సామెతలో కద

అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి కానీ..
దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్లేదు.
ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా మనకు మంచి చేసేవాళ్లకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలి. వారికే పెద్దపీట వేయాలి. అల్ప పదాలతోటి అనల్పార్థాలను సాధించడమే సామెతల ప్రత్యేకత.
మూరెడు పొంగటం ఎందుకు?
బారెడు కుంగటం ఎందుకు?
ఈ ఆరు పదాల్లో ఎంత వ్యక్తిత్వ వికాస పాఠం ఉందో గమనించారు కదా!
ప్రతి మనిషికీ, ప్రతి సందర్భానికీ ప్రతి చిత్త ప్రవృత్తికి అతికినట్టు సరిపోయే సామెతలు మన తెలుగు భాషలో కోకొల్లలుగా ఉన్నాయి. సామెతకు సమానార్థకం లేదా సామ్యం అంటే పోలిక అని ధ్వనించవచ్చు. రూఢ్యర్థం ఏదైనా సామెతను ఎప్పుడూ పైకోణంలోనే అంటే, సమానమైందీ, పోలిక కలదనే అర్థంలోనే వాడుతున్నాం. ‘వేదమైనా అబద్ధం కావచ్చేమో కానీ సామెత అబద్ధం కాద’ని కన్నడ భాషలో ఓ సామెత ఉంది. అదీ భాషలో సామెతల అర్థ పరాక్రమం. నిజం చెప్పాలంటే సామెతల్లో వ్యవహారానికి సంబంధించినవి- కుటుంబ సంబంధమైనవి- చెణుకులు, చమత్కారాలు, సరదాగా చెప్పుకునేవి ఎన్నో రకాలు ఉన్నాయి. పోతే ప్రతి దాని వెనుకా ఒక జీవనసారం ఉంటుంది. రోజుల పాటు విశదీకరించి చెప్పినా అర్థం కాని ఒక క్లిష్ట పరిస్థితికి, సందర్భానికీ నాలుగు సెకన్లలో ఉటంకించే సామెతతో పరిష్కారం కనుగొనవచ్చు. లేదా ఎదుటి వ్యక్తి బిత్తరపోయే విధంగా బదులు ఇవ్వవచ్చు. సామెతను ప్రయోగించే వారి పరిజ్ఞానాన్ని బట్టి స్థాయి, భాష మారుతుంటాయి. సామెతల్లో గల ఇదో విశిష్ట లక్షణం. ఇంకా కొన్ని సందర్భాల్లో సగం సామెతే వాడుతుండటమూ కద్దు. ఆ మిగతా సగాన్ని ఎదుటి వ్యక్తి మనసులో పూరించుకుంటారు. సామెతల్లో వడకట్టిన జీవనసారం ఉంటుంది. అవి ఒకోసారి పంచామృతంగానూ ఉండవచ్చు.
ఏ ఆలుమగలైనా అన్యోన్యంగా కలిసి ఉంటే అంతకుమించిన స్వర్గం మరొకటి ఉండదు. అలా కాకుండా ఎడముఖం పెడముఖంగా ఉన్నట్టు వ్యవహరిస్తే వాళ్లెంత స్థితిమంతులైనా ఆ కాపురం నరకమే. పూటకు గతిలేని వాళ్లయినా కలిసి మెలిసి ఉంటే వాళ్ల ఆనందానికి ఆకాశమే హద్దు. అందుకే కలిసి ఉన్న కాపురాల తీరే వేరు. ఆ అర్థం స్ఫురించేలా వాడుకలోకి వచ్చిన సామెతే- ‘గతిలేని సంసారం చేయవచ్చు. సుతి (శ్రుతి) లేని సంసారం చేయరాదు’.
ఇంకా ఇటువంటివే మన తేట తెనుగు భాషలో ఎన్నో సుతిమెత్తని జీవిత పాఠాల్ని నేర్పే సామెతలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కో సంచికలో తెలుసుకుందాం.

Review సామెతలో కద.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top