తాతా పెండ్లంటే తలెగరేసినాడంట!

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..

అనుభవశూన్యులైన యువతీ యువకులను మందలించి సరైన తోవలో పెట్టేందుకు ప్రతి కుటుంబంలోనూ పెద్దదిక్కు అవసరం ఎంతైనా ఉందని కొన్ని సామెతలు చెబుతున్నాయి.
పెద్దలంటే తల్లిదండ్రులు కావచ్చు లేదా అవ్వతాతలు కావచ్చు.
పెద్దల్ని వృద్ధాప్యంలో సరిగా చూడాల్సిన ధర్మం ఆ ఇంటి యువతీ యువకులపై ఉందని, అలా చూడకపోవడం పాపమని సామెతలు చెబుతున్నాయి. ‘పెద్దలు లేని ఇల్లు ఎద్దులకొకటి’, ‘పెద్దల మాట చద్దిమూట’, ‘పెద్దల మాట పెన్నిధి మూట’, ‘పెద్దల ఉసురు పెనుబామై తగులును’ అనేవి ఆ సామెతలు.
కొడుక్కి పెళ్లయినప్పటి నుంచి తల్లిదండ్రులు అవ్వాతాతలు కావాలని ఉర్రూతలూగుతారు.
మనవడో, మనవరాలో పుడితే వాళ్లను సాకి, సంతరిస్తూ తమ వృద్ధాప్యాన్ని తాత్కాలికంగానైనా మరచిపోవచ్చునని ఆ వృద్ధుల ఆశ. కొడుకు, కోడలు తమ సలహాలను, మాటలను కాకమ్మ కబుర్లుగా తీసిపారేస్తారు. అదే మనవడో, మనవరాలో అయితే ఆ కాకమ్మ కబుర్లే కావాలని మాటిమాటికీ అడిగి చెప్పించుకుంటారు.
వృద్ధుల వాక్చాపల్యాన్ని తట్టుకోగలిగేది పిల్లలే. అందుకే అవ్వాతాతలు పిల్లల్లో పిల్లలైపోతారు.
వృద్ధాప్యం రెండో బాల్యం అనేమాటను పెద్దలు సార్థకం చేస్తారు.
అవ్వాతాతలకు ‘వరహా కన్నా వడ్డీ ముద్దు. కొడుకు కన్న మనవడు ముద్దు’ అనే సామెత పుట్టింది.
మనవరాళ్లు తాత దగ్గర, మనవలు అవ్వ దగ్గర ముద్దులు గుడుస్తారు. మనవరాళ్లు తాతల్ని గేలి చేసే మధుర సందర్భాలకు అద్దం పడుతుంది ఈ సామెత- ‘తాతా పెండ్లంటే తలెగరేసినాడంట’. తలెగరేస్తే మనవరాళ్లు ఊరుకుంటారా- ‘తాటిచెట్టు ఎక్కాలేవు తాటిగెల కోయలేవు తాతా నీకెందుకోయ్‍ పెండ్లాము’ అని ఎగతాళి పట్టిస్తారు.
గత వైభవాన్ని నెమరువేసుకుంటూ ఇప్పటి పరిస్థితిని సమర్థించి ప్రయోజనం లేదని ‘తాతల నాడు నేతులు తాగాం మూతులు వాసన చూడండి’ అనే సామెత ఎత్తి పొడుస్తుంది.
వృద్ధాప్యంలో మనవడినో, మనవరాలినో ఎత్తుకునే అదృష్టం లేకపోతే తాత తనే పసిపిల్లాడిలా ప్రవర్తిస్తాడట.
‘పిల్లలు లేని ఇంట్లో ముసలోడు దొగ్గాడిండట’, ‘బాల లేని ఇంట్లో వృద్ధుడంబాడెనట’ అనే సామెతలు వృద్ధులను పిల్లల్ని చేసి చెబుతాయి. వృద్ధాప్యంలో ప్రధానంగా వేధించేది ‘దగ్గు’. అందుకే వృద్ధులకు తోడు దగ్గు అంటారు. బాగా తెలిసిన వాళ్లకు ఏదైనా చెప్పబోవడం ‘తాతకు దగ్గు నేర్పినట్టు’ వ్యర్థమని చెబుతారు.
అవ్వలను గురించి చెప్పేవి మరికొన్ని సామెతలు ఉన్నాయి.
వీటినే ‘ముసలమ్మ సుద్దులు’గా వ్యవహరిస్తారు.
ఈ సుద్దులు పిల్లలకు వినడానికి బాగుంటాయి కానీ కాస్త పెద్దలైతే సోది కింద భావిస్తారు. ఇంటికి అవ్వ పెద్దదిక్కు. మంచీచెడూ చెప్పడానికి అవ్వ అవసరం. ‘ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం’ అనే సామెత ఈ విషయాన్నే చెబుతుంది.
అవ్వ అంటే కడు వృద్ధురాలు కదా! పాపం ఆ వయసులో ఎంత నూలు వడకగలదు? అందుకే- ‘అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి’ అనే సామెత పుట్టింది. పగలు అవ్వ కూర్చుని కునుకు తీయడం కద్దు. ‘అవ్వకు మనవడు ఆవలింత నేర్పినట్టు’ అనే సామెత ఆ సంగతినే చెబుతుంది. అవ్వ తాను వీపు గోక్కోలేక మనవడికి ఆ పని అప్పచెబుతుంది. మనవడు వచ్చీరాని అక్షరాల్ని అవ్వ వీపు మీదనే దిద్దుతాడు. ఆ వింత సందర్భాన్ని ‘మనవడు నేర్చుకొన్నట్టు.. అవ్వ దురద (తత్తర) తీరినట్టు’ అనే సామెత తెలుపుతుంది.

Review తాతా పెండ్లంటే తలెగరేసినాడంట!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top