నేరేడు చెట్టు
దీనికి కాకి నేరేడు అనే పేరూ ఉంది. అల్లనేరేడు కంటే ఇది చాలామంచిది. దీని బెరడు రసం లేదా కషాయం అతిసారం, నీళ్ల విరేచనాలు, జ్వరాన్ని కట్టిస్తుంది. ఈ కషాయాన్ని పుక్కిలిస్తే గొంతులో పుండు నిమ్మళిస్తుంది. దీని ఆకులు నూరి, తేలు కుట్టిన చోట కడితే విషం హరిస్తుంది. బాధ ఉండదు. దీని ఆకుల రసాన్ని పుక్కిలిస్తే ఉబ్బి మెత్తబడిన చిగుళ్లు గట్టిపడతాయి. నొప్పి ఉండదు. ఈ పళ్లు తింటే నీళ్ల విరేచనాలు కడతాయి. బ్లాడర్‍లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ఎండిన ఈ పళ్ల విత్తనాల చూర్ణాన్ని తీసుకుంటే అతిమూత్రం కడుతుంది. మధుమేహం రాదు. దీని ఆకుల విస్తరిలో భోజనం చేస్తే అతిసారం, పైత్యం అణగిపోతాయి. దీని ఆకుల చూర్ణంతో పళ్లు తోముకుంటే అవి గట్టిపడతాయి.
నేరేడు పండు
వగరు, తీపి, పులుపు రుచులను కలిగి ఉంటుంది. చలవ చేసి ఆర్చుతుంది. ఆకలి కలిగిస్తుంది. మేహశాంతి, పైత్యశాంతిని పుట్టిస్తుంది. పుంసత్వానికి బలాన్నిస్తుంది. కఫ, శిరోపైత్యాలను అణచివేస్తుంది. పొట్టకు బలాన్నిచ్చి, గుండెలోని రక్తంలో ఉన్న వేడిని పోగొడుతుంది. కడుపులోని వాతాన్ని బంధిస్తుంది. నేరేడుపండ్లు తినడం వల్ల ప్రేగులు, పొట్టలో చేరిన తల వెంట్రుకలు, లోహపు ముక్కలు అరిగిపోతాయి.
నీరుల్లిపాయ: పైత్యశాంతి, మేహశాంతిని కలుగచేస్తుంది. చెడు రక్తాన్ని, మూలశంకను పోగొడుతుంది. నడుం నొప్పి, ఉదరం, ఉబ్బును హరిస్తుంది. నరాలకు సత్తువను, వీర్యపుష్టిని, బలాన్ని, దేహపుష్టిని కలిగిస్తుంది. కాంతినిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. మంచి విరేచనకారి. శరీరానికి వేడిని, ఇంద్రియాలకు చురుకుదనాన్ని కలుగచేస్తుంది. రక్తనాళాలను శుభ్రపరుస్తుంది. శ్లేష్మం, జ్వరం, దగ్గు, అజీర్ణం, కడుపునొప్పిని పోగొడుతుంది. పొట్టలోని వాతాన్ని హరిస్తుంది. ఉల్లిపాయలు పచ్చివి తింటే నిద్రవస్తుంది. వీటి రసాన్ని చెవిలో పోస్తే చెవినొప్పి, పోటు అణగిపోతాయి. ఉడికించి వీటిని తింటే కఫం, పొట్టలోని నొప్పి పోతాయి. మూర్ఛ వచ్చినపుడు ఉల్లిపాయ రసం ముక్కులో పిండితే వెంటనే తెలివి వస్తుంది. వడదెబ్బ తగిలిన మనిషికి వీటి రసాన్ని వంటికి పూస్తే కోలుకుంటాడు. వేసవికాలంలో బిడ్డల మెడకు ఉల్లిపాయ కడితే వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వేసవిలో ఎండలో నడిచేటపుడు ఉల్లిపాయను నెత్తి మీద ఉంచుకుని, దాని మీద రుమాలు కానీ, టోపీ కానీ పెట్టుకున్న పక్షంలో వడదెబ్బ తగలదు. దీని రసాన్ని కళ్లకు పూస్తే రేచీకటి పోతుంది. దీని రసంలో తేనె కలిపి కళ్లకు పెట్టుకుంటే కళ్లకు వెలుగొస్తుంది. దీని రసాన్ని కళ్లకు పూస్తే కళ్లకలక కూడా పోతుంది. ముక్కులో వేసుకుంటే ముక్కు కారడం తగ్గుతుంది. ఉల్లిపాయను నూరి దానితో పళ్లు తోముకుంటే పళ్ల వెంట వచ్చే చీము, రక్తం అరికడుతుంది. నొప్పి కూడా మానుతుంది.
