ నవమి నాడు రథ నవమీ వ్రతం చేసి దుర్గాపూజ నిర్వహించాలని వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు.

ఆశ్వయుజ బహుళ (కృష్ణ) ఏకాదశి, నవంబరు 3, శనివారం

ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథం ఈ ఏకాదశిని రమైకాదశిగా పేర్కొంది. శోభనుడు అనే రాజు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వర్గలోక ప్రాప్తిని పొందగలిగాడని ప్రతీతి. అలాగే, మరికొన్ని వ్రత గ్రంథాలలో ఈనాడు వాల్మీకి జయంతిగా పేర్కొన్నారు.

ఆశ్వయుజ బహుళ (కృష్ణ) ద్వాదశి, నవంబరు 4, ఆదివారం

ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి ‘ధన్వంతరి జయంతి’గా వ్యావహారికంలో ఉంది. ధన్వంతరి గొప్ప వైద్య విద్యావేత్త. అతని ప్రాదుర్భావాన్ని గురించి రెండు మూడు కథలు వ్యావహారికంలో ఉన్నాయి. పాల కడలి నుంచి అమృతభాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తియే ధన్వంతరిగా అవతరించాడని ఒక కథ.

ధన్వంతరి కలశం నుంచి పుట్టాడు. అప్పుడు విష్ణువు ఆయనతో నీవు అబ్జుడవనే పేరు పొందాలని సూచించాడు. దీంతో ధన్వంతరి ‘తండ్రీ! నీ కుమారుడైన నాకు యజ్ఞ భాగం ఇప్పించే ఏర్పాటు చేయవలసింది’ అని విష్ణువును ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు విష్ణుమూర్తి- ‘య్ఞ భాగములు ఇది వరకే వారి వారికి నిర్దిష్టమై ఉన్నాయి. కాగా, నీ కోసం ఇప్పుడు కొత్త ఏర్పాటు చేయడానికి వీలులేదు. రెండవ ద్వాపర యుగంలో నీకు పెద్ద పేరు వస్తుంది. అప్పుడు యజ్ఞకర్తలు నిన్ను ఉద్దేశించి చాతుర్మంత్రములతో పఠిస్తారు’ అని పలికాడు.

రెండవ ద్వాపర యుగంలో దీర్ఘతప్తుడు అనే వాడు పుత్రుల కోసం అబ్జుడి గురించి తపస్సు చేశాడు. అప్పుడు ధన్వంతరి ప్రత్యక్షమై ‘నేనే నీ కడుపున కొడుకుగా పుట్టుచున్నాను’ అని చెప్పాడు.

అలాగే, ఆయన ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి రోజున జన్మించాడు. పెరిగి పెద్దవాడైన తరువాత భరద్వజుడికి శిష్యుడయ్యాడు. అతని వద్ద ఆయుర్వేదమును నేర్చుకున్నాడు. దివోదాసు నామం ధరించాడు. కాశికి రాజయ్యాడు.

ఇదంతా బ్రహ్మాండ పురాణంలో ఉన్న ధన్వంతరి గాథ. ఒకచేత్తో జలగ, మరో చేత్తో అమృతభాండం పట్టుకుని ధన్వంతరి జన్మించాడని అంటారు. ధన్వంతరి అమృత కలశంతో జన్మించాడని, ఆ కలశంలోని అమృతం సేవించడం చేత అన్ని విధాలైన రోగాలు నశించాయని ఇతిహాస్యం.

ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరిని పూజించే వారికి రోగ భయం ఉండదని అంటారు.
ఇంకా ఆశ్వయుజ బహుళ ద్వాదశి తిథి నాడు వ్యాఘ్ర ద్వాదశి వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఉంది. ఈ పర్వాన్నే గుజరాతీలు ‘వాగ్‍ బరాస్‍’గా వ్యవహరిస్తారు. వాగ్‍ అంటే పెద్దపులి. బరాస్‍ అంటే ద్వాదశి. ఈనాడు మాళవ దేశపు స్త్రీలు గోవత్స ద్వాదశీ వ్రతం చేస్తారు. దూడతో కూడిన ఆవును పూజిస్తారు. ఈ రెండింటికీ ఉడకపెట్టని ధాన్యం పెడతారు. వాటి నుదుటి మీద ఎర్రబొట్టు ఉంచుతారు. ఆవుల వల్ల లభ్యమయ్యే పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవేవీ ఈనాడు ఈ పూజ చేసే స్త్రీలు తిన కూడదని నియమం. ఈ పూజను శిశువుల క్షేమంకోసం ఆచరించాలని అంటారు.

