మడిబట్ట కడితే దొంగలు ముట్టరా?

వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

టెంకాయ చెట్టుకు మడిబట్ట కట్టినట్టు
నమ్మకాలు వమ్మయ్యే విషయంలో ఉప యోగించే మాట- ‘టెంకాయ చెట్టుకు మడిబట్ట కట్టినట్టు’.
వెనకటికి ఒకావిడ ఇంటి పెరట్లో టెంకాయ చెట్టు ఉండేది. రాత్రి పూట దొంగలు ఈ చెట్టు ఎక్కి కాయలు కోసుకుని వెళ్లేవారు. దీంతో దొంగల బారి నుంచి కాయలను కాపాడుకోవడానికి ఆ ఇంటావిడ చెట్టుకు మడి బట్ట కట్టింది.
‘మడిబట్ట ఉన్న చెట్టును ఎవరూ దోచుకోరు’ అనేది ఆమె నమ్మకం.
కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ దొంగలు ఎప్పటిలాగే కాయలను కోసుకెళ్లారు. దొంగలకు సెంటిమెంట్లు ఉండవు కదా!.
ఇలా మన నమ్మకాలు వమ్మయిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

ఏనుగు మేత
ఏనుగు దాని ఆకారానికి తగినట్టుగానే భారీగా మేస్తుంది. ఏనుగు తిండి మాట ఎలా ఉన్నా.. అధిక వాటా, ఎక్కువ మొత్తం, అధిక తిండి.. ఇలా రకరకాల సందర్భాల్లో ఉపయోగించే మాట- ‘ఏనుగు మేత’.
ఉదాహరణ: ‘ఆయన వాటా ఎలుక పిల్ల తిండి కాదు. ఏనుగు మేత’..
‘ఆయనకు ఆ తిండి ఏం సరిపోతుంది? ఆయనది ఏనుగు మేత’.

పరిణామి న్యాయం
సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు.
మార్పు సహజం.. అనివార్యం.
కాలం మారుతుంది. కాలంతో పాటు రాజ్యాలు మారతాయి. రాజులు మారతారు. సామాజిక స్థితిగతులూ మారతాయి.
కాలాన్ని బట్టే ప్రతీదీ మారుతుండటమే ‘పరిణామి న్యాయం’.

వర న్యాయం
‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ పాలసీని అనుసరించే వారి విషయంలో గుర్తు తెచ్చుకునే మాట ‘వర న్యాయం’.
ఇలాంటి వారు ఒకే కోరిక కోరుతున్నట్టు అనిపించినా, ఆ కోరికతో పాటు అనేక కోరికలను కూడా నెరవేర్చుకుంటారు.
వెనకటికి ఒకావిడ ఉండేదట.
ఆమెకు ఎంతకాలమైనా పెళ్లి జరగడం లేదు.
విసుగెత్తిన ఆమె దేవుడి కోసం తపస్సు చేసింది.
దేవుడు దయతలచి ప్రత్యక్షమయ్యాడు.
‘వరం కోరుకో’ అని అడిగాడు.
‘నాకు వివాహం కావాలి’.. ఇలా అని కోరితే ఒకటే కోరిక నెరవేరుతుంది. కానీ అలాకాక మరికొన్ని కోరికలు కూడా నెరవేరాలా ఆమె పథకం వేసింది. అందుకే తెలివిగా ‘నా మన వళ్లు, మనవరాళ్లు లంకంత కొంపలో వెండి ఉయ్యాల మీద ఊగుతూ, బంగారు గిన్నెలో హాయిగా పాలు తాగుతూ ఉండగా నేను ఇదంతా చూస్తూ సంతోషంగా ఉండాలి’ అని ఆమె దేవుడిని కోరింది.
దేవుడు అలాగే అని వరం ఇచ్చాడు.
ఇలా ఒకే కోరికతో.. పెళ్లి, సంతానం, వంశాభివృద్ధి, ఐశ్వర్యం.. ఇవి కూడా తెలివిగా నెరవేర్చుకుంది ఆమె.

Review మడిబట్ట కడితే దొంగలు ముట్టరా?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top