వైశాఖ వైభవం

తెలుగు పంచాంగ కాలమానం ప్రకారం రెండో మాసం వైశాఖం. ఆంగ్లమానం ప్రకారం ఇది సంవత్సరంలో ఐదో నెల. వైశాఖ మాసానికి మాధవ మాసమని పేరు. అంటే విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. వైశాఖ మాస వైభవం అంతా ఇంతా కాదు. ఈ మాసంలో విశేష దానాలు చేస్తారు. వైశాఖ మాస స్నానాలు చాలా పవిత్రమైనవి. హనుమజ్జయంతి, నృసింహ జయంతి, జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి, రామానుజ జయంతి, అక్షయ తృతీయ, రంభా వ్రతం, బుద్ధపూర్ణిమ వంటివి ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలు.

2022- మే 1, ఆదివారం, వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి
2022- మే 31, మంగళవారం, జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి వరకు..

శ్రీశుభకృతు నామ సంవత్సరం- వైశాఖ మాసం- వసంత రుతువు- ఉత్తరాయణం

భగవంతుని అనుగ్రహం పొందడానికి కొన్ని మాసాలు అనుకూలం. అటువంటి మాసాల్లో వైశాఖం ఒకటి. ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసం కాబట్టే దీనిని ‘సాధన మాసం’ అన్నారు. వసంత రుతువులో వచ్చే రెండో మాసమిది. ఈ కాలంలో చెట్లు చిగురించి, పూలు విరబూస్తాయి. వైదికంగా దీన్ని ‘మాధవ మాస’మనీ అంటారు. అనేకానేక పురాణాల మాదిరిగానే వైశాఖ పురాణం కూడా ఉనికిలో ఉంది. దీనిని వ్యాసదేవుడు రచించాడు. లక్ష్మీ నారాయణుల ఆరాధనకు వైశాఖ మాసం చాలా ప్రసిద్ధమైనది. వైశాఖ మాసంలో ముఖ్యంగా ఆచరించాల్సిన వ్రతాలు రెండు. అవి- వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణుడిని తులసి దళాలతో ఆరాధించాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉండాలి. దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్ఠం. విష్ణు సహస్ర నామ పారాయణకు ఈ మాసమే ఉద్ధిష్టమైనది. ఈ మాసం పొడవునా అశ్వత్థ వృక్షానికి నిండుగా నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి. నెలంతా ఇలా చేస్తే అభీష్టసిద్ధి కలుగుతుంది. పితృదేవతలు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతారు. శివారాధనకూ వైశాఖ మాసం ప్రశస్తమైనది. ఈ నెలంతా శివుడికి అభిషేకం చేయాలి. ఈ మాసంలో చేసే శివారాధన, అభిషేకాలు ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతిని కలిగిస్తాయి. శివాలయాలలో లింగానికి పైన ధారాపాత్ర ఏర్పాటు చేయాలి. దీని నుంచి ధారగా నీరు శివలింగంపై పడేలా చేయాలి. దీనివల్ల సృష్టిలో ఉన్న వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని నమ్మిక. వైశాఖం.. ‘ఉదకుంభ మాసం’గానూ ప్రసిద్ధి. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని దానం చేయడం వైశాఖంలో ముఖ్యమైనది. ఈ మాసం నాటికి ఎండలు మండిపోతాయి. సూర్యుడు అగ్నిగోళంలా మండుతాడు. ఈ కాలంలో కలిగే వేసవి తాపం నుంచి పశుపక్ష్యాదులను, మనుషులను రక్షించేందుకు నీటిని దానం చేయాలనే నియమం ఏర్పడింది. చాంద్ర మానం ప్రకారం చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసమనే పేరు వచ్చింది. ‘వైశాఖ’ అంటే మిక్కిలి కాంతిని ప్రసరించేదని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి దీనిని మించిన సాధనా మాసం లేదని ప్రతీతి.

