ఆచితూచి తినాలి సుమా!

సాధారణంగా మన•ం ఏదైనా అనారోగ్యానికి గురైతే.. ‘ఏం తినమంటారు?’ అని వైద్యుడిని అడుగుతాం. అయితే, ఏది తినడం మానేయాలని అడగడం ఒక కొత్త ఆలోచన. ఎందుకంటే మనం తినే వాటి వల్లనే కానీ, తినని వాటి వల్ల రోగాలు రావు కదా! కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినపుడు మానటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తినవలసినవి మాత్రమే తినడం చికిత్స. మనం తీసుకునే ఆహారం.. ఆయా కాలాలకు అనుగుణంగా ఉండాలి. కాలానికి అనుగుణంగా మన ఆహార నియమాలు ఉంటే అన్ని కాలాల్లోనూ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ విషయంలో ‘ఆరోగ్య గీత’ ఆయుర్వేదం ఏం చెబుతుందో చదివేయండి మరి..

మనకున్న సంవత్సర కాలంలో సగం ఉత్తరాయణం.. సగం దక్షిణాయనం అంటారు.
వర్ష, శరత్‍, హేమంత రుతువుల్లో అంటే, జూలై నుంచి జనవరి వరకు సూర్యుడు దక్షిణం వైపు కదులుతుంటాడు. ఈ కాలంలో మేఘాలు, చల్లగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సూర్యుడి సహజమైన వేడి రోజురోజుకీ తగ్గిపోతుంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

వేడి తక్కువగా ఉండటం వలన శరీరానికి మంచి బలం కలిగే కాలం ఇది. వర్షాకాలంలో ఒక మోస్తరు కానీ, శరదృతువులో మధ్యమంగానూ, హేమంత రుతువులో అంటే నవంబర్‍, డిసెంబర్‍ నెలల్లో పూర్తిగా జీవరాశులు బలసంపన్నంగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కాబట్టి ఈ ఆరు నెలల కాలాన్ని ‘ఆదాన కాలం’.. అంటే బలాన్ని గ్రహించే కాలం అంటారు.
ఇక, జనవరి నుంచి మళ్లీ జూలై వరకు వచ్చే కాలాన్ని ‘విసర్గ కాలం’ అంటారు. అంటే క్రమేణా బలం తగ్గిపోయి మనుషులు బలహీనపడే కాలం.

ఈ పరిస్థితుల్లో ఏయే కాలాల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో ఆయుర్వేదం వివరంగా చెబుతోంది.

శీతాకాలం.. ఉపవాసాలు వద్దు
శీతాకాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. శరీర బలంతో పాటు జఠరాగ్ని బలం కూడా ఈ కాలంలో బాగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కొంచెం గట్టి ఆహార పదార్థాలు తిన్నా తట్టుకోగల, జీర్ణం చేసుకోగల శక్తి సాధారణంగా శరీరానికి ఉంటుంది.

శీతాకాలంలో ఎక్కువ ఉపవాసాలు చేయకూడదు. దేహంలో జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నపుడు అందుకు తగినంతగా, ఆకలికి తగిన ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే వాత వ్యాధులు, నొప్పులు పుట్టుకొస్తాయి. చేపలు, రొయ్యలు వంటివి కూడా ఈ కాలంలో చక్కగా తినవచ్చని అభయం ఇస్తున్నారు ఆయుర్వేద శాస్త్రకారులు. కడుపులో అగ్నితో పాటు శీతాకాలంలో కామాగ్ని కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించకూడదు. పైన చెప్పిన మేరకు శీతాకాలంలో గట్టి ఆహార పదార్థాలనే తీసుకోవాలి సుమా!. మరీ తేలికగా అరిగేవి, బలహీనమైన ఆహార పదార్థాలు ఈ కాలంలో తినకూడదు.

వేసవిలో మసాలాలు వద్దు
వేసవి కాలం గ్రీష్మ రుతువు. ఈ కాలంలో సూర్యుడు తన వేడి కిరణాలతో లోకంలోని సమస్త జీవజాలంలో భూమితో సహా అన్నింటిలోని చెమ్మను ఆకర్షిస్తాడు. అంటే ఈ కాలంలో సూర్యుడి నుంచి పుట్టే అధిక వేడి.. మనుషుల శరీరాల్లోని తేమను హరిస్తుందన్న మాట. కాబట్టి వేసవి కాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా స్నిగ్ధంగా ఉండాలి. అంటే, నెయ్యి, నూనె వంటివి తగ్గించాలి. బియ్యపు జావా, బార్లి జావ, సగ్గుబియ్యం జావ వంటివి తాగితే శరీరంలో నుంచి సూర్యుడు పీల్చేసిన చెమ్మ మళ్లీ వచ్చి శరీరం సంతృప్తమవుతుంది. పైన చెప్పిన జావ ద్రవాలను పంచదార వేసుకుని మరీ తాగాలని ఆయుర్వేదం చెబుతోంది.
వేసవి కాలంలో తినే ఆహార పదార్థాల్లో మసాలాలు పెద్దగా లేకుండా చూసుకోవాలి. మాంసాహారం, నెయ్యి, పాలు వంటివి బాగా తగ్గించాలి. వేసవిలో చల్లదనం కోసమంటా చాలామంది బీర్లు తాగడం కూడా చేస్తుంటారు. అయితే ఈ కాలంలో మద్యపానం చేయడం మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే, అతిగా పులుపు, అతిగా ఉప్పు, అతిగా కారంతో కూడిన ఆహార పదార్థాలను వేసవి కాలంలో అసలు తీసుకోకూడదు.

ఇంకా, వేసవిలో అతిగా వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. వేసవి కాలంలో ఒంటికి మంచి గంధం పూసుకుని, రాత్రిపూట ఆరుబయట వెన్నెల్లో పడుకుంటే పగలు ఎండ 120 డిగ్రీల ఫారన్‍హీట్‍కు వెళ్లినా ఏమాత్రం మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

వర్షాకాలం.. తేలికగా అరిగేవి తినాలి
వర్షాకాలంలో శరీరంలో జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది. బాగా ఎర్రగా కాలిన ఇనుము మీద నీళ్లు చిలికితే ఒక్కసారి ఆ ఇనుము బద్ధలైనట్టు ఉంటుంది వానాకాలంలో మన శరీరం పరిస్థితి. కడుపులో అగ్ని చల్లారిపోతుంది. అగ్ని బలం తక్కువగా ఉంటే అజీర్తి పెరిగి శరీరంలో వాతంతో సహా సమస్త దోషాలు పుట్టుకొస్తాయి. వర్షాకాలంలో తినే ఆహార పదార్థాలు కానీ, తాగే నీరు కానీ సాధ్యమైనంత పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పులుపు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. నెయ్యి, నూనెల్ని ఎక్కువగా వాడినా ఫర్వాలేదు. సాధ్యమైనంత తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకోవడం వానాకాలంలో ఎంతో అవసరం. మజ్జిగ ఎక్కువగా తాగాలి. జీర్ణశక్తి పెరగడమే కాకుండా కడుపులో సూక్ష్మజీవుల వలన చెడు జరగకుండా మజ్జిగ కాపాడుతుంది. తేలికగా అరిగే ఆహార పదార్థాన్ని తీసుకుంటే వానాకాలంలో తరచూ వచ్చే జ్వరాలు, జలుబు, నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటివి దరిచేరకుండా ఉంటాయి.

Review ఆచితూచి తినాలి సుమా!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top