ధ్యానం తో మహాయోగం

ధ్యానం చేయాలంటే దీక్ష, పట్టుదల ఉండాలి. ధ్యాన సాధన చేసే మొదట్లో మనసును ధ్యేయంపై లగ్నం చేయడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. కొంత సాధన చేసిన తరువాత శ్రమ లేకుండా కలిగే ఏకాగ్రత ధ్యానానికి దారితీస్తుంది. ధ్యాన సాధన వలన మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి. ఈ మార్పులు మనిషి అనుకున్నది సాధించడానికి, అతని పురోగతికి, ఆరోగ్యానికి దోహదపడుతుంటాయి. ధ్యానంలో భాగంగా.. ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసుకొందాం
మానవ మనస్తత్వ శాస్త్రం మానసిక ఒత్తిడులకు మూల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒత్తిడిని నివారించుకోవడానికి మనం తప్పనిసరిగా కృషి చెయ్యాలి. ఆ కృషి ధ్యానం ద్వారా సఫలమవుతుంది. అంటే ధ్యానానికి సైకాలజీ అండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా మనలో ఏకాగ్రత సమాయత్తమవుతుంది. బయటి నుంచి శరీరం నుంచి ఆ శక్తిని మరల్చి, అంతర్గతం చేసి మానసిక క్షేత్రం మీదికి తరలిస్తుంది. అక్కడ మనలో ఆలోచనలు, సంఘటనలు, ఉద్వేగాలు మొదలైనవి కదలాడుతుంటాయి. వాటన్నిటితో కలిసి నిరంతరం సాగేదే మనలోని ‘చైతన్యం’. దీని ముఖ్య లక్షణం ‘నేను’, ‘నా’ అనే వాటికి సంబంధించిన మానసిక వ్యవహారం. నిద్రలో ఉన్నప్పుడు తప్పితే మెలకువ రాగానే మళ్లీ కొనసాగే చైతన్య స్రవంతి ‘నా’ అనే మనసుకే సొంతం. అది ‘నా’ అనబడే శరీరానికి, పరిసరాలకీ, జీవితానికీ, గతానికీ, ప్రస్తుతానికీ, భవిష్యత్తుకీ సంబంధించిన వాస్తవాలతో, జ్ఞాపకాలతో, ఊహలతో ప్రతి క్షణం మారుతూ పయనించే ప్రవాహం వంటిది. వీటిలో నేను, నావి అనుకునేవి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదంతా ‘నా’ అనుకునే దానిలో భాగంగానే ఉంటాయి. మనలోని ఆలోచనల్ని మనం గమనించగలం. గమనించేది, గమనించబడేది కూడా మనసే. మనసులోని కొంత భాగం విడిపోయి, మిగతా భాగాలను వాటి దారికవి వదిలేసి, వాటిని వాటి ఆలోచనారీతులను పరిశీలించగలదు. అధ్యయనం, అవగాహన చేయగలదు.
మనసును అదుపులో ఉంచుకోవడం ఒకింత కష్టమైన పనే. బాహ్యపరమైన, అంతర్గతమైన ఎన్నో విషయాల మీద మంచి అవగాహనను పెంపొందించుకోవాలి. అందుకు కావాల్సిన విజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. ధ్యాన సాధన ద్వారా మన మనసును మనకు ప్రయోజనం కలిగించే విషయాల మీద లగ్నం చేయాలి. ఏకాగ్రతను ఎక్కువ చేయడం వల్ల మన మనసు మన అదుపులో ఉండటమే కాక, వ్యక్తిత్వ వికాసానికి, జీవితంలో అనుకున్నవి సాధించడానికి నూటికి నూరుపాళ్లు దోహదమవుతుంది.
ధ్యానం చేయదల్చుకున్న వారు కొంత మనసును కూడా అర్థం చేసుకోవాలి. అది చెప్పే ఊసులు వినాలి. అప్పుడే ధ్యానం దాగి ఉన్న నిగూఢమైన శక్తి ఏమిటన్నది శాస్త్రీయంగా తెలుస్తుంది. ఏ విషయం మీదైనా మనకు ముందు కొంత అవగాహన ఉంటే, అది మనలో కుతూహల శక్తిని పెంచుతుంది. దీనివల్ల మనసు మనం అనుకున్న విషయాలపై లగ్నమవుతుంది. ఏకాగ్రత, సామర్థ్యం వృద్ధి చెందుతాయి. అప్పుడు ధ్యాన సాధన సులభమవుతుంది.
మనిషిలోని మానసిక వ్యవస్థ చాలా గొప్పది. నిరంతరం మనలో కలిగే ఊహలు, ఆలోచనల ప్రకారం మనసు చైతన్యం చెందుతుంది. మనతో ఎన్నో పనులు చేయిస్తుంటుంది. అవి మంచివి కావచ్చు. చెడ్డవీ కావచ్చు. ఒక విధంగా మనసు మనుషులను నియంత్రిస్తూ ఉంటుంది. అయితే, ఆ మనసును మన అదుపులో ఉంచుకునే అవకాశం కూడా ఉండటం మన అదృష్టం. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, చాలామందిమి ఆ మనసును పట్టపగ్గాల్లేకుండా వదిలేస్తుంటాం. దానిని అదుపులో ఉంచుకునే కళ్లెం మన చేతుల్లోనే ఉన్నా, అది మనకు సంబంధించిన పని కాదన్నట్టు వ్యవహరిస్తుంటాం. చాలా విషయాల్లో అపజయాలకు, ఓటమికి, అవరోధాలకు మనసును అదుపులో పెట్టుకోకపోవడమే కారణం.

Review ధ్యానం తో మహాయోగం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top