కోయిల పిలుపు… ప్రకృతి మెరుపు

శ్రీ శార్వరి నామ సంవత్సరం- ఫాల్గుణ-చైత్రం-వసంత రుతువు-ఉత్తరాయనం

పకృతి సమస్త వర్ణాలతో సర్వాంగ సుందరంగా ప్రకాశించే మాసం- చైత్రం. ఇది ఆంగ్ల కాలమానం ప్రకారం మార్చి నెల. మూడవది. తెలుగు పంచాంగం ప్రకారం ఇది సంవత్సరారంభ మాసం. చైత్ర మాసం తొలి రోజే మనకు ఉగాది లేదా
సంవత్సరాది. ఇది వసంత మాసం. అయితే, మార్చిలో ఎక్కువ రోజులు
ఫాల్గుణ మాస తిథులే వస్తాయి. చివరి ఏడు రోజులే చైత్ర మాసం
తిథులు ఆరంభమై.. ఏప్రిల్ వరకు కొనసాగుతాయి. ఫాల్గుణ – చైత్ర మాసాల
కలయిక అయిన మార్చి నెలలో వచ్చే ముఖ్య పండుగలు, పర్వాల పరిచయం.
ఫాల్గుణ మాసంతో శిశిర రుతువు ముగుస్తుంది. నువ్వులు, ఉసిరికలు, మామిడిపూత వాడకానికి అనువైన కాలం ఫాల్గుణం. ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన పౌర్ణమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణమనే పేరు స్థిరపడింది. ఫాల్గుణం ముగియడంతోనే వసంత మాసం (చైత్ర మాసం) ప్రారంభమవుతుంది. చైత్ర మాసం ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నాడే ఉగాది పర్వదినం. ఇది మనకు తెలుగు సంవత్సరాది పర్వం. ఈ సంవత్సర నామం- శ్రీ శార్వరి నామ సంవత్సరం. చైత్ర శుద్ధ పాడ్యమితో వసంతకాలం ఆరంభమవుతుంది. తెలుగు సంవత్సరాలలో తొలిది చైత్ర మాసమే. చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలయ్యే వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ నవమితో ముగుస్తాయి. అయితే, ఆంగ్ల మానం ప్రకారం మనం మార్చి నెలలోని తిథులనే పరిగణనలోకి తీసుకుంటున్నందున.. ఈ నెల ఫాల్గుణ శుద్ధ షష్ఠి నుంచి ప్రారంభమై చైత్ర శుద్ధ సప్తమితో ముగుస్తుంది. ఆయా తిథులను అనుసరించి ఫాల్గుణ, చైత్ర మాసాలతో కూడిన మార్చి నెలలో వచ్చే పర్వాలలో అమలకి ఏకాదశి, కోరుకొండ తీర్థం, హోలీ, ఉగాది, మత్స్య జయంతి, గండి పోచమ్మ తీర్థం వంటివి ముఖ్యమైనవి. శిశిరం వసంతపు అందాలను అలంకరించుకుని ఉండే ఈ మాసం మహా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఫాల్గుణ – చైత్ర మాసాల్లో వచ్చే తిథి పర్వాలు, పండుగల వివరణ..
ఫాల్గుణ శుద్ధ సప్తమి, మార్చి 2, సోమవారం
ఫాల్గుణ శుద్ధ సప్తమి తిథి నాడు కామదా సప్తమి, త్రిగతి సప్తమి, ద్వాదశ సప్తమి, అర్క సంపుట సప్తమి వ్రతాలను ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఫాల్గుణ శుద్ధ అష్టమి, మార్చి 3, మంగళవారం
ఫాల్గుణ శుద్ధ అష్టమి అమ్మ వారికి ప్రీతిపాత్రమైన తిథి. ఈ తిథి నాడు లలిత కాంతిదేవి వ్రతం చేస్తారని తిథితత్వం అనే గ్రంథంలో ఉంది. ఆమాదేర్ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో ఈ తిథిని దుర్గాష్టమిగా వర్ణించారు.
ఫాల్గుణ శుద్ధ నవమి, మార్చి 4, బుధవారం
చతుర్వర్గ చింతామణిలో వివరించిన ప్రకారం- ఈ తిథి నాడు ఆనంద నవమి వ్రతం ఆచరించాలి. ఇది అమ్మవారికి సంబంధించినది. అలాగే దుర్గాపూజకు ఈ తిథి ఉద్ధిష్టమైనది.
