సూర్యం వందే ఆరోగ్యకారకమ్‍

‘తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టు’.. ఈ నానుడి సంగతి తెలుసు కదా!. దీన్ని ఏ సందర్భంలో, ఎందుకు ఉపయోగిస్తారనే విషయాన్ని పక్కనపెడితే.. తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టడం మాత్రం మంచిదే సుమా! ఇంకో విషయం.. సాధారణంగా మనం దేవుడికి లేదా పెద్దలకు గౌరవసూచకంగా లేదా ఏదైనా కోరుకోదల్చినపుడు నమస్కారం చేయడం ఆచారం. కానీ, ఈ దేవుడికి నమస్కారం చేయడమే ఒక వరం. అదీ మామూలు వరం కాదు.. ఆరోగ్య వరం. అవును.. రోజూ ఉదయం సూర్యుడికి అభిముఖంగా తూర్పుకు తిరిగి ఐదు నిమిషాలు నమస్కారం చేస్తే.. ఎనలేని ఆరోగ్యభాగ్యం మీ సొంతం అవుతుంది. సూర్య నమస్కారాలకు అంతటి శక్తి ఉంది. వీటిని ఎలా చేయాలి? ఏ ప్రయోజనం కలుగుతుంది?.. తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా చదివేయండి మరి.

‘‘వ్యాయామం వలన శరీరము తేలికదనము, పని చెయ్యడానికి తగిన శక్తి, దృఢత్వము, కష్టాలను ఎదుర్కొనే శక్తి, శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేయడం, జీర్ణశక్తి పెరగడం మొదలైన ప్రయోజనాలు కలుగును’.
క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద గ్రంథం ‘చరక సంహిత’లో వ్యాయామం గురించి పై విధంగా పేర్కొన్నారు. ఇదే గ్రంథంలో వ్యాయామాన్ని అతిగా ఆచరించే వారికి శ్రమ, బడలిక, ధాతు క్షయం, దాహం, శరీరంలోని రక్తం వివిధ మార్గాల గుండా బయటకు వెళ్లడం, ఉబ్బసం, దగ్గు, జ్వరం, వాంతులు వంటివి కలుగుతాయని కూడా పేర్కొన్నారు.
అంతేకాకుండా, అతిగా వ్యాయామం చేసే వాడు సింహంతో పోట్లాడి డస్సిపోయిన ఏనుగు వలే నశిస్తాడని కూడా ఉంది.

కాబట్టి ప్రస్తుత జీవన విధానంలో వ్యాయామం తప్పనిసరి. మరి, ఎటువంటి వ్యాయామం చేయాలి? ఏ వ్యాయామ పద్ధతి మంచిది? శరీరాన్ని కష్టపెట్టని ఏ వ్యాయామమైనా మంచిదే కదలిక అనేది మన శరీరానికి సంబంధించిన అత్యంత సహజమైన పక్రియ. వ్యాయామం ద్వారా జరిగే శరీర కదలికలు కూడా అత్యంత సహజంగానే ఉండాలి. తినడం, పడుకోవడం మాత్రమే అటవాటైపోయిన జీవనంలో శరీర సమతుల్యత, శరీర ధర్మం తప్పుతుంది. అది క్రమంగా అలాగే కొనసాగితే మనలోని జీవశక్తి నిస్త్రాణంగా మారిపోతుంది.

వ్యాయామం చేయడం వలన మనకి శక్తి కలగాలి కానీ, శక్తి తగ్గి నీరసం రాకూడదు. ఒకవిధమైన రిలాక్సేషన్‍ వంటిది రావాలి. అలసట కాదు. ఒకవేళ మనం చేసే ఏ వ్యాయామమైనా అలసటగా, నీరసంగా అనిపిస్తే మనం తప్పు దారిలో వెళ్తున్నట్టు లెక్క. కాబట్టి మనం మన శరీరానికి ఏదైతే ఇష్టపూర్వకమైనదో ఆ కదలికను, వ్యాయామాన్ని చిన్న చిన్న యోగా సూత్రాల ద్వారా ఆచరించవచ్చు. వీటి ద్వారానే మనం నమ్మలేనంత ఆరోగ్య ప్రయోజనాన్ని పొందవచ్చు. చాలామంది తమ రోజువారీ దినచర్యలో భాగంగా అనేక పనులు చేస్తుంటామని, ఆ కదలికలు శరీరానికి సరిపోతాయని, కాబట్టి అదనంగా వ్యాయామం చేయాల్సిన పని లేదని అంటారు. అయితే, మనం చేసే రోజువారీ పనుల్లో శరీరం యొక్క కదలికలు ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా ఉంటాయి. అదే వ్యాయామంలో అయితే శరీరంలోని వివిధ కండరాలు, కండర సముదాయాలు ఒక క్రమపద్ధతిలో కదులుతాయి. ఇదే వ్యాయామంలో జరిగే మార్పు, ఉపయోగం కూడా.

