నాన్నకు ప్రేమతో..

మాతృదేవోభవ..
అతిథి దేవోభవ..
ఆచార్య దేవోభవ..
పితృ దేవోభవ

ఈ నాలుగు సూత్రాలు ఆర్ష ధర్మ సౌధానికి మూల స్తంభాలు. నిజానికి బిడ్డకు తొలి గురువు తండ్రే.
బిడ్డకు అమ్మ పరిచయం చేసే మొదటి వ్యక్తి నాన్న. నాన్నంటే నడిపించే వాహనం. నాన్నంటే నడిచొచ్చే దైవం.
బిడ్డ పుట్టుకకు హేతువై, విద్యాబుద్ధులు నేర్పటంలో గురువై, వారి అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించే సైనికుడే నాన్నంటే. తన కంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన భుజాలను ఆసరాగా ఇచ్చి తన కంటే ఎత్తుకు ఎదగాలని కోరుకునే గొప్ప వ్యక్తిత్వం గలవాడు నాన్న.

నాన్నంటే భరోసా.. నాన్నంటే భద్రత.. నాన్నంటే బాధ్యత

బిడ్డలను బాణంలా మలిచి, తానే విల్లులా మారతాడు నాన్న. కష్టాలను కడుపులోనే దాచుకుని బిడ్డలకు మాత్రం సంతోషాన్ని పంచుతాడు. త్యాగానికి మారుపేరు తండ్రి. కన్నీటిని రెప్ప దాటి బయటకు రానివ్వక.. పన్నీటిని పిల్లలకు పంచే త్యాగమూర్తి నాన్న.
బిడ్డలను మంచి పౌరునిగా మలచడం నాన్న తొలి లక్ష్యం. తమ కాళ్లపై తాము నిలబడేదాకా వారి వెన్నంటి నీడై ఉంటాడు. తన చిన్నారుల చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తూ.. పిల్లల లక్ష్యసాధనలో తాను సమిధనవుతాడు.

అనుక్షణం బిడ్డల సుఖ సంతోషాల కోసం కరిగే కొవ్వొత్తి తండ్రి.
వారి జీవితాల్లో వెలుగులు నింపే సూరీడు.
తన చిన్నారుల మెదళ్లలో మొలిచిన అజ్ఞానం అనే కలుపును ఏరి విజ్ఞాన విత్తనాలు జల్లే కృషీవలుడు. చెమటను చిందించి బిడ్డల జీవన సౌధాన్ని అందంగా నిర్మించే శ్రామికుడు.
ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు ఎంతో భయం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాన్న స్నేహితుడిగా మారిపోయాడు. త్యాగానికి ప్రతిరూపమయ్యాడు. పిల్లల భవిత కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నాన్న మనసు మంచుకొండలా మారింది. మారాం చేసినా, తప్పు చేసినా పాత రోజుల్లో తండ్రి మందలిస్తే నేడు ఆ స్థానాన్ని అమ్మకు వదిలేసి తాను మాత్రం ఆప్యాయతనే పంచుతున్నాడు. పుత్రోత్సాహం కలిగిన రోజునే పదిమందికీ ఆనందంగా చెబుతున్నాడు. బిడ్డ ఓటమి పాలైనా భుజాలపై చెయ్యేసి ఊరడించే అమృత మూర్తి నాన్న.

మారుతున్న కాలంతో పాటు అన్నింటా పెరుగుతున్న పోటీతత్వం తండ్రి బాధ్యతను మరింత సంక్లిష్టం చేస్తోంది. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే తపన ప్రతి తండ్రిలో కనిపిస్తోంది. ఈ రోజుల్లో పిల్లలు చదువు రీత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉండటం సాధారణమైంది. తండ్రి తోడ్పాటుకు దూరమైన పిల్లల్లో భవిష్యత్తు సక్రమంగా ఉండటం లేదు. ఇలాంటి వారిలో ఆత్మగౌరవం నశించడం, ప్రవర్తనలో మార్పు, వ్యసనాల వంటివి కనిపిస్తు న్నాయి.

వన్‍ మినిట్‍ ఫాదర్‍

పిల్లల పెంపకంపై స్పెన్సర్‍ జాన్సన్‍ రాసిన బెస్ట్ సెల్లర్‍ ‘ది వన్‍ మినిట్‍ ఫాదర్‍’లోని కొన్ని విషయాలివి. తండ్రిగా మారిన, మారబోయే ప్రతి వ్యక్తి తెలుసుకోవలసినవి..
తండ్రిగా మీ పిల్లలను నిరంతరం సంర క్షించదలచుకున్నారా? పిల్లలు తమను తాము సంరక్షించుకునేలా పెంచదలుచు కున్నారా?

పిల్లవాడు తమకు అనుగుణంగా ప్రవర్తించ డమే క్రమశిక్షణ అని చాలామంది తల్లి దండ్రులు అనుకుంటారు. కానీ ఇది తప్పు. మీరు క్రమశిక్షణ అని దేనిని
భావిస్తారో అది తమకు శిక్ష అని పిల్లలు భావిస్తారు.

తమ ప్రవర్తనలో మంచిచెడులను గుర్తిం చేలా పిల్లల్ని తయారు చేస్తే క్రమశిక్షణ దానంతట అదే అలవడుతుంది.

పిల్లల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించండి. అప్పుడు మీ నిజమైన కోపాన్ని కూడా వాళ్లు అర్థం చేసుకోగలరు.

చాలామంది పిల్లలు తమలా ప్రవర్తించడానికే ఇష్టపడతారు తప్ప తండ్రికి అనుకూలంగా ఉండేలా కాదు.

పిల్లలకు తమకంటూ సొంత లక్ష్యాలు ఉంటాయి. వాటి గురించి ఇతరులతో చెప్పరు. పిల్లల ఏకాంతాన్ని, ఏకాంత ఆలోచనలను తండ్రి గౌరవించాలి.

ప్రవర్తనే లక్ష్యాలను నిర్దేశిస్తుంది. పరిస్థితులే ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి.

పిల్లలు మీకు నచ్చేలా ప్రవర్తించినపుడు ప్రశంసించండి.

పిల్లల్ని తరచూ దగ్గరకు తీసుకోవడంవల్ల మీ స్పర్శలోని ఆనందాన్ని వాళ్లు పొందగలుగుతారు.

పిల్లల లక్ష్యం విజయం వైపు మళ్ల డానికి తండ్రిగా కృషి చేయండి. విజయ మంటే ఏమిటో అర్థమైతే వాళ్లే లక్ష్యాల వైపు పరుగెత్తడం నేర్చు కుంటారు.

(జూన్‍ 16: ఫాదర్స్ డే)

Review నాన్నకు ప్రేమతో...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top