ఆశ్వయుజ బహుళ (కృష్ణ) త్రయోదశి, నవంబరు 5, సోమవారం

ఆశ్వయుజ బహుళ త్రయోదశి.. ధన త్రయోదశి తిథి. ఇంకా ఈనాడు గో త్రిరాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాటికి దీపావళి రెండు రోజులు ఉంటుంది. దీపావళి గుజరాతీయులకు సంవత్సరాది. వారు ఈ ఉగాదికి రెండు రోజులు పూర్వం, రెండు రోజులు తరువాత కూడా వారికి పండుగలై ఉన్నాయి. అనగా దీపావళి పర్వ సందర్భమున వారికి వరుసగా ఐదు రోజులు పండుగలన్న మాట. ఆ ఐదు రోజుల పండుగలలో త్రయోదశి మొదటిది.

ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథిని ‘ధన త్రయోదశి’గా పేర్కొన్నారు. ఈ పర్వాన్నే గుజరాతీలు ‘ధన్‍తీరాస్‍’ అంటారు. త్రయోదశి అనగా పదమూడో తిథి. పదమూడు మంచి అంకె కాదని పాశ్చాత్యుల విశ్వాసం. మనకు మాత్రం పదమూడో తిథి మంచి రోజు.

ధన త్రయోదశిని గుజరాతీయులు, మహారాష్ట్రీయులు గొప్పగా నిర్వహించుకుంటారు. ఈనాడు వారు ఇళ్లను శుభ్రం చేస్తారు. అలికి, కడిగి, రంగురంగుల ముగ్గులు పెడతారు. వీధి వాకిలిలో కూడా రంగుల ముగ్గులు పెడతారు. శుచిగా ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుందని వారి విశ్వాసం. ఈనాటి నుంచీ దీపాలు వెలిగించడం ప్రారంభ మవుతుంది.

ఈనాడు అభ్యంగన స్నానం చేయాలి. మంచి బట్టలు కట్టుకుని సుగంధ ద్రవ్యాలు చల్లుకుని ధనపూజ ఆచరించాలి.

ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను, వెండి వస్తువులను పాలతో కడుగుతారు. వాటిని శుభ్రం చేసి పూజ చేసే చోట ఉంచుతారు. ఈనాడు షావుకార్లు తమ డబ్బు నిల్వ సరిచూసుకుని లక్ష్మీపూజ చేస్తారు.

ఈ పండుగకు యమలోకంలోని పితురులు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్తుల నమ్మిక. ఈ కారణంగా వారు పితరులను ఆహ్వానిస్తూ ధన త్రయోదశి సాయంకాలం వేళ తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. తమ ఇంటికి వచ్చే పితరులకు అది దారి చూపిస్తుందని విశ్వాసం. ఈనాడు ఇంటిలో గదికి ఒక దీపమైనా ఉంచుతారు. ఇంటిలో దీపాలు స్త్రీలు పెడతారు. రోడ్డు మీద దక్షిణ దిక్కుగా పెట్టే దీపం తల్లిదండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు. ఇంటి యజమానికి తల్లిదండ్రులు ఉంటే ఈ దీపం అసలు పెట్టనే పెట్టరు.

ఆశ్వయుజ బహుళ (కృష్ణ) చతుర్దశి, నవంబరు 6, మంగళవారం

ఈ చతుర్దశి నాడు అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమ తర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందని కొందరు అంటారు.

నరక చతుర్దశికి ‘ప్రేత చతుర్దశి’ అనే పర్యాయ నామం కూడా ఉంది. ఈనాడు నరక విముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని వ్రత చూడామణి అనే గ్రంథంలో ఉంది. గుజరాతీలు నరక చతుర్దశిని కాలచౌదశ్‍ అంటారు. సంస్క•తంలో కాళ చతుర్దశి, అంటే అంధకారపు చతుర్దశి అని అర్థం.
నరకలోక వాసులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించడానికి చేసే ఉత్సవమనీ, తమకు నరకలోక ప్రాప్తి లేకుండా చేసుకునే కార్యకలాప దినమనీ నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశి అని నమ్మకం.

చతుర్దశి నాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అంతా నరకం నుంచి స్వర్గానికి వెళ్తారని పురాణ వాక్కు.
ఈ తిథి నాడు చీకటి ఉండగానే, అంటే తెల్లవారకుండానే అభ్యంగన స్నానం చేయాలి. వేకువజామున తైలాభ్యంగం చేసుకుని యమతర్పణం చేసిన వారికి యమ దర్శనం లేదని శాస్త్ర వచనం.

