నా గెలుపు..‘జాన్స్‌క్రీక్‌’కు మలుపు

పరమేశ్‌.. అందరిలాగానే మొదట్లో క్రేజ్‌ కొద్దీ అమెరికా వచ్చారు. కానీ, ఇక్కడ జీవించడం మొదలుపెట్టాక.. ఇక్కడి ప్రభుత్వానికి పన్నులు కడుతూ, పరోక్షంగా జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాననే భావన కలిగాక.. దేశంపై ప్రేమ పెంచుకున్నారు. ఇప్పుడు అమెరికాలో జరిగే ఓ కౌంటీ ఎన్నికల్లో పోటీచేస్తూ.. దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జార్జియా రాష్ట్రంలో పుల్టన్‌ కౌంటీ అనే జిల్లాలో జాన్స్‌క్రీక్‌ సిటీ కౌన్సిల్‌ (నంబర్‌ 4)కు పోటీ చేస్తున్న ఆయన.. అక్కడ ఓటింగ్‌ జరిగే తీరు, ఎన్నికల విశేషాలు, తను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, తనను గెలిపిస్తే చేయదగిన పనుల గురించి, జాన్స్‌క్రీక్‌ సిటీ అభివృద్ధి ప్రణాళిక గురించి ‘తెలుగుపత్రిక’తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కీలకమైన రాష్ట్రం జార్జియా. ఈ రాష్ట్రంలో పుల్టన్‌ కౌంటీలోని జాన్స్‌క్రీక్‌ సిటీకి నవంబర్‌ 2న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 11 నుంచే ముందస్తు ఓటింగ్‌ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి 17 రోజుల పాటు ఎప్పుడైనా ఓటు వేయవచ్చు. ఈ సిటీలో 7 కౌన్సిల్‌ సీట్లు ఉన్నాయి. వీటికి జరిగే ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను సిటీ కౌన్సిల్‌గా వ్యవహరిస్తారు. వీరి నుంచే ఒకరు మేయర్‌గా ఎన్నికవుతారు. మేయర్‌కు సిటీ కౌన్సిల్‌ అడ్వైజరీగా వ్యవహరిస్తుంది. సిటీ కౌన్సిల్‌లోని ఏడు కౌన్సిల్‌ సీట్లలో 4వ నంబర్‌ జాన్స్‌క్రీక్‌ సిటీ కౌన్సిల్‌కు నేను పోటీపడుతున్నాను.
ఇక్కడ ఎన్నిక విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఓటుహక్కు ఉన్నవారంతా పోటీలో ఉన్న వారందరికీ ఓటు వేయవచ్చు. జాన్స్‌క్రీక్‌ సిటీలో ఆస్తిపన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు ఉంటుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి కౌన్సిల్‌ సభ్యులు మారుతుంటారు. ప్రతి నాలుగేళ్లకు ఎన్నికలు జరుగుతుంటాయి. జాన్స్‌క్రీక్‌ సిటీ జనాభా 86 వేలు. వీరిలో భారతీయ జనాభా 14 శాతంగా ఉంది. వీరిలో ఓటుహక్కు ఉన్న భారతీయుల సంఖ్య 6 వేల వరకు ఉంది. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది వీరే కావడంతో ఓటింగ్‌లో వీరి పాత్ర కీలకం కానుంది. మొత్తం ఏడుగురిలో ఒక ప్యానల్‌కు చెందిన నలుగురు గెలుపొందితే.. ఈ నలుగురు చెప్పిందే కౌన్సిల్‌లో అమలవుతుంది. అభివృద్ధిలో వీరి మాటే చెల్లుబాటవుతుంది. ఇదే నేను పోటీ చేయడానికి దారితీసింది.
ఎందుకంటే` పుల్టన్‌ కౌంటీలో 3 హైస్కూళ్లు ఉన్నాయి. నేను, నాతో పాటు పోటీచేసే వారిలో నలుగురు మా ప్యానల్‌ తరపున గెలుపొందితే.. ఈ హైస్కూల్స్‌లో తెలుగు బోధన చేర్చగలిగే వీలుంటుంది.