నువ్వుల పచ్చడి: ఈ పచ్చడి జఠరదీప్తి కలిగిస్తుంది. వాతాన్ని పోగొడుతుంది. బలాన్నిస్తుంది. వేడిని, కఫాన్ని కలుగచేస్తుంది.
నువ్వులపొడి: కఫ, పైత్యాలను కలుగచేస్తుంది. వాతాన్ని పోగొట్టి బలాన్నిస్తుంది. వంటికి పట్టిన నీటిని ఆర్చివేస్తుంది.
నూనె పిండివంటలు: దాహం, చర్మరోగం, పైత్యాన్ని కలుగచేస్తాయి. కళ్లకు ఇబ్బందులు కలుగచేస్తాయి.
నువ్వుల నూనె: ఆరోగ్యవంతమైనది. బలం, దేహపుష్టి, వీర్యవృద్ధిని కలగుచేస్తుంది. కళ్లకు మంచిది. వడదెబ్బ తగిలిన మనిషికి నూనెలో చనుబాలు పోసి రంగరించి దానిని చెవిలో పోస్తే వడదెబ్బ నుంచి కోలుకుంటాడు.
నెయ్యి: త్రిదోషహరమైనది. కళ్లకు చలువచేస్తుంది. బుద్ధి, జ్ఞాపకశక్తి, దేహపుష్టి, కాంతి, బలం, ఆయుర్వ•ద్ధి, సుస్వరం, ఇంద్రియపుష్టి, జఠరదీప్తిని ఇస్తుంది. పిల్లలకు, పెద్దలకు అన్ని కాలాల్లోనూ అనుకూలంగా ఉంటుంది.
అప్పుడే వెన్న కాచిన నెయ్యి: సువాసన కలిగి మనోహరంగా ఉంటుంది. కళ్లకు చలువ చేస్తుంది. వీర్యవృద్ధి, ఆయుర్వ•ద్ధి, కాంతి, బుద్ధి బలిమి, ఆరోగ్యాలను కలుగచేస్తుంది. జఠరాగ్నిని పెంచుతుంది.
నెమలి ఈకల విసనకర్ర: చల్లగా, మనోహరంగా ఉంటుంది. కాంతినిస్తుంది. కళ్లకు మేలు చేస్తుంది. తాపం, పైత్యం, వాతాన్ని అణచివేస్తుంది.
నేతి దొండకాయ: రుచిగా ఉంటుంది. చలువచేస్తుంది. పైత్యశాంతి, మేహశాంతిని కలుగచేస్తుంది. పథ్యానికి పనికొస్తుంది.
నేతి పిండివంటలు: రుచిగా, మనోహరంగా తేలిగ్గా ఉంటాయి. వాత, పైత్యాలను హరిస్తాయి. బలం, వీర్యవృద్ధి, కాంతిని కలుగచేస్తాయి. కళ్లకు మంచివి.
నేతి బీరకాయ: రుచిగా ఉంటుంది. వీర్యపుష్టిని కలుగచేస్తుంది. ఎక్కిళ్లు, విషం, విషజ్వరం, పైత్యం, దాహాలను అణచివేస్తుంది. దేహతత్వాన్ని సౌమ్యపరిచి, సమశీతోష్ణంగా ఉంచుతుంది.





















































































Review నేరేడు.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.