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, మార్చి 6, శుక్రవారం
ఈ ఏకాదశిని ఆమలకి ఏకాదశిగా ప్రసిద్ధి. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి గురించి వివిధ వ్రత గ్రంథాలలో ‘ఆమలకే వృక్షే జనార్ధనా..’ అని వర్ణిం చాయి. అంటే ఆమలక వృక్షము జనార్ధన స్వరూపమని, దాని కింద ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర వచనం.
సాధారణంగా కార్తీక మాసంలో ఉసిరి (ఆమలిక) విశిష్ట పూజలు అందుకుంటుంది. మళ్లీ ఆ స్థాయిలో పూజలందుకునేది ఫాల్గుణ మాసంలోని ఆమలక ఏకాదశి నాడే. ఏకంగా ఉసిరి పేరుతోనే ఈ ఏకాదశికి పేరు రావడాన్ని బట్టి.. దీని ప్రాధాన్యాన్ని గుర్తించవచ్చు. ఇంకా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు చిత్రరథుడు పరశురాముడిని పూజించాడని అంటారు.
ఈ తిథి నాడు గోదావరి జిల్లాల వాసులు కోరుకొండ తీర్థం జరుపు కుంటారు. కోరుకొండలోని నరసింహస్వామి ఆలయంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు విశేష పూజలు జరుగుతాయి. కోరుకొండ ఏకాదశి తీర్థాన్ని పురస్కరించుకుని ఒక సామెత కూడా పుట్టింది. ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డంత’ అనే సామెత అది. ఈ సామెత మామిడికాయలకు సంబంధించినది. మకర సంక్రాంతి నాటికి మంచి పూత మీదుండే మామిడిచెట్లు.. ఈ ఏకాదశి నాటికి కోడిగుడ్డు పరిమాణమంతటికి పెరుగుతాయి. అందుకే ఈ సామెత పుట్టింది. ఇవే ఇంకొంచెం పెరిగి.. ఉగాది పచ్చడి కాలం నాటికి లేత కాయలవుతాయి.
ఫాల్గుణ శుద్ధ ద్వాదశి, మార్చి 7, శనివారం
ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని గోవింద ద్వాదశి అనీ అంటారు. ఈనాడు గంగా స్నానం చేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయని అంటారు. ఈ తిథి నాడు కూడా ఆమలకీ వ్రతం చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. ఇంకా ఈనాడు మనోరథ ద్వాదశి, సుకృత ద్వాదశి, సుగతి ద్వాదశి, విజయ ద్వాదశి వ్రతాలను కూడా ఆచరించాలని ఆయా గ్రంథాలలో రాశారు.
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి, మార్చి 8, ఆదివారం
తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఈ తిథి నాడు లలిత కాంత్యాఖ్య దేవీ వ్రతం చేస్తారని ఉంది. అలాగే, మహేశ్వర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి, మార్చి 9, సోమవారం
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని మహా ఫాల్గుణీ అని అంటారు. దీనినే హోలికా పూర్ణిమగానూ వ్యవహరిస్తారు. మరికొన్ని వ్రత గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమగా వర్ణించాయి. ఈ పూర్ణిమ నాడు దక్షిణాది ప్రాంతాలలో కామ దహనం చేయడం ఆచారం. అందుకే ఈ పూర్ణిమకు కాముని పున్నమి అంటారు. కాముడు ఈ రోజున దహనమయ్యాడని పురాణగాథ. అందుకే పంచాంగకర్తలు ఈ తిథిని కామదహన దినమని రాస్తారు. దక్షిణ భారతంలో కామదేవుని దహన దినంగానే కానీ, ఇది ఉత్తరాదిలో మాదిరిగా హోలికా దహన దినంగా అంత ప్రఖ్యాతం కాదు.
హోలిక అనే రాక్షసిని దగ్ధం చేసిన దానికి గుర్తుగా కామదహనం పేరిట మంటలు వేసే ఆచారం ఏర్పడిందని అంటారు. హోలిక అనే రాక్షసి పేరును బట్టే దీనిని హోలీ పర్వదినం అనే పేరు స్థిరపడింది.
