కొందరు చాలా కష్టపడతారు. వచ్చిన సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేస్తారు. వర్తమానంలో భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకుంటారు. వారి కష్టానికి కాలం కూడా కలిసి వస్తుంది. జీవితంలో స్థిరపడతారు.
ఇంకొందరు ఉంటారు. ఏమాత్రం కష్టపడరు. భవిష్యత్తు గురించి ఆలో చించరు. అసలు ఆ రోజు ఎలా గడుస్తుందో, ఎలా గడపాలో కూడా వారికి ఆలోచన ఉండదు. ‘ఈ క్షణం గడిచిందా.. అదే చాలు పదివేలు’ అని తృప్తి పడతారు. ఇలా భవిష్యత్తు గురించి ఆలోచన, రేపటి గురించి చింత లేని వారికి అనుకోకుండా ఏదైనా కష్టం వచ్చి పడితే తలకిందులైపోతారు. ఒక పద్ధతి అంటూ లేకపోవడం వల్ల వీరు తమకు ఎదురయ్యే పరిస్థితులకు అతలాకుతలం అయిపోతారు.
మరికొందరు ఉంటారు. ఎంత కష్టపడినా పైసా కూడబెట్టలేరు. ఎటు పోయినా కష్టమే.. ఏం చేసినా నష్టమే అన్నట్టు వీరి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వారికి కష్టమే నిరంతరం ఎదురు వస్తుంటుంది. అంటే దురదృష్ట జాతకులని అంటారు కదా.. అటువంటి వారే వీరన్న మాట.
ఇటువంటి భిన్న రకాల మనుషుల విషయంలో ఉపయోగించే జాతీయమే ‘అయ్యవారుల గారి నట్టిల్లు’. అంటే ఆదాయం అనేది ఏ రోజుకు ఆ రోజు అన్నట్టుగా ఉండటం, ఆ రోజు ఆదాయం లేకపోతే ఆకలి బాధలు ఎదుర్కోవడం, వెనకటికి ఎవరైనా అయ్యవారి జీవితం ఇలా గడిచిందేమో.. అందుకే ‘అయ్యవారుల గారి నట్టిల్లు’ అనే జాతీయం పుట్టింది. ఆ అయ్య వారి ఇల్లు ఎప్పుడూ చూసినా ఖాళీగా, శూన్యంగా, భారం•గా, విషాదంగా ఉండేదట. బాగా నష్టాల్లో, కష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఉదా: ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అయ్యవారుల గారి నట్టిల్లులా ఉంది.
Review అయ్యవారుల గారి నట్టిలు.