అలాగే, ఈనాడు స్నానానికి ఉపయోగించే వాటిని ఉత్తరేణి, తగిరిస చెట్ల కొమ్మలతో కలియబెట్టాలి. అలా కలిపిన జలంలో విద్యుత్తు ఉత్పాదమవుతుంది. పైగా ఆయా ఔషధాల సమ్మేళనం చేత ఆ జలంలో రసాయనికమైన మార్పులు వస్తాయి. అటువంటి నీటిని పోసుకోవడం ఆరోగ్యప్రదం. స్నానం చేస్తూ ఉండగా తలచుట్టూ దీపం తిప్పడం, ఆపై టపాకాయలు కాల్చడం తెలుగునాట సంప్రదాయం.

సూర్యుడు రాకుండా చంద్రోదయ కాలాన శాస్త్రోక్తంగా ఈనాడు చేసే స్నానం వల్ల నరక బాధలు లేకుండా రక్షణ అవుతుంది. నరకం నుంచి తప్పించినందుకు నరకస్వామి అయిన యముడికి ఆ మీద తర్పణం చేయాలి. ఆ సమయంలో ఉత్తరేణి ఆకుల్ని తలపై ఉంచుకోవాలి. ఇది నెలలో పద్నాలుగవ తిథి. కాబట్టి యుముడిని పద్నాలుగు నామాలతో అర్చించాలి. దక్షిణాభిముఖంగా కూర్చోవాలి. ఒక్కో నామాన్ని ఉచ్ఛరిస్తూ తిలలతో కూడిన •లాంజలులు మూడేసి విడవాలి.
నరక చతుర్దశి నాడు తినవలసిన ఆహార విషయమై మన పెద్దలు కొన్ని నియమాలు ఏర్పరిచారు. తిలలతో అనగా నువ్వులతో వండిన పిండి వంటలు ఈనాడు తప్పక తినాలి. మినుములతో చేసిన పదార్థాలు, ప్రేత చతుర్దశి నాడు మినప పత్ర భక్షణం చేయాలని అంటారు. అలాగే, అప్పాలు, కూరలు బాగా తినాలని నియమం.

నరక చతుర్దశి నాడు సాయంకాలం ప్రదోష కాలంలో దీపదానం చేయాలి. దేవాలయాల్లో, మఠాల్లో దీపపంక్తులు ఉంచాలి. లక్ష్మీకటాక్షమునకే మానవులు ఈనాడు, దీపావళి నాడు, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు దీప దానం విధిగా చేయాలి.

కాగా, ఆశ్వయుజ బహుళ త్రయోదశి- చతుర్దశి తిథుల నడుమ కాలంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా నరక చతుర్దశి పండుగ జరుపుకోవడం ఆచారమైంది. అయితే, నరక చతుర్దశికి నరకాసురుడికి సంబంధం లేదని అంటారు.

ఆశ్వయుజ బహుళ (కృష్ణ) అమవాస్య, నవంబరు 7, బుధవారం

ఆశ్వయుజ కృష్ణ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. దీపమాలికలతో లక్ష్మికి నీరాజనం ఇచ్చే దినం కావడం చేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది.
నరకలోక వాసుల కోసం దీప + ఆవళి కల్పించే దినం కాబట్టి దీపావళి అయ్యింది. హిందూమత సంస్క•తికి, హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నమని చెప్పాలి. ఈ తిథికి ఉన్న విశేషాలివీ..

రాక్షస రాజైన బలి చక్రవర్తి పాతాళానికి విష్ణువునే అణగదొక్కబడిన దినం కావడం చేత ఇది ఒక మహోత్సవ దినంగా పరిగణనలో ఉంది.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన దినం కాబట్టి మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది.

విక్రమ శక స్థాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం పొందిన దినం.

లక్ష్మీదేవి ఈనాడు భూలోకానికి దిగి వచ్చి ఇల్లిల్లు తిరుగుతుందని ప్రజల విశ్వాసం. కాబట్టి ఇల్లు, లోగిని శుచిగా ఉండాలి. మధ్నాహ్నం పిండివంటలతో భోజనం, భోజనానంతరం జూదం ఆడటం, లక్ష్మీదేవి తమ ఇంటికి రావడానికి దారి చూపేందుకు దీపాలు.. ఇవీ ఈనాటి విధాయ కృత్యాలు.