ఫాల్గుణ బహుళ పాడ్యమి, మార్చి 10, మంగళవారం
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాటి మర్నాడు వచ్చే పాడ్యమి తిథి హోలీ పర్వదినం. ఫాల్గుణ పూర్ణిమ తరువాత రోజు కొన్ని ప్రాంతాల వారికి కొత్త సంవత్సర ఆరంభ దినం కూడా. హోలీ వసంతాగమన సూచిక పర్వం. వసంతాన్ని ఆహ్వానిస్తూ పిల్లా, పెద్దా అందరూ ఆనందోత్సాహాలతో రంగునీళ్లు, పూలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా ఒకరినొకరు రంగునీళ్లతో తడుపుకోవడం అనే పక్రియ దాదాపు రోజంతా సాగుతుంది. ఎర్ర రంగు నీళ్లను వసంతాన్ని చల్లుకోవడాన్ని కొన్ని ప్రాంతాల్లో రంగ్లీల అంటారు. పూర్ణిమ నాడు మంటలు వేసే తతంగం పూర్తి కాగానే, ఈ రంగ్లీల ఆరంభమవుతుంది. హోలీ పర్వం అతి ప్రాచీనమైనదే కాక.. ఆధునికమైనది కూడా. అంతేకాదు, వివిధ దేశాల్లో కూడా ఈ వసంత వేడుక ఆచరణలో ఉంది. హోలీ వసంత రుతు సంబంధ ప•ర్వం. ఈ సమయానికి రాగి రంగుతో చిగుళ్లు ఆకు పచ్చరంగుతో పత్రాలు పలు రకాల రంగులతో పువ్వులు పలకరిస్తాయి. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరతాయి. పునాస పంటలన్నీ పంట పచ్చని పసిమితో ఉంటాయి. ఈ రంగుల వాతావరణమే హోలీలో వాడే రంగులకు ప్రతీక అని అంటారు. ఇంకా ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి నాడు ధూళి వందనం అనే పండుగ చేస్తారని కొందరు చెబుతారు. మొత్తానికి ఇది వసంతారంబోత్సవ సమయం.
ఫాల్గుణ బహుళ విదియ, మార్చి 11, బుధవారం
ఈ తిథి కూడా కామ మహోత్సవంగానే వ్యవహారికంలో ఉంది. అయితే, ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక్కడ ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీకి సంబంధ పర్వంగానే భావించాలి. హోలీ మర్నాడే వచ్చే తిథి కాబట్టి, ఇది దానికి అనుబంధంగా వచ్చే తిథిపర్వమని భావించవచ్చు.
ఫాల్గుణ బహుళ తదియ, మార్చి 12, గురువారం
ఫాల్గుణ బహుళ తదియ తిథి కల్పాది దినం.
ఫాల్గుణ బహుళ చతుర్థి, మార్చి 13, శుక్రవారం
వినాయక పూజకు ఉద్ధిష్టమైన తిథి ఇది. సంకష్ట హర చతుర్థి అంటారు. ఇంకా ఈ తిథి వ్యాసరాజ స్మ•తి దినంగా కూడా ప్రసిద్ధి. వ్యాసరాయ స్వామి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. రాజ వ్యవహారాలు, యుద్ధ విషయాలలో రాయల వారు ఈయన సలహాలు సూచనలు పొందే వారని ప్రతీతి. రాయచూరు యుద్ధంలో రాయలు విజయానికి వ్యాసరాయల వారి వ్యూహమే కారణమని అంటారు.
ఫాల్గుణ బహుళ అష్టమి, మార్చి 16, సోమవారం
ఫాల్గుణ బహుళ అష్టమి తిథి.. సీతాదేవి పుట్టిన రోజు. ఈమె జనక మహారాజు కుమార్తె. రాముడి భార్య. ఈమె పూర్వం వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి అనే ముని దంపతులకు జన్మించింది. పుట్టిన వెంటనే పురిటింటి నుంచి వేదఘోష వెలువడటంతో వేదవతి అనే పేరు పెట్టారు. ఒక సందర్భంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తపోదీక్షలోకి వెళ్లిపోయింది. విష్ణువును తప్ప వేరెవరినీ పెళ్లాడనని ప్రతినబూనింది. తపోదీక్షలో ఉన్న ఆమెను రావణుడు తాకుతాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె అయోజనిగా ఈ భూమిపై తాను తిరిగి పుట్టి నిన్ను పుత్రమిత్ర కళత్రంగా సర్వనాశనం చేస్తానని శపిస్తుంది. అన్నట్టే అగ్నిని సృష్టించుకుని ఆహుతైపోతుంది. పిమ్మట భూమిలో జనకుడికి పసిబిడ్డగా దొరకగా, సీతగా నామకరణం చేసి పెంచుకుంటాడు. రాముడిని పెళ్లాడి.. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల రీత్యా రావణ సంహారానికి కారకురాలవుతుంది. ఇంకా ఈనాడు కాలాష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా జరుపుకుంటారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.