నిజమైన వ్యాయామం ఏదంటే…
మన శరీరంలోని మెటబాలిజాన్ని సరిగా ఉంచేదే నిజమైన వ్యాయామం. మనం వ్యాయామం చేయనప్పుడు కూడా మన శరీరాన్ని సరైన స్థితిలో ఉంచేది. అంతేకాకుండా మన శరీరంలోని ఫిజియాలజీని సరిచేసి దాన్ని పెద్దగా మార్చకుండా శరీరానికి మంచి చేసేదే అసలైన వ్యాయామం. కాబట్టి ‘అధికస్య అధికం ఫలం’ అనే నానుడి మిగతా విషయాల్లో పనిచేస్తుంది.
కానీ వ్యాయామం విషయంలో మాత్రం కాదు. జిమ్‍ల్లో గంటలకొద్దీ గడిపి చెమటోడ్చినంత మాత్రాన అది మంచి వ్యాయామం అనలేం. వ్యాయామంలో ఎంత ఎక్కువ కష్టపడితే శరీరానికి అంత నష్టం జరుగుతుంది. అన్ని శరీరతత్వాలకు సరిపడే కొన్ని వ్యాయామ సూత్రాలు

  • ఎప్పుడూ కూడా శరీరంలోని సగం శక్తిని మాత్రమే ఉపయోగించి వ్యాయామం చేయడం మంచిది.
  • ఉదాహరణకు మీరు పది కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలరనుకుంటే, ఐదు కిలోమీటర్లు మాత్రమే నడవండి. అదే విధంగా పరుగైనా, ఆటలైనా, మిగతా ఇతర వ్యాయామాలైనా సరే.. ఇదే సూత్రాన్ని అనుసరించాలి.
  • మన శరీరంలోని శక్తిని వాడుకోవడానికి కాకుండా మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి మాత్రమే వ్యాయామం చేయాలనే విషయాన్ని మరిచిపోరాదు.
  • పై విధంగా చెప్పినట్టు వ్యాయామం చేస్తే కొంతకాలం అయ్యేసరికి మీ ఎనర్జీ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి.
  • వ్యాయామ పద్ధతి ఏదైనా సరే.. తేలికగా ఉండటంతో పాటు వారమంతా కొనసాగించాలి. వారానికి నాలుగు రోజులే చాలనే ప్రచారం ఇటీవల జరుగుతోంది. ఇది తప్పు. ఎందుకంటే వారంలో నాలుగు రోజులు చేసే వ్యాయామం వల్ల జరిగిన మంచి మార్పు కాస్తా వ్యాయామం చేయని మూడు రోజులలో తిరిగి వెనక్కి వెళ్లి మళ్లీ మీ పాత ఆరోగ్య పరిస్థితులకు వెళ్లిపోతారు
  • ఎంత మంచి వ్యాయామ పద్ధతి అయినా బోర్‍ కొట్టకుండా ఉంటే ఎక్కువ రోజులు చేయగలుగుతారు. అందుకే మనసుకు, శరీరానికి ఆనందాన్నిచ్చే వ్యాయామ పద్ధతిని ఎంచుకోవాలి.
  • అలసట, ఆయాస పడటం, బట్టలు తడిసేలా చేసే వ్యాయామ పద్ధతులు మీ బాడీ ఫిజియాలజీని శ్రమకు గురిచేస్తున్నాయని గుర్తించాలి.
  • ఎంత వ్యాయామం చేసినా, ఏ వ్యాయామ పద్ధతిని అనుసరించినా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం- మీ ముక్కుతో శ్వాసించేంత మాత్రమే చేయాలి. నోటితో గాలి పీల్చుకుంటూ వ్యాయామం చేస్తుంటే కనుక మీరు కెపాసిటీని మించి వ్యాయామం చేస్తున్నారని అర్థం.
  • వ్యాయామం ఎప్పుడు, ఏ సమయాల్లో చేయాలనేది చాలామందికి కలిగే సందేహం. సాధారణంగా ఉదయం 6 – 10 గంటల మధ్య, సాయంత్రం 6 – 10 గంటల మధ్యలో మాత్రమే వ్యాయామం చేయడం మంచిది. ఆ సమయాల్లోనే మన శరీరంలోని ఫిజియాలజీలోని మార్పులు వ్యాయామానికి తగినట్టుగా ఉంటాయి.
    తగిన వ్యాయామం ఎంచుకోవడం ఎలా? మన పురాతన ఆయుర్వేద గ్రంథం ఎటువంటి శరీర తత్వాలు ఉన్న వారు ఎలాంటి వ్యాయామాలు చేయాలో స్పష్టంగా చెప్పింది. మన శరీరతత్వాన్ని బట్టి మన వ్యాయామ పద్ధతిని ఎంచుకోవాలి. కాబట్టి మొదట మన శరీరతత్వం ఏమిటనేది తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శరీరతత్వాలు మూడు (3) రకాలు.
  • కఫ ప్రకృతి: ఈ తత్వం ఉన్న వారు ముఖ్యంగా లావుగా, ఎక్కువ బరువుగా, నెమ్మదిగా నడుస్తూ, ఎప్పుడైనా ఆహారం లేకపోయినా కండరాలు బలంగా ఉంచగలరు. దట్టమైన నల్లని వెంట్రుకలతో ఉండేవారు, తాపీగా పనులు చేసే వారు, ఈ తత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తించాలి.
  • వాత ప్రకృతి: ఈ తత్వం ఉన్నవారు మరీ సన్నగా ఉంటారు. వీరి కండరాలు పూర్తిగా బలంగా ఉండవు. వీరు చాలా వేగంగా నడుస్తూ, వేగంగా మాట్లాడుతుంటారు. వీళ్ళు కొద్దిగా కంగారుపడే తత్వం ఉన్నవారు.
  • పిత్త ప్రకృతి: పై రెండు తత్వాలకు మధ్యస్తంగా ఉండే వారిని పిత్త ప్రకృతి వ్యక్తులుగా వర్గీకరించారు. వీళ్ళు ఓ మాదిరి శరీర నిర్మాణంతో ఉంటారు. వీరికి మిక్కిలి కోపం. కచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. వీరు ఎండను, వేడిని, అధిక చలిని అసలు తట్టుకోలేరు. పల్చటి జుట్టు లేదా బట్టతల లేదా జుట్టు తెల్లబడిన వారై ఉంటారు.

