ప్రతి ధ్వని

ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాదిగా సమాధానం చెబుతున్నాడు.

అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో ‘అమ్మా’ అని అరిచాడు రఘు. అతను అరవకున్నా ఆ కొండ ప్రాంతంలో మరోసారి ‘అమ్మా’ అనే శబ్దం వినబడటంతో రఘు ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండలలో నుంచి రావడాన్ని గమనించాడు.

ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు ‘ఎవరు నువ్వు?’అని అడిగాడు శబ్దం వినిపించిన వైపు చూస్తూ. విచిత్రంగా అటు నుంచి మళ్లీ ‘ఎవరు నువ్వు?’ అనే శబ్దం వినిపించింది.

రఘు మళ్లీ కొంచెం గట్టిగా, ‘నీకు ధైర్యం ఉందా?’ అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది.
ఆ మాట విని కోపం పట్టలేక పోయిన రఘు ‘పిరికిపందా!’ అని నరాలు బిగపట్టి మరింత బిగ్గరగా అరిచాడు. అదే విధంగా మరింత గట్టిగా ‘పిరికి పందా!’ అని వినిపించింది.

ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో ‘నాన్నా! ఏమిటిదీ? ఎవరు నాన్నా అక్కడ?’ అని అడిగాడు.
తండ్రి నవ్వుతూ ‘కొంచెం ఓపిక పట్టు’ అంటూ ‘నువ్వు చాంపియన్‍వి’ అని రఘు తండ్రి గట్టిగా అన్నాడు.
‘నువ్వు చాంపియన్‍వి’ అన్న శబ్దమే మళ్లీ వినిపించింది.
ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతోందో అసలు అర్థం కాలేదు.

రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు-

‘దీన్ని ప్రతిధ్వని అంటారు. జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం తప్పక నీకు లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ, శాంతి వికసించాలి. ‘అందరూ నాతో ప్రేమగా ఉండాలి’ అని నువ్వు అనుకుంటూనే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయకాంక్షను పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాలలో అన్ని సందర్భాలకూ వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం తిరిగి మనకు అదే ఇస్తుంది’

Review ప్రతి ధ్వని.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top