మనకు తిథులను అనుసరించి వచ్చే వివిధ పర్వాలలో సీతాష్టమి ఒకటి కదా!. దీని నేపథ్యం ఏమిటి? వివరాలు చెప్పగలరా?
ఫాల్గుణ బహుళ అష్టమి తిథి సీతాదేవి పుట్టిన రోజు. అందుకే ఈ తిథి నాడు సీతా జయంతి ఆచరిస్తారు. సీతాదేవి రాముడి భార్య. జనకుని కుమార్తె. సీత పూర్వం వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి అనే ముని దంపతులకు వేదవతి జన్మించింది. పుట్టిన వెంటనే పురిటింటి నుంచి వేదఘోష వెలువడటం వల్ల ఈమెకు వేదవతి అనే పేరు పెట్టారు. ఒక సందర్భంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తపోదీక్షలోకి వెళ్లిపోయింది. విష్ణువును తప్ప వేరెవరినీ పెళ్లాడనని ప్రతినబూనింది. తపోదీక్షలో ఉన్న ఆమెను రావణుడు తాకుతాడు. దీంతో ఆగ్రహోద్రగురాలైన ఆమె అయోజనిగా ఈ భూమిపై తాను తిరిగి పుట్టి నిన్ను పుత్రమిత్ర కళత్రంగా సర్వనాశనం చేస్తానని శపిస్తుంది. అన్నట్టే యోగాన్ని సృష్టించుకుని ఆహుతైపోతుంది. పిమ్మట ఒకనాడు జనక మహారాజు భూమి దున్నుతుండగా, ఆయనకు పసిబిడ్డగా దొరకగా, సీతగా నామకరణం చేసి పెంచుకుంటాడు. అనంతరం రాముడిని పెళ్లాడి.. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల రీత్యా రావణాసుర సంహారానికి కారకురాలవుతుంది. ఇంకా ఫాల్గుణ బహుళ అష్టమి తిథి నాడు కాలాష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా జరుపుకుంటారని ఆయా వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఇదీ సీతాదేవి జయంతి తిథి నేపథ్యం.
ధ్యానం యొక్క నిజమైన ధ్యేయం ఏమిటి? దైవాన్ని ధ్యానం ద్వారా అర్థం చేసుకోగల అవకాశం ఉందా?
కచ్చితంగా ఉంది. ఒక్కోచోట ఒక్కో దేవుడు మహిమాన్వితుడుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అలా మనకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని ఆరాధించడం చాలామంది అలవాటు. నిజానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక దేవుడు కంటే మరో దేవుడు మహిమాన్వితుడని మనకున్న అజ్ఞానం కొద్దీ భావిస్తూ.. వివిధ సమయాలు, సందర్భాలలో మనం పూజించే దేవుడిని మారుస్తూ పోతుంటాం. నిజానికి ఇది అజ్ఞానం. అందులో మన స్వార్థం కూడా ఉంటుంది. ఎంత శక్తిమంతుడైన దేవుడైన మనకు అన్ని శక్తి సామర్థ్యాలు వస్తాయని, కోరికలు తీరుతాయనే నమ్మకమే ఇందుకు కారణం. దైవాన్ని ఇలాంటి సంకుచిత భావాలతో ఆరాధించడం వల్లనే మనకు దైవసాక్షాత్కారం జరగదు.
నిజానికి మనం ఆచరించే ధర్మమే ఒక దైవం. మన ధర్మాన్ని ఆచరించడం వల్ల పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యమే దైవంగా మన వెన్నంటి ఉంటుంది. అదే మన కోరికలు తీరుస్తుంది. మనకు ఆధ్యాత్మిక బాటను చూపుతుంది. ఈ సత్యాన్ని గుర్తించలేకనే మనం ఈనాడు ధర్మాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నాం. ఈ క్రమంలోనే అనేక మంది దేవుళ్లు, అనేక రూపాలు పుట్టుకొస్తున్నాయి. ధ్యానం చేయడం వలన అనేక రూపాలన్నీ కలిసి ఏకరూపం కలుగుతుంది. ధ్యానం అంటే బయటి నుంచి దేనినీ ఆశించకపోవడం. ఈ సృష్టికి ఆధారభూతంగా ఉన్న దైవం మనలోనూ ‘ఆత్మ’గా ఉన్నాడన్న సత్యం అనుభవంలోకి రావడమే ధ్యానం. అంతేకానీ, కోరికలు తీరడం లేదని పూజించే దేవతా మూర్తులను మారుస్తూ పోవడం భక్తి, ధ్యానం అనిపించుకోదు.
రోజూ కొద్దిసేపు మనసులో ఏ ఆలోచనలు లేకుండా ధ్యానం చేయడాన్ని ఆచరిస్తే.. క్రమంగా మనసు నిర్మలమవుతుంది. ఒక ప్రశాంతస్థితి కలుగుతుంది. అటువంటి ప్రశాంత స్థితిలో నుంచే మనం దైవాన్ని దర్శించగలం.
పరమశాంతిని పొందడం ఎలా?
శాంతిని పొందాలంటే మొదట భ్రాంతిని వీడాలి. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా, శక్తిహీనుడిగా నటించాలి.
తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉండాలి. అప్పుడు ప్రతి మనిషి శాంతిగా బతికే అవకాశం లభిస్తుంది.
చివరకు పరమశాంతిని పొందుతారు.
Review ధ్యానం ద్వారా దైవాన్ని దర్శించవచ్చా?.