ఫాల్గుణ బహుళ ఏకాదశి, మార్చి 19, గురువారం
ఫాల్గుణ కృష్ణ (బహుళ) ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అనీ, స్మార్త ఏకాదశి అనీ అంటారు. నీలమత పురాణంలో తెలిపిన ప్రకారం ఈనాడు కాశ్మీర్లో ఛందో దేవపూజ చేస్తారు. అలాగే, ఈనాడు కృష్ణకాదశి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఫాల్గుణ బహుళ ద్వాదశి, మార్చి 20, శుక్రవారం
ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం ఆచరించాలి. నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో మాత్రం ఈనాడు ఫాల్గుణ శ్రవణ ద్వాదశి వ్రతం ఆచరించాలని ఉంది. యోగేశ్వర భగవానుడిని పూజించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.
ఫాల్గుణ బహుళ చతుర్దశి, మార్చి 23, సోమవారం
ఫాల్గుణ బహుళ చతుర్దశినే పిశాచ చతుర్దశి అని కూడా అంటారు. ఈ తిథి నాడు శివపూజ చేసి పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని నీలమత పురాణంలో ఉంది.
ఫాల్గుణ బహుళ అమావాస్య, మార్చి 24, మంగళవారం
అమావాస్యను సాధారణంగా అశుభంగా భావిస్తారు. కానీ, శుభాశుభాలతో నిమిత్తం లేకుండా ఈనాడు ఆంధప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారు ఈ తిథి నాడు ఏరువాక సాగుతారు. దీనినే దొంగ ఏరువాకగా కూడా వ్యవహరిస్తారు. గ్రామ దేవతల ఉత్సవాలు ఈ తిథి నాడు వైభవంగా జరుగుతాయి. అలాగే, ఈ తిథి నాడే మీన సంక్ర మణం జరుగుతుంది. కాబట్టి ఇందుకు సంకేతంగా మత్స్యవాసుదేవులను పూజించాలని హేమాద్రి అనే పండితుడి అభిప్రాయం.
చైత్ర శుద్ధ పాడ్యమి, మార్చి 25, బుధవారం
చైత్ర శుద్ధ పాడ్యమి మన తెలుగు వారికి సంవత్సరాది. కొత్త సంవత్సర ఆరంభ దినం. వసంతమాసపు తొలి రోజు ఇది. వరాహమిహిరాచార్యుడు.. చైత్ర శుద్ధ పాడ్యమిని ప్రాచీనమైన దేవమాన దిన ప్రారంభమైన ఉత్తరాయణ పుణ్యకాలమనీ, సంప్రదాయానుసారంగా అదే వసంత కాలమనీ, వసంత ఆగమనమ ఉగాది అని నిర్ణయించి మాసరుతువు సమతుల్యం సాధించిన మహానుభావుడు. ఆయన నిర్ణయానుసారమే చైత్ర మాసం పాడ్యమి తిథినే సంవత్సరారంభ దినంగా భావించి ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. కానీ, ధర్మసింధు, నిర్ణయ సింధుకారులు అన్నట్టు శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్నే నెలగా పరిగణిస్తున్నాం. కనుక చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పాటించే ఆచారం ఏర్పడింది. అలా ఉగాదికి బీజం పడింది. ఈనాడు ఉదయమే ఇష్టదేవతలను పూజించడం, ఉగాది పచ్చడిని నివేదించి, ఆపై మహా ప్రసాదంగా స్వీకరించడం, అనంతరం పంచాంగ శ్రవణంతో ఆనందంగా గడపడం వంటివి ఈనాటి విధాయ కృత్యాలు.
చైత్ర శుద్ధ విదియ, మార్చి 26, గురువారం
పార్వతి ఒకనాడు తన భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉండగా ఆ సమయంలో అగ్ని అక్కడకు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా జరిగాడు. అప్పుడు శివుడికి వీర్యపతనం అయ్యింది. క్రీడా భంగానికి ఆగ్రహించిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాలని ఆజ్ఞాపించింది. అగ్ని ఆ వీర్యాన్ని భరించి కుమారస్వామి జననానికి కారణ భూతుడయ్యాడు. ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలను ఈనాడు దమనములతో పూజించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
స్కంధ పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయా లని ఉంది. ఆ వ్రతం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు తృతీయ వరకు చేయాలని అంటారు. ఇది స్త్రీల సుమంగళత్వాన్ని కాపాడ్డానికి ఉద్దేశించిన వ్రతం. అయితే, ప్రస్తుతం ఎక్కడా అరుంధతీ వ్రతం ఆచరిస్తున్న దాఖలాలు లేవు. అయితే, వివాహ సందర్బాలలో అరుంధతీ దర్శనం చేయించే ఆచారం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లి నాటి రాత్రి ఔపోసనానంతరం నక్షత్ర రూపంలో ఉండే అరుంధతిని ప్రాతివత్య నిష్టకు ప్రతీకగా పెళ్లి కుమార్తెకు చూపిస్తారు. అరుంధతి అంటే- ఏ కారణం చేత కానీ ధర్మాన్ని అతిక్రమించనిది అని అర్థం. చైత్ర శుద్ధ విదియ వేదవ్యాస తీర్థానాం పుణ్యదినం అని శ్రీమధ్వ పుణ్యతీర్థమనీ ప్రసిద్ధి. పెరియ పెరుమాల్ తిరు నక్షత్రం ఈనాడేనని ఆళ్వాచార్యుల చరిత్ర చెబుతోంది.
