సూర్య నమస్కారాల్లో పన్నెండు (12) రకాల ఆసనాలు ఉన్నాయి.

ప్రణామాసనం (నమస్కారాసనం)
మంత్రం:
ఓం మిత్రాయ నమ:
నిటారుగా ప్రార్థన భంగిమలో నిలుచుండాలి. రెండు పాదాలు ఒకదానికి మరొకటి తాకుతుండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్ఛ్వాసలను చేయాలి.
ప్రయోజనం: ఈ ఆసనం వల్ల మనసు సూర్యాభివందనాలను అనువుగా మారుతుంది

హస్త ఉత్తానాసనం
మంత్రం:
ఓం రవయే నమ:
శ్వాసను లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపు వెనక్కి వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగానూ, చాలా కాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగానూ ఊపిరి పీల్చుకోవాలి.
ప్రయోజనం: వెన్నెముకకు శక్తినివ్వడం, దాని రుగ్మతలను నిరోధించేందుకు ఈ ఆసనం పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెటబాలిక్‍ హార్మోన్‍ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియంలను మెరుగుపరుస్తుంది.

పాదహస్తాసనం
మంత్రం:
ఓం సూర్యాయ నమ:
శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్లను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్టు ఉండాలి.
ప్రయోజనం: ఈ ఆసనం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా, యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది

ఆంజనేయాసనం- కుడి (అశ్వ సంచలనాసనం)
మంత్రం:
ఓం భానవే నమ:
లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేల మీదకు వంచాలి. కుడి మోకాలును కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి పైకప్పును చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరంలో అర్ధ చంద్రాకృతిని కలిగి ఉంటుంది.
ప్రయోజనం: థైరాయిడ్‍ గ్రంథి చర్యను క్రమబద్దం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్ర పోషిస్తుంది. శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి.

పర్వతాసనం (దండాసనం)
మంత్రం:
ఓం ఖగయే నమ:
నాలుగవ స్థితి (ఆంజనేయాసనం) నుంచి గాలి నెమ్మదిగా వదులుతూ కాలి వేళ్లను నేలను తాకుతూ, ఎడమ కాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్లు రెండూ నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగం పైకి ఎత్తినట్టు బోర్లించిన ‘వీ’ ఆకారంలో ఉంచాలి. శరీరం మొత్తం కాలి వేళ్లపైన అరచేతులపైన ఆధారపడి నిలవాలి. దృష్టిని మాత్రం ఎదురుగా నేలపై ఉన్న ఏదైనా వస్తువుపైన కేంద్రీకరించి ఉంచాలి.
ప్రయోజనం: ఈ ఆసనం మణికట్టుకు బలం చేకూరుస్తుంది. మానసిక, శారీరక పుష్టి కలుగుతుంది. ఇది నడుముకు పటుత్వాన్ని ఇస్తుంది.

సాష్టాంగ నమస్కారం (అష్టాంగ నమస్కారం)
మంత్రం:
ఓం పూష్ణే నమ:
అరచేతులను, కాలి వేళ్లను కదిలించకుండా నేలపై ఉంచాలి. గడ్డాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్లను నేలకు ఆనించాలి. తరువాత ఛాతీని, గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది.
ప్రయోజనం: కడుపు, కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది

సర్పాసనం (భుజంగాసనం)
మంత్రం:
ఓం హిరణ్యగర్భాయ నమ:
అష్టాంగ నమస్కారం మాదిరిగానే ఉదరం నేలకు తాకేలా ఉంచాలి. శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుంచి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తుండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి. మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి.
ప్రయోజనం: ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్‍ సమతుల్యం, యురోజెనిటల్‍ సమస్యలు, ముఖ్యంగా రుతుక్రమ సంబంధమైన, రుతువు ఆగిపోవడం వలన వచ్చే (మోనోపాజ్‍) సమస్యలకు ఈ భంగిమ అమోఘంగా పనిచేస్తుంది.

పర్వతాసనం
మంత్రం:
ఓం మరీచయే నమ:
పద్మాసనంలో కూర్చునే విధంగా కూర్చుని రెండు చేతులను ఒకచోట చేర్చి చిత్రంలో చూపిన విధంగా చేతులను సాగదీస్తూ పైకి ఎత్తాలి.
ప్రయోజనం: వెన్నెముకకు ఇది మంచి వ్యాయామం. ఫలితంగా వెన్నునొప్పులకు ఇది ఔషధంలా పనిచేస్తుంది.

ఆంజనేయాసనం- ఎడమ (అశ్వసంచలనాసనం)
మంత్రం:
ఓం ఆదిత్యాయ నమ:
దీనినే అశ్వసంచలనాసనం అనీ అంటారు. పర్వతాసనం నుంచి నెమ్మదిగా కటిద్వయాన్ని కిందికి దించి ఎడమ కాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. కుడి మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్ధ చంద్రాకారం కలిగి గుర్రం ఆకారం వలే ఉంటుంది.
ప్రయోజనం: జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా, యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది.

పాదహస్తాసనం
మంత్రం:
ఓం పవిత్రే నమ:
అశ్వ భంగిమ నుంచి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నుంచునే విధంగా వంగాలి. చిత్రంలో చూసి ఆ విధంగా అభ్యసించాలి. అశ్వ సంచలనాసం (ఆంజనేయాసనం)లోని నియమాలే దీనికీ వర్తిస్తాయి.
ప్రయోజనం: శరీరానికి మంచి ఆకృతిని ఇస్తుంది. నాజూకుగా మలుస్తుంది. ఈ భంగిమలో థైరాయిడ్‍, టైమర్‍ ఎడ్రినల్‍, యూరో జెనిటల్‍ గ్రంథులు వంటివి ఉత్తేజితం అవుతాయి.

హస్త ఉత్తాసనం
మంత్రం:
ఓం ఆర్కాయ నమ:
పై భంగిమ నుంచి రెండు చేతులను తలపైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటపుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుము వెనుక భాగం వద్ద కొద్దిగా వంగాలి.
ప్రయోజనం: వెన్నెముకకు శక్తినిస్తుంది. దాని రుగ్మతలను నివారిస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనసును ఆహ్లాదంగా ఉంచుతుంది.

ప్రణామాసనం (నమస్కారాసనం)
మంత్రం:
ఓం భాస్కరాయ నమ:
శ్వాసను వదులుతూ రెండు అరచేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి ఛాతీ వద్ద ఉంచాలి. దీనితో సూర్య నమస్కారాలు పూర్తయినట్టే.
ప్రయోజనం: మనో వికాసం కలుగుతుంది. మనసు తేలికై ఆహ్లాదకరమైన అనుభూతి లభిస్తుంది.

Review సూర్య నమస్కారాల్లో పన్నెండు (12) రకాల ఆసనాలు ఉన్నాయి..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top