బహ్మమెచ్చిన జ్యేష్ఠం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో ఆరో మాసం- జూన్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది మూడో మాసం. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసమని పేరు. జ్యేష్ఠ మాసం నెల రోజులు బ్రహ్మను ఆరాధించాలని అంటారు. తెలుగు మానం ప్రకారం జూన్‍ నెల.. వైశాఖ – జ్యేష్ఠ మాసాల కలయిక. జూన్‍ 10వ తేదీ వరకు వైశాఖ మాస తిథులు.. ఆపై జూన్‍ 11వ తేదీ నుంచి జ్యేష్ఠ మాస తిథులు కొనసాగుతాయి. హనుమజ్జయంతి, అపర ఏకాదశి, ఏరువాక పున్నమ, నిర్జల ఏకాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలో ప్రత్యేకమైనవి.

2021- జూన్‍ 1, మంగళవారం, వైశాఖ బహుళ సప్తమి నుంచి
2021- జూన్‍ 30, బుధవారం, జ్యేష్ఠ బహుళ షష్ఠి వరకు..

శ్రీప్లవ నామ సంవత్సరం – వైశాఖం – జ్యేష్ఠం – గ్రీష్మ రుతువు- ఉత్తరాయణం

చాంద్ర మానం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠ మాసం కొన్ని పర్వదినాలు, వ్రతాలకు ప్రత్యేకమైనది. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసమనే పేరు వచ్చింది. జ్యేష్ఠ మాసం చాలా శ్రేష్ఠమైనది. ఈ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ప్రీతికరమైనదని అంటారు. జ్యేష్ఠ మాసం పొడవునా బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఇలా చేస్తూ జ్యేష్ఠ మాసంలో తనను ఆరాధించే వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. ఇంకా పితృదేవతల ప్రీత్యర్థం చేయాల్సిన కర్మలకు, వారి రుణం తీర్చుకోవడానికి, చేసిన పాపాల నుంచి విమోచనం పొందడానికి ఉద్దేశించిన కొన్ని మంచి తిథులు ఈ మాసంలో ఉన్నాయి. స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే సావిత్రి వ్రతం, పార్వతీదేవి ఆచరించిన రంభా వ్రతం, పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఆచరించే నిర్జల ఏకాదశి వంటివి జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన వ్రతాలు. ఇంకా దీనికి ముందు కొనసాగే వైశాఖ మాస తిథుల్లో వచ్చే ముఖ్యమైన పర్వాల్లో హనుమజ్జయంతి ఒకటి. వైశాఖంలో కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే హనుమజ్జయంతిని ఆచరించే ఆచారం ఉంది. ఈ మాసంలో వచ్చే మరికొన్ని తిథులు, పర్వాల పరిచయం..

వైశాఖ బహుళ సప్తమి
జూన్‍ 1, మంగళవారం

ఇది జూన్‍ మాసపు తొలి రోజు. విధాయకంగా వైశాఖ బహుళ సప్తమి తిథి నాడు , ఆచరించాల్సిన, చేయాల్సిన మతపరమైన విధులేమీ లేవు.

వైశాఖ బహుళ అష్టమి
జూన్‍ 2, బుధవారం

జూన్‍ 2వ తేదీ ఆంధప్రదేశ్‍ పునర్విభజన దినం. 2014లో ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ఆంధప్రదేశ్‍, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. దీంతో ఈ రోజు ఆంధప్రదేశ్‍ పునర్విభజన దినం కాగా, ఇదే రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఇక, వైశాఖ బహుళ అష్టమి కాలాష్టమి దినం. కాలభైరవుడిని ఈనాడు పూజిస్తారు. కాలభైరవుడు కాశీ విశ్వేశ్వరుడికి క్షేత్ర పాలకుడు. ఈయన వాహనం శునకం. శివుడి అనుగ్రహం పొందాలంటే కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలని అంటారు. సాధారణంగా అష్టమి తిథి శక్తి దేవతల ఆరాధనకు కూడా అనువైనది. ఈనాడు దుర్గ, కాళి వంటి శక్తి దేవతలను కూడా ఆరాధించే ఆచారం భారతదేశమంతటా ఉంది.

వైశాఖ బహుళ నవమి
జూన్‍ 3, గురువారం

వైశాఖ బహుళ నవమి నాడు దుర్గాదేవిని ఆరాధిస్తారు.

వైశాఖ బహుళ దశమి
జూన్‍ 4, శుక్రవారం

హనుమజ్జయంతి తిథిపై అనేక వాద సంవాదాలు ఉన్నాయి. ఉత్తరాదిన ఒక తీరుగా, దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మరో తీరుగా హనుమజ్జయంతిని ఆచరించే ఆచారం ఉంది. వైశాఖ బహుళ దశమి తిథే హనుమజ్జయంతి తిథి అని తెలుగు పంచాంగాలు చెబుతున్నాయి. హనుమంతుడు అంజనీదేవి పుత్రుడు. అందుకే ఆయన ఆంజనేయుడయ్యాడు. రాముడికి నమ్మినబంటు. వాక్చాతుర్యంలోనూ, బుద్ధికుశలతలోనూ, బలంలోనూ, స్థిరచిత్తం కలిగి ఉండటంలోనూ ఇంకా అనేక శుభమైన గుణాలు, లక్షణాలకు హనుమంతుడు పెట్టింది పేరు.

వైశాఖ బహుళ ఏకాదశి
జూన్‍ 5, శనివారం

ఈనాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మానవ జీవితంలో పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో, పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో తెలుపుతూ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతారు.

Review బహ్మమెచ్చిన జ్యేష్ఠం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top