విశేషాల ఆషాడం

25 జూన్‍, ఆదివారం ఆషాఢ శుద్ధ విదియ-23 జూలై, ఆదివారం ఆషాఢ బహుళ అమావాస్య వరకు
మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. ఆషాఢం.. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో నాల్గవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా..
అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనది ఆషాఢ మాసం. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో నాల్గవది. సాధారణంగా శుభ కార్యక్రమాలు ఈ నెలలో తలపెట్టరు. గృహ నిర్మాణాదులు ప్రారం భించరు. ఆధ్యాత్మికంగా చూస్తే అత్యంత శక్తివంతమైనదీ మాసం. అమ్మ వారి ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసమిది. అతివలు గోరింటాకు పెట్టుకుని అరవిరిసిన అరచేతులను చూసుకుని మురిసిపోయేది ఆషాఢంలోనే. అలాగే, ఈ మాసంలో ములగ కూర బాగా తినాలని అంటారు. అనప పప్పు విరివిగా వాడాలని అంటారు. ఇవి ఆరోగ్య హేతువులు. ఇక, ఈ మాసం విశేషాల్లోకి వెళ్తే..

జూన్‍ 25: ఆషాఢ శుద్ధ విదియ
ఈ జగత్తు అంతా మహాశక్తి స్వరూపమే. ఆ శక్తి ప్రకృతి అంతటా ఆవరించి ఉంది. అలాంటి ప్రకృతి ఆకృతులైన జగన్మాత స్వరూపాల ఆరాధనకు తగిన తరుణం ఆషాఢ మాసం. ప్రకృతిలో జరిగే అనేక మార్పులను, పరిణామాలను తమ ఆయురారోగ్య సుఖ సౌభాగ్యాలకు అనుగుణంగా మలచాలని కోరుకుంటూ భక్తులు ఆషాఢంలో అమ్మను ఆరాధిస్తారు. ఈ క్రమంలో వచ్చేవే బోనాల జాతర. తెలంగాణ రాష్ట్ర రాజ ధాని హైదరాబాద్‍లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జూన్‍ 25 ఆదివారం మొదలుకుని ఆపై వచ్చే జూలై 2.9,16,23 తేదీల్లో వచ్చే ఆదివారాల్లో సికింద్రాబాద్‍ మహంకాళి, పాతబస్తీ మహంకాళి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆల యాల్లో, ఇతర కోవెలలో మహా ఉత్సవాలు నిర్వ హిస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగ దాంబిక ఆలయంలో ఆషాఢంలో మొదటి బోనాల వేడుక ఆరంభమవుతుంది. ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారు. పసుపు కలిపిన నీరును వేపకొమ్మలతో చిలకరిస్తూ ఆలయాలకు భక్తులు బయల్దేరుతారు. మొక్కుల్ని అనుసరించి అన్న పదార్థాల్ని బోనపు ఘటాల్లో అమర్చి నివేదిస్తారు. సాకబెట్టుట (పసుపు జలంతో అభిషేకం), ఫలహారపు బండ్లు (ఆహార పదార్థాల తరలింపు), గావుపట్టుట (సొర, గుమ్మడికాయలతో అమ్మవారికి దృష్టి దోషాన్ని నివారించడం), రంగం (భవిష్యవాణి) వంటి పక్రియలతో బోనాల వేడుక వర్థిల్లు తుంది. సికింద్రాబాద్‍ ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని బోనాల సందడితో ఉత్సవ శోభ పతాకస్థాయిని చేరుకుంటుంది. ఆషాఢంలో వచ్చే ప్రతి ఆదివారం రాజధానిలో బోనాల వేడుకలు అంబరాన్నంటుతాయి. లాల్‍దర్వాజ అక్కన్న మాదన్న గుడిలో తుది బోనాల్ని సమర్పించడంతో జాతర సుసంపన్నమవుతుంది.
ఆషాఢ శుద్ధ విదియ నాడు వచ్చే మరో పర్వం- జగన్నాథ రథయాత్ర. పూరిలో కనుల పండువగా జరిగే రథోత్సవం ప్రపంచంలోనే వింత వేడుక. వాసుదేవుడైన జగన్నాథుడు, సంకర్షణ రూపమైన బలభద్రుడి విగ్రహం, శక్తితత్వమైన సుభద్ర- వీరు ముగ్గురూ దారు రూపం దాల్చి మూడు రథాలపై భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగే దృశ్యం అపురూపమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ మూడు రథాలను ఏటా కొత్తగా నిర్మించడం ఓ విశేషం. దారు వృక్షాల చెక్కలతో నిర్మించే వీటి నిర్మాణంలో ఆగమశాస్త్ర నియమాలను అనుసరిస్తారు. శ్రీకృష్ణ స్వరూపమైన జగన్నాథుని రథం పేరు- నందిఘోష. బలభద్రుని రథం- తాళధ్వజ. సుభద్రాదేవి రథం- దర్పదళన. చక్కని వర్ణాలతో చిత్రమై, అలంకృతమైన మూర్తులను రథయాత్ర నాడు భక్తులు కనులారా దర్శించవచ్చు. ‘బొడొదండొ’ అని ఉత్కళ భాషలో వ్యవహరించే ప్రధాన విశాల రాజమార్గాన ఈ మూడు రథాలను ప్రజలు తాళ్లు పట్టుకుని లాగుతూ, నృత్యవాద్య కీర్తనల నడుమ, దివ్యమైన సందడితో ఊరేగి ‘గుండిచా’ మందిరానికి చేరుస్తారు. విశ్వరథంపై అధిష్ఠించి నడిపించే విష్ణుదేవుడి లీలా వైభవానికి ప్రత్యక్ష రూపంగా జగన్నాథుని రథయాత్రను భావించవచ్చు.

