పిచ్చుక… మూడు సూక్తులు

అనగనగా ఒక వేటగాడు. ఒకరోజు అతను వేటకు బయల్దేరాడు. ఎట్టకేలకు అతని అన్వేషణ ఫలించి ఒక చిన్న పిచ్చుక అతని వేటకు దొరికింది. అతను దానిని పట్టి చంపబోతుంటే, ఆ పిచ్చుక అతనిలో ఇలా అంది..
‘అయ్యా! నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను, జంతువులను, నా కంటే పెద్ద పక్షులను వేటాడి ఉంటావు. అటువంటి నువ్వు నాలాంటి అల్ప ప్రాణిని చంపడం వల్ల ఏమిటి ఉపయోగం?. సరిగ్గా నీ పిడికిలి కూడా పట్టేంత లేని నన్ను చంపి తింటే నీ ఆకలి తీరుతుందా? కాబట్టి నన్ను చంపడం అవసరమా? ఆలోచించు. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలెయ్యి’.

అంతటితో ఆగక ఆ వేటగాడికి ఇంకా ఇలా చెప్పింది.
‘నువ్వు నన్ను వదిలిపెడితే అందుకు ప్రతి ఫలంగా నేను నీకు అమూల్యమైన మూడు నీతి సూక్తులు చెబుతాను. అవి నీ జీవితాన్ని ఉద్ధ రించుకోవడానికి, నువ్వు సంతోషంగా జీవించ డానికి ఎంతగానో ఉపయోగ పడతాయి’.
పిచ్చుక మాటలు విన్న వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు.
‘నిజమే కదా.. ఈ చిన్ని పిచ్చుకను చంపడం వల్ల ఏం ఉపయోగం?’ అనుకొని ఆ పక్షితో ఇలా అన్నాడు.
‘సరే. నిన్ను వదిలేస్తాను. ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు’.
అప్పుడు ఆ పిచ్చుక-
‘అయ్యా! కానీ నాది ఒక షరతు. నేను మొదటి సూక్తి నీ చేతిలో చెబుతాను. రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చుని చెబుతాను. ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చుని చెబుతాను’ అంది.
వేటగాడు అందుకు అంగీకరించాడు.
పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చుని మొదటి నీతిసూక్తి ఇలా చెప్పింది..
‘ఎవరైనా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి (తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు’.
పిచ్చుక ఇలా చెప్పి, వేటగాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్లి అతని ఇంటి పై కప్పుపై కూర్చుంది. అక్కడి నుంచి ఫక్కున నవ్వి ఇలా అంటుంది.
‘ఓరీ మూర్ఖుడా! నువ్వు నన్ను ఎవరను కున్నావు? నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రం ఉంది. అది తెలుసు కోకుండా నువ్వు నన్ను వదిలేశావు’.
అది విన్న వే•గాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకుని ఏడవడం మొదలు పెట్టాడు. ‘అయ్యో.. అంత విలువైన, బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడను నేను?’ అని బిగ్గరగా రోదించాడు.
అతనిని పిచ్చుక నవ్వుతూ చూసి,
‘ఓరీ మూర్ఖుడా! నువ్వు నిజంగానే మూర్ఖుడివి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు’ అని మొదటి సూక్తిని మళ్లీ గుర్తుచేసింది. ఆపై ఇలా అంది.
‘నీ పిడికిలి అంత కూడా లేని నేను, నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెబితే ఎలా నమ్మేశావు?. మూర్ఖుడా విను. రెండవ సూక్తి ఏమిటంటే-ఎప్పుడూ, ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించి, బాధపడకూడదు’ అని చెబుతూ ఆ పిచ్చుక ఇంటి పై కప్పు నుంచి ఎగిరి చెట్టుకొమ్మపై వాలింది.
వేటగాడు ఏడుస్తూ అరవడం మొదలు పెట్టాడు.
‘లేదు. నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టు కున్నాను. నువ్వు నన్ను మోసం చేశావు’ అన్నాడు. పిచ్చుక వేటగాడిని చూస్తూ అలాగే కూర్చుని ఉంది.
కాసేపటికి వేటగాడు తేరుకుని, ‘గతంలో ఎప్పుడో, ఎన్నడో జరిగిపోయిన వాటి గురించి తలచుకుని బాధపడకూడదు’ అని పిచ్చుక చెప్పిన రెండో సూక్తిని గుర్తు చేసుకుని స్థిమితపడ్డాడు.
అప్పుడు ‘సరే మూడవ సూక్తి ఏమిటో చెప్పు’ అని పిచ్చుకను అడిగాడు.
అందుకు బదులుగా పిచ్చుక- ‘ఎలాగూ నేను చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు. మూడవది చెప్పడం వల్ల ప్రయోజనం లేదు’ అంది. ఇలా అంటూనే మూడవ సూక్తిని ఇలా చెప్పింది.
‘నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తిని, విజ్ఞానాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దు’.. అని చెబుతూ ఆ చెట్టు కొమ్మపై నుంచి తుర్రుమంటూ ఎగిరిపోయింది.

Review పిచ్చుక… మూడు సూక్తులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top