మహారాష్ట్ర, గుజరాత్‍లలో దీపావళి ఐదు రోజుల పర్వం. దీపావళి అనగా దీపాల సమూహమని అర్థం.
ఈనాడు విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి అణచివేసి అతని ఆదీనంలో ఉన్న దేవతలను విడుదల చేశాడు. అలా విడుదల చేసిన ఆ దేవతల్ని లక్ష్మితో పాటు క్షీరసాగరానికి తీసుకువెళ్లాడు. ఆ దేవతలు చాలా కాలం అక్కడే ఉండిపోయారు. దేవతలు బలి జ్ఞప్తిగా ఖైదు నుంచి విడుదలై లక్ష్మితో క్షీరసాగరానికి చేరి పొందిన ఆనంద దినాలకు గుర్తుగా ఈ పండుగ ఏర్పడింది. ఈ పండుగ లక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. కావునే దీపావళి పర్వంలో లక్ష్మీపూజ ప్రధాన కార్యమై ఉంటుంది. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం పుణ్యప్రదం. నెయ్యి లేక నూనె, పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగించాలి. దీపావళి పండుగకు వెలుతురు ఇచ్చే, చప్పుడు చేసే, బాణాసంచా కాల్చడం సంప్రదాయం.

మహాలయ పక్షంలో స్వర్గం నుంచి దిగి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉండే పితరులు ఈనాడు తిరిగి పితృలోకానికి ప్రయాణమై వెళ్తారు. వారికి వెలుతురు చూపడం నిమిత్తం మానవులు తమ చేతులతో కాగడాలు పట్టుకుని ఆకాశం వైపు చూపాలని శాస్త్ర వచనం. ఆ కాగడాలే నేడు దీపావళి పండుగలో మతాబులు, ఇతర టపాసులు కాల్చడంగా మారింది. ఇక, చప్పుడు చేసే టపాకాయల విషయం గురించి తెలుసుకుందాం. దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ చేసిన అనంతరం నిద్రపోకుండా ఉండి అర్ధరాత్రి సమయాన చేటల మీద కర్రలు కొట్టి, డిండిమం అనే వాద్యాలు వాయించి ఆ లక్ష్మిని వీధుల వెంట సాగనంపాలని శాస్త్ర వచనం. ఆ వాద్య ధ్వనులే ఇప్పుడు టపాకాయలు కాల్చడంగా మారింది. అయితే, నరకాసురుని చావుకి సంతోషించి భూలోకంలోని వారు బాణసంచా కాలుస్తున్నారనే విశ్వాసం ప్రస్తుతం వ్యావహారికంలో ఉంది.

అసలు ఈ సరకాసురుడు ఎవరో తెలుసుకుందాం.

భూదేవి కొడుకు నరకాసురుడు. అతని కోసం భూదేవి తన భర్త అయిన విష్ణుమూర్తిని వేడుకొని వైష్ణవాస్త్రాన్ని తెచ్చింది. నరకుడు చనిపోయాక ఆ వైష్ణవాస్త్రం అతని కొడుకైన భగదత్తుడి వశమైంది. భారత యుద్ధంలో భగదత్తుడు కౌరవుల పక్షం వహించాడు. ఆ యుద్ధంలో అతను వైష్ణవాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు. అది మెరుస్తూ, ఉరుముతూ అర్జునుడి మీదికి రాసాగింది. పార్థసారథి అయిన కృష్ణుడు ఇది చూసి తొడల మీద లేచి అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు. ఆ వైష్ణవాస్త్రాన్ని నిలువరించేందుకు తన కుడి చేతిని ముందుకు చాచాడు. దీంతో వైష్ణవాస్త్రం నిస్తేజమైపోయింది. అతని కంఠ ప్రదేశాన్ని చుట్టి చుట్టి చల్లారిపోయింది. చల్లారి నక్షత్రాల వలే మినుకు మినుకుమనే పూలగుత్తులతోడి వనమాల అయి శ్రీకృష్ణుడి మెడలో వేలాడినది. ఇది స్ఫురింపచేయడానికే దీపావళి నాడు బొగ్గు పొడి, ఉప్పురాళ్లు కలిపి ముతకగుడ్డలో చుట్టి, నిప్పు ముట్టించి వీధుల్లో తిప్పుతారు. ఇవి నిప్పురవ్వలు రాలుస్తూ వైష్ణవాస్త్రం మాదిరిగా తిరుగుతాయి.

ఇక, దీపావళితో బలి చక్రవర్తికి గల సంబంధాన్ని చూద్దాం. ఈ తిథి నాడే విష్ణువు రాక్షస రాజైన బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగి, అతనిని పాతాళానికి అణచివేశాడు. మహాబలి అనే రాక్షసరాజు పీడ విరగడ కావడంతోటే జనులు సంతోషించారు. ఆ సంతోషంలో తలంటి పోసుకున్నారు. కొత్తబట్టలు కట్టుకున్నారు. దీపాలు వెలిగించారు. టపాకాయలు కాల్చారు. మధురమైన పిండివంటలు చేసుకొని ఆరగించారు. జనులతో పాటు బలి అనుచరులు పాతాళానికి వెళ్లిన తమ ప్రభువు ఆత్మకు శాంతిని కోరి స్నానం చేసి పూజాభావంతో దీపాలు వెలిగించారు. ఈ విధంగా సర్వేసర్వత్రా నాడు దీపాలు వెలిగాయి. బలి చక్రవర్తికి ప్రీతిదాయకంగా ఇట్లా దీపావళి ఆరంభమైనది. నాటి నుంచి ఈ పండుగ ప్రచారంలోకి వచ్చింది.