జూన్‍ 26: ఆషాఢ శుద్ధ తదియ
జూన్‍ 26 ముస్లింల పవిత్ర రంజాన్‍ పర్వదినం. ‘ఈద్‍-ఉల్‍-ఫితర్‍’గా వ్యవహరిస్తూ దాదాపు ప్రపంచంలోని ముస్లింలంతా ఈ వేడుకను నిర్వహించుకొంటారు.
జూన్‍ 28: ఆషాఢ శుద్ధ పంచమి
ఆషాఢ శుద్ధ పంచమి తప్పితే ద్వాదశికి గౌతమి (గోదావరి పాయ)కు వరద నీరు వస్తుందని ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాల వాసుల నమ్మిక. ఇదే తిథి నాడు కావేరీ తీరవాసులు ‘ఆడిపదినెట్టు’ అనే ఒక పండుగను నిర్వహిస్తారు. ఆదిపదినెట్టు అటే- ఆడి మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. ప్రాయికంగా, ఆ నాటికి కావేరికి కొత్త నీళ్లు వస్తాయి. వ్యవసాయ పనులకు ఇదే తరుణమవుతుంది. ఆడి మాసం అంటే ఆషాఢ మాసమని అర్థం.

జూన్‍ 29: ఆషాఢ శుద్ధ షష్ఠి
ఈనాడు స్కంద వ్రతం ఆచరించాలని స్మ•తికౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని షోడశోపచారా లతో పూజించాలి. ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రమే తీసుకోవాలి. మర్నాడు కుమార స్వామిని దర్శించాలి. ఈ వ్రతాచరణలో ఉస వాసం ఉండటం ద్వారా శరీరారోగ్యం ఇమిడి ఉండదని శాస్త్రవచనం.

జూన్‍ 30: ఆషాఢ శుద్ధ సప్తమి
పురుషార్థ చింతామణిలో ఈనాడు వివస్వ న్నామో భాస్కరస్యోత్పత్తిః అని పేర్కొన్నారు. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన దినం. అలాగే, నీలమత పురాణంలో ఈనాటి తిథిని గురించి మిత్రాఖ్య భాస్కర పూజ ఆచరించాలని ఉంది. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని పేర్కొన్నారు. ఇవన్నీ సూర్యారాధనకు సంబంధించినవే కావడం విశేషం.

జూలై 1: ఆషాఢ శుద్ధ అష్టమి
స్మ•తి కౌస్తుభంలో ఈనాడు మహిషఘ్నీ పూజ అనీ, గదాధర పద్ధతిలో దుర్గాష్టమీ, పరశురామాష్టమీ అని పేర్కొన్నారు. ఇంకా వివిధ వ్రత గ్రంథాలను అనుసరించి, ఈనాడు మహిషాసుర మర్దని పూజ ఆచరించాలని తెలుస్తోంది.