చైత్ర శుద్ధ తదియ, మార్చి 27, శుక్రవారం
ఈనాడు శివపార్వతులను దమనాలతో పూజించి, డోలోత్సవం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చని అంటారు. గౌరితో కూడిన శివుడిని పూజిం చడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. అందుకే ఈనాటి పర్వాలకు శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీవ్రతం అనే పేర్లు వచ్చాయి. ఈనాటి ఉద యాన స్త్రీలు మట్టితో గౌరీ విగ్రహాన్ని చేస్తారు. దానిని బాగా అలంకరిస్తారు. సాయంకాలం స్త్రీలందరూ ఒకచోటచేరి గౌరిని పూజిస్తూ పాటలు పాడుతారు. తిరిగి వెళ్లేటప్పుడు ప్రతి స్త్రీ దేవి వద్ద తన భర్త పేరు చెప్పాలి. ఈ పూజ జరిగిన అయిదవ నాటి సాయంకాలం గౌరీ విగ్రహాన్ని ఊరేగించి, తిరిగి ఇంటికి తీసుకు వస్తారు. తిరిగి పాటలు పాడతారు. కుంకుమ పంచి పెడతారు. వడపప్పు ప్రసాదం ఇస్తారు. వెళ్లిపోయేటప్పుడు ప్రతి స్త్రీ దేవి వద్ద తన భర్త పేరు చెప్పాలి. సాధారణ:గా హిందూ గృహిణికి తన భర్త పేరు చెప్పడం నిషిద్ధం. అయితే, దేవి వద్ద ప్రతి స్త్రీ తన భర్త పేరు చెప్పడం వల్ల దేవి కృప అతనికి లభిస్తుందనే నమ్మకం ఈ ఆచారానికి ప్రాతిపదిక. ఇంకా ఈ తిథి నాడు సౌభాగ్య శయన వ్రతం, ఉత్తమ మన్వంతరాది వంటివీ ఆచరిస్తారు. ఇంకా ఈ తిథి మత్స్య జయంతి దినంగా కూడా పరిగణనలో ఉంది.
చైత్ర శుద్ధ చతుర్థి, మార్చి 28, శనివారం
చైత్ర శుద్ధ చతుర్థి తిథి ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలకు ఉద్ధిష్టమైనదని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ తిథి నాడు విఘ్నేశ్వరుడిని దమనములతో పూజించాలి.
చైత్ర శుద్ధ పంచమి, మార్చి 29, ఆదివారం
ఈ తిథి శ్రీపంచమి, వసంతపంచమిగా కూడా ప్రసిద్ధి.
వాల్మీకి రామాయణంలో పేర్కొన్న ప్రకారం- శ్రీరాముడు ఇదే తిథి నాడు అయోధ్యలో పట్టాభిషేకం చేయించుకున్నాడు. అందుకే, ఇది ‘శ్రీరామ రాజోత్సవ పర్వం’గానూ ప్రసిద్ధి.
చైత్ర శుద్ధ పంచమి తిథి నాడు హయగ్రీవ పూజ చేయాలని అంటారు. పూర్వం మన రాజులు అశ్విక దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్ర హయ పంచమి వ్రతం బాగా ఆచారంలో ఉండేది. అలాగే, ఈ తిథి నాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది.
చైత్ర శుద్ధ షష్టి, మార్చి 30, సోమవారం
స్కందుడిని ఈనాడు దమనంతో పూజించాలి. చైత్ర శుద్ధ షష్టి నాడే స్కందోత్పత్తి జరిగిందని తిథితత్వం అనే గ్రంథంలో ఉంది. ఇంకా అర్క, కుమారషష్టి వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారు. ఇవన్నీ కూడా కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి సంబంధించిన పూజలే.
చైత్ర శుద్ధ సప్తమి, మార్చి 31, మంగళవారం
ఈనాడు అర్క వ్రతం ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించే వారు రాత్రి పూట భోజనం చేయకూడదు. అలాగే, సూర్యుడిని దమనంతో పూజించాలి. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన దినం.

Review కోయిల పిలుపు… ప్రకృతి మెరుపు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top