నరక చతుర్దశి నాడు కానీ, దీపావళి అమావాస్య నాడు కానీ స్వాతీ నక్షత్రం వస్తే ఉత్తమ యోగమని మన పెద్దలు అంటారు.
దీపావళి నాటి రాత్రి చేసే లక్ష్మీపూజ పుణ్యప్రదమైనది. ఈనాడు లక్ష్మీదేవి భూలోకానికి దిగి వచ్చి ఇల్లిళ్లూ తిరుగుతుందని, శుభ్రంగా ఉన్న ఇంటిలో తన అంశను ఉంచి వెళ్తుందని విశ్వాసం. అందుచే భారత స్త్రీలు ఈనాడు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. పగిలిపోయిన, పనికిరాని వస్తువులను తీసిపారేస్తారు. లక్ష్మీ విగ్రహానికి పూజ చేస్తారు. ఆమె విగ్రహం ముందు తమ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, నగలు, నాణేలు ఉంచుతారు.

లక్ష్మీపూజ అనంతరం ఆనాటి రాత్రి ఇక నిద్రపోకూడదు. జూదం మొదలైన ఆటపాటలతో మేలుకొని ఉండాలని శాస్త్ర వచనం. ఇలా పవిత్రంగా పూజ జరిగింది కాబట్టి లక్ష్మి ప్రసన్నురాలై ఆ ఇంట ప్రవేశిస్తుంది. లక్ష్మీ ప్రవేశించిన ఇంటిలో అలక్ష్మికి స్థానం లేదు. కాబట్టి అక్కడి నుంచి అలక్ష్మీ వెళ్లిపోతుంది.

దీపావళి అమావాస్య మొదలు నెల రోజులు అనగా, మళ్లీ అమావాస్య వరకు ఇంటి వెలుపల ఆకాశదీపం ఉంచే వారికి అనంత పుణ్యమని శాస్త్ర వచనం.
మన పెద్దలు కొన్ని పండుగలకు కొన్ని కొన్ని ఆకులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ రుతువుకు ఆ ఆకుల వాడకం ఆరోగ్యదాయినిగా ఉంటుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వేప పువ్వు, చైత్ర శుద్ధ అష్టమి నాడు అశోక కలికా ప్రాశనం, మకర సంక్రాంతికి బూడిద గుమ్మడి ఆకులు, రథసప్తమికి చిక్కుడాకులు, దీపావళి నాడు మాష పత్రాలకు మన పెద్దలు పెట్టపీట వేశారు. మాష పత్రాలు అంటే మినప ఆకులు.

కార్తీక శుద్ధ (శుక్ల) పాడ్యమి, నవంబరు 8, గురువారం

కార్తీక శుక్ల పాడ్యమి నాడు ఏయే వ్రతాలు చేయాలనే విషయమై రకరకాల నిబంధనలు ఆయా వ్రత గ్రంథాలలో ఉన్నాయి. స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు అన్నకూటము, గోవర్ధన ప్రతి పదము, అభ్యాసనము, లక్ష్మీపూజ, ద్యూతము, గోవర్ధన పూజ, అన్నకూటోత్సవ అపరాహ్ణే మార్గపాలీ బంధనం వంటి వ్రత విధులు ఆచరించాలని నిర్దేశించారు. అలాగే, గదాధర పద్ధతి ప్రకారం.. ఈనాడు బలిరాజోత్సవం, ద్యూతమ్‍, బలిప్రతిపత్‍, ద్యూత ప్రతిపత్‍ వ్రతాలు చేయాలని ఉంది. పురుషార్థ చింతామణి వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు భాస్కర కృచ్ఛ వ్రతం ఆచరించాలి. అంటే మొదటి ఐదు రోజుల పాటు అన్నం, తరువాత ఐదు రోజులు పెరుగు అన్నం తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వ్రత విధి. కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అని కూడా అంటారు. బలి చక్రవర్తికి ప్రీతికరమైన పాడ్యమి ఇది. దీనికి ముందు వచ్చే ఆశ్వయుజ మాసంలో వచ్చే నరక చతుర్దశి, అమావాస్యల మాదిరిగానే ఈనాడూ అభ్యంగన స్నానం చేసి దీపావళి ఉత్సవం నిర్వహించడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది.