జూలై 2: ఆషాఢ శుద్ధ నవమి
నవమి సహజంగానే దుర్గాపూజకు ఉద్ధిష్టమైన తిథి. కాబట్టి ఇది దుర్గాపూజకు అనువైన రోజు. బంద్రీ దుర్గాపూజ ఆచరించి ఐంద్రాదేవిని పూజించాలని స్మ•తికౌస్తుభకారుడు పేర్కొన్నారు. అలాగే, ఈ తిథి నాడు ఇంద్రాదేవిని పూజిం చాలని ‘రామార్చన చంద్రిక’లో కూడా ఉంది.

జూలై 3: ఆషాఢ శుద్ధ దశమి
ఈ తిథి శాకవ్రత మహాలక్ష్మీ వ్రతారంభ దినం. ఈనాడు మహాలక్ష్మిని పూజించి, ఒక నెల ఆకు కూరలు తినడం మాని, ఆకు కూరలు దానం చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఆషాఢంలో వచ్చే పర్వాలలో శాకంబరి ఉత్సవం కూడా ముఖ్యమైనదే. పల్లెలు, పట్టణాల్లో ఈనాడు అమ్మవార్లను కూరగాయలు, ఆకు కూరలతో అలంకరిస్తారు.
సంపదల తల్లి అయిన మహాలక్ష్మిని ఆషాధ శుద్ధ దశమి నాడు షోడశోపచారాలు, అష్టోత్తరాలు, శ్రీసూక్తసహితంగా పూజించి ఆకుకూరల్ని నివేదిస్తారు. ఆషాఢంలో అమ్మవారి వివిధ స్వరూపాల్ని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, సస్యాలు వంటి ఆహార ద్రవ్యాలతో అలంకరించి శాకంబరిగా ఆరాధించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుషమన్వంత రాది దినం కూడా. చాక్షుష మనువు మనువుల్లో ఆరవ వాడు.

జూలై 4: ఆషాఢ శుద్ధ ఏకాదశి
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే తిథిని ఏకాదశి అంటారు. అంటే ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా ఇలా 12 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశులన్నీ పుణ్యప్రదాలు. ఏకాదశి నాడు హరినామ కీర్తన ప్రధానంగా చేస్తారు కాబట్టి ఏకాదశిని ‘హరివాసర’మని కూడా అంటారు. శిష్టులు ఏకాదశి నాడు పరమనిష్టగా ఉండి ఉపవాసం ఆచరిస్తారు. దశమి రాత్రి నిరాహారుడై, ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ద్వాదశి ఉదయం పారణమొనర్చి, ద్వాదశి నాడు రాత్రి కూడా నిరాహారుడై ఉండాలి. అప్పుడు కాని ఏకాదశి వ్రతం సంపూర్ణం కాదు. ఏకాదశి అనేది ఎంతటి పుణ్య తిథి అంటే, కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రకు ఈ వ్రతం గురించి చెప్పాడట. ఇక, ద్వారకానగర వాసులంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆయన దండోరా వేయించాడట. దీనిని బట్టి ఏకాదశ వ్రత ప్రాముఖ్యాన్ని గుర్తించవచ్చు. ఇక, ఆషాఢ శుద్ధ ఏకాదశి మొత్తం ఏకాదశుల్లో తొలిది. అంటే ఇది ప్రథమేకాదశి. ఈనాటి రాత్రి వైష్ణవాలయాల్లో విష్ణు శయన వ్రతాలు ఆచరిస్తారు. విష్ణు విగ్రహాన్ని ఆభరణాదులతో అలంకరించి, జాజిపువ్వులతో పూజిస్తారు. పవళింపు సేవ చేస్తారు. కీర్తనలు పాడతారు. చంద్రభాగ నదీ తీరాన పండరిపురం (మహారాష్ట్రలో ఉంది) కొలువైన విఠలుని వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలి. అక్కడ ఈ తిథి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశినే శయనైకా దశి అనీ అంటారు. సతీ సక్కుబాయి ముక్తి పొందినది ఈ ఏకాదశి నాడే.

