ఒక చెట్టు ఆత్మ కథ

చాలాకాలం క్రితం చాలా పెద్ద ఫల వృక్షం ఉండేది. ఒక చిన్న పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ తిరు గుతూ రోజూ చాలా ఇష్టంగా, ప్రేమగా ఆడుకునేవాడు.
ఆ పిల్లవాడితో పాటే ఆ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించసాగింది. పిల్లవాడు పెరిగి పెద్దయ్యే సమ యానికి ఆ చెట్టు నిండా పండ్లు కాశాయి. ఆ బాలుడు ఒకరోజు చెట్టు ఎక్కి పండ్లు కోసుకుని తిన్నాడు. ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు.

ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించే వాడు. ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడేది. బాలుడిని అమితంగా ప్రేమించేది.
కాలం గడిచింది. చిన్న పిల్ల వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు మళ్లీ అతను చెట్టు వద్దకు వెళ్లాడు. ఎందుకో విచారంగా ఉన్నాడు.
‘రా.. వచ్చి నా ఒడిలో ఆడుకో’ అని చెట్టు అంది.
‘నేను ఇంకా చిన్న పిల్లాడని కాదు. చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది. నాకిప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి’ అన్నాడు అతను విచారంగా.
‘నా దగ్గర డబ్బులు లేవు కానీ, నువ్వు ఒక పని చెయ్యి. నా పండ్లన్నీ కోసుకుని వెళ్లి అమ్ముకో. దాంతో నీకు కావాల్సినన్ని డబ్బులు వస్తాయి’ అని చెట్టు ఉపాయం చెప్పింది.
బాలుడు ఎంతో సంతోషంగా చెట్టెక్కి, దాని పండ్లన్నీ కోసుకున్నాడు. వెళ్లి వాటిని అమ్ముకున్నాడు. కొంత డబ్బులు రాగా, వాటితో బొమ్మలు కొని ఆడుకున్నాడు. కానీ, మళ్లీ ఆ చెట్టు వైపు రాలేదు. ఆ చెట్టు అతను రాక కోసం దిగులుగా ఎదురు చూడసాగింది.
క్రమంగా బాలుడు పెరిగి మరింత పెద్దవాడయ్యాడు. యువ కుడిగా మారాడు. ఒకరోజు అటుగా అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషపడింది.
‘రా. నా వద్దకు వచ్చి ఆడుకో’ అని ఆ యువకుడిని ఆశగా ఆహ్వానించింది.
‘నీతో ఆడుకునే సమయం లేదు నాకు. నా కుటుంబం కోసం పని చేయాలి. మేం ఉండటానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. నువ్వేమైనా సహాయం చేయగలవా?’ అని ఆ యువకుడు చెట్టును అడిగాడు.
‘నా వద్ద ఇల్లు లేదు. అయితే, నా కొమ్మలు అందుకు నీకు ఉపయోగపడతాయి. వాటిని కొట్టుకుని వెళ్లు. ఇల్లు కట్టుకో’ అని ఆ చెట్టు చెప్పింది.
ఆ యువకుడు చెట్లు కొమ్మలు నరికి సంతోషంగా తీసుకెళ్లాడు. అతని సంతోషం చూసి చెట్టు చాలా ఆనందపడింది. కానీ, మళ్లీ అతను చాలా కాలం వరకు తిరిగి రాలేదు. చెట్టూ మళ్లీ అతని కోసం దిగులుగా, విచారంగా ఎదురు చూస్తూ గడపసాగింది.
బాగా ఎండగా ఉన్న వేసవికాలంలో ఒక రోజు అతను మళ్లీ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. చెట్టుకు సంతోషమేసింది.
‘రా. వచ్చి నాతో ఆడుకో’ అని సంతోషంగా ఆహ్వానించింది.
‘నేను ముసలివాడిని అయ్యాను. ఈ వయసులో నీతో ఆడుకుంటే అందరూ నవ్వుతారు. కాకపోతే, నీ వద్దకు ఒక పనిపై వచ్చాను. ఈ ఎండా కాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి నేను సముద్ర ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను. దానికి నాకు ఒక పడవ కావాలి. ఇందు కోసం నువ్వు నాకేమైనా సహాయ పడగలవా?’ అని ముదుసలి అడిగాడు.
‘నేను నీకు పడవను ఇవ్వలేను. కానీ, నా చెట్టు కాండం అందు కోసం ఉపయోగపడుతుంది. దానిని నరికి తీసుకెళ్లు. దానితో మంచి పడవ తయారు చేయించుకుని హాయిగా సముద్ర ప్రయాణం చెయ్యి’ అని చెట్టు సలహా ఇచ్చింది.
అతను చెట్టు కాండాన్ని తెగ నరికాడు. తీసుకెళ్లి పడవ తయారు చేయించుకుని హాయిగా ప్రయాణం చేస్తూ గడిపాడు. చాలా కాలం వరకు తిరిగి అతను చెట్టుకు తన ముఖం చూపించలేదు.
చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.
‘నాయనా! నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ మిగలలేదు. పండ్లు కూడా లేవు’ అని చెట్టు విచారంగా పలికింది.
‘నాకు ఏమీ వద్దు. నాకు కూడా తినడానికి పళ్లు లేవులే’ అన్నాడు ఆ వృద్ధుడు.
‘నాపై ఎక్కి ఆడుకోవడానికి నాకు కాండం కూడా లేదు’ అని మరింత విచారంగా అంది చెట్టు.
‘ఎక్కడానికి నాకు బలమూ లేదు. ముసలివాడిని కదా’ అన్నాడు వృద్ధుడు.
‘నిజంగా నీకివ్వడానికి నా వద్ద ఏమీ లేదు. చచ్చిపోతున్న నా వేర్లు తప్ప’ అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు.
‘నాక్కూడా ఇప్పుడు ఏదీ అవసరం లేదు. చాలా అలసిపోయాను. విశ్రాంతి తీసుకోవడానికి ఓ మంచి ఆసరా కావాలి’ అన్నాడు వృద్ధుడు.
‘వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి, విశ్రాంతి తీసుకోవడానికి మంచివి. అనుకూలంగా కూడా ఉంటాయి నాయనా! రా. వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో’ అంది చెట్టు.
ఆ వృద్ధుడు ఆ చెట్టుపై కూర్చుని కునుకు తీశాడు. సంతోషంతో కన్నీరు కారుస్తూ ఆ చెట్టు అతనికి సేదదీర్చింది.
చెట్టు నేర్పే పాఠం: చెట్టు.. మనిషి పుట్టినప్పటి నుంచి మట్టిలో కలిసిపోయే వరకు కడదాకా మనిషితో పాటే నడుస్తుంది. తన వేరు, కాయ, కాండం, ఆకు, కొమ్మ.. అన్నింటినీ అందరి కోసం త్యాగం చేస్తుంది. అటువంటి చెట్లను పెంచుదాం. పర్యావరణానికి పాటు పడదాం

Review ఒక చెట్టు ఆత్మ కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top