కార్తీక శుద్ధ (శుక్ల) విదియ, నవంబరు 9, శుక్రవారం

కార్తీక శుక్ల విదియ (ద్వితీయ) తిథి నాడు కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. అలాగే, స్మ•తి కౌస్తుభం ఈ తిథిని యమ ద్వితీయగా పేర్కొంటోంది. ఈనాడు యముడిని పూజించాలి. సోదరి ఇంట భోజనం చేయాలి. ఈ పక్రియనే భగినీ హస్త భోజనం అంటారు. ఈనాడు చంద్రార్ఘ్య దానం తప్పక చేయాలని అంటారు. శుక్ల విదియ నాడు చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. కాగా, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు పూజలు అందుకునే బలి చక్రవర్తి విదియ నాడు తిరిగి పాతాళానికి వెళ్లిపోతాడు. కాబట్టి ఈనాడు విధాయకంగా బలికి వీడ్కోలు పూజలు నిర్వహించాలి. అలాగే తాహతును బట్టి దాన ధర్మాలు నిర్వహించాలి.

కార్తీక శుద్ధ (శుక్ల) తదియ, నవంబరు 10, శనివారం

కార్తీక శుక్ల తృతీయనే సోదరి తృతీయ అని కూడా అంటారు. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు వైష్ణవ కృచ్ఛ వ్రతం చేయాలని ఉంది. అలాగే ఈనాడు విష్ణు గౌరీ వ్రతం ఆచరించాలని కూడ అందులో రాశారు. లక్ష్మీదేవిని యథాశక్తి పూజించి, ముత్తయిదువులను పిలిచి మంగళ ద్రవ్యాలతో వారిని గౌరవించి, వారికి భోజనం పెట్టాలి. అలాగే మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉన్న ప్రకారం- ఈనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేయాలని నియమం విధించారు. అయితే, వ్రతాలన్నిటి కంటే సోదరి తృతీయ పర్వంగానే ఈ తిథి మిక్కిలి ప్రసిద్ధి చెంది ఉంది. ఈనాడు సోదరి సోదరుడిని, సోదరుడు సోదరిని పరస్పరం గౌరవించుకుంటారు. అందుకే దీనికి ‘సోదరి తృతీయ’ అనే పేరు వచ్చింది.

కార్తీక శుద్ధ (శుక్ల) చవితి), నవంబరు 11, ఆదివారం

కార్తీక శుక్ల చవితి నాగుల చవితి పర్వదినం. ఇది ఆంధప్రదేశ్‍లో ఎక్కువ ఆచరణలో ఉన్న తిథి పర్వం. ఈనాడు గోదావరి తీర ప్రాంతాల్లో నాగ పూజలను చేస్తారు. నాగుల చవితిగా వ్యవహరించే ఈనాడు పాముల పుట్టలలో పాలు పోస్తారు. అలాగే, ఈనాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. కార్తీక శుద్ధ పంచమి నాడు జయపంచమి, శాంతి వ్రతాలు ఆచరించాలని కూడా ఈ గ్రంథంలో ఉంది. ఈ తిథి మొదలు వరుసగా ఏడు రోజులు క్రమం తప్పకుండా రోజూ ‘యవాగుయావక శాకదధి క్షీరఘృత జలనామాహార’ అనే వ్రతాన్ని ఆచరించాలని అంటారు. కార్తీక శుద్ధ పంచమినే నాగపంచమి అని కూడా అంటారు. జైనులు ఈనాడు తమ ఇళ్లలోని పాత పుస్తకాలను దులిపి, శుభ్రం చేసుకుని తిరిగి వాటిని యథా స్థానంలో ఉంచుతారు.

కార్తీక శుద్ధ (శుక్ల) పంచమి, నవంబరు 12, సోమవారం

కార్తీక శుక్ల పంచమి తిథి నాటి నుంచి గురు మౌడ్యమి ప్రారంభమవుతుంది. జయ పంచమి, జ్ఞాన పంచమి విధులు నిర్వర్తించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

కార్తీక శుద్ధ (శుక్ల) షష్ఠి, నవంబరు 13, మంగళవారం

కార్తీక శుక్ల షష్ఠి.. మహా షష్ఠి పర్వంగా ప్రసిద్ధి. ఈనాడు వహ్ని పూజ చేయాలని అంటారు. కుమారస్వామిని పూజించడానికి ఈ తిథి మిక్కిలి అనుకూలమైనది. చతుర్వర్గ చింతామణి అనే ఈ గ్రంథంలో ఈనాడు స్కంధ షష్ఠి వ్రతం చేయాలని ఉంది. ఈ తిథి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మూడు రాత్రులు పాలు తాగి ఉపవాసం ఉండాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడాన్ని మహేంద్ర కృచ్ఛ వ్రతమనీ అంటారు. అలాగే, ఈనాడు మనవాళ మహాముని తిరు నక్షత్ర తిథి కూడా.