వైశాఖ శుద్ధ పాడ్యమి/వైశాఖ మాసం ఆరంభం
మే 1, ఆదివారం

వైశాఖ శుద్ధ పాడ్యమి వైశాఖ మాస ఆరంభ తిథి. ఈనాటి నుంచే వైశాఖ స్నాన వ్రతం ఆరంభమవుతుంది. సర్వ పాపాలు వైశాఖ స్నానంతో పోతాయని ప్రతీతి. ప్రాత కాలంలో నియమంగా స్నానం చేస్తే మాధవుడికి ప్రీతి కలుగుతుంది. స్నానానంతరం రావిచెట్టుకుని నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి. ఈనాటితో మొదలుకుని మాసాంతం వరకు తులసి దళాలతో నిత్యం శ్రీమహా విష్ణువును పూజించాలి. మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)గా ప్రసిద్ధి.

వైశాఖ శుద్ధ విదియ/చంద్ర దర్శనం
మే 2, సోమవారం

వైశాఖ శుద్ధ విదియ నాటి నుంచి చంద్ర దర్శనం ప్రారంభమవుతుంది. యథావిధిగా శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో ఈనాడు ఆరాధించాలి.

వైశాఖ శుద్ధ తదియ/అక్షయ తృతీయ
మే 3, మంగళవారం

వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ తిథి. ఇది గొప్ప పుణ్య దినం. అక్షయ తదియ సోమవారం కానీ, బుధవారం కానీ వస్తే మరీ పవిత్రమైనది. విశేషం ఏమిటంటే.. మే 3, మంగళవారం ప్రారంభమైన తదియ ఘడియలు 4వ తేదీ బుధవారం కూడా కొనసాగుతున్నందున ఈ అక్షయ తృతీయ మనకు అత్యంత మహిమాన్వితమైనదిగా భావించాలి. కృత్తిక రోహిణీ నక్షత్రంతో కూడిన అక్షయ తృతీయ పర్వం అతి ప్రశస్తమైనదిగా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తిథి నాడు చేసే దానాలు, దేవతలకు, పితరులకు చేసే పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని అంటారు. అందుకే ఈ పర్వానికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది.
అక్షయ తృతీయ నాడు పెరుగన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభము మొదలైనవి దానం చేయాలని నియమం. వైశాఖ మాసంలో వైశాఖ పూజ అనే పేరుతో సంపన్నులు ఒక వ్రతం చేస్తుంటారట. అందులో వేసవికి అవసరమైనవి, వేసవిలో బాగా దొరికే మామిడిపండ్లు, పనస తొనలు మొదలైనవి కూడా వ్రతం చివరిలో పంచి పెట్టే వారు. వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా దానం చేయడం అక్షయ తృతీయ వ్రతం విధాయ కృత్యాలలో ఒకటి.
స్మ•తి కౌస్తుభంలో, తిథి తత్వంలో, పురుషార్థ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఈనాడు విష్ణువును పూజించాలని ఉంది.
చైత్ర శుక్ల తృతీయ నాడు ప్రారంభించిన గౌరీ పూజ వ్రతాన్ని కొన్ని ప్రాంతాలలో నెల రోజులు కొనసాగించి, ఈనాడు ముగిస్తారు. కాబట్టే పంచాంగాలలో ఈనాడు గౌరీపూజ, త్రిలోచన గౌరీ వ్రతం అని పేర్కొన్నారు.
అక్షయ తృతీయ ఉగాది తిథి. కృత, త్రేత, ద్వాపర, కలియుగం అనే నాలుగు యుగాల్లోనూ త్రేతాయుగానికి ఇది మొదటి రోజు. శ్రీరామావతారం త్రేతా యుగానికి చెందినది. అప్పటి మానవ ఆయుర్ధాయం మూడు వేల సంవత్సరాలు. శరీరంలో మాంసం ఉండే వరకు మనుషులు ప్రాణాలు ధరించి ఉంటారట. త్రేతా యుగం రజత యుగం. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణములనే త్రేతాగ్నులను పూజించిన కాలం కావడం చేత అది త్రేతాయుగం అయ్యింది.
అక్షయ తృతీయ నాడే కృత యుగం ఆరంభమైందని, కాబట్టి ఈ కృత యుగాదినే అక్షయ తృతీయ పర్వంగా నిర్వహించుకుంటారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిష్యోత్తర పురాణంలో వివరంగా ఉంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయ నాడు బదరీ నారాయణుడిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా చాలాచోట్ల ఉంది. ఈ తిథి మొదలుకుని అన్నీ పర్వదినాలే..
వైశాఖ శుద్ధ తదియ బలరామ జయంతిగానూ ప్రసిద్ధి. రోహిణికి ఆదిశేషుడు బలరాముడుగా పుట్టాడని పురాణగాథ. విష్ణుమూర్తి కృష్ణావతారం ధరించినపుడు బలరాముడూ అవతరించాడు. కృష్ణుని కంటే ఒక విధంగా బలరాముడే గొప్పవాడనే వర్ణణలూ మన కవుల రచనలలో ఉన్నాయి. ఈయన ఆయుధం నాగలి. ఒకసారి దుర్యోధనుడి కూతురైన లక్షణను కృష్ణుడి కుమారుడైన సాంబుడు వివాహార్థం తీసుకునిపోతుండగా, కౌరవ సైనికులు అతనిని బంధించి హస్తినాపురంలో చెరలో ఉంచారు. సాంబుడిని విడిపించడానికి బలరాముడు వెళ్లాడు. ఎంతగా హెచ్చరించినా కౌరవులు సాంబుడిని విడిచి పెట్టలేదు. దీంతో బలరాముడు తన నాగలితో హస్తినాపురాన్ని పెళ్లగించడానికి సిద్ధమయ్యాడు. దీంతో హస్తినాపురమంతా అల్లల్లాడింది. భయపడిన కౌరవులు సాంబుడిని విడిచి పెట్టారు. ద్వివిదుడనే వానరుడు తన కోతి చేష్టలతో పచ్చని పొలాలను నాశనం చేయసాగాడు.