జూలై 9: ఆషాఢ శుద్ధ పౌర్ణమి
ఆషాఢ శుద్ధ పౌర్ణమి తిథి గురుపూర్ణిమ పర్వ దినం. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరా ధించే పర్వదినమిది. దీనికే వ్యాస పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు. గురువును యథాశక్తి పూజించడానికి ఇది ఉద్ధిష్టమైన దినం. ఇంకా పూర్ణిమ నాడు శివ శయనోత్సవం కూడా నిర్వహిస్తారు. ఇదొక వ్రత విధానం. దీనిని శైవులు ఎక్కువగా ఆచ రిస్తారు. పాపాలను తన జడలతో కలిపి కట్టివేసి పెద్దపులి చర్మాన్ని శయ్యగా ఏర్పర్చుకుని శివుడు ఆషాఢ శుద్ధ పూర్ణిమ మొదలుకుని నాలుగు నెలలపాటు నిద్రపోతాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి విష్ణు శయన వ్రతం చేసినట్టే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి శివశయన వ్రతం చేస్తారు. అలాగే, ఈనాడు కోకిలా వ్రతం కూడా ఆచరిస్తారు. కామ్య వ్రతాల్లో ఇదీ ఒకటి. ఈనాటి సాయంకాలం నదికి వెళ్లి స్నానం చేస్తారు. తెలకపిండితో కోకిక ప్రతిమను తయారు చేస్తారు. దీనిని నెల పాటు పూజిస్తారు. దీనిని బాలిక ఆచరిస్తే అందమైన మొగుడు, బాలుడు ఆచరిస్తే అందమైన భార్య లభిస్తారని అంటారు. కోకిల, తెలకపిండి ఈ వ్రతాచరణలో ప్రధాన ద్రవ్యాలు. ఆషాఢ మాసంలో సేవిం చాల్సిన ఆహార పదార్థాల్లో తెలక పిండి ఒకటి. ఆషాఢానికి కోకిళ్లకు అంకిళ్లు పడిపోతాయని అంటారు. కోకిల అప్పటి నుంచి వలస పోతుంది. ఈ వ్రత విషయాలు స్మ•తికౌస్తుభం అనే గ్రంథంలో ఉన్నాయి.

జూలై 10: ఆషాఢ బహుళ పాడ్యమి
ఈ తిథి నాడు మృగశీర్షా వ్రతం, కోకిలా వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం, ధర్మావాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి గ్రంథాలలో ఉంది.

జూలై 11: ఆషాఢ బహుళ విదియ
ఇది విజయతీర్థ పుణ్య దినం. అష్టనాగ పూజ చేయాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఆమాదేర్‍ జ్యోతిషీలో ఈ నాటి దినం గురించి‘ క్షీరసాగరే సలక్ష్మీ మధుసూదన పూజ’ అని వివరించారు.

జూలై 17: ఆషాఢ బహుళ అష్టమి
ఆషాఢ కృష్ణ (బహుళ) అష్టమి రౌచ్య మన్వంతరాది. రౌచ్యుడు 13వ మనువు. అతనికే రేచ్చుడు అనే మరో పేరు ఉంది. ఈ మన్వంతరంలో ఇంద్రుడి పేరు ‘దివస్పతి’. ధృతిమంతుడు, తత్త్వదర్శి తదితరులు సప్తర్షులు.

జూలై 19: ఆషాఢ బహుళ దశమి/ఏకాదశి
ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ ఏకాదశిని కామకైకాదశి అని వ్యవహరించారు. ఈనాటి ఏకాదశీ వ్రతాచరణ వల్ల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి.

జూలై 23: ఆషాఢ బహుళ అమావాస్య
ఈనాడు దీపపూజ ప్రత్యేకమైనది. ఉదయాన్నే శుచిగా స్నానం చేసిన అనంతరం ఇంట్లోని ఇత్తడి దీప స్తంభాలు, కుందులు శుభ్రంగా కడుగుతారు. కొయ్య పలకలను పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీపస్తంభాలు ఆ ఫలకంపై ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో పూజ చేస్తారు. లడ్డూలు, మోరుండలు నివేదిస్తారు. వాటిని ముత్తయిదువకు, బ్రాహ్మణుడికి వాయనం కింద అందచేస్తారు. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు. అక్కడితో దీప పూజ పరిసమాప్తి అవుతుంది.

Review విశేషాల ఆషాడం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top