కార్తీక శుద్ధ (శుక్ల) సప్తమి, నవంబరు 14/15, బుధ/గురువారాలు

కార్తీక శుక్ల సప్తమి తిథి నాడు కల్పాదిగా వ్యవహరిస్తారు. అలాగే, శాక సప్తమీ వ్రతం కూడా ఆచరిస్తారు. లక్ష్మీప్రద వ్రతం కూడా ఆచరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. నీరు, బిల్వ దళాలు, పద్మాలు, తామర తూళ్లు మాత్రమే తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉండటాన్ని బట్టి ఇది చాలా కఠిన నియమాలతో కూడిన వ్రతమని అర్థమవుతోంది. కాగా, సప్తమి తిథి నవంబరు 14 తేదీన మొదలై 15వ తేదీ, గురువారం కూడా కొన్ని ఘడియల పాటు కొనసాగుతుంది. ఇంకా, బాలలకు ఎంతో ఇష్టమైన నెహ్రూ జయంతి దినం కూడా నవంబరు 14నే. ఈనాడు బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.

కార్తీక శుద్ధ (శుక్ల) అష్టమి, నవంబరు 16, శుక్రవారం

కార్తీక శుక్ల అష్టమి నాడు గోపూజ చేయడం మిక్కిలి పుణ్యప్రదమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ వ్రత నియమాల గురించి వివరించారు. అలాగే, ఈనాడు గోపాష్టమి నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు.

కార్తీక శుద్ధ (శుక్ల) నవమి, నవంబరు 17, శనివారం

కార్తీక శుక్ల నవమి.. మన పంచాంగాల ప్రకారం ‘కృత యుగాది’ దినం. యుగాలలో కృతయుగం శ్రేష్ఠమైనది. దీని కాల పరిమితి 1728000 మానవ సంవత్సరాలు. అలాగే ఈనాడు నదీ, సముద్ర స్నానం చేయడం గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో మాత్రం- ఈనాడు దుర్గా నవమి ఆచరించాలని ఉంది. తిథి తత్వం అనే మరో గ్రంథం ప్రకారం- ఈనాడు చండీపూజ చేయాలని ఉంది. ఇవి రెండూ అమ్మవారి ఆరాధనకు సంబంధించినవే కావడం విశేషం. మొత్తానికి మన పంచాంగ కాలమే ప్రమాణం కాబట్టి ఈనాటి తిథిని కృత యుగాదిగానే ఆచరించాలి.

కార్తీక శుద్ధ (శుక్ల) దశమి, నవంబరు 18, ఆదివారం

చతుర్వర్గ చింతామణిలో ఈనాడు సార్వభౌమ వ్రతం, రాజ్యావ్యాప్తి దశమి వ్రతం వంటివి ఆచరించాలని ఉంది.

కార్తీక శుద్ధ (శుక్ల) ఏకాదశి, నవంబరు 19, సోమవారం

కార్తీక శుద్ధ ఏకాదశి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. మొత్తం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి. అత్యంత ప్రాశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే, ఆనాడు పాల సముద్రంలో శేష తల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడు. అందుచేత, విష్ణువు నిద్రలేచిన రోజు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిన్యేకాదశి అని కూడా అంటారు. ఈనాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. పండరి భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు. ఇంకా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి దినం కూడా ఈనాడే.

కార్తీక శుద్ధ (శుక్ల) ద్వాదశి, నవంబరు 20, మంగళవారం

వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని, అందుకే ఇది మథన ద్వాదశి దినం అయ్యిందని అంటారు. దీనినే మన తెలుగు నాట ‘చిలుక ద్వాదశి’గా వ్యవహరిస్తారు. మథించడాన్నే చిలకడం అని కూడా అంటారు. అలాగే క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కా•ట్టే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు క్షీరాబ్ధి నుంచి బయల్దేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి తులసీ బృందావనానికి చేరుకుంటారు. కాబట్టి ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఉంది. అలాగే, కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వ్రతాలు ఆచరించే సంప్రదాయం వివిధ ప్రాంతాలలో ఉంది. ఈ వ్రతాల నియమాలన్నీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో సవివరంగా ఉన్నాయి. కాగా, ఈనాటితో చాతుర్మాస వ్రతం పరిసమాప్తి అవుతుంది. అనూరాధ కార్తె ప్రారంభం అవుతుంది.

