ప్రకృతి ‘పుష్య’ శ్యామలం

ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి సంవత్సరారంభ మాసం. తెలుగు పంచాంగం ప్రకారం దీనిని పుష్య మాసంగా వ్యవహరిస్తారు. ఇది పదవ నెల. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం. శివుడికి కార్తికం ప్రీతికరం. అలాగే, పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా తనను పూజించే వారి పట్ల శనైశ్చరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం.
‘పుష్య’ అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం కాబట్టి ఇది పుష్య మాసమైంది. ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి బృహస్పతి. వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే చోర భయమని మత్స్య పురాణం చెబుతోంది. సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించ డానికి మాత్రం ఇది విశేష మాసం. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యాన్ని కలుగచేస్తుంది. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి. ఇది తెలుగు వారి పెద్ద పండుగగా ప్రసిద్ధి. ఈ మాసంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చేయాలంటారు. పుష్య మాసంలో గేదె ఈనితే శాంతి చేసే ఆచారం కొన్నిచోట్ల ఉంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దు ఉండదని నానుడి. ఈ మాసంలో వచ్చే పండుగలు, పర్వాల విశేషాలు..
పుష్య శుద్ధ విదియ, డిసెంబరు 28, శనివారం
పుష్య శుద్ధ పాడ్యమి (డిసెంబరు 27)తో పుష్య మాసారంభం. పుష్య శుద్ధ విదియ (డిసెంబరు 28) తిథి నాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే విష్ణు వ్రతానికి ఈనాడే శ్రీకారం చుడతారు.
పుష్య శుద్ధ పంచమి, డిసెంబరు 31, మంగళవారం
ఈ తిథి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి. ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షాల్లోని పంచమి తిథులలో నాగపూజ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆచారమై ఉంది.
పుష్య శుద్ధ షష్ఠి, జనవరి 1, బుధవారం
పుష్య శుక్ల షష్ఠిని కుమారషష్ఠి అని అంటారు. ఇది శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని పూజించడానికి సరైన రోజు. తమిళనాడులో ఈనాడు పెద్ద పర్వంగా నిర్వహిస్తారు. కుమారస్వామి వారి ఇలవేల్పు. చాళుక్యుల కాలంలో కుమారస్వామి పూజ తెలుగునాట ఎక్కువగా ఉండేది. ‘కుమారదేవం’ తదితర ఊళ్లు అందుకు నిదర్శనం. ఇక, మన ప్రాచీనాంధ్ర కవులు సైతం తమ కావ్యాలలో ఇష్టదేవతా స్తుతిలో కుమారస్వామి స్తుతిని కూడా చేర్చారు. అయితే, ప్రస్తుతం తెలుగు వారిలో కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యస్వామి పూజ విశేషమై ఉంది. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగు నాట విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. సుబ్బారాయుడి షష్ఠి అని పిలిచే మార్గశిర శుద్ధ షష్ఠి తెలుగు నాట పెద్ద పర్వమే. ఇదే పర్వాన్ని తమిళులు పుష్య శుద్ధ షష్ఠి నాడు ఘనంగా జరుపుకుంటారు.
పుష్య శుద్ధ సప్తమి, జనవరి 2, గురువారం
ఈ తిథి నాడు మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలు చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాయడాన్ని బట్టి.. ఇవి సూర్య సంబంధమైన పర్వాలుగా భావించాలి. ఈనాడు సూర్య భగవానుడిని యథాశక్తి పూజిం చాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

Review ప్రకృతి ‘పుష్య’ శ్యామలం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top