పై శరీర తత్వాల వర్గీకరణను బట్టి కఫతత్వం గలవారు అధికమైన సమయం, కొద్దిగా కష్టతరమైన వ్యాయామం చేయవచ్చు. పిత్త ప్రకృతి గలవారు మధ్య రకంగానూ, వాత ప్రకృతి తత్వం గలవారు మరీ తక్కువ వ్యాయామం అదీ ఎక్కువ విశ్రాంతితో కూడిన వ్యాయామం చేయడం మంచిది

ఏ వ్యాయామం మంచిది?
వ్యాయామం ప్రాధాన్యత, వ్యాయామం ఎంతసేపు చేయాలి? ఎలా చేయాలి? ఏ శరీరతత్వానికి ఎటువంటి వ్యాయమ పద్ధతులు సరిపడతాయనే విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు అందరూ ఆచరించదగిన తేలికైన విధానంలోనే మంచి ఆరోగ్యాన్ని, శరీరాకృతికి, మానసిక ఆనందాన్ని, ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే వ్యాయామ పద్ధతి ఏదో తెలుసుకుందాం. నిస్సందేహంగా యోగా అందరినీ అనువైనా వ్యాయామ పద్ధతి. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు.. ఇవన్నీ యోగాలో ఒక భాగం. ఇంకా చెప్పాలంటే యోగా కంటే సూర్య నమస్కారాలు వంద రెట్లు శ్రేష్ఠమైనవి. కచ్చితంగా చెప్పాలంటే యోగా లేదా సూర్య నమస్కారాలు వ్యాయామ పద్ధతులు కావు. శరీరాన్ని ఏమాత్రం అలసట బారినపడనివ్వకుండా చక్కని భంగిమలో లేదా ఆకృతిలో ఉంచడం సూర్య నమస్కారాల పత్య్రేకత.

సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపంలో ప్రకృతిలో జీవాన్ని నింపి, మధ్యాహ్నం మహేశ్వరునిలా తన కిరణాల ద్వారా సృష్టి దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం విష్ణు రూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింప చేస్తూ ఆనందాన్ని కలిగిస్తాడు. సూర్య నమస్కారాల్లో పన్నెండు (12) రకాల ఆసనాలు ఉన్నాయి. ఈ పన్నెండు ఆసనాలను చేస్తే ఒక వృత్తం పూర్తయినట్టు లెక్క. వీటిలో ఒకటి నుంచి ఐదు వరకు, ఎనిమిది నుంచి 12 వరకు గల ఆసనాలు ఒకే విధంగా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ప్రతి ఆసనానికి ఒక ప్రయోజనం ఉంటుంది.
పదంటే పదే నిమిషాలు.. లాభాలు పదివేలు
మన శరీరాన్ని మొత్తం టోన్‍ చేసే శక్తి సూర్య నమస్కారాలకు ఉంది. నిజానికి వీటిని ఆచరించడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. రోజులో పది నిమిషాలు చాలు. కానీ అందువల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం వేనవేలు.

Review సూర్యం వందే ఆరోగ్యకారకమ్‍.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top