వహ్వా.. హాండ్వో

శీతాకాలం సాయంత్రం వేడి వేడి పకోడీలో.. మిర్చి బజ్జీలో తినాలనిపించడం సహజం. అయితే, ఈసారి వాటికి బదులు కాస్త వెరైటీగా కూరగాయలతో స్నాక్స్ చేసేయండి. నాలుకకు రుచీ.. ఆరోగ్యానికి పోషకాలు.. ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేయండిలా..

కావాల్సినవి: ఇడ్లీపిండి: 2 కప్పులు, సొరకాయ తురుము: పావు కప్పు, పాలకూర తురుము: పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు: 2 టేబుల్‍స్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‍స్పూన్లు, క్యారెట్‍ తురుము: 2 టేబుల్‍స్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద: టీ స్పూను, వెల్లుల్లి సాస్‍: అర టీ స్పూను, పసుపు: పావు టీ స్పూను, కారం: అర టీ స్పూను, ఆవాలు: ఒకటిన్నర టీ స్పూన్లు, నువ్వులు: నాలుగు టీస్పూన్లు, నూనె: తగినంత, ఉప్పు: సరిపడా.
తయారీ విధానం ఇలా..

  • ఇడ్లీపిండిలో నూనె, నువ్వులు, ఆవాలు తప్ప మిగిలిన అన్ని పదార్థాలు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
  • తరువాత నాన్‍స్టిక్‍ పాన్‍లో అడుగున కొద్దిగా నూనె వేసి ఆవాలు, నువ్వులు చల్లినట్టుగా వేయాలి.
  • ఇప్పుడు దాని మీద మిశ్రమాన్ని మందపాటి మినపట్టు మాదిరిగా వేసి మూతపెట్టాలి.
  • ఒకవైపు కాలిన తరువాత రెండోవైపు కూడా ఎర్రగా కాల్చి తీసి, ముక్కలుగా కోసి అందించాలి.

కార్న్ ఫ్రిట్టర్స్
కావాల్సినవి:
మొక్కజొన్న గింజలు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, బేకింగ్‍ సోడా: చిటికెడు, సెనగపిండి: టేబుల్‍స్పూను, మైదా: టేబుల్‍స్పూను, జీలకర్ర పొడి: అర టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా, కారం: టీ స్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‍స్పూన్లు, పాలు: రెండు టేబుల్‍స్పూన్లు, వినెగర్‍: టీ స్పూను.
తయారు చేసే విధానం:

  • బాణలిలో కొద్దిగా నూనె పోసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మొక్కజొన్న గింజలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించి తీసి ఆరాక మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
  • ఓ గిన్నెలో మైదా, సెనగపిండి, బేకింగ్‍ సోడా, జీలకర్ర కారం వేసి కలపాలి. తరువాత కొద్దిగా పాలు చికలరించి జారుగా కాకుండా గట్టిగా కలపాలి. వీటిల్లో రుబ్బిన మిశ్రమాన్ని వేసి కలిపి చిన్నగా గుండ్రని ఉండల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీసి సాస్‍తో వడ్డించాలి.

అరటి కొబ్బరి కచోరి
కావాల్సినవి: అరటికాయలు: నాలుగు, బియ్యప్పిండి: టేబుల్‍ స్పూన్‍, ఉప్పు: రుచికి సరిపడా, పచ్చిమిర్చి ముద్ద: టేబుల్‍స్పూన్‍,
లోపల నింపేందుకు:
కొబ్బరి తురుము: కప్పు, ఎండుద్రాక్ష: పదిహేను, కరివేపాకు తురుము: 2 టేబుల్‍స్పూన్లు, నువ్వుల పొడి: 2 టేబుల్‍స్పూన్లు, పల్లీల పొడి: తగినంత, జీలకర్ర: అర టీస్పూను, నిమ్మరసం: టేబుల్‍స్పూన్‍; కొత్తిమీర తురుము: 2 టేబుల్‍స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: అరటికాయల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో బియ్యప్పిండి, సగం పచ్చిమిర్చి ముద్ద, టీ స్పూన్‍ నూనె వేసి కలిపి పక్కన
ఉంచుకోవాలి.

  • ఓ గిన్నెలో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముద్ద వేయించి కచ్చాపచ్చాగా పొడి చేసిన పల్లీలు, వేయించిన నువ్వులు, సన్నగా కోసిన ఎండుద్రాక్ష ముక్కలు, జీలకర్ర, కరివేపాకు తురుము, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి.
  • చేతులకు నూనె రాసుకుని అరటికాయ ముద్దని చిన్న ఉండల్లా చేసి, చిన్న పూరీలా చేసి అందులో టేబుల్‍స్పూన్‍ పై మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ దాన్ని కచోరీ ఆకారంలో చేత్తోనే వత్తి పక్కన ఉంచాలి.
  • ఇలాగే అన్నీ తయారు చేసుకున్న అనంతరం వాటిని కాగిన నూనెలో సిమ్‍లో వేయించి తీస్తే అరటి కొబ్బరి కచోరీ రెడీ.

Review వహ్వా.. హాండ్వో.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top