అతనిని ఎంతగా బెదిరించినా వినకపోయే సరికి.. బలరాముడు తన హలాయుధంతో అతనిని సంహరించాడు.
బలరాముడు గధా యుద్ధవిద్యలో దుర్యోధనుడికి గురువు. కురుక్షేత్రంలో భీమ దుర్యోధనుల గధా యుద్ధంలో భీముడు దుర్యోధనుని యూరువుల మీద కొట్టాడు. అలా కొట్టడం అధర్మం కాబట్టి భీముడిని శిక్షించడానికి బలరాముడు తన హలాన్ని ఎత్తాడు. కృష్ణుడు అడ్డుపడి అన్నను శాంతపరిచాడు.
బలరాముడు ఒకసారి గోపికలతో కలిసి యమునా నదికి స్నానానికి వెళ్లాడు. ఆ సందర్భంలో అతను యమునా నదిని పిలిచాడు. కానీ ఆమె రాలేదు. దీంతో నదిని చీల్చి వేస్తానని నాగలిని ఎత్తాడు. దీంతో యమున పరుగున వచ్చిన అతనికి వినీల వస్త్రాలు కానుకగా ఇచ్చింది.
బలరాముడు తన నాగలితో ఆంధ్రులకు మహోపకారం చేశాడు. తన నాగలి చాలుతో ఆయన ఆంధ్రభూమిలో ఒక నదిని పుట్టించాడు. మహేంద్ర పర్వత శాఖ అయిన నిమ్మగిరుల నుంచి నూట పదిహేను మైళ్లు నడిపించి మోపసు బందరు వద్ద తూర్పు సముద్రంలో పడేటట్టుగా ఒక నదిని సృష్టించాడు. నాగలి వలన పుట్టిన నది కాబట్టి అది ‘నాగావళి’ అయ్యింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది.
బలరాముని కేతన చిహ్నం.. కర్షకుల కల్పవృక్షమైన తాటి చెట్టు.
బలరాముడిని ఆంధ్రులు, ముఖ్యంగా రైతులు విశేషంగా కొలుస్తారు. ఈనాడు ఆంధ్ర కర్షకులు తమ పొలాల్లో, తమ పెరళ్లలో కూరపాదులు పెడతారు. అవి యథా కాలాన మొలకెత్తి భరణి, కృత్తిక కార్లుల్లోని ఎండలను తట్టుకుంటూ నెమ్మదిగా ఎదిగి మృగశిర కార్తె నాటికి ముంగిళ్లు చల్లబడటంతోనే ఏపుగా ఎదిగి అప్పటి నుంచి అక్షయంగా కాస్తాయి.
వైశాఖ శుద్ధ తదియ చాలా విధాలుగా ప్రశస్తమై ఉంది. ఈనాడు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షయ తృతీయ నాడు సాధారణంగా కృత్తికా నక్షత్రం కూడి ఉంటుంది. కృత్తిక అగ్ని సంబంధమైనది. అగ్ని వల్ల తీక్షణత పుడుతుంది. ఆ తీక్షణం తగ్గించడానికి చందన చర్చ ఒక శైత్యోపచారం. సింహాచల స్వామికి విదియ నాటి రాత్రి గంధమును ఒలిచి వేస్తారు. తదియ నాటి ఉదయాన సహస్ర ఘటాభిషేకము చేస్తారు. అనంతరం స్వామి నిజరూప దర్శనం. స్వామి రూపం లింగాకృతిలో కనిపిస్తుంది. అనంతరం తిరిగి స్వామికి చందన చర్చ. ఈ గంధం ఒలుపు సహస్ర ఘటాభిషేకం, చందన సేవతో కూడి ఉంటుంది. చందనాను లేపనం మంగళ ప్రదమైనది. ఆరోగ్యప్రదమైనది. చందనం అమూల్యమైన మూలిక. ప్రియమైన వాసన కలిగి ఇది దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. విషాహారంగా, క్రిమిహరంగానూ పని చేస్తుంది. అంతస్తాపాన్ని పోగొట్టి మిక్కిలి చలవ చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో దీనిని విరివిగా వాడతారు.
అలాగే, ఈనాడు రంజాన్‍ పర్వదినం.

