మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
దేవుడి పెండ్లి
దేవుని గుడిలో – దేవర పెండ్లి
చక్కగ తీర్థం – సాగించారు
పిన్నలు పెద్దలు – వేంచేశారు
బాజాలవిగో – వాయించారు
నిండా మెరసిన – జెండాకట్టి
తావుల నింపే – దండలు చుట్టి
గణగణ మ్రోగే – గంటలు గట్టి
స్వామిని రథమున – సాగించారు
బాలకురాలా! – పాటలు పాడుచు
బాలికరాలా! – భజనలు చేయుచు
రండీ వేంకట – రమణుని చూడగ
రండీ రండీ – రథమును లాగ
భజనలు
పొద్దు పొద్దున లేద్దామా!
అక్కల్లారా పోదామా!
పోయి పువ్వులు తెద్దామా!
తెచ్చి దండలు గుచ్చుదామా!
గుచ్చి రాముని మెడలో వేద్దామా!
అందరం రాముని భజనలు చేద్దామా!
ప్రార్థన
పొద్దున్నే పొద్దున్నే లేద్దామా?
అందుగల పూవులు కోద్దామా?
కోసినవి రాసులు పోద్దామా?
దేవుడి గుళ్లోకి పోదామా?
కిర కిర తలుపులు తీద్దామా?
దేవుడి మెళ్లో వేద్దామా?
జేజేలు
లాలను పోసీ
పాలను తాపీ
జోలను పాడే
అమ్మకు జేజేలు
నడువగ చూచీ
అడిగినవన్నీ
తడియక ఇచ్చే
నాన్నకు జేజేలు
మాటలు నేర్పే
ఆటలు నేర్పే
పాటలు నేర్పే
గురువుకు జేజేలు
గోవిందుడమ్మా
గోవిందుడమ్మ – గోపాలుడమ్మా!
కొబ్బరి బెల్లమూ కొని తెచ్చెనమ్మా!
ఏడు మేడలు మీద నన్నుంచెనమ్మ
ఏడాదికోసారి తావచ్చెనమ్మ
గజ్జెల్ల పాపణ్ణి నే గంటినమ్మ
ఎత్తుకుని ముద్దాడ తానెవ్వరమ్మ
చిక్కుడు చెట్టు కింద కొస్తే ఛీఛీ అనిపిస్తు
కాకరచెట్టు కిందకొస్తే కాదు కాదనిపిస్తు
పొట్ల చెట్టు కిందకొస్తే పోపో అనిపిస్తు
పల్లెటూరు గనక బతికిపోయాడు
పట్నవాసమైతే పట్టుకు తన్నిస్తు
మాతృపూజ
అరటిపళ్లు కొబ్బరికాయలు అమ్మవారికి
పూటుగా ధనమంత – పూజారికి
చెంగల్వ పూదండ – సీతామాలక్ష్మికి
చేతిల కాసులు – సన్యాసికి
భక్తితో మొక్కాలి – మా అమ్మకూ
చేతులు జోడించి – చెలువు మీర
తల్లి కంటే వేరు దైవం
ఇలను లేదు ఎంచి చూడ
తల్లిగాచు ఎపుడు మనల
పాలు ఇచ్చి పెంచుచుండు
ఎందుగానీ ఏమీరానీ
తల్లి మనకూ త్రోవ జూపు
మాతృ పూజా మనకు మేలు
మాతృ సేవా మనకు చాలు
Review పిల్లల ఆటపాటలు.