ఇటీవల జగన్నాథ రథోత్సవానికి కొందరు తమిళులు అక్కడి కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకుంటే అనుమతి నిరాకరించారు. మనం గెలిస్తే మన భారతీయులకు ఇటువంటి తిరస్కరణలు ఎదురుకావు. తమిళుల వినతి తిరస్కరణకు గురైన విషయం తెలిసి బాధ కలిగింది. అటువంటి పరిస్థితి మునుముందు రాకూడదంటే మనం గెలిచి తీరాలనే పట్టుదల పెరిగింది.
జాన్స్‌క్రీక్‌లో ఇప్పటికీ పోస్టాఫీస్‌ లేదు. ఇటువంటివి సాధించడానికి నా గెలుపు దోహదపడుతుంది.
ఈ సిటీలో ప్రధాన సమస్య.. రక్షణ బలగాలకు నైతికంగా మద్దతుగా నిలవడం. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీస్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం, వీరి బడ్జెట్‌ కేటాయింపులు పెంచడం తద్వారా జాన్స్‌క్రీక్‌ సిటీలోని ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా కల్పించడం వంటివి నా లక్ష్యాలు.ఇక్కడి కమింగ్‌, ఆల్ప్రెటా, గ్వినెట్‌ వంటివి అత్యంత సంపన్న ప్రాంతాలు. ఇక్కడి ప్రజలకు తగినంత భద్రత కల్పించడం ముఖ్యం. ఇక్కడి మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ కల్పించాలి. పోలీస్‌ భద్రత తగ్గితే అసాంఘిక శక్తులు పేట్రేగిపోతాయి. వాటిని అరికట్టాలంటే పోలీస్‌ బలగం పెరగాలి.
ఆ మధ్య కాలంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో పోలీస్‌ విభాగంపై చెడ్డముద్ర పడిరది. దీనిని చెరిపేయాల్సిన అవసరం ఉంది. జాన్స్‌క్రీక్‌లో 71 మంది పోలీసులు ఉంటే, వారిలో ఇద్దరు ముగ్గురు చెడ్డవారుండొచ్చు. వీళ్లను బట్టి మిగతా వాళ్లను తప్పుబట్టడం తప్పనేది నా ఉద్దేశం. పోలీసుల్లో నైతిక బలాన్ని పెంచుతూ వారి బడ్జెట్‌ను పెంచుతాం.
అలాగే, ప్రజాధనాన్ని కాపాడతాం. వరదలు వచ్చినపుడు భారీగా ఆస్తినష్టం ఉంటోంది. చెక్‌డ్యాంలు, రెయిన్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాల ద్వారా వరద నీటిని మళ్లించే పనులు చేపడతాం.
అన్ని రంగాల్లోనూ ‘స్మార్ట్‌ గ్రోత్‌’కు ప్రాధాన్యమిచ్చి ఆ దిశగా అభివృద్ధి పనులు చేపడతాం.
డెఫిసిట్‌ బడ్జెట్‌ వల్ల పన్నులు పెరుగుతాయి. స్కూళ్ల నిర్వహణ లోపిస్తుంది. ఆస్తులకు రక్షణ కరువవుతుంది. ఈ పరిస్థితి నివారణకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తాం.
విజయం సాధించగానే అయిపోదు. తెల్లారగానే కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. అన్నీ ఆలోచించే నేను పోటీకి దిగాను.
నా గెలుపు కోసం, ఓటర్లను చైతన్యం చేసేందుకు ‘మైఓట్‌.ఎర్రమిల్లి.కామ్‌’ అనే వెబ్‌సెట్‌ను రూపొందించాం. ఇందులో నా వివరాలతో పాటు నేను గెలిస్తే చేసే పనులకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.

Review నా గెలుపు..‘జాన్స్‌క్రీక్‌’కు మలుపు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top