పట్టణపు చిట్టి ఎలుక – గ్రామా చిట్టి ఎలుక

ఒక గ్రామంలో ఉన్న చిట్టెలుక పట్టణంలో ఉన్న చిట్టెలుకని తన యింటికి రమ్మని ఆహ్వానించింది. పట్టణంలోని చిట్టెలుక గ్రామ చిట్టెలుక యింటికి వచ్చింది. గ్రామ చిట్టెలుక దానికి భోజనం ఏర్పాటు చేసింది. కాని ఆ భోజనంలో బార్లీ, ధాన్యాలు తప్పయింకేవీ కనపడ లేదు. పట్టణ చిట్టెలుకతో, ‘‘నిజంగా ఆలోచించి చూస్తే యిక్కడ నీ పరిస్థితి ఏమీ బాగులేదు. నీకు యిక్కడ తినడానికి కూడా సరియైన పదార్థాలు దొరకడం లేదు. ఎలా బ్రతకాలో మా పట్టణానికి వస్తే తెలుస్తుంది. ప్రతిరోజూ మేము రకరకాల పదార్థాలు తింటాం. పట్టణ జీవితం ఎంత బాగుంటుందో! ఒకసారి వచ్చి చూడు’’ అంది.
గ్రామ చిట్టెలుకకి చాలా సంతోషం కలిగింది. కొన్నాళ్ళకి పట్టణానికి వెళ్లి ఆ చిట్టెలుకని కలిసింది. పట్టణ చిట్టెలుక మొదటగా గ్రామ చిట్టెలుకకి తానున్న యింట్లో వంటగదిలో ఉన్న అలమరా చూపించింది. ఆ అలమరా అడుగు అరలో జాడీల వెనక ఒక పెద్ద కాగితపు సంచిలో గోధుమ వర్ణంలో ఉన్న పంచదార కనిపించింది. పట్టణపు చిట్టెలుక ఆ సంచికి రంధ్రం చేసి, కొంత పంచదారని తినమని గ్రామ చిట్టెలుకని ఆహ్వా నించింది. రెండు చిట్టెలుకలు తినడం మొదలు పెట్టాయి. తాను అటువంటి దానిని ఎప్పుడూ తన జీవితంలో తినలేదనుకుంది. పట్టణపు చిట్టెలుక ఎంత అదృష్టవంతురాలో అనుకుంది. అంతలో తలుపు తీసిన చప్పుడయింది. పిండి అవసరమైన వంటవాడు తలుపు తెరుచుకుని ఆ గదిలోకి వచ్చాడు.‘‘పరుగెత్తు!’’ అంది పట్టణపు చిట్టెలుక గ్రామ చిట్టెలుకతో రెండూ చాలా వేగంగా పరుగెత్తి పట్టణపు చిట్టెలుక ఉండే రంధ్రంలోకి దూరాయి. పట్టణపు చిట్టెలుక భయంతో గజగజలాడుతూంది. అప్పుడు గ్రామ చిట్టెలుక, ‘‘ఆ వంటవాడు వెంటనే వెళ్లిపోతాడు కదా? అప్పుడు మనం మళ్లీ అక్కడికి వెళ్దాం’’ అంది. కొంత సేపటికి వంటవాడు తలుపులు వేసి వెళ్లిపోయాడు. పట్టణపు చిట్టెలుక గ్రామ చిట్టెలుకని ఒక మూలకి తీసుకుని వెళ్లి పై అరలో ఉన్న జాడీల వెనుక ఉన్న ఖర్జూరాన్ని చూపించింది. అతి కష్టం మీద పెద్ద ముక్కని కొరికి తినడం ప్రారంభించాయి. గ్రామ చిట్టెలుక త్వరగా తినలేకపోతూంది.
అంతలో తలుపుని ఎవరో గీకిన శబ్దం, దానితో పాటు ‘‘మియావ్‍’’ అనే అరుపు విన పడ్డాయి. ‘‘ఏమిటది? అంది గ్రామ చిట్టెలుక – ‘‘ష్‍!’’ నెమ్మదిగా అని పట్టణపు చిట్టెలుక అతి వేగంగా రంధ్రంలోకి దూరి పోయింది. గ్రామ చిట్టెలుక కూడా త్వరగానే పరుగెత్తింది. వాటికి అపాయం తప్పింది. పట్టణపు చిట్టెలుక, ‘‘అది ముసలి పిల్లి, చాలా బాగా చిట్టెలుకల్ని చంపు తుంది. నువ్వు దొరికావో, అయిపోయావే’’ అంది ‘‘అమ్మో చాలా భయంకరంగా ఉంది, మళ్లీ అల మరా వైపు మనం వెళ్లవద్దు అంది గ్రామ చిట్టెలుక.
‘‘నేను నిన్ను క్రింది గదిలోకి తీసుకుని వెళ్తాను. అక్కడ ఒక ప్రత్యేకత ఉంది’’ అంది పట్టణపు చిట్టెలుక. గ్రామ చిట్టెలుకను క్రింది గదిలోకి తీసుకుని వెళ్లింది. అక్కడ చాలా అలమరా లున్నాయి. అరలలో వెన్న, జున్ను వరుసలో
ఉన్నాయి. పైన వ్రేలాడుతూ ఆపిల్‍ పళ్లు ఉన్న పెట్టెలు, యితర తినుబండారాలు ఉన్నాయి. వాటి నుండి నోరూరించే వాసనలు వస్తున్నాయి. గ్రామ చిట్టెలుక అరలలోకి ఎక్కి కొంత వెన్న, కొంత జున్ను అటూ ఇటూ తిరుగుతూ తినడం మొదలు పెట్టింది. మంచి వాసన గల జున్ను విచిత్రంగా ఉన్న బల్ల మీద ఒక మూలగా ఉండడం చూసింది గ్రామ చిట్టెలుక. అది తన నోటితో జున్నుని తినబోయే సమయంలో పట్టణ ఎలుక చూసింది.
‘‘ఆగు ! ఆగు ! అది ఒక బోను. జున్నుని నువ్వు ముట్టుకుంటే, నీ మీద ఒక బలమైనది ఏదో వచ్చి గట్టిగా పడుతుంది. వెంటనే నువ్వు చస్తావు’’ అంది. గ్రామ చిట్టెలుక ఒకసారి బోను వైపు, ఒకసారి జున్ను వైపు, యింకొక సారి పట్టణ చిట్టెలుక వైపు చూసింది. ‘‘నన్ను క్షమించు. నా యింటికి వెళ్లిపోతాను. నాకు దొరికే బార్లీ గింజలే చాలు. వాటిని ప్రశాంతంగా, సుఖంగా తింటాను. అంతేకాని యీ పంచదార, ఖర్జూరం, జున్ను నాకు అక్కర్లేదు. ఎప్పుడు చస్తామో అనే భయంతో నేనిక్కడ ఉండలేను’’ అంది.
గ్రామ చిట్టెలుక తన యింటికి వెళ్లిపోయింది. తన భోజనాన్ని తింటూ ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉంది.

Review పట్టణపు చిట్టి ఎలుక – గ్రామా చిట్టి ఎలుక.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top