వైశాఖ శుద్ధ తదియ
మే 4, బుధవారం

వైశాఖ శుద్ధ తదియ ఘడియలు ఈనాడు కూడా కొనసాగుతున్నాయి.

వైశాఖ శుద్ధ చతుర్థి
మే 5, గురువారం

వైశాఖ శుద్ధ చతుర్థి తిథి నాటి నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది.

వైశాఖ శుద్ధ పంచమి/శంకరాచార్య జయంతి
మే 6, శుక్రవారం

వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి పర్వం. ఈ తిథి నాడే జగద్గురువు ఆది శంకరాచార్యులు అవతరించారు. ఈనాడు శృంగేరి తదితర జగద్గురు పీఠాలలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తారు. అద్వైతాన్ని ఈ లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరులు మన హైందవ ధర్మానికి పట్టుగొమ్మ. ఆదిశంకరులు చిన్ననాడే దరిద్ర నారాయణులను చూసి.. వారి కోసం కరుణా సముద్రుడై లక్ష్మీదేవిని స్తుతించి పేదల ఇళ్లను సౌభాగ్యాలకు నెలవు చేశాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా నేటికీ విరాజిల్లుతోంది.
శంకరుని మహిమలు అన్నీ ఇన్నీ కావు. కాశ్మీర దేశంలో శారదా దేవి పీఠం ఒకటి ఉందనీ, దానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయనీ, తూర్పు, పడమటి, ఉత్తర ద్వారాలను ఆయా దిక్కుల నుంచి వచ్చిన సర్వజ్ఞులైన పండితులు తెరిచారనీ, దక్షిణ ద్వారం తెరవగల పండితుడు లేనందున ఆ ద్వారం అలాగే మూసి ఉందని జనం చెప్పుకోవడం శంకరులు విన్నారు. దీంతో ఆయన కాశ్మీరానికి వెళ్లి, అక్కడి పండితులతో వాదించి దక్షిణ ద్వారం తెరుచుకునేలా చేసి విశేష కీర్తిని పొందారు. బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసాశ్రమం స్వీకరించిన శంకరులు సన్యాసి అయి ఉండీ తల్లికి అంత్యకర్మలు నిర్వహించారు. తన పండిత శక్తితో డెబ్బయి రెండు మతాల వారిని జయించారు. అనేక ఉద్గ్రంథాలను రచించారు. శంకరాచార్యులు అద్వైత మత స్థాపనాచార్యుడు. అద్వైత మతం మన వేదాలలో, ఉపనిషత్తులతో, భగవద్గీతలో ఉన్నదే. ప్రజలు దానిని మరిచిపోగా భారతాన ఆ కొస నుంచి ఈ కొస వరకు తిరిగి దానిని వెలుగులోకి తెచ్చారు.

Review వైశాఖ వైభవం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top