కార్తీక శుద్ధ (శుక్ల) త్రయోదశి, నవంబరు 21, బుధవారం

కార్తీక శుక్ల త్రయోదశి శనిదేవునికి, శివుడికి ప్రీతికరమైనది. ఈనాడు శని త్రయోదశి పూజలు నిర్వహిస్తారు. శనిదేవుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే గో త్రిరాత్ర వ్రతం ఈ తిథి నాడే ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

కార్తీక శుద్ధ (శుక్ల) చతుర్దశి, నవంబరు 22, గురువారం

కార్తీక శుక్ల చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి. విష్ణుమూర్తి శంకరుడిని పూజించిన తిథి. విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని ఈనాడు పూజించాడని అంటారు. కాబట్టి ఇది పవిత్రమైన పర్వదినంగా భావించాలి.

కార్తీక శుద్ధ (శుక్ల) పౌర్ణమి, నవంబరు 23, శుక్రవారం

కార్తీక మాసమంతా వెలిగే కార్తీక దీపోత్సవంనాడు మరింత దేదీప్యమానం అవుతుంది. కార్తీక పూర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ వంటిదే. అదీ నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ‘ఈనాటి రాత్రి స్త్రీలు తులసి చెట్టు వద్ద 365 వత్తులు నేతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తార’ని కొఠారీస్‍ హిందూ హాలీడేస్‍ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. మూడు రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుడిని సంహరించడంతో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తీక పూర్ణిమ నాడు దీపాల పండుగను జరుపుకుంటారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అలాగే, ఈ దినం త్రిపురాసురుని సంహరించిన దినం కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలు అయితే, వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు.

కార్తీక పూర్ణిమ మరెన్నో విధాలుగా ప్రాశస్త్యమైనది. ఈనాడు మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.
కార్తీక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యావహారికంలో ఉన్నాయి. ‘కర్ణుడు చనిపోయాక భారతం లేదు. కార్తీక పౌర్ణమి వెళ్లాక వానలు లేవు’ అని తెలుగు రాష్ట్రాలలో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది.

ఈనాడు పలుచోట్ల జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట రెండు స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండు గడ్డి వాములు ఆ మూడు స్తంభాలకు దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతుండగా శివుడిని, పార్వతిని ఒక పల్లకిలో ఉంచి దాని కిందుగా మూడుసార్లు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్న గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డి వాము లోపల దూర్చి దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయని విశ్వాసం.

పార్వతీదేవి మొక్కు ఫలితంగా జ్వాలా తోరణ ఉత్సవం ఏర్పడిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచన అని అంటారు. సహగమనం అంటే అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక నేపథ్యమిదీ.

ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఆ సందర్భంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధిమైందని అంటారు. అలాగే, రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టి దోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయచిహ్నమే ఈ పర్వమనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
ఈనాడు కార్తీక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతమిది. తెలుగు నాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించిందని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి (దుర్గ) తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలుగొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం జరిగింది.

కార్తీక బహుళ (కృష్ణ) పాడ్యమి, నవంబరు 24, శనివారం

కార్తీక బహుళ పాడ్యమి నాడు అన్నదానం మహా ఫలప్రదమైనదని అంటారు. అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఒక నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది.

కార్తీక బహుళ (కృష్ణ) విదియ, నవంబరు 25, ఆదివారం

కార్తీక బహుళ విదియ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. అలాగే, విదియ ఘడియల్లోనే తదియ కూడా ప్రవేశిస్తుంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు భద్ర వ్రతం ఆచరించాలని ఉంది. ఇది దేవికి సంబంధించిన వ్రతంగా తెలియవస్తుంది.

కార్తీక బహుళ (కృష్ణ) చతుర్థి, నవంబరు 26, సోమవారం

కార్తీక బహుళ చవితి స్త్రీలకు సౌభాగ్య ప్రదమైన వ్రతాలలో చతుర్థి వ్రతం ఒకటి. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఈనాడు ఉద యాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది పిండి వంటలతో కూడిన విస్తరులను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఇది 12, 16 ఏళ్ల పాటు కానీ లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం.

కార్తీక బహుళ (కృష్ణ) సప్తమి, నవంబరు 29, గురువారం

కార్తీక బహుళ సప్తమి నాడు పైతామహాకృచ్ఛ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇది కొంత ఆశ్చర్య కరమైన వ్రత విధానంతో కూడి ఉన్నది. ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతా మణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.

కార్తీక బహుళ (కృష్ణ) అష్టమి, నవంబరు 30, శుక్రవారం

కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. సంవత్సరం పొ

Review కార్తీక దీపం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top