
మాఘ శుద్ధ సప్తమి ఒకప్పుడు ఉగాది పర్వమై ఉండేదట. ఈ విషయమలా ఉంచితే.. మాఘ శుద్ధ సప్తమి మన ప్రాచీన పర్వాల్లో మాత్రం ఒకటి. ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడు కాయలతో చేసిన దానిని సూర్య రథం అంటారు.
కామ, క్రోథ గుణాల్ని హరించే జిల్లేడు
జిల్లేడు ఆకుల్ని రథ సప్తమి నాడు నెత్తి మీద పెట్టుకోవడంలో ఆంతర్యం ఉంది. గ్రహాలను బట్టి జీవులకు కామ క్రోధాది గుణాలు కలుగుతుంటాయి. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఇతర గ్రహాలు జీవులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అదే ఉత్తరాయణ గతుడైనపుడు గ్రహాల పలుకుబడి మనుషులపై అంతగా ఉండదు. రథ సప్తమి సూర్యుని ఉత్తరగతిని సూచించే పండుగ. ఈ పర్వం సందర్భంలో జిల్లేడు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేస్తూ వాటిని జారవిడవడం కామ క్రోధాది గుణాల విసర్జనకు సూచన అని అనుకోవచ్చు. జిల్లేడుకు సంస్క•తంలో సూర్యాహ్వాయ, అర్క, రవి అనే పేర్లున్నాయి. ఈ నామాలు దీనికి సూర్యునితో గల సంబంధాన్ని తెలియ చేస్తున్నాయి. రథ సప్తమి సూర్యునికి సంబంధించిన పండుగ కాబట్టి ఆనాడు జిల్లేడు ఆకులకు ప్రాధాన్యం వచ్చి ఉండవచ్చు.
రేగుపండ్లతో అందరికీ మంచి ఆరోగ్యదాయిని.
రథ సప్తమి నాడు రేగుపండ్లు నెత్తిమీద పెట్టుకునే ఆచారం కూడా ఉంది. భవిష్యోత్తర పురాణంలో రథ సప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులు కానీ, రెండు రకాల ఆకులు కానీ తలపై పెట్టుకుని స్నానం చేయాలని ఉంది. కానీ, ఆంధప్రదేశ్‍లో జిల్లేడు ఆకుల దొంతర మీద రేగుపండ్లు ఉంచుకుని స్నానం చేయడమే ఆచారం. శిశిర రుతువైన మాఘ, ఫాల్గుణ మాసాల్లో రేగుపండ్లు విస్తారంగా దొరుకుతాయి. ‘ఫలశైశిర’ అని రేగుకు సంస్క•త నామంఉంది. రథ సప్తమికి ఇంచుమించు ఒక నెల ముందు వచ్చే సంక్రాంతి భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు రేగుపండ్లు తలపై పోసి దిగబారేలా చేస్తారు. అలా పోయడం వల్ల పీడ వదిలిపోతుందని మనవాళ్ల నమ్మకం. ఆనాడు రేగుపండ్ల మూలకంగా ఒక్క చిన్నపిల్లలకే జరిగే మంచి.. రథసప్తమి నాడు అందరికీ మంచి జరుగుతుందని అనుకోవాల్సి ఉంటుంది.
చిక్కుడు.. ఆరోగ్యవర్థనం
ఇక, రథ సప్తమి నాడు ప్రాధాన్యం వహించే మరో కాయగూర- చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు. రథ సప్తమి నాటి పూజలో చిక్కుడు కాయలతో పాటు ఆకులనూ వాడతారు. ప్రకృతిని ఆరాధించే మన పెద్దలు మాఘ మాసంలో బాగా పూచి, కాచే చిక్కుడును కూడా మాఘ మాసపు పర్వాలలో చేర్చి రథ సప్తమి నాటి ఆరాధన ద్రవ్యాలలో ఒకటిగా చేర్చారు. ఈనాడు చిక్కుడు కాయలతో, వెదురు పుల్లలతో రథాన్ని చేసి దాని మీద చిక్కుడు ఆకుల్ని పరిచి నైవేద్యానికి ఆధారపాత్రగా ఉపయోగించే ఆచారం ఉంది. నైవేద్యం పెట్టడానికి వేడి పొంగలి చిక్కుడు ఆకు మీదనే వేసి చల్లార్చడం చేత ఆకులో ఉండే పసరు, ఆర్ధ్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనిక మార్పు వస్తుంది. ఆ పదార్థ సేవనం ఆరోగ్య వర్థకం అవుతుంది.
రథసప్తమి పర్వమే సూర్య జయంతి రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని రాజపుటానాలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, కొన్ని తావులలో జయంతి సప్తమి అనీ, మరికొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది. సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు. అయితే, జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చనేది పెద్దల అభిప్రాయం. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- సప్తమి తిథులు నెలకు రెండుసార్లు వస్తాయి. అనగా, ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమికి మహా సప్తమి అనే పేరు వచ్చిందని అంటారు.
Review సూర్య రథం.. ఆరోగ్యపథం.