కుందేలు తెలివితేటలు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.

ఒక అడవిలో ఒక ముసలి సింహం మృగ రాజుగా చెలామణి అవుతూ ఉంది. మేక, ఎలుగు, లేడి, దుప్పి, జింక, కోతి, కుందేలు వంటి చిన్న చిన్న జంతువుల్ని పట్టి ఇష్టం వచ్చినట్టు చంపి ప్రతి రోజూ తినేస్తూ ఉండేది. ఒకరోజు ఈ సన్నకారు జంతువులన్నీ ఒక మహాసభ జరుపుకుని సింహం బాధ చాలా ఎక్కువగా ఉందని చర్చించు కున్నాయి. దాని బాధ తప్పించుకునే మార్గం ఆలోచించాలని అనుకున్నాయి. ఆ మాటలు విన్న ఎలుగుబంటి మిగతా జంతువులతో ఇలా అంది-
‘అందరం కలిసి ఒకేసారి సింహం మీద పడి చంపేద్దామా?’ అని అంది.
‘అది జరిగే పని కాదు. ఆ పని మనం చేయలేం కదా!’ అని అరిచాయి మిగతా జంతు వులు.
ఈ లోపున నక్క ‘మనం మృగరాజుతో ఒక సంధి చేసుకుందాం’ అని ప్రతిపా దించింది.
‘ఏమని ఒప్పందం చేసు కుందాం?’ అని మిగతా జంతువులన్నీ మిక్కిలి ఆసక్తితో ముక్తకంఠంతో నక్కను ప్రశ్నించాయి.
అప్పుడు నక్క రెట్టించిన ఉత్సాహంతో మిగతా చిన్న జంతువులతో ఇలా అంది-
‘రోజూ ఆ ముసలి సింహం మనల్ని చంపే బదులు రోజూ మనలో ఒకరిని సింహానికి ఆహా రంగా పంపుదాం. ఎలా ఉంది? నా సలహా?’ అని అడిగింది.
మిగతా జంతువులన్నీ ‘చాలా బాగుంది’ అన్నాయి.
ఈ విషయాన్ని ఆ జంతువులన్నీ కలిసి మృగరాజును కలిసి చెప్పాయి. తాను వేటాడే శ్రమ లేకుండానే ఆహారం దానంతట అదే తన వద్దకు వస్తుందంటే సింహానికి ఆనందం వేసింది. అందుకు అంగీకారం తెలిపింది.
అలా ప్రతిరోజూ- ఒకరోజు జింక, రెండో రోజు మేక, మూడో రోజు కోతి, నాలుగో రోజు ఎలుగు, ఐదవ రోజు గొర్రె ఆహారంగా వెళ్ల సాగాయి. ఇలా మృగరాజుకు వేటాడనవసరం లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి.
ఒకరోజున సింహానికి ఆహారం వెళ్లే వంతు కుందేలు మీద పడింది. కుందేలు తెలివితేటల్లో దిట్ట. మంచి ఉపాయం వేసి మృగరాజు వద్దకు అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. దీంతో సింహానికి ఆకలి ఎక్కువైంది. అది కాస్తా ఆగ్రహంగా మారింది. అంతలో కుందేలు రానే వచ్చింది.
దాని మీద కోపంతో- ‘కుందేలా! ఏమంత ఆలస్యం? ’ అని గర్జించింది.
దానికి సమాధానంగా ఆ కుందేలు- ‘మృగరాజా! నాతో మరొక జంతువును కూడా పంపారు. అయితే దాన్ని దారిలో ఒక సింహం అడ్డం వచ్చి చంపి తినివేసింది. నేను తప్పించుకుని నీ వద్దకు వచ్చేసరికి ఆలస్యం అయ్యింది’ అని సంజాయిషీ ఇచ్చుకుంది.
సింహం కోపంతో పెద్దగా గర్జిస్తూ- ‘ఏమిటీ? నాకంటే బలమైన సింహం మరొకటి ఈ అడవిలో ఉందా? దాన్ని నాకు చూపించు’ అని అరిచింది.
‘రండి మహాప్రభూ!’ అంటూ ఆ కుందేలు సింహాన్ని వెంటబెట్టుకుని ఒక బావి వద్దకు తీసుకెళ్లింది. ‘చూడండి ప్రభూ! ఈ బావిలో ఆ సింహం దాక్కుంది’ అంది.
సింహం నిజమేననుకుని ఆ బావిలోకి ముఖం పెట్టి తొంగి చూసింది. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకుని దానినే మరొక సింహంగా భావించింది. వెంటనే గట్టిగా గర్జిస్తూ ఆ సింహాన్ని చంపేయాలనే భావనతో బావిలోకి దూకింది. చివరకు ఆ నీళ్లలో పడి మరణించింది.
అలా కుందేలు చిన్నదైనా తన తెలివి తేటలతో పెద్ద సింహాన్నే మట్టు పెట్టింది. అడవిలోని మిగతా జంతువులన్నీ చాలా సంతోషించాయి.
నీతి: ఉపాయంతో ఎంత అపా యాన్ని అయినా తప్పించు కోవచ్చు.

Review కుందేలు తెలివితేటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top